Naga Babu vs Nadendla: మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి చేపట్టడం ఖాయమైంది. నాగబాబుకు రాజ్యసభ చాన్స్ ఇస్తారంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో స్వయంగా వెల్లడించారు. జనసేనాని పవన్‌కళ్యాణ్ పట్టుబట్టి నాగబాబుకి కేబినెట్ బెర్త్ ఇప్పించుకున్నారంట. ఇంత సడన్‌గా నాగబాబుకి మంత్రి పదవి ఇప్పించుకోవడం వెనుక డిప్యూటీ సీఎం లెక్కలేంటి? పార్టీలో నెంబర్ 2గా ఫోకస్ అవుతున్న నాదెండ్ల మనోహర్ ప్రభావం తగ్గించడానికా?
ఏపీ కేబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాకుండా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక మంత్రి పదవి ఖాళీగానే ఉంది. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి నాలుగో మంత్రిగా నాగబాబు క్యాబినెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రాజ్యసభకు వెళ్తారనుకున్న నాగబాబుకి అనూహ్యంగా కేబినెట్ బెర్త్ దక్కింది. ఈ నేపథ్యంలో ఇంతకీ నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అదలా ఉంటే నాగబాబు అంత సడన్‌గా నాగబాబు కేబినెట్ బెర్త్ దక్కించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో మొదటి నుంచి నెంబర్ టూగా ఫోకస్ అవుతున్నారు . ఇప్పుడు నాదెండ్లకు ఎర్త్ పెట్టడానికే నాగబాబుకు మంత్రిపదవా? అన్న చర్చ మొదలైంది.. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్వయంగా చంద్రబాబుతో చర్చించి మరీ నాదెండ్ల స్థానంలో ఇప్పుడు కుడిభుజంగా సొంత అన్ననే తెచ్చుకున్నారన్న టాక్ వినిపిస్తుంది.
నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ బేస్డ్‌గా తన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ అండతో తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్‌ను వెనుపోటు పొడిచి గద్దె దించారు.. గతంలో ఎన్టీఆర్ కు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినట్టే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కల్యాణ్ కు ఏదో ఒకరోజు వెన్నుపోటు పొడుస్తారన్న అనుమానం జనసేన కార్యకర్తల్లో ఉందంటున్నారు.
Also Read: ముగ్గురూ ముగ్గురే.. వైసీపీ బాస్ లకు వారసుల టెన్షన్
గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం అంతా పవన్‌కళ్యాణ్‌కి అండగా నిలిచి కూటమిని గెలిపించింది. అలాంటప్పుడు జనసేనాని సొంత కులం వ్యక్తిని కాకుండా కమ్మ సామాజికవర్గానికి చెందిన నాదెండ్లను పక్కన బెట్టుకోవడంపైనా జనసైనికులు తీవ్ర అసహనంతో ఉన్నారంట. 2019పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే సైతం పార్టీని వీడడానికి నాదెండ్ల మనోహర్ వైఖరే కారణమని జనసైనికులు భావిస్తున్నారంట.
పార్టీ కార్యకర్తలతో నాదెండ్ల మనోహర్ దురుసుగా ప్రవర్తిస్తారని.. పార్టీలో నంబర్ టూ గా ఉన్నప్పటికీ ఆయన్ని ఎప్పుడూ పార్టీ శ్రేణులన పట్టించుకోలేదని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారంట. ఆ క్రమంలో మనోహర్‌కు మంత్రిపదవి ఇవ్వడంపైనా వారు ఆగ్రహంతో ఉన్నారంట. పార్టీ కార్యకర్తలను చులకన భావంతో చూస్తారని.. మాట్లాడే విధానం కూడా సరిగా ఉండదని.. ఆయన అహంకారంతో వ్యవహరిస్తారని ఎంతోమంది కార్యకర్తలు పవన్ కల్యాణ్ కు ఫిర్యాదులు చేశారంట.
పార్టీపై నాదెండ్ల మనోహర్ పెత్తనాన్ని సహించబోమన్న కార్యకర్తలు స్పష్టం చేయడంతో పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుని సొంత అన్నని కేబినేట్ లోకి తీసుకోవాలని చంద్రబాబును పవన్ కోరారని ప్రచారం జరుగుతుంది.. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించబోనని గతంలో పవన్‌కళ్యాణ్ చెప్పినప్పటికీ ఆ మాటను వెనక్కు తీసుకుని మరీ నాగబాబుకు మంత్రిపదవి ఇప్పించుకున్నారంటున్నారు .. ఆ లెక్కలతోనే జనసేనాని గత కొద్దికాలంగా నాదెండ్లను కొద్దికొద్దిగా పక్కన పెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నాగబాబుకు మంత్రిపదవి ఇస్తారని ముందుగానే నాదెండ్లకు ఇండికేషన్స్ ఉన్నాయని.. అందుకే ఆయన పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదంట. నాగబాబు మంత్రి అయ్యాక పార్టీలో యాక్టివ్ రూల్ ఉంటుందని, నాదెండ్ల పెత్తనానికి పూర్తి స్థాయిలో చెక్ పెడతారని ప్రచారం జరుగుతోంది.