E-Paper
Advertisement

తెలంగాణ ఇసుక క్వారీల్లో అక్రమ బకాసురులు.. పట్టించుకోని అధికారులు!

తెలంగాణ ఇసుక క్వారీల్లో అక్రమ బకాసురులు.. పట్టించుకోని అధికారులు!
Advertisement

Sand Quarries: స్వేచ్చ బ్యూరో: ఇసుక క్వారీల నిర్వహణ చుట్టూ మరో వివాదం ముసురుకుంటోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా జరగాల్సిన చోట.. క్షేత్రస్థాయిలో అదనపు వసూళ్ల వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. క్వారీల వద్ద ఇసుక లోడింగ్‌ చేయించుకోవాలంటే నిర్ణీత చెల్లింపులతోపాటు అదనంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని లారీ యజమానులు వాపోతున్నారు. ఒక్కో లారీకి 1500 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడిగిన మొత్తం చెల్లిస్తేనే లోడింగ్‌.. లేదంటే లారీని పక్కన నిలిపివేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ల తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

లోడింగ్‌కు అదనపు రేటు!

ప్రభుత్వ నిబంధనల మేరకు 35టైర్ల లారీకి ఇసుక కోసం 15600 చెల్లిస్తున్నారు. 30 టైర్ల లారీ అయితే 12వేలు చెల్లిస్తున్నారు. ఇసుక కోసం క్వారీల వద్ద లారీలు బారులు తీరుతున్నా అందరికీ ఒకే విధంగా లోడింగ్‌ జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. అదనంగా డబ్బులు చెల్లించేందుకు అంగీకరించిన వాహనాలకు ప్రాధాన్యం ఇస్తూ.. అడిగిన మొత్తం ఇవ్వని లారీలను గంటల తరబడి నిలిపివేస్తున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. ఒక్కో లారీపై రూ.2,500 వరకు అదనపు భారం పడుతోందని చెబుతున్నారు. ఈ మొత్తానికి సంబంధించి ఎలాంటి అధికారిక రసీదులు ఇవ్వడం లేదని బాధితుల వాదన. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు ఒకవైపు.. క్వారీల వద్ద అదనపు చెల్లింపులు మరోవైపు కావడంతో రవాణా వ్యయం గణనీయంగా పెరుగుతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా ఇచ్చేవారికి కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్దంగా ఎక్కువ ఇసుక లోడ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

డబ్బులివ్వకుంటే లారీ పక్కకే..

Advertisement

క్వారీల వద్ద లోడింగ్‌ ప్రక్రియలో కాంట్రాక్టర్ల సిబ్బంది వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోందని ఆరోపణలు ఉన్నాయి. అదనపు మొత్తాన్ని చెల్లించని లారీలకు లోడింగ్‌ చేయకుండా జాప్యం చేస్తున్నారని యజమానులు చెబుతున్నారు. దీంతో వాహనాలు క్వారీల వద్దే నిలిచిపోతున్నాయి. ఒక ట్రిప్పు పూర్తి కావాల్సిన సమయంలో మరో ట్రిప్పు చేసే అవకాశం లేకుండా పోతోంది. డీజిల్‌ ఖర్చులు, డ్రైవర్ల వేతనాలు, వాహనాల నిర్వహణ వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇసుక రవాణాపై ఆధారపడి జీవించే లారీ యజమానులు, డ్రైవర్లు ఈ పరిణామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని ఇసుక క్వారీల నుంచి ప్రతి రోజూ 2వేల లారీలు ఇసుక రవాణా చేస్తుంటాయి. అయితే ప్రతి లారీకి సుమారు 2500 చెల్లిస్తే 50లక్షల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. వే బ్రిడ్జిలు పెట్టినా, సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ అక్రమాలు సైతం ఆగడం లేదనే ప్రచారం జరుగుతుంది.

కాంట్రాక్టర్లు.. పీఓల ములాఖత్‌?

క్వారీల నిర్వహణలో కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు ఆఫీసర్ల (పీఓ) పాత్ర కీలకం. క్వారీల్లో నిబంధనల అమలు, ఇసుక సరఫరా, లోడింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అలాంటిది కాంట్రాక్టర్లపై అదనపు వసూళ్ల ఆరోపణలు వస్తున్నా నియంత్రణ ఎందుకు కొరవడుతోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు, పీఓల మధ్య తరచూ జరుగుతున్న సమావేశాలు, పరస్పర వ్యవహారాలపై లారీ యజమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశాల వివరాలు, క్వారీల్లో జరుగుతున్న వ్యవహారాలపై అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత అధికారుల పాత్రపైనా ఉన్నతస్థాయి విచారణ జరపాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Advertisement

Also read: రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!

ఫిర్యాదులు అందినా చోద్యమేనా?

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లెక్కేశ్వరం, పలుగుల-3, కన్నెపల్లిలో ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. ఈక్వారీల నుంచి ఇసుక కోసం సుమారు 600లారీలు ప్రభుత్వానికి డీడీలు చెల్లించాయి. దీంతో క్వారీల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు లోడ్ చేయాల్సి ఉంది. అయితే అదనంగా లారీకి కాంట్రాక్టర్ కు 2500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్క క్వారీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుందని సమాచారం. క్వారీల వద్ద అదనపు వసూళ్ల వ్యవహారంపై బాధిత లారీ యజమానులు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు అందినప్పుడు అధికారులు ఏం చేశారు? క్వారీల్లో తనిఖీలు నిర్వహించారా? అదనపు వసూళ్లకు సంబంధించిన ఆధారాలను సేకరించారా? బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిర్యాదులపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.

అంతిమంగా వినియోగదారుడిపైనే భారం

లారీ యజమానుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న అదనపు మొత్తాలు రవాణా ఖర్చుల్లో కలిసిపోతున్నాయి. దీంతో ఇసుక కొనుగోలుదారులపైనా ఆ భారం పడే అవకాశం ఉంది. నిర్మాణ రంగంలో ఇప్పటికే పెరిగిన వ్యయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఇది మరింత భారంగా మారుతోంది. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఇసుక సరఫరా పారదర్శకంగా, నిర్ణీత ధరలకు జరగాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఆరోపణలు రావడం సరఫరా వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అధికారులు స్పందిస్తారా?

ఇసుక క్వారీల్లో అదనపు వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని లారీ యజమానులు కోరుతున్నారు. ప్రతి క్వారీలో అధికారిక రుసుముల వివరాలు ప్రదర్శించాలని, అదనపు వసూళ్లకు తావులేకుండా పర్యవేక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లోడింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసి, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లతో ములాఖత్ అయ్యే పీఓ(ప్రాజెక్టు ఆఫీసర్ల)లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఇసుక క్వారీల్లో అక్రమ వసూళ్లు, అధిక లోడింగ్ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Also Read: భారత్‌ సమ్మిట్‌పై కేంద్రం నజర్! దేశ వ్యతిరేక శక్తుల ముద్ర వేసే ప్రయత్నం.. ! విదేశీ అతిథుల వీసాలు రద్దు చేయడంతో కొత్త రచ్చ..

Tags

Related News

తెలంగాణ మహిళలకు చీరల పంపిణీకి డేట్ ఫిక్స్ చేసిన సర్కార్.. ఎప్పుడంటే?

భారత్‌ సమ్మిట్‌పై కేంద్రం నజర్! దేశ వ్యతిరేక శక్తుల ముద్ర వేసే ప్రయత్నం.. ! విదేశీ అతిథుల వీసాలు రద్దు చేయడంతో కొత్త రచ్చ..

ప్రభుత్వ ఆసుపత్రిలో.. ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్ పెట్టుకుంటున్న డాక్టర్!

సోనియా బుక్‌పై బీఆరెస్‌ జోక్యం బ్లండర్‌! తెలంగాణతో ఆమె బంధాన్ని తక్కువ చేసి చూడలేం! వినోద్‌ కుమార్‌ వాదనతో ఎవరికి నష్టం?

సీఎం భారీ బహిరంగ సభకు ముందే కవిత టూర్‌! పార్టీ నిర్మాణానికి శంఖుస్థాపన..! సర్వ మత ప్రార్థనలు.. ప్రెస్‌మీట్‌!

నల్గొండ జిల్లా హెల్త్ అసిస్టెంట్ నియామకంలో.. సంచలన ట్విస్ట్..?

ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్న పీసీసీ చీఫ్‌! అయినా, క్యాడర్‌లో విశ్వాసం నింపని వైనం! సంక్రాంతి దాకా డౌటేనా?

Big Stories

Advertisement
×