Google 2024 Search Trends: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. కోట్లాది మంది సినీ అభిమానులు ఉన్న ఆయన ఎన్నికల్లో హండ్రెట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి.. పొలిటికల్‌గా కూడా సూపర్ హిట్ కొట్టారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఎర్రచందనం స్మగ్లర్లు, బియ్యం మాఫియా, గంజాయి ఫెడ్లర్‌లపై యుద్దం ప్రకటించారు. సనాతనధర్మాన్ని స్మరిస్తూ యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఏడాది గూగుల్ వేదికగా వ్యక్తుల గురించి శోదించిన జాబితాలో టాప్ 5 స్థానం పవన్‌కు దక్కింది. ఈ మేరకు 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను వెల్లడించింది గూగుల్.
వ్యక్తుల జాబితా కాకుండా.. ఈ ఏడాది పొడవునా మన భారతీయులు ఎక్కువ దేని గురించి వెతికారో కూడా వెల్లడించింది గూగుల్. క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టపడే ఐపీఎల్ గురించే ఈ ఏడాది ఎక్కువ సెర్చ్ జరిగినట్టు తెలిపింది. గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ టీ20 టోర్నీ అగ్రస్థానంలో నిలిచింది.
ఈ ఏడాది అత్యధికంగా వెతికన వాటిల్లో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌తో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇటీవల దివంగతులైన టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి కూడా ఎక్కువగా నెటిజన్లు శోధించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది స్త్రీ2 గురించి ఎక్కువ మంది సెర్చ్ చేయగా.. ప్రభాస్ నటించిన కల్కి, సలార్ సినిమాల గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేసినట్టు గూగుల్ వెల్లడించింది. వీటితో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. హీరామండీ, మీర్జాపూర్ షోల గురించి కూడా గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తేలింది.
Also Read: పవన్ కళ్యాణ్ కు బెదిరింపులు.. నేరుగా చంపేస్తామంటూ ఫోన్ కాల్స్..
ఇక రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వినేశ్ ఫొగాట్ గురించి కూడా ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేశారని గూగుల్ తన నివేదికలో తెలిపింది. వ్యక్తుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. బిహార్‌కు చెందిన నీతీశ్ కుమార్, చిరాగ్ పాసవాన్ గురించి కూడా ఎక్కువ మంది శోధించారట. ఇవి కాకుండా ఎక్కువగా సెర్చ్ చేసిన మీమ్స్, పదాల అర్థాలు, దగ్గర్లోని ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు వంటి వాటితో గూగుల్ నివేదికను విడుదల చేసింది.