వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు తొందరలోనే పార్టీని వీడటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారంట. జనసేనలో చేరడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెగ రాయబారాలు నడిపిస్తున్నారని తెలుస్తోంది. కొందరు నేతలైతే ఏకంగా మెగస్టార్ చిరంజీవితో రికమెండేషన్లు కూడా చేయించుకుంటున్నారని జనసేన సర్కిల్ లో గుసగుసలు వినపడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు కుదిరితే అతి కొద్ది రోజుల్లోనే కొందరు కీలక నేతలు జనసేన కండువా కప్పుకోవడం ఖాయంగా కనపడుతుందని ఏపీ పాలిటిక్స్ టాక్ నడుస్తోంది.
ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను లాంటి నేతలు పార్టీ కండువా మార్చేశారు. పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మరి కొందరు కూడా అదే దారిలో నడవబోతున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా తాము సేఫ్ జోన్ లో ఉండాలంటే జనసేన ఒక్కటే దిక్కు అని పార్టీ మారాలని చూస్తున్న వైసీపీ నేతలు భావిస్తున్నారట. జనసేనలో ఉంటే ఇటు వ్యక్తిగతంగాను, అటు రాజకీయంగాను ఇబ్బందులు ఉండవని పై పెచ్చు అదృష్షం కలిసి వస్తే పదవీ యోగం కూడా దక్కవచ్చనేది నేతల ఆలోచనట. అందుకే ఆలస్యం చేయకుండా పార్టీ మారాలని తాపత్రయపడుతున్నారంట.
గతంలో వైసీపీ ప్రభుత్వంలో తమ వల్ల ఇబ్బందులు పడ్డ టీడీపీ నేతలు ఎలాగూ ఆ పార్టీలోకి రానివ్వరని.. అందుకే జనసేన అయితే కరెక్ట్ అని మెజార్టీ నేతలు భావిస్తున్నారు. జనసేనలో నాయకుల కొరత తీవ్రంగా ఉంది. అత్యధిక నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్ధుల కొరత ఉంది. అందుకే ఆ పార్టీలోకి వెళితే రాజకీయంగా ఉపాధి లభించడంతో పాటు చాలా ప్రయోజనాలు ఉంటాయని నేతలు భావిస్తున్నారంట. అందుకే జనసేన వైపు వైసీపీ నేతలు చూస్తున్నారని రాజకీయ పరిశీలకుల అంచనా.
ముఖ్యంగా మొన్నటి ఎన్నికల వరకు వైసీపీలో ఉన్న నేతలతో మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ కసిగా పోరాడింది. ఇప్పుడు అలాంటి నేతలే జనసేనలో చేరితే అప్పుడు రాజకీయాలు ఎలా ఉండబోతాయి అని టీడీపీలో చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించిన నేతలు జనసేనలో చేర్చుకోవడం కరెక్టు కాదని టీడీపీలోని పలువురు నేతలు అంటున్నారు. తమను ఇబ్బంది పెట్టిన నేతలే ఇప్పుడు జనసేనలో కాలర్ ఎగరేస్తూ ఉండటాన్ని తెలుగు తమ్ముళ్లు అస్సలు తట్టుకోలేకపోతున్నారంట. తమ రాజకీయ శత్రువులు ఇప్పుడు మిత్ర పక్షాల్లో చేరితే రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో? అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతుంది.
ప్రస్తుతానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు సమన్వయంతో కూటమిని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీనీ ఇబ్బందిపెట్టిన నేతలను జనసేనలో చేర్చుకుంటే క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల మాట. టీడీపీ నుంచి వస్తున్న సూచనలను జనసేనాని ఎలా తీసుకుంటారు. వైసీపీ నుంచి వస్తున్న వారందరిని పార్టీలో చేర్చుకుంటారా? లేక ఆయా నియోజకవర్గ పరిస్థితులను బట్టి పవన్ నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ జనసేనలో జరుగుతుంది. చాలా మంది నేతలు జనసేనలో చేరడానికి సుముఖత చూపిస్తున్నారు కానీ జనసేన అధినేత మాత్రం కొందరి విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం.
Also Read: కాళ్ల బేరానికి పేర్ని నాని? కారణం ఇదేనా..?
వైసీపీలో ఉన్నప్పుడు పవన్‌ను , జనసేనను ఇష్టం వచ్చినట్లు విమర్శించిన నేతలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జనసైనికులు సూచిస్తున్నారు. అలాంటి వారిని తీసుకుంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని కొందరు నేతలు పవన్‌కు చెబుతున్నారట. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఏమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధికార వైసీపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమితో తిరిగి సొంత గూటికి చేరాలనుకుంటున్నారంట. అయితే రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక రీఎంట్రీని జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాపాక వరప్రసాద్ విషయంలోనే క్యాడర్ అంత సీరియస్ గా ఉంటే ఇక వైసీపీ నుంచి వస్తున్న మిగిలిన నేతల పట్ల ఎలా రియాక్ట్ అవుతారో అని జనసేన ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు.
తాజాగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు పలువురు టీడీపీలోకి.. మరి కొందరు జనసేన, బీజేపీల్లో చేరుతున్నారు. అనేక మందికి టీడీపీ గేట్లు తెరవకపోవడంతో మిత్రపక్షాల వైపు వెళ్తున్నారు.. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆనంద్ చేరికని విశాఖ జిల్లా టీడీపీ సీనియర్లు వ్యతిరేకించడంతో ఆయన గత్యంతరం లేక బీజేపీ చేరారు. దాంతో బీజేపీపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
అలాగే మంగళగిరిలో లోకేష్‌పై ఇష్టానుసారంగా మాట్లాడి వైసీపీ బాట పట్టిన గంజి చిరంజీవి తాజాగా పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన గంజి చిరంజీవి టీడీపీలో ఉన్న ఆప్కో చైర్మన్‌గా పదవులు అనుభవించారు. గత ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ గంటి చిరంజీవి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని ఎదురు చూసిన చిరంజీవి అది కూడా దక్కకపోవడంతో అలిగి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. లోకేశ్‌పై పోటీకి సిద్దమైన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కైకలూరు నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ శిష్యుడిగా కైకలూరు జడ్పీటీసీ సభ్యుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన అనూహ్యంగా 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కించుకుని కామినేనిపై విజయం సాధించారు. ఇక 2014 పొత్తుల్లో భాగంగా కామినేని శ్రీనివాస్ కోసం తన సీటు త్యాగం చేసి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగానే కొనసాగారు.
2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ ఎమ్మెల్యేగా టిక్కెట్టు ఇచ్చినా ఓటమి పాలయ్యారు. రెండు దశాబ్దాలుగా టీడీపీకి సేవలందించిన జయమంగళ వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఉహించని విధంగా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ గూటికి చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన జయమంగళ తాజాగా జనసేనలో చేరడం కైకలూరు టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదంట.
ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు ఉండడంతో భవిష్యత్తు ఎన్నికల్లో టిడిపిలో ఉంటే అవకాశం రాదని భావిస్తున్న నేతలు జనసేన, బిజెపి వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కూటమి పార్టీల్లో చేరికలకు సంబంధించి మూడు పార్టీల నేతలతో ఒక్క స్క్రూటినీ కమిటీ ఉంది. ఏ పార్టీలో ఎవరు చేరినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఏకాభిప్రాయంతోనే చేర్చుకోవాలి. అయితే ఇటీవల బీజేపీ, జనసేనల్లో చేరికలపై టీడీపీ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు పొత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.