పుట్టినిల్లు అడ్డాగా కవిత నిప్పులాంటి నిజాలను బయటపెట్టారు. హరీశ్ రాజకీయ ఆయువుపట్టైన సిద్దిపేట వేదికగా ఘాటు విమర్శలు, ఆరోపణలు గుప్పించారామె. తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాయానికి భూమి పూజ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హరీశ్ అవినీతి చిట్టాను విప్పారు. ఆధారాలను బయటపెట్టే ప్రయత్నం చేశారామె. కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు భూములను పాయింట్ అవుట్ చేస్తూ ఇదిగో వీరి అవినీతి.. అంటూ ఆమె చూపిన ఆధారాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపింది.
సిద్దిపేటను హరీశ్ చెరపట్టారన్న కవిత.. అందరినీ ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతి జరిగిందని, కోట్లు కొల్లగొట్టి భూములను కొన్నారన్నారు. వీటికి సంబంధించిన పలు ఆధారాలను బయటపెట్టినా సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఈనెల 19న సిద్దిపేటకు రానున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగానైనా స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలను బెదిరించి పాల వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారన్నారు. సిద్దిపేట విశ్వబ్రాహ్మణుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిపై కేసులు పెట్టిన ఉదంతాలున్నాయని చెప్పారు కవిత. నిమ్స్‌లో వంద కోట్ల స్కామ్ కు హరీశ్ ఆద్యుడని, దీనిపై తన వద్ద ఆధారాలున్నాయన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములు ఎన్ని ఉన్నాయో వివరిస్తూ గూగుల్ మ్యాప్ ఇమేజ్‌ను విడుదల చేశారు కవిత.
కేసీఆర్ ఫామ్ హౌజ్ చుట్టూ కేసీఆర్ సతీమణి పేరు మీద, కేటీఆర్, కేటీఆర్ సతీమణి, సంతోష్‌రావు, సంతోష్ రావు తండ్రి, హరీశ్ రావు, హరీశ్ రావు తండ్రి, కేటీఆర్ తనయుడు.. ఇలా ఆ కుటుంబంలోని అందరికీ భూములున్నాయని, తనకే అక్కడ ఎలాంటి భూమి లేదన్నారు కవిత. ఇన్ని భూములు కొనుగోలు చేసిన వీరు ఎలాంటి అవినీతికి పాల్పడకుండానే ఇంత సంపాదించారా? అని ప్రశ్నించడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
ప్రత్యేకించి ఆమె అక్కడ రాజకీయంగా పాగా వేయడంతో పాటు కేసీఆర్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంలో భాగంగా ఆయువు పట్టుగా ఉన్న అడ్డానే కేంద్రంగా చేసుకున్నారనిపిస్తోంది. కేసీఆర్ పదేండ్ల పాలనను విమర్శించడంతో పాటు, ఆ కుటుంబ అవినీతి సంపాదన, హరీశ్ రావు అరాచకాలు ఇవీ.. అని విడమర్చి చెప్పడం ద్వారా ఆ కుటుంబ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలనే వ్యూహం కూడా కనిపించింది. తనకు ఆ అవినీతిలో భాగస్వామ్యం లేదని చెబుతూనే, తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న సొమ్ము కన్నా ఎక్కువుంటే అది ప్రజలకే ఇచ్చేస్తానని చెప్పడం ద్వారా ఆ కుటుంబంతో తనకు సంబంధం లేదని, కొత్త పార్టీ ద్వారా వచ్చిన తనను ప్రజలు ఆశీర్వదించాలనే రిక్వెస్టు కనిపించింది.
కొండ పోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు సాగునీరు వెళ్తుందనే ఆరోపణలపై కవిత తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్ లో ఉన్న బావిలోకి ఆ నీళ్లు వెళ్తున్నాయని ఆమె చెప్పకనే చెప్పారు. దీని పై వివరణ ఎందుకు ఇవ్వడం లేదని హరీశ్, కేటీఆర్‌లను సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేసేలా ఆమె మాట్లాడారు.