Vinukonda Hospital: వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా వెలుగులోకి వస్తున్న విషయాలు చూస్తుంటే నిజంగా షాక్‌కు గురిచేస్తున్నాయి. బిగ్ టీవీ దీనిపై నిజాలను బయటపెట్టింది. ఇక్కడ మెయిన్‌గా రెండు పెద్ద ఇష్యూలు నడుస్తున్నాయి. ఒకటి ఈవీ కారు ఛార్జింగ్ గొడవ, రెండోది బయట మందుల దందా, ప్రైవేట్ క్లినిక్‌ల మళ్లింపు. ఆరు నెలల క్రితం గురజాల నుంచి డిప్యుటేషన్‌పై వినుకొండ హాస్పిటల్‌కి వచ్చారు పిల్లల వైద్యుడు డాక్టర్ సాయి కర్ణ. ఆయన రోజు రానుపోనూ దాదాపు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి వస్తుంటారు. అయితే, తన ఎలక్ట్రిక్ కారును ఆసుపత్రిలోనే ఛార్జింగ్ పెట్టుకుంటున్న వైనం బయటపడింది.
కేవలం కారు ఛార్జింగే కాదు.. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు గవర్నమెంట్ మందులు ఇవ్వకుండా బయట మెడికల్ షాపుల్లో మందులు రాస్తున్నారనే ఫిర్యాదులు పెద్దఎత్తున వచ్చాయి. అంతేకాదు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను నేరుగా పక్కనే ఉన్న ప్రైవేట్ క్లినిక్‌కు పంపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై హాస్పిటల్ తనిఖీకి వచ్చిన DCHS అధికారికి కూడా ఆ పక్కనే ఉన్న క్లినిక్‌ను చూపించామని, తప్పు చేసిన వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తామని సూపరింటెండెంట్ చెప్పారు.
గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సామాన్యులకు, నిరుపేదలకు ఒకే ఒక భరోసా. అలాంటి చోట డాక్టర్లే సొంత కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడం, ప్రైవేట్ క్లినిక్‌ల బిజినెస్‌ను ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తప్పు చేసిన వాళ్లపై వేటు వేస్తారా? లేక ఈ వివాదం కూడా అలాగే సైలెంట్ అయిపోతుందా? చూడాలి.