Indiramma Sarees: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని మహిళలకు ఇందిరమ్మ మహిళాశక్తి చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు చీరలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి చీరల పంపిణీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించారు. అర్హత ఉన్న మహిళలకే చీరలు అందేలా, ఒకరికి రెండుసార్లు పంపిణీ కాకుండా సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. రేషన్ కార్డు, ఆధార్ ధ్రువీకరణతోపాటు లబ్ధిదారు ఫొటోను యాప్‌లో నమోదు చేసిన తర్వాతే చీరను అందించనున్నారు.
చీరల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం సెర్ప్ మొబైల్ యాప్‌ను రూపొందించింది. పంపిణీ కేంద్రాలకు వచ్చే మహిళలు రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు ఆధార్ వివరాలను పరిశీలించి, లబ్ధిదారు ఫొటోను యాప్‌లో నమోదు చేస్తారు. వివరాల ధ్రువీకరణ పూర్తయిన తర్వాతే చీరను అందజేస్తారు. చీర అందుకున్న మహిళ వివరాలు కూడా యాప్‌లో నమోదు అవుతాయి. దీంతో ఒకే మహిళకు రెండుసార్లు చీరలు ఇచ్చే అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ ద్వారా పంపిణీ అయిన చీరల సంఖ్య, ఇంకా పంపిణీ చేయాల్సిన చీరలు, లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. జిల్లా, మండల స్థాయిలో పంపిణీ పురోగతిని పర్యవేక్షించేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితోపాటు సెర్ప్ సిబ్బంది పంపిణీ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించనున్నారు.
ఈసారి మహిళలకు అందించే చీరల రంగు, డిజైన్లలోనూ ప్రత్యేకత చూపిస్తున్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో పంపిణీ చేసిన చీరలకు భిన్నంగా కొత్త రంగుల కలయికను ఎంపిక చేశారు. ప్రధానంగా చిలకపచ్చ రంగుపై ఎరుపు రంగు జరీ అంచుతో చీరలను రూపొందిస్తున్నారు. సంప్రదాయానికి ఆధునికతను జోడించేలా డిజైన్లను6.5 గజాల చీరను సిద్ధం చేశారు. వృద్ధ మహిళల కోసం 9 గజాల ముదురు ఆకుపచ్చ రంగు చీరలను ప్రత్యేకంగారూపొందించారు. సుమారు 3లక్షల చీరలను తయారు చేయించినట్లు అధికారులు తెలిపారు.చీరల నాణ్యత విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మహిళలు నిత్యావసరంగా ఉపయోగించుకునేలా వస్త్ర నాణ్యత, రంగుల ఎంపిక, జరీ అంచులపై దృష్టి సారించారు. రాష్ట్ర చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పించడంతోపాటు మహిళలకు ఉపయోగకరమైన వస్త్రాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
Also Read: జెన్సన్ హువాంగ్‌తోపాటు ఐదుగురు.. వివాహేతర సంబంధాల ఉచ్చు, పదవులు కోల్పోయిన సీఈవోలు
ఇందిరమ్మ మహిళాశక్తి చీరల తయారీ కోసం ప్రభుత్వం రూ.334 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. చీరల తయారీతో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేలా ఉత్పత్తి ప్రక్రియను చేపట్టారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కేంద్రాలకు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వేలాది మంది కార్మికులకు పని కల్పించే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే కోటీ చీరల చీరల తయారీ పూర్తికావడంతో పాటు జిల్లా కేంద్రాల్లోని గోదాములకు అధికారులు తరలించారు. పౌరసరఫరాలశాఖ దగ్గర ఉన్న కుటుంబ వివరాలతో 18 ఏళ్లు నిండిన యువతులకు, మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. మహిళలకు ఉచితంగా చీరలు అందించడమే కాకుండా స్థానిక వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు, కార్మికులకు ఉపాధి కల్పించే కార్యక్రమంగానూ ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు చీరలు అందించేలా పంపిణీ వ్యవస్థను రూపొందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ఉండటంతో అక్కడి పంపిణీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లోనూ పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సుమారు 65 లక్షలు, పట్టణ ప్రాంతాలకు సుమారు 35 లక్షల చీరలు కేటాయించినట్లు సమాచారం. ఈ పంపిణీ లక్ష్యాలను జిల్లా, మండలాల వారీగా విభజించి లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణతో గ్రామాల్లో పంచాయతీసెక్రటరీ, సెర్ప్, మహిళా గ్రూపుల సమక్షంలో చీరల పంపిణీ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సిద్దిపేట వేదికగా కార్యక్రమాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెర్ప్ అధికారులు సైతం ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. నియోజకవర్గాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు, మండల, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. ప్రతి అర్హురాలికీ చీర అందేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. పంపిణీ కేంద్రాల వద్ద మహిళలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని,ఆధార్ ధ్రువీకరణ, ఫొటో నమోదు, యాప్ ఆధారిత పర్యవేక్షణతో పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించింది.
Also Read: అమ్మకాల్లో దూసుకెళ్తున్న BGauss.. ఏకంగా లక్ష యూనిట్ల సేల్ క్రాస్!