GHMC: స్వేచ్ఛ బ్యూరో: రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? మీ వద్ద కొన్ని లక్షల రూపాయాలుండి, మీకు జీహెచ్ఎంసీ ఇంజనీర్లతో పరిచయం ఉంటే చాలు. కాంట్రాక్టర్ గా అవతారమెత్తి, పనులను మంజూరు చేయించుకుంటే చాలు, పనులు చేయకున్నా బిల్లులు క్లెయిమ్ చేసి కోట్లాది రూపాయలను సంపాదించుకోవచ్చు. ఈ పనులకు గానీ, బిల్లుల క్లెయిమ్ లకు సంబంధించి ఎలాంటి తనిఖీలుండవు. అసలు ప్రశ్నించే వారే ఉండరు. ఇంజనీరింగ్ విభాగంలో వరుసగా అక్రమాలు చేసుకోవటం పట్ల ప్రజలు కమిషనర్ సాబ్ హే క్యాహై అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ఎక్కువ మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో ఇంజనీరింగ్ వింగ్ ఇష్టారాజ్యం కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీహెచ్ఎంసీ అంటేనే అవినీతి, అక్రమాలు, అవకతవకలను ప్రస్తావించగానే గుర్తుకొచ్చేవి టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలు. కానీ ఇపుడు ఇంజనీరింగ్ విభాగం ఆ రికార్డును బద్దలు కొట్టి, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బల్దియా ఖజానాకు కన్నం వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన ఏడాదిగా చేయని పన్నులకు బిల్లులు చెల్లించటం, ఒకే పనికి రెండు సార్లు బిల్లులు చెల్లించటమే గాక, ఇపుడు తాజగా ఒక సర్కిల్ లో మంజూరై, టెండర్ల ప్రక్రియ చేపట్టి, అవే పనులను మరో సర్కిల్ లో చేపట్టిన తతంగం బయట పడింది. చార్మినార్ జోన్ లోని వార్డు నెంబర్ 28 ఆజంపురాలో చేపట్టాల్సిన బాక్స్ డ్రెయిన్ పనులను వార్డు నెంబర్ 26 ఓల్డ్ మలక్ పేటలో చేపట్టి, బిల్లులు క్లెయిమ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని విజిలెన్స్ అధికారులు చార్మినార్ ఇంజనీరింగ్ వింగ్ కు లేఖ రాసినట్లు సమాచారం.
గతంలో కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబరితి ఉన్నపుడు ఐఎస్ సదన్ డివిజన్‌లో రూ. 10 లక్షల రోడ్డు పనులు మంజూరు కాగా, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేయకుండానే బిల్లులు క్లెయిమ్ చేశారు. ఈ వ్యవహారంపై స్థానిక కార్పొరేటర్ కమిషనర్ ఇలంబరితికి ఫిర్యాదు చేయటంతో ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించటంతో అసలు విషయం బయటకొచ్చింది. దీంతో బిల్లులు గా చెల్లించిన రూ. పది లక్షలను రికవరీ చేయటంతో పాటు ఓ ఇంజనీర్ పై సస్పెన్షన్ వేటు వేయగా, మరో ఇంజనీర్ ను విధుల నుంచి తొలగించారు. అంతేగాక, సదరు కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా, ఒక వైపు జీహెచ్ఎంసీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే, మరో వైపు ఫైనాన్షియల్ అడ్వైజర్ వింగ్ లోని కొందరు అధికారులు, కాంట్రాక్టర్లకు కుమ్మక్కై ఒకే పనికి రెండు సార్లు బిల్లులు చెల్లించిన వ్యవహారం కూడా ఇటీవలే బయట పడింది.
Also read: నిమజ్జనానికే కాదు.. విగ్రహం తెచ్చేటప్పుడే రచ్చ రంబోలా.. మారుతున్న గణేష్ ఉత్సవాలు!
ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారికంగా ప్రకటన కూడా జారీ చేశారు. సుమారు రూ. వంద కోట్ల వరకు డబుల్ బిల్లుల చెల్లింపులు జరిగినట్లు ప్రచారం జరుగుతుంటే అధికారికంగా జారీ చేసిన ప్రకటనలో మాత్రం కమిషనర్ డబుల్ బిల్లులు జరిగిన విషయం వాస్తవమేనన్న విషయాన్ని అంగీకరించటంతో పాటు డబుల్ గా చెల్లించిన మొత్తం బిల్లులు అంకెలను కూడా అంగీకరించారు. ఈ వ్యవహారంలో మాత్రం ఐఎస్ సదన్ లో చేయని పనులకు బిల్లులను క్లెయిమ్ చేసిన ఘటనలో తీసుకున్న చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. ఒక పని కి రెండు సార్లు బిల్లుల చెల్లింపుల వ్యవహారం బయట పడటంతో కేవలం ఫైనాన్షియల్ అడ్వైజర్ ను తన మాతృశాఖకు సరెండర్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారే తప్పా, రికవరీకి ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోగా, ఎవరిపై క్రిమినల్ కేసులను కూడా నమోదు చేయకపోవటం గమనార్హం.
జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వింగ్ లో వరుసగా అక్రమాలు, ఒకే పనికి రెండు సార్లు బిల్లుల చెల్లింపులు, ఒక సర్కిల్ లో మంజూరైన పనులను మరో సర్కిల్ లో చేయటం వంటి అక్రమాలు జరుగుతున్నా? పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయటంతో పాటు పనుల్లోని నాణ్యతను అంచనా వేయాల్సిన క్వాలిటీ సెల్ జీహెచ్ఎంసీలో అసలు ఉన్నట్టా? లేనట్టా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పాతబస్తీలోని గౌలీపురాలో బాక్స్ డ్రెయిన్లు నిర్మించారు. మరుసటి రోజున చిన్న పాటి వర్షానికే నిర్మించిన బాక్స్ డ్రెయిన్లు కొట్టుకుపోయాయి.
ఈ విషయంపై నేరుగా అప్పటి చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ కు ఫిర్యాదు అందటంతో ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్ తో మాట్లాడి, బాక్స్ డ్రెయిన్లను పునర్ నిర్మించి, క్వాలిటీ చెక్ చేయించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ప్రతి పనిని క్వాలిటీ సెల్ ఇంజనీర్లు చెక్ చేసి నివేదికలను సమర్పించాల్సి ఉండగా, కొందరు ఇంజనీర్లు మాత్రం రూ. 10 లక్షల అంచనా వ్యయం దాటిన పనులను మాత్రమే క్వాలిటీ సెల్ తనిఖీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. బల్దియా జీహెచ్ఎంసీగా రూపాంతరం చెంది దాదాపు రెండు దశాబ్దాలుగా గడుస్తున్నా, ఇప్పటి వరకు క్వాలిటీ సెల్ ఇంజనీర్లు ఒక్క పనిలో కూడా నాణ్యత లోపాలను గుర్తించకపోవటం వారి విధి నిర్వహణకు నిదర్శనంగా పేర్కొనవచ్చు.
Also read: తెలంగాణ విద్యుత్ వాడకంలో సరికొత్త హిస్టరీ.. అత్యధిక వినియోగం అక్కడే?