చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు.. ఆ కుటుంబ సభ్యులు ఆస్తులు కూడబెట్టుకునేందుకు కేసీఆరే ఆద్యుడిగా నిలిచారు. చీమలు చేసిన పుట్టలు పాములకిరువైనయట్లు.. అన్న చందంగా.. ఆయన ఫామ్‌హౌజ్ చుట్టూ ఆ కుటుంబ సభ్యుల భూములే ముసురుకున్నాయి. ఆయన కుటుంబ సభ్యురాలు, స్వయంగా కూతురే ఈ విషయాన్ని వెల్లడించడం కేసీఆర్ రాజకీయ జీవితంలో ఓ మాయని మచ్చే అని చెప్పాలి. కవిత చూపిన ఆ భూముల చిట్టాను చూస్తే జనానికి ఎవరికైనా అనిపిస్తుంది.. ఇంత సంపాదించారా? అని. కేసీఆర్ కు ఇదంతా తెలియకుండానే వీరు చేశారా? అనే అనుమానమూ కలుగక మానదు.
మొన్నటి దాకా కేసీఆర్ ఫామ్‌హౌజే ఓ వివాదం. కానీ ఇవాల్టి నుంచి కవిత వల్ల ఆ కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ ఉన్న ఆయన కుటుంబ సభ్యుల భూముల లెక్కలూ ఓ వివాదమే. ఓ రాజకీయమే. ఇది ఆమెకు, ఆమె కొత్త పార్టీకి ఏం మేలు చేస్తుందో లేదో తెలియదు కానీ, కాంగ్రెస్ సర్కార్‌కు మాత్రం కచ్చితంగా మేలే చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే రేవంత్ .. కేసీఆర్ ఫామ్‌హౌజ్ కేంద్రంగా తనదైన స్టైల్ రాజకీయాలు చేస్తున్నారు. ఫామ్‌హౌజ్ వీడి రావడం లేదని విమర్శిస్తున్నారు. అసెంబ్లీకి రావా? అని నిలదీస్తున్నారు. ఆ ఫామ్‌హౌజ్ భూముల్లో పేదల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపిస్తున్నారు. సర్వేలు చేపిస్తున్నారు. ఆ ఫామ్‌హౌజ్ ఎదురుగానే అమరుల కుటుంబాలకు కాలనీ కడతానని కూడా ప్రకటించి ఆ పార్టీని, కేసీఆర్‌ను పూర్తిగా డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు ఆ ఫామ్‌హౌజ్ ఓ అస్త్రం. కేసీఆర్‌ను రాజకీయ చట్రంలో ఇరికించి చెరుకు గడలా పిప్పి చేసేందుకు ఉపయోగపడే ఓ యంత్రం. దీనికి తగ్గట్టుగానే ఆయన బయటకు రావడం లేదు. ఏం మాట్లాడటం లేదు. ఎలాంటి విమర్శలకూ స్పందన లేదు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను దాటి కేటీఆర్, హరీశ్‌రావు ఫామ్‌హౌజులను కూడా టార్గెట్ చేసింది కాంగ్రెస్ ఈ మధ్య. వారి గెస్ట్ హౌజ్‌ల వద్దకు బస్సుయాత్రలు కూడా చేపట్టారు. అక్రమంగా భూములు కొల్లగొట్టారని, భారీ అవినీతికి పాల్పడ్డారనే విమర్శలనే అస్త్రాలుగా సంధిస్తూ.. బీఆర్‌ఎస్‌పై ఇంకా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోకుండా ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది రేవంత్ సర్కార్.
ఇప్పుడు వీరికి తాజాగా దొరికిన మరో అస్త్రం.. కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ ఆ కుటుంబ సభ్యుల భూములు. ఈ కొత్త ఐడియా ఇచ్చింది కవితే. ఇప్పుడు బస్సుయాత్రలు అక్కడికి కూడా చేయాలనే ఆలోచన వస్తే దానికీ కవితే ఊతమిచ్చిందనుకోవాలి. అంటే ఓ రకంగా కవిత ఆరోపణాస్త్రాలు.. ఆమె కంటే.. కాంగ్రెస్‌కే మేలు చేసేలా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదేమో!
ఎవరో ఆరోపిస్తే అంత పస ఉండదు. సీఎం పదే పదే ఆరోపించినా రోజూ ఇదేగా ఉండేది.. అని బోర్ కొడుతుంది జనానికి. కవితే ఇలా బయటకు వచ్చి.. ఆ కుటుంబం అవినీతి బండారం బయటపెడితే.. ? ఎవరికైనా ఆసక్తే ఉంటుంది. నమ్మాలనిపిస్తుంది. అవును మరి పదేండ్లు అధికారంలో ఉన్నారుగా.. చేసే ఉంటారులే అని అనిపించకా మానదు. కానీ అదే సమయంలో కవిత కూడా కుటుంబ సభ్యురాలేగా అని అనిపించకా మానదు.
అందుకే ఆమె తను ఆ కుటుంబం చేసిన అవినీతిలో మాత్రం భాగం కాదు.. అని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా ఆస్తులు ఇవీ… అని జనం ముందు క్లియర్‌గా ఉన్నాయి… అని చెబుతూ వస్తున్నారు. ఇంతలా అవినీతి చేసింది కేసీఆర్ కాకపోయినా.. ఆ అవినీతికి పాల్పడిన కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడింది మాత్రం ఆయనేనని చెప్పకనే చెబుతున్నారు కవిత. బహుశా ఇలాంటి రాజకీయాన్ని జనాలు ఎక్కడా చూసి ఉండరేమో! తెలంగాణలో కొత్త రాజకీయ ఒరవడి కొనసాగుతోంది. అది దేశ వ్యాప్త చర్చకు దారి తీస్తోంది.