Koneti Adimulam: కూటమి ప్రభుత్వానికి ఓ ఎమ్మెల్యే దూరం కానున్నాడా…? ఏకంగా అధిష్టానంపైనే తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నాడా..? ప్రోటోకాల్ పాటించడం లేదంటూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ ఎమ్మెల్యే..అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోనున్నాడా..? ఎమ్మెల్యేను వద్దనుకునే..టీడీపీ పెద్దలు.. పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పేరుతో ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారా..? అధిష్టానంకు బుద్దిచెప్పేందుకు ఎమ్మెల్యే ఆడుతున్న రివర్స్ డ్రామా ఏ మేరకు పనిచేస్తుంది..?
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ చినికి చినికి గాలివానలా మారుతోంది. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం…తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బహిరంగంగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల చేత ఎన్నికైన తనకు కాకుండా..ప్రార్టీ ప్రోగ్రామ్ కన్వినర్‌కు అగ్రతాంబూలం ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను దళితుడిని కాబట్టే చిన్నచూపు చూస్తున్నారంటూ ఏకంగా కలెక్టరేట్‌లోనే ఆక్రోశాన్ని వెల్లగక్కడం ఇప్పుడు సంచలనంగా మారింది.
సత్యవేడు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా పేరొందిన కోనేటి ఆదిమూలం..2014లో తొలిసారిగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. టీడీపీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో వైసీపీ తరపున మరోసారి పోటీ చేయగా..ఈ సారి విజయం ఆయన్ను వరించింది. అయితే 2024 ఎన్నికల ముందు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆదిమూలం గళం విప్పారు. దీంతో ఆయన తెలుగు దేశం అధిష్టానం దృష్టిలో పడి చివరి నిమిషంలో టిడిపి టికెట్‌తో పోటీ చేసి గెలిచారు.
2024లో గెలిచినప్పుడు హీరోగా ఉన్న ఆదిమూలం..కొద్ది నెలల్లోనే జీరోగా మారారు. సెప్టెంబర్‌లో టీడీపీ మహిళా నాయకురాలితో ఉన్న రాసలీలల వీడియోలు బయటపడటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం..పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య మహిళా నాయకురాలితో ఎమ్మెల్యే ఆదిమూలం కాంప్రమైజ్ అయ్యారు. మహిళతో రాజీకుదుర్చుకున్నా…టీడీపీ అధిష్టానం మాత్రం ఆయనపై సస్పెన్షన్ ఎత్తవేయలేదు. అయినా కొద్దిరోజుల తర్వాత పార్టీ తనకు అవకాశం ఇస్తుందని భావించి సైలెంట్ అయ్యారు. కానీ..ఇటీవల సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్యే ఆదిమూలం రగిలిపోతున్నారు.
సత్యవేడులో టీడీపీ కార్యక్రమాల కోఆర్డినేటర్‌గా కూరపాటి శంకర్ రెడ్డి అనే వ్యక్తిని అధిష్టానం నియమించింది. కాంట్రాక్టర్ అయిన శంకర్ రెడ్డి..గతంలో తుడా చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డారు. అయినా అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. 2024 ఎన్నికల సమయంలో పార్టీకి ఆర్థికంగా సహకరించారని పేరుంది. అటు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారన్న యోచనలో ఉన్న అధిష్టానం…కూరపాటి శంకర్‌రెడ్డిని లైన్లో పెట్టింది. కోఆర్డినేటర్ పేరుతో పార్టీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఇతర కులాల పెత్తనం ఏంటన్న విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు పట్టించుకోకుండా…శంకర్ రెడ్డి..తన అనుచరులకు పదవులు ఇస్తున్నారని టాక్. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన వారికి శంకర్ రెడ్డి అగ్రతాంబూలం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో స్థానిక అధికారులు సైతం శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తున్నారని సమాచారం. అయితే శంకర్‌రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తూ..తనకు ఇవ్వకపోవడంతో…ఎమ్మెల్యే ఆదిమూలం తెగ రగిలిపోతున్నాడట.
ఈ నేపథ్యంలో అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్యే ఆదిమూలం సిద్ధమయ్యాడట. అందులో భాగంగా టీడీపీ పెద్దలకు వ్యతిరేకంగా రివర్స్ గేమ్ మొదలు పెట్టాడని టాక్. ఇటీవల నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి అరగంట ముందుగానే వస్తున్నాడట. అక్కడ తన ప్రసంగంలో పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారట. పార్టీ పెద్దలు నియమించిన శంకర్‌రెడ్డితో పాటు…ప్రభుత్వాధికారులను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. తాను దళిత ఎమ్మెల్యేను కాబట్టే..ప్రోటోకాల్ విషయంలో చిన్నచూపు చూస్తున్నారని..కనీస గౌరవం ఇవ్వడం లేదని సింపతీ గేమ్ మొదలు పెట్టాడట. ఈ క్రమంలోనే తిరుపతిలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కేసులు, వారి అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో ఆదిమూలం ఆగ్రహంతో ఊడిగిపోయాడట. ఎలాంటి ప్రభుత్వ పదవి లేని వ్యక్తికి ప్రోటోకాల్ ఏలా ఇస్తారంటూ అధికారులపై సీరియస్ అయ్యాడట. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రమేల…తాడోపేడో సీఎంతోనే తేల్చుకుంటానని..గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట.
సత్యవేడులో తండ్రికి తగ్గ తనయుడిగా.. ఆదిమూలం కుమారుడు సుమన్ సైతం రెబలిజం చూపిస్తున్నారు. జెడ్పీటీసీగా ఉన్న ఆయన.. ఇసుక అక్రమ రవాణా చేస్తు్న్న ట్రాక్టర్లపై నారాయణ వనం ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇసుక ట్రాక్టర్లను స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు.. అనంతరం వారిని వదిలేశారు. తన ఫిర్యాదును అధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడంపై సుమన్..ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఏకంగా ఎమ్మార్వో ఆఫీస్‌కే తాళం వేయడం సంచలనంగా మారింది. అయితే సుమన్ తీరుపై తహసీల్దార్ రోజా రాణి తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఓ వైపు ఎమ్మెల్యే ఆదిమూలంకు నియోజకవర్గంలో కనీస గౌరవం లేదు..మరోవైపు జెడ్పీటీసీగా ఉన్న సుమన్‌కు విలువలేదు. ఈ క్రమంలో తండ్రీకొడుకులు ..టీడీపీ అధిష్టానంపై తిరుబావుటా ఎగురవేయడానికి సిద్ధమవుతున్నారని టాక్. టీడీపీ పెద్దలు తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తేసే పరిస్థితి లేదని భావిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం…భవిష్యత్‌పై కార్యాచరణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ముందుగా సత్యవేడులో తనను రాజకీయంగా పతనం చేసేందుకు జరిగిన కుట్రలు, గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి సహకరించిన టీడీపీ నేతల వివరాలతో సీఎంను కలిసే యోచనలో ఆదిమూలం ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత దళిత జెండా భుజాన వేసుకుని..తండ్రీకొడుకులు పోరుబాట పట్టాలని యోచిస్తున్నారట.
మొత్తం మీద సత్యవేడు నియోజవర్గంలో నెక్ట్స్ ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒక వేళ దళిత కార్డుతో ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన కుమారుడు సుమన్ పోరుబాట సాగిస్తే..టీడీపీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. మరి సత్యవేడు పంచాయితీని అధిష్టానం ఎలా సాల్వ్ చేస్తుంది. ఆదిమూలం ఆగ్రహాన్ని చల్లారుస్తుందా..? లేక శంకర్‌రెడ్డి ఆధిపత్యానికి అండగా నిలుస్తుందా ? అనేది చూడాలి.
Story By Kishan, Big Tv