Pakistan Vs Afghanistan: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య పచ్చగడ్డి కాదు.. ఏం వేయకుండానే భగ్గుమంటున్నాయి ఇప్పుడు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆల్‌టైమ్‌హైకు చేరుకున్నాయి. పాక్ అంతు చూస్తామని తాలిబన్‌లు చెబుతుంటే.. ఇది ఓపెన్ వార్ అంటూ పాకిస్థాన్ చెబుతోంది. మా సహనం నశించింది.. ఇక మీకు మాకు మధ్య జరిగేది ఓపెన్ వార్ అంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
పాకిస్థాన్, అఫ్ఘాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికిప్పుడు మొదలైనవి కావు. చాలా రోజులుగా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే ఎప్పుడైతే అఫ్ఘానిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్ జరిపిందో.. అప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. కాబూల్ సహా.. కీలక నగరాలైన కాందహార్, పక్తికాలపై భారీగా ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించింది పాకిస్థాన్. ఇందులో తాలిబన్‌ల ఆర్మీ పోస్టులు, ఆయుధగారాలు సహా.. అనేక మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. దీంతో అఫ్ఘాన్ కౌంటర్ అటాక్స్ ప్రారంభించింది.
పాకిస్థాన్ చేసిన దాడులకు కౌంటర్‌గా డ్యూరాండ్ లైన్ వద్ద ఉన్న పాకిస్థాన్ పోస్టులపై దాడులు చేసింది. పాక్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. ఖైబర్ జిల్లా సరిహద్దుల్లో ఘర్షణలు ప్రారంభంకాగా.. ఆ తర్వాత అన్ని పోస్టులకు విస్తరించాయి. ఈ చర్యలతో ఫుల్ ఫ్లెడ్జ్‌గా దాడులు ప్రారంభించింది పాకిస్థాన్. ఆపరేషన్ గజబ్ లిల్-హక్ పేరుతో దాడులు చేస్తోంది.
ఎప్పుడేతే పాకిస్థాన్ ఓపెన్ వార్ అని స్టేట్‌మెంట్ ఇచ్చిందో.. అఫ్ఘాన్ ఇక డోస్‌ను పెంచింది. సూసైడ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించుతున్నామని స్టేట్‌మెంట్ ఇచ్చింది. సూసైడ్ స్క్వాడ్ అంటే సూసైడ్ బాంబర్ల బెటాలియన్. వీరంతా పేలుడు పదార్థాలు అమర్చిన డ్రెస్‌లు, కారు బాంబులతో ఉంటారు. పాకిస్థాన్‌కు చెందిన కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను టార్గెట్ చేయనున్నారు.
ఇక్కడ కొన్ని విషయాలను గమనిస్తే.. పరిస్థితులు ఎంత వేగంగా మారాయనేది అర్థమవుతోంది. ముందుగా పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్ చేసింది. దానికి కౌంటర్‌గా తాలిబన్లు దాడులు చేశారు. ఇవి ప్రతీకార దాడులు అని అనౌన్స్ చేశారు. ఆ వెంటనే పాకిస్థాన్ యుద్ధమని ప్రకటించింది. దీంతో తాలిబన్లు కూడా మోహరింపులు పెంచుతున్నారు. చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్ వార్‌ను ప్రారంభించింది పాకిస్థాన్ అని అర్థమవుతోంది.
ప్రస్తుతం ఇరు దేశాలవైపు భారీగా నష్టం జరుగుతోంది. ఇప్పటి వరకు 133 తాలిబన్ ఫైటర్లను మట్టుపెట్టాం.. తాము చేసిన దాడిలో 200 మందికి గాయాలయ్యాయి.. 27 తాలిబన్ పోస్ట్‌లను నాశనం చేశాం.. తొమ్మిది పోస్టులను స్వాధీనం చేసుకున్నామని చెబుతోంది. తమవైపు కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే చనిపోయారని చెబుతోంది. తాలిబన్‌లు ఏమో.. 55 పాకిస్థాన్ సైనికులను మట్టుపెట్టామని.. 19 పాక్ పోస్ట్‌లను స్వాధీనం చేసుకున్నామంటోంది. తమ వైపు 8 మంది తాలిబన్ ఫైటర్లు మాత్రమే చనిపోయారని చెబుతోంది.
ఓవరాల్‌గా చూస్తే ఇరు దేశాలు పోయిన ప్రాణాలు, జరిగిన నష్టం గురించి నిజాలు చెప్పడం లేదని అర్థమవుతోంది. కానీ అఫ్ఘాన్ ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్ మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. తమ ఎయిర్‌స్పేస్‌లోకి వచ్చిన పాకిస్థాన్ F-16 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని చెబుతోంది అఫ్ఘాన్. అయితే దీనిని పాకిస్థాన్ ధ్రువీకరించడం లేదు. ఇదే నిజమైతే మాత్రం పాకిస్థాన్‌కు భారీ నష్టం జరగడమే కాకుండా.. ఆ ఫైటర్ జెట్స్‌ను అందించిన అమెరికా నుంచి కూడా తీవ్ర ఆగ్రహాన్ని చూడక తప్పదు. సరే దాడులు జరుగుతున్నాయి.. అది యుద్ధంగా మారుతోంది.. మరి అసలు ఈ దాడులకు కారణమేంటి? ఇదే పరిస్థితి కొనసాగితే ఇరు దేశాలు ఎదుర్కోబోయే పరిస్థితులు ఏంటి?
పాక్ ఎయిర్‌స్ట్రైక్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా ఇలానే ఎయిర్‌స్ట్రైక్స్ చేసింది పాకిస్థాన్. అప్పుడు ముగ్గురు అఫ్గాన్ దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. అప్పట్లో జరిగిన ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరు దేశాలు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. కానీ పాక్ దానిని బ్రేక్ చేసింది. ఇది పాక్‌కు అలవాటైన విషయమే. మొదట తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించగా.. ప్రతీకారంగా తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం ఔట్ పోస్టులపై డ్రోన్ బాంబులతో ఎటాక్ చేశారు. సేమ్ ఇప్పుడు ఎలాగైతే జరిగిందో.. అప్పుడు కూడా అదే జరిగింది. అసలు ఈ దాడులన్నింటికి కారణం తెహ్రీక్ ఇ తాలిబన్. ఇది అంటే పాకిస్థాన్‌కు అస్సలు నచ్చదు. ఈ గ్రూప్‌ను టార్గెట్ చేసే పాక్ ఎయిర్‌స్ట్రైక్స్ చేస్తుంది. కానీ ప్రతిసారీ ఆ గ్రూప్ సభ్యులు కాకుండా.. సాధారణ ప్రజలను చంపుతూ వస్తోంది పాక్ ఎయిర్‌ఫోర్స్.
అఫ్ఘాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటునన్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ – టీటీపీ ఉగ్రవాదులు.. తమ దేశంలో దాడులు చేస్తున్నారనేది పాకిస్థాన్ చెబుతున్నమాట. అయితే ఉగ్రవాదులపై దాడుల పేరుతో అఫ్ఘాన్ ప్రజలపై విరుచుకపడటం ఇప్పుడు వివాదాన్ని పెంచుతోంది. తాలిబన్లు TTPకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోతే దాడులు చేస్తూనే ఉంటామనేది పాక్ చెప్పకనే చెబుతున్న మాట. చెప్పాలంటే పాకిస్తాన్ వద్ద శక్తివంతమైన సైనిక, సాంకేతికంగా అధునాతన ఆయుధాలు ఉన్నాయి. తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు దేశాల్లో రాజకీయ పరపతి కూడా ఉంది. కానీ వచ్చిన చిక్కంతా.. ఈ యుద్ధం ఎన్నాళ్లు చేయగలరు అనేది. ఎందుకంటే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. కానీ బయటికి మాత్రం ఆ దేశం అలా చూపించదు. తమది బలమైన దేశం అనుకుంటారు. ఏదైనా అవసరం వస్తే అమెరికా, చైనా తమకు సపోర్ట్ చేస్తాయనే అనుకుంటారు. అదే ధైర్యంతో ఇప్పుడు కదనరంగంలో కత్తి దూస్తోంది. అయితే తాలిబన్‌ల పరిస్థితి కూడా బయటికి చెబుతున్నంత గొప్పగా ఏం టేదు. వారి వద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్లు, ఆధునిక ఆయుధాలు లేవు. ఇదో పెద్ద మైనస్.
కానీ తాలిబన్‌లకు కొన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయి. ఆయుధాలు లేకపోయినా.. తాలిబన్‌ల ఐడియాలజీకి జై కొట్టే సంస్థలు ఉన్నాయి. తెహ్రిక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్‌కు తాలిబన్ల మధ్య బంధం ఈనాటిది కాదు. అందుకే పాకిస్తాన్ సైనికపరంగా బలంగా ఉన్నప్పటికీ, తాలిబన్ల వద్ద ఇస్లామాబాద్‌కు హాని కలిగించే సొంత సోర్సులు చాలా ఉన్నాయి. పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ రాజకీయ గ్రూపులు కూడా తాలిబాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి సపోర్ట్ ఇవ్వవు. ఇది తాలిబన్లకు కాస్త అడ్వాంటేజ్. దీనికి తోడు పాక్ దాడుల పుణ్యమా అని స్వదేశంలో కూడా తాలిబన్లకు మద్దతు పెరుగుతోంది.
ఏదేమైనా యుద్ధం ఇరు దేశాలకు తీవ్ర నష్టాన్ని మిగల్చడం తప్పదు. ఇప్పటికే బలూచిస్థాన్ రెబల్స్‌కు చుక్కలు చూస్తున్న పాక్ బలగాలకు.. ఇప్పుడు తాలిబన్ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. ఇదే కంటిన్యూ అయితే.. ఓ నిప్పుల కుంపటిపై పాకిస్థాన్ కూర్చున్నట్టే ఉంటుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని చైనా, రష్యా చెబుతున్నాయి. అవసరం అయితే ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటోంది ఇరాన్. కానీ ఇవేవీ కూడా అయ్యే పనులు కావు.
ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలన్నా.. ఒప్పందాలు కుదరాలన్నా.. అసలు విషయాలు బోధపడాలి. ఇది ఎక్కువ రోజులు కొనసాగే ఉద్రిక్తత కాదని అంచనా వేస్తున్నారు. ఆయుధాలు, ఆర్థిక పరిస్థితిని చూస్తే ఈ దాడులకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందని అర్థమవుతుంది. కానీ దీని వలన ఎక్కువగా నష్టపోయేది మాత్రం పాకిస్థాన్ అని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ దాడులకు ప్రతీకారంగా పాక్‌లోని అనేక ప్రాంతాలను TTP ఫైటర్లు టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మరో అంతర్గత సమస్యను తీవ్రతరం చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Story by: Vamshi Krishna, Big Tv