Mydukur Politics: గడిచిన 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆ నియోజకవర్గంలో చిరకాలం తర్వాత జండా ఎగరవేసింది. దాంతో ఆ సెగ్మెంట్‌ని తమ కంచుకోటగా భావిస్తున్న వైసీపీ కేడర్‌కు పెద్ద షాకే తగిలింది .. ఆ క్రమంలో అసలే నైరాశ్యంలో ఉన్న కేడర్‌ని మాజీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం మానేశారంట. అసలే గడ్డు పరిస్థితుల్లో ఉన్న తమను ఆ సీనియర్ నాయకుడు గాలికొదిలేసి మాయపోయాడని వైసీపీ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఓటమి తర్వాత కేడర్‌కు ముఖం చాటేస్తున్న ఆ నాయకుడు ఎవరు?
1999 తర్వాత మైదుకూరులో విజయం సాధించిన టీడీపీ
గడిచిన 2024 ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసింది. 1999 తర్వాత తెలుగుదేశం పార్టీ దీర్ఘకాలానికి అక్కడ పాగా వేయగలిగింది. 1999 ఎన్నికల్లో మైదకూరులో టీడీపీ నుంచి గెలిచిన శెట్టిపల్లె రఘురామిరెడ్డి తర్వాత వైసీపీ బాటపట్టి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్‌యాదవ్ ఆయనకి షాక్ ఇచ్చారు. 1985 ఎన్నికల నుంచి వరుసగా తొమ్మిది సార్లు మైదుకూరు నుంచి పోటీ చేసిన రఘురామిరెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు. గెలిచినా ఓడినా ఎప్పుడూ నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉండే ఆయన 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత కనిపించడమే మానేశారంట.
క్యాడర్ ఇబ్బందులను పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే
ఎన్నికల అనంతరం మైదుకూరు నియోజకవర్గం లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురాంమిరెడ్డి నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం లేదంట. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం మైదుకూరులో ఇష్టానుసారం చెలరేగిపోయిన క్యాడర్ తర్వాత పరిణామాలతో అనేక ఇబ్బందులకు గురవుతున్నా మాజీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంట. వైసీపీకి వెన్నుముక్కలా పనిచేసిన కేడర్ ని ఆయన పూర్తిగా విస్మరిస్తుండటంపై పార్టీ పరంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్యాడర్‌కి ఏ కష్టం రాకుండా చూస్తానంటున్న జగన్
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలకే జగన్ అధికారంపై కలలు కనేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ సారి 30 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలుతామని ప్రకటనలు చేస్తున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చాక కేడర్‌కు ప్రాధాన్యత ఉంటుందని… క్యాడర్ కి ఏ కష్టం రాకుండా చూస్తామని అంటున్నారు.
కడప జిల్లాలోనే కేడర్ని పట్టించుకోని అధిష్టానం
జగన్ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఎంత భరోసా ఇస్తున్నా ఆయన సొంత జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో ఆ పరిస్థితి కనిపించం లేదు. గడిచిన పదేళ్లుగా వైసీపీ బలోపేతానికి కృషిచేసిన క్యాడర్ ఇప్పుడు నిరుత్సాహంలో ఉందట. అధికారంలో ఉన్నప్పుడు కూడా శెట్టిపల్లె రఘురామిరెడ్డి క్యాడర్ ని పట్టించుకున్న పాపాన పోలేదని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎంత సేపు తన స్వప్రయోజనాలే చూసుకుంటూ కార్యకర్తల్ని విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తల్ని పట్టించుకోని శెట్టిపల్లె
అంత సీనియర్ నాయకుడైన శెట్టిపల్లె రఘురామిరెడ్డి పరాజయం తర్వాత పార్టీకి, కార్యకర్తలకి అండగా నిలవాల్సిందిపోయి కాడె వదిలేసినట్లు వ్యవహరిస్తుండటం వైసీపీ వర్గాలకు మింగుడుపడటం లేదంట.. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వైసీపీ బలోపితానికి కృషిచేసిన కేడర్ ని పక్కన పెట్టడంపై మైదుకూరు నియోజకవర్గం లోని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి సెగలు రేగుతున్నాయట. ఆ క్రమంలో కూటమి పార్టీ తలపులు తెరుచుకుంటాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారంట .. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం వారిని దరిచేరనీయడం లేదంట. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి, తమను వేధించిన వారిని తమ సార్టీల చేర్చుకునే పరిస్థితి లేదని తెగేసి చెప్తున్నారంట.
Also Read: జగన్‌కు బిగ్ ఝలక్.. టీడీపీలోకి మరో ఎమ్మెల్యే..!
అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఏం చెప్పినా చేసిన కేడర్ .. తాము గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్నా పట్టించుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుందంట. కడప జిల్లాలో వైసీపీ పరాజయం పాలైన అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. పార్టీ అధ్యక్షుడి సొంత జిల్లాలోనే ఇలా ఉంటే పార్టీ మనుగడే కష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.