E-Paper
Advertisement

Maoist Hidma: ముప్పుతిప్పలు పెట్టిన హిడ్మానే లేపేశారు.. మావోయిస్టుల శకం ఇక ముగిసినట్లేనా?

Maoist Hidma: ముప్పుతిప్పలు పెట్టిన హిడ్మానే లేపేశారు.. మావోయిస్టుల శకం ఇక ముగిసినట్లేనా?
Advertisement

Maoist Hidma: ఎన్‌కౌంటర్ మీద ఎన్‌కౌంటర్.. లొంగుబాట్ల మీద లొంగుబాట్లు.. ఇలా మావోయిస్ట్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న టైమ్‌లో.. మోస్ట్‌వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం.. దేశం మొత్తం సంచలనంగా మారింది. ఇప్పటిదాకా చాలా మంది మావోయిస్ట్ అగ్రనేతలు చనిపోయారు. కానీ హిడ్మా ఎన్‌కౌంటర్ అలా కాదు. ఇది.. మావోయిస్ట్ పార్టీ గతినే మార్చే పరిణామం. ఈ ఒక్క దెబ్బతో.. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్‌కి చేరినట్లేనా? ఇక.. మావోయిస్టుల కథ ముగిసినట్లేనా?

అతడే.. హిడ్మా! ఇలాంటి.. ట్రాక్ రికార్డ్ కలిగిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఓ చరిత్రగా మిగిలిపోయాడు. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో.. మావోయిస్ట్ పార్టీ నాయకత్వం, క్యాడర్ అంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇప్పుడేం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎందుకంటే.. హిడ్మా మామూలు మావోయిస్ట్ కాదు. అతి తక్కువ కాలంలోనే సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఎదిగిన టాప్ కమాండర్. గెరిల్లా దాడుల్లో ఆరితేరిన ఇండియన్ చెగువేరా. భద్రతా బలగాలను ముప్పుతిప్పలు పెట్టిన ఖతర్నాక్ కామ్రేడ్.

Advertisement

భారీ దాడులకు వ్యూహకర్తగా, దండకారణ్యంలో దళాలను ముందుండి నడిపించే నాయకుడిగా హిడ్మాకు పేరుంది. అతనిక.. విలాస్, హిడ్మాల్, సంతోష్ లాంటి మారుపేర్లు ఉన్నాయి. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ వన్‌కి.. కమాండర్‌గా పనిచేశారు. భారీ మెరుపుదాడులకు వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. మనకు.. NSG, బ్లాక్ క్యాట్, కోబ్రా, గ్రేహౌండ్స్ లాంటి పవర్‌ఫుల్‌ దళాలు ఎలా ఉన్నాయో.. మావోయిస్టు దళాల్లో PLGA వెరీ స్పెషల్ టీమ్. దానికి.. కమాండర్ అంటేనే.. హిడ్మా ఎంతటి పవర్‌ఫుల్ మావోయిస్ట్ లీడరో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. అతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్‌గా ఇన్నాళ్లూ భద్రతా బలగాల హిట్ లిస్టులో ఉన్నాడు.

ఎక్కడ దాడి చేయాలి.. ఎలాంటి పేలుడు పదార్థాలు వాడాలి.. ఏ డైరెక్షన్‌లో వాటిని పేల్చాలి.. దాడి చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి? ఇలా.. పకడ్బందీగా గెరిల్లా దాడులకు వ్యూహాలు రచించి, అణలు చేయడంలో.. హిడ్మా ఎక్స్‌పర్ట్. పక్కా ప్రణాళికతో దాడులు చేస్తారు కాబట్టే.. హిడ్మా టీమ్ చేసిన ఎటాక్స్‌లో.. మావోయిస్టుల వైపు ప్రాణ నష్టం అతి తక్కువగా ఉంటుందని చెబుతారు. భద్రతా బలగాలపై కనీసం 26 సార్లు.. సాయుధ దాడులకు హిడ్మా పాల్పడినట్లు సమాచారం. హిడ్మా చేసిన దాడుల్లో అనేకమార్లు భద్రతా దళాలు భారీగా ప్రాణనష్టాన్ని చవిచూశాయ్.

Advertisement

2010లో దంతెవాడ మెరుపుదాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీని వెనకున్న మాస్టర్‌మైండ్ హిడ్మానే. మావోయిస్టుల చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద దాడుల్లో ఒకటి. 2013 జీరం వ్యాలీ దాడిలో 27 మంది చనిపోయారు. వీరిలో.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. 2017లో సుక్మాలో జరిపిన మెరుపుదాడిలో 26 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు. 300 మందికి పైగా మావోయిస్టుల బృందం.. 99 మంది సీఆర్పీఎఫ్ దళంపై దాడి చేసింది. ఇది.. మావోయిస్టుల దాడుల్లో మరో అతిపెద్ద దాడి. 2021లో సుక్మా-బీజాపూర్ ఎదురుకాల్పుల్లో.. 22 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఉర్పల్ మెట్ట, చింతల్నార్, డోర్నాపాల్, తాడిమెట్ల, మినప లాంటి.. అనేక ఆపరేషన్లలో హిడ్మా స్వయంగా పాల్గొన్నాడు. ఇప్పటివరకు దాదాపు 200 మందికి పైగా భద్రతా దళాల సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా హిడ్మానే కారణమని చెబుతుంటారు.

హిడ్మా ఆపరేషన్స్‌కి మెచ్చే.. అతి తక్కువ సమయంలోనే కేంద్ర కమిటీలో హిడ్మాకు స్థానం కల్పించింది మావోయిస్ట్ పార్టీ. తెలుగువారు కాకుండా సుక్మా ప్రాంతం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తొలి ఆదివాసీ నాయకుడు హిడ్మా. సౌత్ బస్తర్ ప్రాంతంలోని మురియా తెగకు చెందిన హిడ్మా.. చదివింది పదో తరగతే అయినా నాలుగైదు భాషలు మాట్లాడతని చెబుతారు. హిడ్మా నెట్‌వర్క్‌ని వీరప్పన్‌తో పోలుస్తారు. ఆదివాసీ తెగకు చెందినవాడు కావడంతో.. అడవుల్లోనూ, స్థానికుల నుంచి హిడ్మాకు మంచి మద్దతు ఉండేది. అడవి బిడ్డలతో బలమైన ఇంటలిజెన్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని.. అతను ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా తనకు తెలిసేలా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాకు చాలా సులువుగా, వేగంగా చేరుకునే కీలకమైన జంక్షన్‌లో ఉన్న సుక్మా అడవులను అడ్డాగా చేసుకుని.. హిడ్మా ఇన్నేళ్ల పాటు భద్రతా దళాలపై గెరిల్లా దాడులకు పాల్పడ్డాడు. హిడ్మా కమాండర్‌గా ఉన్న PLGA దాడులతో తీవ్ర ప్రాణనష్టాన్ని చవిచూసిన భద్రతా బలగాలు.. హిడ్మా కోసం ఎప్పటి నుంచో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు మారేడుమిల్లి అడవుల్లోనే ఉన్నాడన్న పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా ఎన్‌కౌంటర్ అయ్యాడు.

ఇప్పటికి.. ఎన్నోసార్లు హిడ్మా దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. భద్రతా దళాలు కళ్లుగప్పి ఎన్నోసార్లు ఎస్కేప్ అయ్యాడు. ఇటీవల మలుగు జిల్లాలోని కర్రెగుట్టల్లో హిడ్మా దళం ఉందనే సమాచారంతో.. కూంబింగ్ ముమ్మరం చేశారు. వెయ్యి మందికి పైనే భద్రతా సిబ్బంది అడవుల్లో జల్లెడ పట్టింది. కానీ.. అక్కడి నుంచి కూడా హిడ్మా తప్పించుకున్నాడు. కర్రెగుట్టల ఆపరేషన్ తర్వాత.. హిడ్మా కనుమరుగైపోయాడు. భారీ గెరిల్లా దాడులకు పథకం రచించే హిడ్మా.. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక.. భద్రతా బలగాలకు దొరకకుండా ముందు తాను సేఫ్‌గా ఉండాలనే ఆలోచనకు వచ్చేశాడు. అలా.. అటు తిరిగి, ఇటు తిరిగి.. చివరికి మారేడుమిల్లి అడవుల్లో సెటిలయ్యాడు. హిడ్మాపై కోటి రూపాయల రివార్డ్ ఉందని ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర చెప్పారు. హిడ్మా భార్యపైనా 50 లక్షల రివార్డ్ ఉంది.

మారేడుమిల్లిలో హిడ్మా ఎన్‌కౌంటర్‌‌కు గురైన ప్రదేశం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఏకే 47 రైఫిళ్లు, పిస్టల్, రివాల్వర్‌, సింగిల్ బోర్ ఆయుధాన్ని సీజ్ చేశారు. 1500లకు పైగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్-ఎలక్ట్రికల్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. మారేడుమిల్లిలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగానే విజయవాడలోని షెల్టర్‌ జోన్‌ గుట్టు సైతం వీడింది. కూలీలమని చెప్పి.. ఓ అద్దె బిల్డింగ్‌లో 27 మంది మావోయిస్టులు తలదాచుకున్నారు. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు.

నాయకుడు లేని సేన.. చెల్లాచెదురైపోతుంది. ఇప్పుడు.. మావోయిస్ట్ పార్టీలోని పీఎల్‌జీఏ బెటాలియన్ పరిస్థితి ఒక్కటే కాదు.. దాదాపుగా మావోయిస్ట్ పార్టీ పరిస్థితి కూడా అదే! హిడ్మా లాంటి నాయకుడినే.. ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టేశారంటే.. మిగతా వాళ్ల పరిస్థితేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో.. హిడ్మా ఎన్‌కౌంటర్ ఎఫెక్ట్.. మావోయిస్టులపై ఎలా ఉండబోతోంది?

దేశంలో జరుగుతున్న యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లలో.. హిడ్మా ఎన్‌కౌంటర్ గ్రేట్ విక్టరీ అని భద్రతా దళాలు చెబుతున్నాయ్. ఎన్నో ఏళ్లుగా హిడ్మాని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు.. ఇప్పటికి ఫలించాయ్. ఈ వేటలో.. భద్రతా దళాలకు విశ్వసనీయ సమాచారం లేదు. ఈమధ్యకాలంలో హిడ్మాకు సంబంధించిన ఫోటోలు లేవు. అతని చుట్టూ ఉన్న భద్రతా వలయం, స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్.. ఇన్నాళ్లూ హిడ్మాని భద్రతా దళాలు చేరకుండా చేశాయ్. అయితే.. ఆపరేషన్ కగార్‌ తర్వాత పరిస్థితులు మారిపోయాయ్. వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ట్రై-జంక్షన్‌గా ఉన్న మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చి.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. మావోయిస్టులు సుక్మా జిల్లాలోని హిడ్మా స్వగ్రామం పూవర్తిలో.. ఓ చెరువుని నిర్మిస్తున్నప్పుడు చూశాడు. ఆ సమయంలో.. రెబల్ మూమెంట్‌కి ఆకర్షితుడయ్యాడు. హిడ్మా.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌కి నాయకత్వం వహించాడు. అలా.. మావోయిస్ట్ పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీలో.. అతి పిన్న వయసులోనే సభ్యుడయ్యాడు. బస్తల్ ప్రాంతం నుంచి సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక ఆదివాసీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కీలక వ్యక్తి.. హిడ్మానే. అతని స్థానిక మూలాలు, అడవి బిడ్డలతో తనకున్న సత్సంబంధాలు.. అతన్ని ఉన్నత స్థానానికి చేర్చాయి. ఇంకొన్నాళ్లుంటే.. హిడ్మా మావోయిస్ట్ పార్టీ చీఫ్‌గానూ ఎదిగే అవకాశం ఉందనే చర్చ ఉంది. హిడ్మా ప్రతిరోజూ తెల్లవారుజామునే 4 గంటలకు నిద్రలేచి.. బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు న్యూస్ రిపోర్ట్స్ చదివేవాడు.

హిడ్మాకు ఎలాంటి వ్యసనాలు లేవని చెబుతున్నారు. అయితే.. బీఫ్, చికెన్, టీ అంటే ఇష్టపడేవాడట. హిడ్మాకు డయాబెటిస్ కూడా ఉందంటున్నారు. ఏదేమైనా.. హిడ్మా జంగిల్ వార్‌ఫేర్‌లో ఎక్స్‌పర్ట్. అతనికి.. పోలీసు ఉన్నతాధికారుల కంటే విస్తృతమైన భద్రత ఉంటుంది. అధునాతన ఆయుధాలతో.. సాయుధులైన కమాండోలు హిడ్మా సెక్యూరిటీ రింగ్‌లో ఉండేవారు. అతను.. గ్రామాల్లోకి వచ్చేవాడు కాదు. అతని స్థావరాల్లో.. ఇన్‌ఫార్మర్లు భద్రతా దళాల కదలికల గురించి అతనికి తెలియజేస్తూ ఉండేవారు. అలా.. హిడ్మా ఇన్నేళ్లూ పోలీసుల నుంచి తప్పించుకోగలిగాడు. చివరికి.. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతిచెందాడు. ఈ కాల్పుల్లో.. మరో ఐదుగురు మావోయిస్టులు కూడా చనిపోయారు. వీరిలో.. హిడ్మా భార్య రాజే కూడా ఉన్నారు.

మావోయిస్ట్ పార్టీలో హెడ్ వెయిట్ ఉన్న లీడర్ హిడ్మానే. గెరిల్లా దాడులు చేయడంలో హిడ్మాని కొట్టేవాడు లేడు. అలాంటోడినే.. ఎన్‌కౌంటర్‌లో వేసేశారంటే మిగతా మావోయిస్టుల్లో.. భయం పెరుగుతుంది. పైగా.. ఇప్పుడు ఆ పార్టీలో హిడ్మా అంత అగ్రెసివ్‌గా ఎటాక్స్ చేసేవాళ్లెవరూ లేరు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో దూకుడు తగ్గుతుంది. క్యాడర్ కూడా డీలా పడుతుంది. సెంట్రల్ కమిటీలోనూ.. హిడ్మా అంత దూకుడు స్వభావం కలిగిన లీడర్, గెరిల్లా దాడులకు పథక రచన చేసే వాళ్లెవరూ లేరు. వ్యూహాలు, ఎస్కేప్‌లు ప్లాన్ చేసే వాళ్లే తప్ప..
హిడ్మా అంత పక్కాగా అటాక్స్ చేసే వాళ్లు లేరు. గెరిల్లా దాడుల వ్యూహాలు, దాడి చేసే సామర్థ్యం బలహీనపడే అవకాశం ఉంది. హిడ్మా.. సెంట్రల్ కమిటీ సభ్యుల్లో అతి పిన్న వయస్కుడు. బస్తర్ ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎదిగిన ఏకైక గిరిజన నాయకుడు. ఆపరేషన్ కగార్ లాంటి గట్టి ఎదురుదెబ్బతో సతమతమవుతున్న మావోయిస్ట్ పార్టీ.. ఇప్పుడు హిడ్మాపైనే తమ ఉద్యమాన్ని తిరిగి నిర్మించాలని ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైమ్‌లో హిడ్మా ఎన్‌కౌంటర్.. క్యాడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది.. లొంగుబాట్లని మరింత పెంచొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.

Also Read: బాబోయ్..! చలి చంపేస్తోంది.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

2026 మార్చి నాటికి.. దేశంలో మావోయిస్ట్ ఉద్యమాన్ని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మధ్యకాలంలోనే.. మావోయిస్ట్ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఆయనతో మరికొందరు అగ్రనేతలు కూడా హతమయ్యారు. ఇప్పుడు హిడ్మా మృతి కూడా మావోయిస్ట్ పార్టీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తుందనే చర్చ మొదలైంది. మావోయిస్ట్ ఉద్యమం కూడా దాదాపు తుది దశకు చేరుకుందనే అంచనాలు బలపడుతున్నాయ్. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న వేళ, వరదలా సాగుతున్న లొంగుబాట్ల కారణంగా.. పార్టీ ఇబ్బంది పడుతున్న సమయంలో.. హిడ్మా ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు పెద్ద దెబ్బ అనే చెప్పారు. ఇది.. మావోయిస్ట్ పార్టీని మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా.. రెడ్ టెర్రర్ నుంచి విముక్తి చేసేందుకు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది బిగ్ అచీవ్‌మెంట్ అంటున్నారు.

Story By Anup, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×