కేటీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు కవిత. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లా నుంచే ఆమె మరోసారి రామన్నను నిలదీశారు. నేరెళ్ల బాధితుల పక్షాన నిలిచిన ఆమె.. వారికి అండగా ఉండటమే కాదు.. ఈ నేలపై నుంచే ఆనాటి కర్కశత్వాన్ని గుర్తు చేశారు. కేటీఆర్ తప్పిదాలను, అధికార దాహాన్ని కడిగిపారేశారు. పనిలో పనిగా దీన్ని ఆసరా చేసుకుని శపథాలు పూని అధికారం చేజిక్కించుకున్న రేవంత్‌నూ గట్టిగానే అర్సుకున్నారు.
అయితే.. ఆమె కేటీఆర్ విషయంలో సూటిగా తొమ్మిది ప్రశ్నలు వేశారు.. నిలదీశారు. అప్పటి నిర్లక్ష్యాన్ని, అధికార దర్పాన్ని, ఓట్ల రాజకీయాలను తూర్పారబట్టారు. ఇప్పుడు ఇది స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే టీఆరెస్ జెండా పండుగ సందర్భంగా ఆమె సిరిసిల్లా పర్యటనలో కూడా కేటీఆర్‌ను టూరిస్ట్ ఎమ్మెల్యేగా ఎద్దేవా చేశారు. ఆ తరువాత ఇవాళే ఆమె మళ్లీ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నిలదీతల పర్వంతో పాటు పలు డిమాండ్లు కూడా ముందు పెట్టారు కవిత.
1. కేవలం ఇసుక కోసం.. ఇంత ధనదాహమా? లారీలను అడ్డుకున్నారని 8 మంది దళితులను ఐదు రోజులు పాటు థర్డ్ డిగ్రీ ఇచ్చి వారిని జీవచ్చవాలుగా మార్చితే కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదు..? ఎందుకు ఈ కేసుపై శ్రద్ధ చూపలేదు..?
2. కేటీఆర్ ధనవంతుల పక్షం వహించినందునే.. పోలీసులు చెలరేగిపోయారా? పోలీసులు అమానవీయంగా ఇంతటి దమనకాండకు పాల్పడ్డారంటే దీని వెనుక కేటీఆర్ సపోర్టు లేదా? వారి అండదండలతోనే పోలీసులు దళితులపై దమనకాండ కొనసాగించారా?
3. కేటీఆర్ పేద ప్రాణాలంటే లెక్కలేదు. అసలు ప్రాణాలకే విలువలేదు. ఆయనకు ధనదాహం ఎక్కువైంది. అందుకే దళితుల ప్రాణాలు లెక్కలేకుండా పోయాయి. తన ధనదాహానికి చట్టం కూడా వంతపాడింది. పోలీసులను ఉలిగొల్పి.. ఆ మారణకాండకు తెగబడ్డారు..
4.డబ్బులకు ఇచ్చిన ప్రయార్టీ దళితుల ప్రాణాలకు కేటీఆర్ ఇవ్వలేదు. ఇసుక వ్యాపారం కోసం దళితుల ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయాలు చేసిన కేటీఆర్‌ను మరిచిపోతామా? అధికార దర్పంతో కళ్లు కనిపించని కేటీఆర్.. ధనదాహానికి దాసోహమయ్యాడు. అందుకే ఈ నేలపై రక్తం చిమ్మింది.
5. ఇంతటి ఘోరమైన శిక్ష వేసి.. జీవితాలు విచ్ఛిన్నం చేసిన కేటీఆర్‌ను వదిలేదు లేదు. బీఆరెస్‌నూ వదిలేదు. పౌరుషం ఉన్న ఆడబిడ్డలుగా మేమంతా పోరాడుతాం.. తగిన బుద్ది చెబుతాం. అన్నీ మరిచిపోయామనుకుంటున్నారు.. ఏమీ మరిచిపోలేదు.. కడుపులు కుతకుతా ఉడుకుతున్నాయి.
6. నేను టూరిస్ట్ లెక్క రాలేదు. ఇలా వచ్చి అలా పరామర్శించి.. చేతులు దులుపేసుకోవడానికి నేనేం కేటీఆర్‌ను కాను. రక్షణ సేన పార్టీ గొడుగు కింద నేరెళ్ల బాధతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా..! ఆ పాపాలకు శిక్షపడేదాకా వెంటాడుతాం..!
7. బాధితులను మరిచిపోయి.. పోలీసులకు రక్షణ ఇచ్చారంటేనే అర్థమవుతున్నది పదేళ్ల పాలన ఎలా సాగిందో? మానవ హక్కుల కమిషన్ ఎస్పీపై చర్య తీసుకోమంటే కేటీఆర్ ఎందుకు తీసుకోలేదు? ఓ ఎస్సైని బలిపెట్టి వీరి పాపాలను కప్పేసుకుందామనుకున్నారు.. కానీ ఆ పాపం దాగదు.. ఇంకా వెంటాడుతూనే ఉన్నది..
8. కేటీఆర్ ఈ బాధిత కుటుంబాలకు అండగా ఉండాలె. చికిత్సల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఆ ఖర్చులన్నీ భరించాలె. పరిహారం ఇవ్వాలె. ఆర్థికంగా అండగా ఉండాలె. విద్యా, వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు భరించాలె..
9. దీన్ని వదిలిపెట్టేది లేదు. కేటీఆర్‌నూ వదలబోం. ఢిల్లీకి పోతం.. ఆ రిపోర్టును బయటకు తీస్తాం. అందులో ఎవరు బాధ్యులుగా తేల్చారో తెలంగాణ సమాజం ముందుంచుతాం.. ఆ పాపాలకు లెక్కకట్టి నేరెళ్ల నేరగాళ్లకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్షలు పడేదాకా టీఆరెస్ పోరాటం చేస్తూనే ఉంటుంది.