Telangana Sarpanch Elections: తెలంగాణలో బీజేపీ టార్గెట్… లోకల్ బాడీ ఎనికలేనా..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయం ఇచ్చిన జోష్ పార్టీ శ్రేణుల్లో ఏమాత్రం తగ్గకుండా అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తోందా..? మోడీ 11 ఏళ్ల పాలన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రజలపై ఇంపాక్ట్ పడే విధంగా స్కెచ్ వేస్తోందా..? ఇదే జోష్, ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ నింపేందుకు పార్టీ పెద్దలు కసరత్తులు చేస్తున్నారా..?.. అసలు బీజేపీ పెద్దల స్కెచ్ ఏంటి?
స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న కాషాయ దండు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేస్తోంది. చాప కింద నీరులా కనపడకుండానే బలోపేతం అవుతున్న పరివారులు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు పాచికలు కదుపుతున్నారు. బీఆర్ఎస్ పాచికలను తిప్పికొడుతూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, తమ గళాన్ని ప్రజల్లో వినిపించడానికి కాషాయ దళం సిద్ధం అవుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న ఫామ్ హౌస్ రాజకీయాలు తమకు ప్లస్ అవుతున్నాయనే అంచనాల్లో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ .. మరోవైపు బిజెపి, బీఆర్ఎస్ కలిసి ఒప్పందం ప్రకారమే హోల్ సేల్ రాజకీయాలు చేస్తున్నాయనే టాక్ సైతం నడుస్తోంది. అంతేకాదు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఒప్పందం ప్రకారమే రెండు పార్టీలు కలిసి నీకు సగం సీట్లు, నాకు సగం సీట్లు అంటూ ముందుకు వెళ్తాయనే టాక్ సైతం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని కాన్ఫిడెన్స్
గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలకు భారీగా గండి పడి, అధికారమనే కల నెరవేరకపోయినప్పటికీ, ఓటింగ్ శాతం భారీగా పెంచుకున్నామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమదే అధికారమనే కాన్ఫిడెన్స్ కమలనాథుల్లో కనిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు, కమలం పార్టీల కుమ్మక్కు రాజకీయం మంచి ఫలితాలను రాబట్టడంతో, వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే స్ట్రాటజీ తో ముందుకు వెళ్ళి, అధికార పార్టీకి భారీగానే గండి కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందుకు బీజేపీ ఇప్పటి నుంచే స్థానిక ఎన్నికలకు దారులన్నీ క్లియర్ చేసుకుంటోంది.
రాష్ట్ర నేతలకు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ క్లాసులు
అందులో భాగంగానే, 11 ఏళ్ల మోడీ పాలన, మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమవుతున్నారని పార్టీ అధిష్టానం భావిస్తోందంట. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై ప్రజలకు వివరించడంలో బీజేపీ విఫలం అవుతుందనే టాక్ వినిపిస్తున్న నేపద్యంలో కాషాయ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ బన్సల్, పొలిటికల్ వ్యవహారాల ఇంచార్జీ అభయ్ పాటిల్ కలిసి పార్టీ క్యాడర్‌కు క్లాస్‌లు పీకుతూ వారిని అలెర్ట్ చేసే పనిలో బిజీగా గడుపుతున్నారంట.
ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్వాంటేజ్ అవుతాయని ధీమా
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు యావత్ తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందా, లేదా..? అనేది అటుంచుతే.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తమకు అడ్వాంటేజిగా మారాయని తెలంగాణ కమలదళం భావిస్తోంది.. ఈ అడ్వాంటేజీ ఉత్తర తెలంగాణ జిల్లాలపై మాత్రమే ఉండనుందా..? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తర తెలంగాణపై బీజేపీపట్టు పెంచుకుంటుందా..? ఇప్పటికే ఉత్తర తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండటం ఆ పార్టీ ప్లస్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను పూర్తిగా అనుకూలంగా మార్చుకుని తెలంగాణలో అధికారం సాధించడానికి బీజేపీ హైకమాండ్ పాచికలు వేస్తూ, సైలెంట్ గా పావులు కదుపుతోందంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి ప్రణాళికలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఫుల్ జోష్ తో ఉన్న పరివారుల దండు ఇదే జోష్‌తో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రణాళికలకు పదును పెడుతోంది. రాష్ట్రంలో అధికార మార్పు జరిగి, ఏడాదిన్నర పూర్తైన నేపద్యంలో.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్న కాషాయ పార్టీ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపేనని నిరూపించిందని చెప్పుకుంటోంది
వచ్చే నెలలో కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం
మొత్తం మీద తెలంగాణలో జోష్ కొనసాగించేందుకు కమలం పెద్దలు మెదళ్ళకు పదును పెడుతున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టిన కాషాయ పార్టీ నేతలు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెలలో అధిష్టానం కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు జోష్‌తో పాటు, కొత్త బాస్ ఫైనల్ అయితే మరింత దూకుడు పెంచాలని బీజేపీ నేతలు స్కెచ్ గీస్తున్నారు. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ పార్టీకి ఎంత మేర కలిసి వస్తాయో చూడాలి.