Toll Plaza RajyaMarg App| హైవేలలో ప్రయాణించే వాహనదారులకు శుభవార్త! ఇకపై మీరు తక్కువ టోల్ ట్యాక్స్ ఉన్న మార్గాన్ని ఎంచుకోవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తమ అధికారిక రాజమార్గ యాత్ర యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ ద్వారా రెండు నగరాల మధ్య తక్కువ టోల్ ట్యాక్స్ ఉన్న మార్గాన్ని కనుగొనవచ్చు. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 2023లో ప్రారంభమైన రాజమార్గ యాత్ర యాప్.. భారత జాతీయ రహదారుల వెంబడి ఉన్న వివిధ సౌకర్యాల గురించి సమాచారం అందిస్తుంది. ఇప్పుడు, ఈ యాప్ రెండు ప్రదేశాల మధ్య వివిధ మార్గాల్లో వర్తించే టోల్ ట్యాక్స్ వివరాలను కూడా చూపిస్తుంది. అంతేకాక, తక్కువ టోల్ ట్యాక్స్ ఉన్న రహదారులను హైలైట్ చేస్తుంది.
ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ (ఐహెచ్‌ఎంసీఎల్) చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అమృత్ సింగ్ వివరిస్తూ.. ఉదాహరణకు, ఢిల్లీ నుండి లక్నోకు మూడు వేర్వేరు మార్గాలు ఉన్నాయని, ఈ యాప్ ప్రయాణికులకు తక్కువ టోల్ ట్యాక్స్ ఉన్న ఉత్తమ మార్గాన్ని ఎంచుకోవడంలో సహాయపడుతుంది. ఢిల్లీ-లక్నో ప్రయాణం కోసం ప్రయాణికులు.. యమునా ఎక్స్‌ప్రెస్‌వే, గాజియాబాద్-అలీఘర్-కాన్పూర్ మార్గం లేదా మొరాదాబాద్-బరేలీ-సీతాపూర్ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ యాప్ రెండు నగరాల మధ్య తక్కువ టోల్ ట్యాక్స్ ఉన్న మార్గాన్ని సూచిస్తుంది.
వార్షిక ఫాస్టాగ్ కోసంతో టోల్ ట్యాక్స్ పై డిస్కౌంట్.. ఎలా దరఖాస్తు చేయాలి?
ఎన్‌హెచ్‌ఏఐ ఇటీవల వార్షిక ఫాస్టాగ్ పాస్‌ను ప్రవేశపెట్టింది. ఈ పాస్ ధర రూ. 3,000 మరియు ఇది ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ పాస్‌తో ఏ హైవేలోనైనా 200 టోల్-ఫ్రీ ట్రిప్‌లు చేయవచ్చు. ఈ కొత్త ఫాస్టాగ్ నియమం ఆగస్టు 15, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఒకవేళ 200 ట్రిప్‌లు ఏడాది ముగిసేలోపు పూర్తయితే, మళ్లీ ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేయాలి. ఈ పాస్ కేవలం ఎన్‌హెచ్‌ఏఐ అధీకృత టోల్ ప్లాజాల వద్ద మాత్రమే చెల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వ టోల్ ప్లాజాల వద్ద పనిచేయదు.
Also Read: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. త్వరలోనే కొత్త ఛార్జీలు వసూలు
వార్షిక ఫాస్టాగ్ దరఖాస్తు విధానం
వార్షిక ఫాస్టాగ్ పాస్ కోసం దరఖాస్తు చేయడానికి, ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్ లేదా రాజమార్గ యాత్ర యాప్‌ను ఉపయోగించవచ్చు. ముందుగా, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో లింక్ చేయబడిన యాక్టివ్ ఫాస్టాగ్ వివరాలను ధృవీకరించాలి. ఆ తర్వాత, ఒకేసారి రూ. 3,000 చెల్లించాలి. ధృవీకరణ, చెల్లింపు ప్రక్రియలు పూర్తయిన తర్వాత, వార్షిక ఫాస్టాగ్ పాస్ జారీ చేయబడుతుంది.
ఈ కొత్త ఫీచర్‌లతో కూడిన వార్షిక ఫాస్టాగ్ పాస్ వాహనదారులకు హైవేలపై ప్రయాణాలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. రాజమార్గ యాత్ర యాప్ ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను ఎంచుకోవడం ద్వారా సమయం, డబ్బు రెండూ ఆదా చేయవచ్చు. ఈ సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.