Delhi Railway Alert: దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంజరగనుంది. భారత్ మండపంలో జరిగే ఈ సమావేశానికి భద్రతా ఏర్పాట్లు భారీగా చేపట్టారు. దీనికి తోడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండటంతో నార్త్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూడు రోజుల్లో సుమారు 110 రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లను సాధారణ స్టేషన్‌కు బదులుగా ఇతర ప్రాంతాల నుంచి ప్రారంభించడం, అక్కడే ముగించడం జరుగుతుంది. కొన్ని రైళ్లను ఆలస్యంగా నడపనున్నారు. దీంతో ఢిల్లీకి వెళ్లే దూరప్రాంత ప్రయాణికులతో పాటు రోజూ రైళ్లపై ఆధారపడే NCR ప్రయాణికులపైనా ప్రభావం పడనుంది.
సెప్టెంబర్ 11న పలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పాటు సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్యమైన రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. న్యూఢిల్లీ, ఢిల్లీ జంక్షన్, సాహిబాబాద్ మీదుగా కొన్ని రైళ్ల రూట్లను మార్చారు. ఇదే రోజు పలు EMU సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని రైళ్లు ఘజియాబాద్, ఢిల్లీ షాదారా వంటి ప్రత్యామ్నాయ స్టేషన్ల నుంచి ప్రారంభం కానున్నాయి. మరికొన్ని రైళ్లను 20 నిమిషాల నుంచి రెండు గంటల వరకు ఆలస్యంగా నడపడం, రీషెడ్యూల్ చేయడం జరిగింది.
సెప్టెంబర్ 12న గోమతి ఎక్స్ ప్రెస్, శ్రామ్ జీవి ఎక్స్ ప్రెస్, వైశాలి ఎక్స్ ప్రెస్, మగధ ఎక్స్ ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్‌తో పాటు పలు రాజధాని రైళ్లను దారి మళ్లించనున్నారు. అదే రోజున ఢిల్లీ-ఘజియాబాద్, ఢిల్లీ-పల్వాల్ మధ్య నడిచే పలు EMU, MEMU రైళ్లు రద్దవుతాయి. కొన్ని సర్వీసులు ఘజియాబాద్, ఢిల్లీ షాదారా, షకుర్‌బస్తీ, ఇతర స్టేషన్ల నుంచి బయలుదేరుతాయి. సుదూర ప్రాంత రైళ్లు కూడా ఆలస్యంగా నడవనున్నాయి. ముంబై సెంట్రల్-న్యూఢిల్లీ తేజస్ రాజధాని 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరే అవకాశం ఉంది. అమృత్ సర్-విశాఖపట్నం హిరాకుడ్ ఎక్స్ ప్రెస్, ఖజురహో-కురుక్షేత్ర ఎక్స్ ప్రెస్ లను కూడా ఆలస్యంగా నడపనున్నారు.
సదస్సు చివరి రోజైన సెప్టెంబర్ 13న శివగంగా సూపర్ ఫాస్ట్, బనారస్-న్యూఢిల్లీ సూపర్ ఫాస్ట్ లాంటి రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. పలు లోకల్ రైళ్లు రద్దవుతాయి. మరికొన్ని పల్వాల్, ఘజియాబాద్, షకుర్‌బస్తీ, ఢిల్లీ షాదారా, హజ్రత్ నిజాముద్దీన్ వంటి స్టేషన్ల దగ్గర ప్రారంభం కావడం లేదంటే ముగియనున్నాయి.
ఈ మార్పుల కారణంగా ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సాధారణ స్టేషన్ మారిపోయిన రైళ్ల విషయంలో ముందుగానే వివరాలు తెలుసుకోవడం మంచిదని అధికారులు వెల్లడించారు. నార్త్ రైల్వే ప్రయాణికులు బయలుదేరే ముందు NTESలో తమ రైలుకు సంబంధించిన లేటెస్ట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించారు. స్టేషన్‌కు వెళ్లే సమయంలో ఢిల్లీలోని ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని కొంత ముందుగానే బయలుదేరడం మంచిదన్నారు. ఈ మూడు రోజుల పాటు రైళ్ల రద్దు, రూట్ మార్పులు, ఆలస్యాలు ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తమ జర్నీని ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నారు.
Read Also: మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!