BigTV English

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

‘మన కొంపలార్పిన మన స్త్రీల చెరచిన
మన పిల్లలను జంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసగొట్టుచుండాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలి’. నిరంకుశ నిజాం పాలనపై ప్రజాకవి కాళోజీ చెప్పిన మాటలివి. దీన్ని బట్టి నైజాం సర్కార్ పాలనలో తెలంగాణ పల్లెల్లోని ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. నాటి గ్రామీణ ప్రజల కష్టాలు, కన్నీళ్లు, అనుభవించిన దౌర్జన్యాలు, అత్యాచారాలు, అవమానాలే వారిని పోరుబాట పట్టేలా చేశాయి. నాటి పోరాట యోధుల ప్రసంగాలే వారిని తమ బానిస సంకెళ్లను తెంచుకునేలా చేశాయి. ఆ కూలి జనం పనిముట్లే నిజాం తొత్తులను నేలకూల్చే ఆయుధాలయ్యాయి. ‘నీ బాంచన్ దొరా’ అని మొక్కిన ఆ చేతులే.. గొడ్డళ్లు చేతబట్టి ముష్కరుల మీద మూకుమ్మడి పోరుకు సిద్ధపడ్డాయి. నిజాం తొత్తులుగా మారి జనాన్ని పీడించిన భూస్వాములు, పటేళ్లు, దొరల ఆధీనంలోని పది లక్షల ఎకరాల భూమిని పేదలకు దక్కేలా చేశాయి. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకొరిగిన వీరుల అమరత్వమే.. తర్వాతి రోజుల్లో నైజాం సంస్థానంలో ప్రజాస్వామ్యానికి ప్రాణప్రతిష్ట చేసింది. రెండు శతాబ్దాల ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటికీ జనం మనసుల్లో నిలిచిపోయింది.


ఏ సమాజంలోనైనా రాజ్యవ్యవస్థ మీద ప్రజలకు అసంతృప్తి పెచ్చుమీరితే.. అది ఏదో ఒక ఉద్యమం రూపంలో ప్రజలను సంఘటితం చేయటానికి కారణమవుతుంది. తెలంగాణ సాయుధ పోరాటానికీ ఇలాంటి నేపథ్యమే ఉంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. దీంతో నాటి నిజాం ప్రభుత్వం ధాన్యం సేకరణ కోసం ఫర్మానాలను జారీ చేసింది. సర్కారు నిర్ణయించిన ధరలకు రైతులు లెవీ ధాన్యాన్ని కొనాల్సి రావడం, ధాన్య సేకరణతో తెలంగాణలోని చిన్న, మధ్య తరగతి రైతాంగం, రైతు కూలీల్లో రగిలిన అసంతృప్తి, నిజాం ప్రజల మీద విధించిన పన్నులు, చిన్న, సన్నకారు రైతాంగం, శ్రామిక వర్గాలను పీడించిన వడ్డీ వ్యాపారుల అత్యాశ మూలంగా రైతులంతా రైతు కూలీలుగా మారాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆ కూలీ జనం అసంతృప్తే సాయుధ పోరుకు బీజాలు వేసింది. ప్రజా వ్యతిరేక విధానాలను సహించలేని ప్రజలు నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థను అంతం చేయడం, పన్నుల నిరాకరణ, మద్యపాన నిషేధం, వడ్డీ వ్యాపారాన్ని నిర్మూలించాలంటూ సాగించిన ఈ పోరు.. భారత రైతాంగ పోరాటాల్లో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిపోయింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం, పోరాడితే పోయేదేమీ లేదనే తెగింపుతో రైతుకూలీలు తిరగబడిన ఈ అపూర్వ ఘట్టంలో, ఉక్కు సంకల్పంతో తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి పోరాడిన వీరులు, వీరవనితలూ ఎందరో.

Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంత ప్రత్యేకం? 70 ఏళ్ల కిందట.. ఒక్క ‘అడుగు’తో మొదలైన సాంప్రదాయం


ప్రపంచ రైతాంగ పోరాటాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ సాయుధ పోరాటం 1945 నుంచి 1951 మధ్యకాలంలో 4 దశల్లో జరిగింది. తొలి దశ 1940లో ప్రారంభమై ఆరేళ్ల పాటు భావజాల వ్యాప్తి లక్ష్యంగా సాగింది. ఈ దశలో ఆంధ్రమహాసభ పేరుతో కమ్యూనిస్టు యోధులు.. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం కావాలనే ఆకాంక్షను ప్రజల్లో నింపగలిగారు. 1946 నుంచి ఏడాది పాటు సాగిన రెండవ దశ పోరాటంలో కమ్యూనిస్టులు గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతుల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూనే, భూస్వాముల వెట్టి చాకిరి, కట్టు బానిసత్వాల నుంచి శ్రామిక వర్గాల ప్రజలను విముక్తి చేయటానికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగారు. తర్వాత.. రజాకార్లకు వ్యతిరేకంగా పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలో రైతాంగ పోరాటం తీవ్ర రూపం దాల్చి, 1947 సెప్టెంబర్ 11న నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 1948 సెప్టెంబరు 17 వరకు సాగిన ఈ దశలో రాజ్య హింస, అణచివేతలు విపరీతంగా పెరగగా, శ్రామిక వర్గాల నుంచే పాలక పక్షానికి అంతే స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఈ పోరులోనే వేలాది మంది వీరులు నేలకొరిగారు. భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని చేజిక్కించుకున్న తర్వాతి నుంచి 1951 వరకు నాలుగో దశ పోరాటం సాగింది. నైజాం రాజ్యంలో జరుగుతున్న అరాచకాలకు కమ్యూనిస్టులే కారణమంటూ దోపిడీ వర్గాలు చేసిన ప్రచారాన్ని నమ్మిన కేంద్ర బలగాలు.. ఈ సమయంలో దగా పడిన ప్రజల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులను లక్ష్యంగా చేసుకున్నాయి. అక్టోబర్ 21, 1951 సాయుధ పోరాటాన్ని విరమించాలని సీపీఐ నిర్ణయించిన తర్వాత ఈ ప్రాంతంలో శాంతి నెలకొంది.

చైనాలో తప్ప ఆసియాలో మరెక్కడా ఇంత పెద్ద రైతాంగ పోరాటం జరిగిన దాఖలాలు లేవు. ఈ పోరాటంతో నైజాం రాజ్యం పరిధిలో చట్టబద్ధపాలన, సమానత్వ భావన, రాజ్యాగ సంస్కరణలు, విద్య ఆవశ్యకత, పౌర హక్కులు, ఉద్యోగ నియామకాలు మొదలైన అంశాల్లో ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఈ పోరాటంలో పాల్గొన్న రైతులకు భూ చట్టాలు, సామాజిక హోదాను పెంచటంలో భూమి పోషించే పాత్ర మీద మెరుగైన అవగాహన ఏర్పడగా, కౌలుదారు, భూమిలేని రైతు వర్గాలను భూపోరాటాలకు పురికొల్పి, మిగులు భూములు పంచేలా చేసింది. ముఖ్యంగా వెట్టిచాకిరి, కట్టుబానిసత్వంలో మగ్గిపోతున్న గిరిజన రైతులు ఆ పీడన నుంచి బయటపడగలిగారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వల్ల 4000 గ్రామాలను కమ్యూనిస్టులు తమ అధీనంలోకి తెచ్చుకుని, సుమారు 10 లక్షల ఎకరాల భూమిని.. భూస్వాముల నుంచి పేదలకు బదిలీ చేయగలిగారు. ఈ పోరాటాన్ని నాటి హోంమంత్రి హోదాలో పటేల్.. పార్లమెంటులోనూ ప్రస్తావించారు. ఈ పోరుకాలంలో రావినారాయణరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలమ్మ, భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి, నర్రా రాఘరవరెడ్డి, ధర్మ బిక్షం, చల్లా సీతారాంరెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో నేతలు ఇళ్లూ వాకిళ్లూ వదిలేసి, పోరాటాల్లో పాల్గొన్నారు.

Also Read: Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

తెలంగాణ ప్రాంతంలో నాడు పోరుబాట పట్టిన ఎందరో వీరుల పేర్లు, వారి అమరత్వానికి రుజువులుగా మిగిలిన అక్కడి గ్రామాలను నేటికీ జనం గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. విసునూరు దేశ్ ముఖ్ రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా 1920లో షేక్ బందగీ సాగించిన వీరోచిత పోరాటం, జలియన్ వాలాబాగ్ ఉదంతానికేమాత్రం తీసిపోని వరంగల్‌ జిల్లా బైరాన్‌పల్లి మారణకాండ, రజాకార్ల రాక్షసకాండకు పరాకాష్టగా నిలిచిన గుండ్రాంపల్లి దురంతం, వరంగల్ జిల్లా పరకాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన వారిపై కాల్పులకు దిగి 23 మందిని పొట్టన బెట్టుకున్న సందర్భం, కడివెండిలో నిజాం తుపాకీ తూటాలకు ఎదురు నిల్చి దొడ్డి కొమరయ్య చేసిన ప్రాణత్యాగం, విసునూరు దొర కిరాయి గూండాల మీద రోకలి చేతబట్టి తిరగబడ్డ చాకలి ఐలమ్మ సాహసం, పాలమూరు జల్లా అప్పంపల్లిలో బెల్లం నాగన్న నాయకత్వంలో జరిగిన పోరాటంలో 11 మంది నేలకొరిగిన ఘటన జనం మనసుల్లో నేటికీ నిలిచిపోయాయి. ఈ తెలంగాణ సాయుధ పోరాటమే తర్వాత ఈ గడ్డమీద జరిగిన అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ అరుదైన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, నాటి అమరుల త్యాగాలను పది కాలాల పాటు గుర్తుండిపోయేలా చేయగలిగితేనే రేపటి తెలంగాణ అన్యాయాన్ని నిలదీయగల చైతన్యాన్ని తనలో నిలుపుకోగలుగుతుంది.

– పీవీ శ్రీనివాస్

ఎడిటర్ ఇన్ చీఫ్

బిగ్ టీవీ

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×