India vs Pakistan: యుద్ధం గెలవడం అంటే శత్రువును ఓడించడం మాత్రమే. చంపడం కాదు. సరిగ్గా ఇదే స్ట్రాటజీని భారత్ ఇప్పుడు ఫాలో అవబోతోందా అన్న చర్చ జరుగుతోంది. రక్తం చిందించకుండా, బుల్లెట్ పేల్చకుండా, పాకిస్తాన్ కు ఎలా బుద్ధి చెప్పాలో అన్ని వ్యూహాలను రెడీ చేసి పెడుతున్నారు. అసలు ఊపిరి సలపకుండా చేయడం ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. టూరిస్టులను ఎలా తూటాలు పేల్చి చంపారో.. అంతకు మించి బాధ అనుభవించేలా ఖతర్నాక్ ప్లాన్ నడుస్తోంది.
లెక్కకు లెక్క..
దెబ్బకు దెబ్బ..
ముందుంది అసలు పంజా
ప్రతీకారమే అజెండా..
ప్రపంచమంతా చూసేలా..
ఎవరూ ఊహించని రిప్లైకి రెడీ
యుద్ధాల విషయంలో భారత్ కు ఓ నియమం ఉంది. అదేంటంటే తనంతటతానుగా ఏ దేశంపై భారత్ దండెత్తదు. ఎవరైనా మొదట దాడి చేస్తే మాత్రం ప్రతీకారం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ గడ్డ మీది నుంచి కుట్రలు మొదలై.. పహల్గామ్ లో దాడి వరకు మ్యాటర్ వెళ్లింది. దీంతో భారత్ పకడ్బందీగా వ్యవహారం నడుపుతోంది. లెక్కకు లెక్క.. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ప్లాన్ నడుస్తోంది. పాకిస్తాన్ ను ఎలా డీల్ చేయాలి.. ఉగ్రవాదుల ఏరివేత ఎలా.. వీటిపైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది భారత్.
యుద్ధానికి ఏమాత్రం సిద్ధంగా లేని పాక్
భారత్ పాక్ సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బలగాల మోహరింపు నడుస్తోంది. పైకి పాక్ గాంభీర్యంగా ఉన్నా లోలోపల మాత్రం వణుకు మొదలైంది. భారత్ ను ఎదుర్కొని నిలబడే కెపాసిటీ అసలే లేదు. దాయాది నమ్ముకున్న దేశాలు వెంట వస్తాయన్న గ్యారెంటీ లేదు. వీటికి తోడు అంతర్గత తిరుగుబాట్లు, ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు.. ఎలా చూసినా పాకిస్తాన్ యుద్ధానికి రెడీగా లేదు. అందుకే చచ్చిన పామును ఎలా డీల్ చేయాలో భారత్ భారీ స్ట్రాటజీ రెడీ చేసి పెట్టింది. ఎందుకంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా. అలాంటిదే ఇది.
ప్రధానితో రాజ్ నాథ్, ధోవల్ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీతో తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించారు. మోడీతో భేటీ కంటే ముందు రాజ్ నాథ్ సింగ్ ఏప్రిల్ 27న భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌తోనూ భేటీలు జరిగాయి. అందరిదీ ఒకే ఆలోచన. యావత్ ప్రపంచం భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతోందో తొలిసారి చూడబోతోంది. ఆ రియాక్షన్ ఏంటన్నదే ఇప్పుడు టాప్ సీక్రెట్. అందుకే ప్రధాని మోడీ ఇదే మాట చెప్పారు. భారత్ ప్రతీకారం ఎలా ఉంటుందో అంతా చూస్తారన్నారు.
ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే.. వేట ఖాయం
ఏప్రిల్ 22న పహల్గాం బైసరన్ గ్రౌండ్ లో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. ఏప్రిల్ 23 నుండి NIA బృందాలు ఆ ప్రదేశంలో మోహరించి ఆధారాల కోసం సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి. సో ఉగ్రవాదులు POK లో ఉన్నారా.. లేదంటే జమ్మూకశ్మీర్ లోనే తలదాచుకున్నారా.. మరేదైనా సరే ఎక్కడున్నా సరే వారి ఆట కట్టించేలా కథ మారబోతోంది. ఎక్కడ దాక్కున్నా వెతికి వెంటాడుతామని ప్రధాని మోడీ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 23న, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీలోనే చాలా వరకు మ్యాటర్ లిస్టవుట్ అయింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లో సక్సెస్ ఫుల్ గా ఎన్నికలు నిర్వహించి, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతూ, అభివృద్ధివైపు ప్రయాణిస్తున్న సమయంలో దాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగినట్లుగా భారత్ భావిస్తోంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సభ్యుల సంఖ్యను తగ్గించింది.
పాక్ వీసాదారులకు ఏప్రిల్ 27 డెడ్ లైన్
సో పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఒంటరి చేయడమే లక్ష్యంగా కథ నడుస్తోంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న మిలిటరీ దౌత్యవేత్తను వారంలో దేశం విడిచి వెళ్లాలన్నారు. పాక్ తాత్కాలిక వీసాదారులకు ఏప్రిల్ 27తో డెడ్ లైన్ పెట్టేశారు. పాకిస్తానీ మెడికల్ వీసాదారులకు ఈనెల 29న లాస్ట్ డేట్. ఆలోపు భారత్ వీడి వెళ్లాల్సిందే. మరోవైపు UN భద్రతా మండలికి, అలాగే 95 దేశాల రాయబారులకు పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ పాత్రకు సంబంధించిన ఆధారాలను సమర్పించి, పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా ఎక్స్ పోజ్ చేసింది భారత్.
సింధూ జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్
భారత్ 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనివల్ల పాకిస్తాన్‌కు సింధూ నది జలాల ప్రవాహం తగ్గి, వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అటారీ-వాఘా సరిహద్దు ద్వారా వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం, పాకిస్తాన్ జనానికి వీసాల జారీ ఆపేశారు. పహల్గామ్ దాడి తమదే అని చెప్పుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తోయిబా వంటి పాకిస్తాన్ సపోర్ట్ ఉన్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. టీఆర్ఎఫ్ ఇప్పటికే 2023లో నిషేధిత సంస్థల జాబితాలో చేర్చారు. ఇప్పుడు వారి ఆనవాళ్లు లేకుండా చర్యలకు రెడీ అవుతున్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్ అలాగే 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తరహాలో.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై.. కచ్చితమైన దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది ఊహకు అందనివిధంగా రియాక్షన్ ఉంటుందని మాత్రం చెబుతున్నారు.
లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్
అమెరికా ట్విన్ టవర్స్ ఎటాక్ తర్వాత అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. ప్రాంతాలు, దేశాలు మారుస్తూ చివరకు పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో తలదాచుకున్నాడు. ఇలాంటి ఉగ్రవాదులందరికీ పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందని అమెరికా సహా ప్రపంచదేశాలకు తెలుసు. లాడెన్ ను హతమార్చే ఆపరేషన్ గురించి పాక్ కు చెబితే మొత్తం ప్లాన్ లీక్ అవుతుంది. అందుకే పాకిస్తాన్ కు తెలియకుండా హెలికాప్టర్లు దింపి లాడెన్ కథ క్లోజ్ చేసింది అమెరికా. అంతే కాదు.. లాడెన్ శవం ఈ భూమ్మీద ఖననం చేస్తే అదో పెద్ద కథ అవుతుందని డెడ్ బాడీకి 150 కిలోల బరువైన ఇనుప సంకెళ్లు కట్టి సముద్రంలో విసిరేసి షార్క్ లకు ఫలహారంగా పడేసింది అమెరికా. సరిగ్గా ఇప్పుడు పాక్ లో నక్కిన ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్నోళ్లందరి ఆట కట్టించే టైమ్ వచ్చింది.
అబోటాబాద్ లో లాడెన్ హతం
పాకిస్తాన్ కు తెలియకుండా ఇస్లామాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబోటాబాద్ లో అమెరికా ఆర్మీ ఆపరేషన్ చేయడం అంటే మాటలు కాదు. ఒక దేశానికి తెలియకుండా దాడులకు తెగబడడం అంటే కథ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ పాక్ ను అమెరికా లైట్ తీసుకుంది. ఆపరేషన్ సక్సెస్ చేసి నోరు మూయించింది. ఇప్పుడు భారత్ కూడా ఆ తరహా యాక్షన్ ప్లాన్ కు రెడీ అవుతోంది. మాటల్లో చెబితే పాకిస్తాన్ కు అర్థం కాదు. అందుకే చేతల్లో ఆ దేశం విలవిలలాడేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది భారత్. ఇందులో మొదటి ఆప్షన్ యుద్ధం లేకుండా ఓడించేందుకు బహుముఖ వ్యూహాలను ఫాలో అవ్వాలనుకుంటోంది.
పాక్ పై దౌత్య, ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక చర్యలు
దౌత్యపరమైన, ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక చర్యలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నారు. ఈ వ్యూహాలు పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడం, ఆర్థిక ఒత్తిడి తీసుకురావడం, ఉగ్రవాదాన్ని తుదముట్టించడం వంటివి ఉన్నాయి. పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా చిత్రీకరిస్తూ ప్రపంచదేశాలకు చాటి చెబుతోంది భారత్. సాక్ష్యాధారాలు కూడా చూపిస్తోంది. అంతే కాదు స్వయంగా పాక్‌తో దౌత్యబంధాలను దాదాపుగా తగ్గించేసింది. భవిష్యత్‌లో ఇది పూర్తిగా ముగిసిన చరిత్ర అవ్వొచ్చు కూడా. అటు వాణిజ్య సంబంధాలను కూడా ఆపేసింది.
సింధు నది జలాలపైనే పాక్ ఆధారం
పాకిస్తాన్ చాలా వరకు సింధు నది జలాల ఆధారంగానే బతుకుతోంది. అక్కడి వ్యవసాయానికి ఆధారం సింధూ నదీ జలాలే. అవే లేకపోతే పాక్‌లో దిగుబడులు తగ్గి ఆహార సంక్షోభం తలెత్తవచ్చు. పాక్‌కు నీటి సరఫరా తగ్గించేందుకు మూడుదశల వ్యూహాన్ని భారత్ ఫాలో అవనుంది. పశ్చిమ నదులైన సింధూ, జీలం, చీనాబ్‌లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ఆనకట్టలు, రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఇందుకోసం ఐదు నుంచి పదేళ్ల టైమ్ పట్టొచ్చంటున్నారు. కిషన్‌గంగా, రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, భాక్రా నంగల్, సలాల్ వంటి ఇప్పటికే ఉన్న ఆనకట్టల సామర్థ్యాన్ని విస్తరించడం మొదటి వ్యూహం.
ఇదంతా జరిగితే పాక్ ఖేల్ ఖతమే
దీని ప్రకారం పాక్‌కు వెళ్లే నీటి ప్రవాహాన్ని 5-10% వరకు తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఇక రెండో దశలో సింధు నీటిని పాకిస్తాన్‌కు చేరకుండా భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వైపు మళ్లించడం. ఇందులో సట్లెజ్-బియాస్ నదుల అనుసంధానం ఉంది. సింధూ నది వ్యవస్థలోని పశ్చిమ నదులపై భారత్‌కు పూర్తి నియంత్రణ సాధించడం, వరద నియంత్రణ చర్యలను స్వేచ్ఛగా చేపట్టడం మూడోదశలో కీలకంగా ఉండబోతోంది. ఇదంతా జరిగితే పాక్ ఖేల్ ఖతమే. భారత్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది.
పశ్చిమ నదులపై పూర్తి నియంత్రణ సాధించడం
భారత్ ఫాలో అవ్వాలనుకుంటున్న ఈ బహుముఖ వ్యూహాలు బాంబు దాడులతో కాకుండా.. దౌత్యపరమైన, ఆర్థిక, కచ్చితమైన సైనిక చర్యల ద్వారా పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విధానంతో అంతర్జాతీయ శాంతిని కాపాడుతూనే పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకుండా నియంత్రించేలా కథ మార్చాలనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే వరుస మీటింగ్‌లతో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠగా మారుతోంది. టెంపరరీ వీసా హోల్డర్స్ అంతా వెళ్లిపోయాక మే 1 నుంచి పాకిస్తాన్‌కు అసలైన లైవ్ యాక్షన్ ఉండబోతోందన్నది గ్యారెంటీగా కనిపిస్తోంది. అది ప్లాన్ A నా.. లేదంటే ప్లాన్ బీనా అన్నదే ఉత్కంఠ.