అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు. జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ అద్భుతాన్ని కచ్చితంగా గుర్తించాల్సిందే. అప్పుడప్పుడు మన దాయాది దేశం పాకిస్థాన్ తీసుకునే నిర్ణయాలు.. ఆ దేశ ప్రజల్నే కాదు.. మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటాయ్. ఇప్పుడు పాక్ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. లేకపోతే.. ముస్లిం దేశమైన పాకిస్థాన్.. మన భారతీయ ప్రాచీన భాష సంస్కృతాన్ని కోర్సుగా ప్రవేశపెట్టడమేంటి? మహాభారతం, భగవద్గీత పాఠాలు కూడా బోధించేందుకు సిద్ధమవడమేంటి? దశాబ్దాల తర్వాత పాక్‌లో ఈ మార్పేంటి?
భారత్, పాకిస్థాన్.. ఈ రెండు దేశాల పేర్లు వినగానే.. దశాబ్దాల ఉద్రిక్తతలు, వైరుధ్యాలే గుర్తొస్తాయ్. ఈ క్రమంలో.. భారతీయ ప్రాచీన భాష సంస్కృతాన్ని, మహాభారతం, భగవద్గీత లాంటి గ్రంథాలను బోధించేందుకు పాకిస్థాన్ లాంటి దేశం సిద్ధమవడం అనేది.. అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించింది. దీనినొక.. కీలక పరిణామంగా చూస్తున్నారు. రెండు దేశాల మధ్య అనేక అంశాలపై తీవ్ర వైరుధ్యాలు, ఘర్షణలు ఉన్నప్పటికీ.. పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం.. ప్రపంచ దేశాలను, భారతీయులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన పాకిస్థాన్‌లో.. భారతీయ ప్రాచీన భాష సంస్కృతాన్ని కోర్సుగా ప్రవేశపెట్టడం, హిందూ మతానికి సంబంధించిన ముఖ్య గ్రంథాలైన మహాభారతం, భగవద్గీత పాఠాలను బోధించేందుకు సిద్ధమవడం అనేది ఓ ఊహించని మార్పు. సాధారణంగా.. దాయాది దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు ఒక దేశం భాషని గానీ, సంస్కృతిని గానీ మరో దేశం అంగీకరించడం, ప్రోత్సహించడం చాలా అరుదు. ఈ క్రమంలో.. పాకిస్థాన్‌లోని యూనివర్సిటీలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచన.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
పాకిస్థాన్‌లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్.. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ విభజన జరిగిన తర్వాత తొలిసారిగా.. భారత్‌కు చెందిన ప్రాచీన భాష సంస్కృతాన్ని పార్ట్ టైమ్ కోర్సుగా ప్రవేశపెట్టింది. అంతకుముందు.. వర్క్‌షాప్ కోర్స్‌గా ప్రవేశపెట్టగా అనూహ్య స్పందన లభించింది. 2027 నాటికల్లా పూర్తిస్థాయి కోర్సుగా మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అంతేకాదు.. మహాభారతం, భగవద్గీత పాఠాలు బోధించేందుకు కూడా యూనివర్సిటీ సిద్ధమైంది. అఖండ భారతదేశ విభజన తర్వాత.. తొలిసారి పాకిస్థాన్‌లో సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందే దిశగా చారిత్రక అడుగు పడింది. లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లో.. ప్రముఖ సామాజిక శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ షాహిద్ రషీద్ చొరవతో ఈ మార్పు వచ్చింది. గతంలో అరబిక్, పార్సీ భాషలపై పట్టు సాధించిన ఆయన.. ఏడాది పాటు కష్టపడి సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతం మన ప్రాంతానికి చెందిన సాంస్కృతిక స్మారకమని చెప్పారు. సంస్కృత భాష తమకు కూడా చెందిందే అన్నారు ప్రొఫెసర్ రషీద్. సంస్కృత వ్యాకరణ పండితుడు పాణిని.. గంధార ప్రాంతంలో నివసించారు. ఆ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉంది. సింధు లోయ నాగరికత సమయంలో ఎన్నో రచనలు ఇక్కడే జరిగాయని చెబుతుంటారు. అందువల్ల.. సంస్కృతం ఒక పర్వతం లాంటిదని.. అది ఏ ఒక్క మతానికి పరిమితం కాదని చెబుతున్నారు పాక్ ప్రొఫెసర్ రషీద్.
కోర్సుని తిరిగి ప్రవేశపెట్టిన తర్వాత.. లాహోర్ యూనివర్సిటీ విద్యార్థులు.. కొద్ది కాలానికే సంస్కృతాన్ని అర్థం చేసుకోగలిగారు. ఉర్దూ భాషపై సంస్కృతం ఎంత ప్రభావం చూపిందో.. వారికి కొత్తగా తెలిసిందంటున్నారు. పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీలో సంస్కృతం పామ్-లీఫ్ మాన్యుస్క్రిప్ట్స్ పెద్ద కలెక్షన్ ఉంది. 1930లలో జేసీఆర్ వూల్నర్ వాటిని కేటలాగ్ చేశారు. కానీ.. 1947 తర్వాత పాకిస్తాన్ వాటిని ఉపయోగించలేదు. ఇప్పుడు స్థానిక పండితులకు.. శిక్షణ ఇవ్వడం వల్ల పరిస్థితి మారుతోంది. లాహోర్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు విజయవంతం కావడంతో.. భవిష్యత్తులో మహాభారతం, భగవద్గీతపైనా కోర్సులు ప్రారంభించాలనుకుంటోంది. ఇంకొన్నేళ్లలోనే.. పాకిస్థాన్‌లో భగవద్గీత, మహాభారతంపై రీసెర్చ్ చేసేవారు కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. భారతదేశంలోని హిందువులు, సిక్కులు అరబిక్.. పాకిస్థాన్‌లోని ముస్లింలు సంస్కృతం నేర్చుకుంటే.. భాషలనేవీ అడ్డంకులు కాకుండా వారధులుగా మారతాయన్నారు పాకిస్థాన్ ప్రొఫెసర్. దక్షిణాసియా ప్రాంతంలోని ప్రజలు ఒకరి సంస్కృతి, సంప్రదాయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే.. మరింత సామరస్యం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు ప్రొఫెసర్ రషీద్. పాకిస్థాన్ ప్రాంతం.. ఒకప్పుడు అత్యంత సుసంపన్నమైన సింధూ నాగరికత, గాంధార సంస్కృతిలో భాగంగా ఉండేది. ఇక్కడి చారిత్రక వారసత్వం.. వేల సంవత్సరాల నాటిది. సంస్కృతం ఈ ప్రాంతంలోని అనేక ప్రాచీన మతాలు, తత్వాలు, శాస్త్రాలకు మూల భాష. ఈ ప్రాంతానికి సంబంధించి.. చారిత్రక, సాంస్కృతిక మూలాలను అధ్యయనం చేయడంలోనూ, పూర్వ ఇస్లామిక్ యుగం నాటి గొప్పతనాన్ని అర్థం చేసుకోవడంలోనూ.. సంస్కృతం అవసరం ఉందని పాకిస్థాన్ విద్యావేత్తలు భావిస్తున్నారు.
ఒక ముస్లిం దేశం.. సరిహద్దుకు అవతల ఉన్న దాయాది దేశానికి చెందిన గొప్ప సంస్కృతి, తత్వశాస్త్రాన్ని.. ఓ కోర్సుగా ప్రవేశపెట్టడం అనేది చాలా అరుదైన విషయం. అసలు.. సంస్కృతం, మహాభారతం, భగవద్గీత బోధన వెనుక.. పాకిస్థాన్ ఉద్దేశమేంటి? పాక్ తీసుకున్న ఈ సాహసోపేతమైన అడుగు.. రెండు దేశాల మధ్య కొత్త తరం జ్ఞాన వంతెనని నిర్మించడంలో.. ఓ కీలకమైన మైలురాయిగా నిలుస్తుందనడంలో.. సందేహం లేదు. ఈ మార్పు ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలు, సంస్కృతులు, మతాల పట్ల సహనం, అవగాహన పెరగాలనే ఆలోచన బలంగా ఉంది. ఒక దేశం భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని అధ్యయనం చేయడం అనేది.. కేవలం దాని చరిత్రను తెలుసుకోవడం మాత్రమే కాదు. ఆ దేశంతో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి కూడా సాయపడుతుంది. పాకిస్థాన్ విద్యావ్యవస్థ ఈ బృహత్తర గ్రంథాలు, సంస్కృత భాష జ్ఞాన సంపదను గుర్తించి.. వాటిని ఒక అకాడమిక్ కోణంలో అధ్యయనం చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన ఉద్దేశాలు ఉన్నాయి. మహాభారతం, భగవద్గీత లాంటి గ్రంథాలు కేవలం మతపరమైనవి మాత్రమే కాదు.. అవినీతి, ధర్మం, యుద్ధ వ్యూహాలు, నాయకత్వం, మానవ జీవితంలోని క్లిష్టమైన ఘట్టాలను వివరించే తత్వ శాస్త్రాలు. ఈ గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులు ప్రపంచంలోని అత్యుత్తమ మేధో సంపత్తికి అందుబాటులోకి వస్తారు.
సంస్కృతం ప్రపంచంలోనే అత్యంత శాస్త్రీయమైన భాషల్లో ఒకటి. దాని వ్యాకరణ నిర్మాణం, శబ్దోచ్ఛారణలో ఉన్న కచ్చితత్వం.. భాషా శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడుతుంది. విభిన్న సంస్కృతులకు చెందిన జ్ఞానాన్ని.. తమ విద్యార్థులకు అందించడం ద్వారా, పాకిస్థాన్ తన ఆధునిక దృక్పథాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేలా చెస్తోంది. పాకిస్థాన్‌లో ఉన్న హిందూ మైనారిటీలకు తమ ప్రాచీన వారసత్వాన్ని, మత గ్రంథాలను అభ్యసించే అవకాశం కల్పించడమనేది.. ఆ దేశంలో మైనారిటీ హక్కులను గౌరవిస్తున్నామనే బలమైన సందేశాన్నిస్తుంది. ముఖ్యంగా.. పాకిస్థాన్‌లో ఉన్న పురావస్తు ప్రదేశాలు, శాసనాలు, చారిత్రక గ్రంథాలను లోతుగా అధ్యయనం చేయడానికి సంస్కృత జ్ఞానం అవసరం. మహాభారతం, భగవద్గీత కేవలం మతగ్రంథాలు మాత్రమే కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన మానవతా, నైతిక, తత్వశాస్త్ర గ్రంథాలలో ఒకటిగా గుర్తింపు పొందాయ్. ఈ గ్రంథాలను బోధించడం ద్వారా పాకిస్థాన్ విశ్వవిద్యాలయాలు తమ ఫిలాసఫీ, ఏసియన్ స్టడీస్ కోర్సుల నాణ్యతను పెంచగలవు.
సంస్కృతంని అభ్యసించడ వల్ల.. విద్యార్థులలో భాషా విశ్లేషణ సామర్థ్యం సైతం మెరుగుపడుతుంది. ఇస్లామేతర సంస్కృతుల గురించి బోధించడం ద్వారా సహనం, పరస్పర గౌరవం, మత సామరస్యం పెంపొందడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రాచీన భారతీయ గ్రంథాలను అధ్యయనం చేయడానికి అంతర్జాతీయ పరిశోధకులకు.. పాకిస్థాన్ ఒక కొత్త కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. భగవద్గీత లాంటి గ్రంథాలను బోధించడం ద్వారా.. విద్యార్థుల్లో నైతిక చింతన, విమర్శనాత్మక ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఈ గ్రంథాలు జీవితంలో ధర్మం, కర్మ, కర్తవ్యం లాంటి భావనల గురించి చర్చిస్తాయ్. పాకిస్థాన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన అడుగు.. కేవలం అకడమిక్ మార్పు కాదు. ఇది భారత్, పాకిస్థాన్ మధ్య కొత్త తరం జ్ఞాన వంతెనను నిర్మించడంలో కీలక మైలురాయి. ఈ వారధి.. రాజకీయ సరిహద్దులను దాటి, మనుషుల మనస్సులను, చరిత్రను, జ్ఞానాన్ని లింక్ చేసేందుకు సాయపడుతుంది.
లాహోర్ యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం.. పాకిస్థాన్ అంతర్గత, బాహ్య సంబంధాలపై విస్తృత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇది కేవలం విద్యాపరమైన నిర్ణయం అయినప్పటికీ, రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధి నిర్మించడానికి ఇదొక చిన్న అడుగు కావచ్చు. జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా దాయాది దేశాల మధ్య అపార్థాలు తొలగి, పరస్పర గౌరవం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా.. పాకిస్థాన్ ప్రజల్లో చారిత్రక అవగాహన పెరుగుతుంది. తమ దేశం పూర్వ చరిత్రను, ముఖ్యంగా.. ఇస్లాం పూర్వ చరిత్రను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇది.. పాకిస్థాన్ మతపరమైన కఠినమైన ఇమేజ్‌ని మారుస్తుంది. ఇతరుల సంస్కృతిని, భాషను గౌరవించే విశాల దృక్పథం ఉన్న దేశంగా ప్రపంచం దీనిని చూస్తోంది. దశాబ్దాల కాలంలో పాకిస్థాన్‌లో పెరుగుతున్న విశాల దృక్పథానికి, అకడమిక్ స్వేచ్ఛకు, చారిత్రక మూలాలను అన్వేషించాలనే తపనకు ఇది నిదర్శనం.
Story By Anup, Big Tv