E-Paper
Advertisement

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. బిలియన్ డాలర్ల కోసం మిత్రదేశాల వార్నింగ్!

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. బిలియన్ డాలర్ల కోసం మిత్రదేశాల వార్నింగ్!
Advertisement

Pakistan: ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ లేదు. యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత అనేక దేశాలను కుదిపేస్తోంది. పాకిస్థాన్‌లో అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయ్. ఇప్పటికే, ద్రవ్యోల్బణంతో దెబ్బతిన్న పాక్‌కు ఈ యుద్ధం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. దాంతో.. పాక్ పరిస్థితి, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది.

ఆర్థిక సంక్షోభంలో పాక్

ఇప్పుడు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. పాక్ తమకు చెల్లించాల్సి ఉన్న 3.5 బిలియన్ డాలర్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. అసలే, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి సమయంలో.. యూఏఈ ఇలా డిమాండ్ చేయడం దాయాది దేశానికి పెద్ద సమస్యగా మారబోతోంది. అయినప్పటికీ, ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు పాక్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

సంక్షోభాల సుడిగుండంలో పాకిస్థాన్

Advertisement

నిజానికి.. వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా, దేశాలకైనా ఎత్తుపల్లాలు సహజం. అదే, పాకిస్థాన్ విషయానికి వస్తే.. ఇదొక రకమైన అస్తిత్వ సంక్షోభం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దేశానికి పశ్చిమాసియా సంక్షోభం రూపంలో సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇప్పుడు.. పాకిస్థాన్ ఓ క్లిష్టమైన మలుపులో ఉంది. ఒకప్పుడు తన వ్యూహాత్మక భౌగోళిక స్థానాన్ని చూపించి, ప్రపంచ దేశాల నుంచి, అరబ్ దేశాల నుంచి భారీగా నిధులు పొందేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పునాదులే అప్పుల మీద నిలబడి ఉన్నాయ్. ఐఎంఫ్, చైనా, సౌదీ అరేబియా నుంచి తీసుకున్న అప్పులు కూడా కొండలా పేరుకుపోయాయ్. గతంలో అప్పులిచ్చిన దేశాలు.. ఇప్పుడు వాటిని రోల్ ఓవర్ చేయడానికి సుముఖంగా లేవు. పాక్ దగ్గరున్న విదేశీ కరెన్సీ నిల్వలు కూడా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయ్.

6 బిలియన్ డాలర్ల కోసం సౌదీ కఠిన వైఖరి

యూఏఈ ఒక్కటే కాదు, సౌదీ అరేబియా కూడా పాక్‌పై అత్యంత కఠినంగా ఉంది. గతంలో ఇచ్చిన 6 బిలియన్ డాలర్లకు పైగా అప్పులు చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది. గతంలో సౌదీ పాక్‌కు 3 బిలియన్‌ డాలర్లు డిపాజిట్‌ చేసి.. ఐఎంఎఫ్‌ రుణాలు రావడానికి సాయం చేసింది. ఇప్పుడు లోన్ రికవరీపై దృష్టి పెట్టింది. ఈ ఒత్తిడి పాక్‌ రిజర్వులను మరింత బలహీనపరుస్తోంది. సౌదీ తన సొంత ఆర్థిక సంస్కరణలు కోసం ఇలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. చైనా కూడా పాక్‌పై ఎనర్జీ రుణాల మీద ఒత్తిడి పెట్టింది.

చైనా 220 మిలియన్ డాలర్లు డిమాండ్

Advertisement

చైనా ఎనర్జీ కంపెనీకి చెల్లించాల్సిన సుమారు 220 మిలియన్ డాలర్లు.. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ పవర్ ప్లాంట్లతో ముడిపడి ఉన్నాయ్. చైనా మొత్తం 30 బిలియన్ డాలర్లు.. సీపీఈసీలో పెట్టుబడి పెట్టింది. కానీ, రుణాలు తిరిగి రావాలని ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే, పాకిస్థాన్ జీడీపీ 2 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం 25 శాతానికి పైగా పెరిగిపోయింది. రుణాలు జీడీపీలో 80 శాతం మించాయి. పాక్ రుపీ విలువ పడిపోవడం, ఇంధనం, నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయాయ్. ఈ పరిస్థితుల్లో.. గతంలో అప్పులిచ్చిన దేశాలు సాయం చేయడానికి ముందుకు రాకపోగా, పాత అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయ్. పైగా, పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు.. పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్.

మిత్ర దేశాలే మారిన వైఖరి

మొన్నటిదాకా పాకిస్థాన్‌కు ఏటీఎంలా ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు ఇప్పుడు తమ సొంత ప్రాంతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలపై దృష్టి పెట్టాయ్. యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలు, రక్షణ వ్యయం దృష్ట్యా.. అవి పాక్‌కు ఇచ్చే ఉచిత సాయానికి ఫుల్ స్టాప్ పెట్టేశాయ్. చివరికి చైనా కూడా ఇప్పుడు పాక్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ పనులు నెమ్మదించడం, భద్రతా కారణాల దృష్ట్యా.. చైనా పెట్టుబడులు వెనక్కి తగ్గడం.. పాకిస్థాన్‌ని ఒంటరి చేశాయ్.

పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు

పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేత లాంటి పరిణామాలు గ్లోబల్ ఎకానమీని కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం.. ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను మరింత అనిశ్చితిలోకి నెట్టేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ జీడీపీ వృద్ధి కోసం ఆరాటపడుతుంటే, పాకిస్థాన్ మాత్రం మనుగడ కోసం పోరాడుతోంది. అప్పుల కోసం ఐఎంఎఫ్ కాళ్లు పట్టుకోవడం, పొరుగు దేశాల నుంచి విరాళాలు సేకరించినట్లు అప్పులు తెచ్చుకోవడం పాక్‌కు అలవాటుగా మారింది. అయితే, మిడిల్ ఈస్ట్ సంక్షోభం పాక్ పతనాన్ని మరింత వేగవంతం చేస్తోంది.

అప్పుల రికవరీ డిమాండ్లు

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటింది. పాకిస్థాన్ తన ఇంధన అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. పెరిగిన ఆయిల్ ధరల వల్ల పాక్ దిగుమతి బిల్లు అదనంగా 4.5 బిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడంతో.. నిత్యవసర ధరలు చుక్కలను తాకుతున్నాయ్. ఇప్పటికే అక్కడ సామాన్యులు సాధారణ జీవితం గడిపేందుకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులున్నాయ్. ఈ సమయంలో.. అప్పుల రికవరీకి వస్తున్న డిమాండ్లు పాక్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్.

అప్పులపై ఆధారపడిన పాక్

పాకిస్థాన్ మొద్దం విదేశీ అప్పు సుమారు 138 బిలియన్ డాలర్లు ఉంటుంది. చైనా, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాలు.. గతంలో అప్పులిచ్చి ఆదుకున్నాయ్. కానీ, ఇప్పుడు.. పాకిస్థాన్ భారీ మొత్తంలో విదేశీ రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పెరగడం, ఆర్థిక మాంద్యం ఛాయలు కమ్ముకోవడంతో, అప్పులిచ్చిన దేశాలు కూడా తమ సొంత ఆర్థిక భద్రత కోసం పాక్ నుంచి రికవరీకి ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు.. అప్పులు కట్టేందుకు కూడా కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో పాకిస్థాన్ ఉంది.

నిత్యవసర సరుకులు ప్రజలకు అందకపోవచ్చు

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం పాకిస్థాన్‌కు పెద్ద దెబ్బ. ముఖ్యంగా.. గల్ఫ్ దేశాలకు పాక్ ఎగుమతులు నిలిచిపోయాయ్. దీనివల్ల.. సుమారు 2 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పాక్ కోల్పోయే ప్రమాదం ఉంది. విదేశాల నుంచి వచ్చే సొమ్ము తగ్గడం వల్ల పాక్ ఫారిన్ రిజర్వ్స్ కూడా అడుగంటుతున్నాయ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. పాకిస్థాన్ గనక తిరిగిఅప్పలు చెల్లించడం మొదలుపెడితే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు.. ప్రజల నుంచి తిరుగుబాట్లు వచ్చే ప్రమాదం ఉంది. అప్పులు కట్టేస్తే.. ఖజానా ఖాళీ అయిపోతుంది. దేశంలో ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించేందుకు చిల్లి గవ్వ కూడా మిగలదు.

పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదంలో

పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి – వెనుక గొయ్యిలా ఉంది. మిడిల్ ఈస్ట్ యుద్ధానికి ఓ ముగింపు అంటూ త్వరగా రాకపోతే.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి.. ఆ దేశం మరో శ్రీలంకలా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పులిచ్చిన దేశాలు మానవతా దృక్పథంతో గడువు పెంచితే తప్ప, పాక్ ఈ గండం నుంచి గట్టెక్కడం అసాధ్యం. అందువల్ల.. పాకిస్థాన్ ఇప్పుడు తన చరిత్రలోనే అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. అప్పులు తీసుకుని రోజులు గడిపే కాలం చెల్లిపోయింది.

దివాళా తీసే దేశంగా పాక్!

సొంతంగా ఉత్పత్తిని పెంచుకోవడం, ఉగ్రవాదాన్ని అరికట్టి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మినహా ఆ దేశానికి మరో మార్గం లేదు. ఇప్పుడు కూడా పాకిస్థాన్ మేల్కోకపోతే, ఆ దేశం దివాళా తీసిన దేశంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆర్థిక సంక్షోభం ముదిరితే.. అది రాజకీయ సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే, అక్కడి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అప్పులు కట్టలేని స్థితికి దిగజారితే.. దివాలా తీసిన దేశంగా ముద్రపడుతుంది. అప్పుడు.. ఏ దేశంలోనూ పాకిస్థాన్‌కు చిల్లిగవ్వ అప్పు కూడా పుట్టదు. అప్పుడు పాక్ పూర్తిగా పతనమైపోతుంది.

Also Read:అందాల ఆరబోతతో లక్షల్లో సంపాదన.. సబ్‌స్క్రిప్షన్ల పేరుతో నిలువు దోపిడి!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×