హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ దేశ వ్యాప్త చర్చకు తెర తీసింది. ఇక్కడ మూడు రోజులుగా జరిగే ఈ కార్యక్రమంపై కేంద్రం భయపడుతున్నదా? దీన్ని అడ్డుకోవాలని, సఫలం కావొద్దని భావిస్తున్నదా? అనే అనుమానాలు వచ్చేలా మోడీ సర్కార్ వైఖరి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చే విదేశీ అథితుల వీసాలను రద్దు చేయడంతో కేంద్రం వైఖరిపై వివాదం నెలకొన్నది.
ఇది చాలదంటూ దేశ వ్యతిరేక శక్తులు సమ్మిట్‌కు వస్తున్నారనే ఆరోపణలు కూడా వివాదాన్ని రాజకీయంగా మరింత వేడెక్కిస్తున్నాయి. ఏకంగా నల్ల రిబ్బన్లు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పిలుపునివ్వడం.. భారత్ సమ్మిట్‌పై కేంద్రం వైఖరి తీవ్రత తీరు ఎలా ఉందో తెలియజేస్తోంది.
ప్రగతి శీల రాజకీయ పార్టీలు, మేధావులు, పౌర సమాజ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ భారత్ సమ్మిట్ ఉద్దేశం. అంతర్జాతీయ రాజకీయాలతో పాటు, సామాజిక, ఆర్థిక విధానాలపై ఈ సమ్మిట్‌లో చర్చలు జరుగుతాయి. ఇదో అంతర్జాతీయ సదస్సు కావడంతో మోడీ సర్కార్ దీనిపై సీరియస్‌గా కన్ను పెట్టింది. దాదాపు వెయ్యి మంది దాకా విదేశీ ప్రతినిధులు అతిథులుగా సమ్మిట్‌కు హాజరు కానున్నారు. ఇందులో వంద మంది దాకా విదేశీయుల వీసాలను ఆకస్మికంగా కేంద్ర మంత్రిత్వ శాఖ రద్దు చేయడం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దేశ విద్రోహ శక్తుల కార్యక్రమంగా ముద్ర వేస్తున్న సర్కార్ .. మరి మిగిలిన వారికి ఎందుకు పర్మిషన్ ఇస్తోంది? ఎందుకు దీన్ని అడ్డుకోవాలని చూస్తుందనే ప్రశ్నలను సంధిస్తోంది. అయితే ఇక్కడి బీజేపీ నేతలు కూడా ఈ సమ్మిట్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో ఇది రాజకీయ వేడిని రగిలిస్తోంది. రాహుల్ గాంధీ చివరి రోజున ముఖ్య అతిథిగా పాల్గొననుండటంతో.. మోడీ సర్కార్ దీన్ని టార్గెట్ చేసినట్టుగా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
రాహుల్‌ను ప్రపంచ దేశాల ముందు ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్ చేయడానికే ఈ సదస్సు పెట్టారని స్టేట్ బీజేపీ ఆరోపిస్తోంది. అయితే దీన్ని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగానే తిప్పికొడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాహుల్ ప్రధాని అని చెప్పే అవసరం తమకు లేదని, అది ప్రపంచానికి అంతా తెలుసునని, మీరే మోడీ కాకుండా.. ప్రధాని అభ్యర్థిగా ఇంకెవరున్నారు..? అని సర్చ్ చేసుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఎటాక్ చేశారు.
భారత్ సమ్మిట్ లాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు రెండే జరిగాయి. అదీ హైదరాబాద్ వేదికగానే. అందుకే కేంద్రం దీనిపై సీరియస్ నజర్ పెట్టింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ టూర్‌ను కూడా ఆకస్మికంగా రద్దు చేసిన నేపథ్యంలో కూడా ఇదే రాజకీయం నడిచింది. అప్పుడూ దేశ ద్రోహ శక్తులతో రేవంత్ భేటీ కారణంగానే రద్దు చేశామని కేంద్రం సమర్థించుకున్నా.. అది బీజేపీ అభద్రతాభావానికి పరాకాష్టగానే చూశారు దేశ జనం.
ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌పై కూడా అవే ఆంక్షల సాకులను చూపి వీసాల రద్దు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నదనే సంకేతాలు వెళ్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ‘దేశ ద్రోహులు, విదేశీ దేశ ద్రోహ శక్తులు’ అనే పదాలను బీజేపీ విరివిగా వాడుతూ రావడం పరిపాటే. అత్యవసర సమయాల్లో దాన్ని తన రాజకీయ అస్త్రంగా బీజేపీ వాడుతోంది. కానీ ఈ పదాలకు పదును తగ్గుతూ వస్తోంది. జనం నమ్మడం లేదు. దీనికి తాజా ఉదాహరణ.. జంతర్‌మంతర్ వద్ద జరిగిన కాక్రోచుల ఉద్యమమే.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జెన్ జీ చేసిన ఉద్యమం.. కేంద్రానికి ఊపిరి సలపనీయలేదు. దీంతో బీజేపీ శ్రేణులు, కేంద్రం కూడా ఇందులో విదేశీ దేశ ద్రోహ శక్తులున్నాయని, విదేశీయుల హస్తం ఉందనే ప్రచారం చేసింది. అయినా ఆ ఉద్యమం ఆగలేదు సరికదా.. మరింత ఉధృత రూపం దాల్చింది. దీంతో మోడీ సర్కార్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
విషయంలో పస లేనప్పుడు, దాన్ని ఫక్తు రాజకీయ అవసరం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, కేంద్రం సెల్ఫ్ డిఫెన్స్ లో పడినప్పుడు ఇలాంటి మూస పద ప్రయోగాల వల్ల లాభం లేదని తేలిపోతున్నది. జనం నుంచి పెద్దగా స్పందన రావడం లేదని తెలిసిపోతున్నది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్రానికి కూడా అవగతమవుతూ వస్తోంది. కానీ మారుతున్న దేశ రాజకీయ సమీకరణల నేపథ్యంలో.. కాంగ్రెస్ వేస్తున్న ప్రతీ చర్యనూ చాలా క్షుణ్ణంగా కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందులోనూ భారత్ సమ్మిట్ లాంటి ప్రొగ్రెసివ్ కార్యక్రమాలపై సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నది కేంద్రం. అందుకే ఎవరేమనుకున్నా తమ పని తాము చేసుకుంటూ.. దేశ విద్రోహ చర్యలు, దేశ వ్యతిరేక శక్తుల పేరుతో తమ విచక్షణా అధికారాన్ని ప్రయోగిస్తున్నట్టుగా భావిస్తున్నారు మేధావులు.