PM Modi 6D War Plan: పహెల్గాం దాడి జరిగి ఇంత కాలం అవుతోంది. ఎలాంటి ప్రతి దాడులు లేవు. సర్జికల్ స్ట్రైక్స్ అంతకన్నా లేవు. దాడులకు పాల్పడ్డ ఒక్క ఉగ్రవాది చావలేదు. భారత్ నుంచి కనీస ప్రతీకారం లేదు. అసలు మోడీ పాకిస్తాన్ పై రచిస్తున్న యుద్ధరచన ఏది? ఎలా ఉండబోతుంది? ఆ వివరాలు ఎలాంటివి? ఈ నిశ్శబ్ధం వెనక దాగిన విధ్వంసం ఎలా ఉండబోతుంది? నిజంగానే మోడీ అంతటి విలయాలన్ని సృష్టించగలరా? ఇందుకు అంత స్కోప్ ఉందా? ఒక వేళ మోడీ చేయదలిస్తే ఎలాంటి యుద్ధం చేసే అవకాశముంది? ఇవన్నీ ఇలాగుంటే అసలు భారత్- పాక్ యుద్ధం చుట్టూ అల్లుకుని కనిపిస్తున్న స్థితిగతులు ఎలాంటివి? మనం చేయబోయే యుద్ధం చుట్టూ మూగిన రాబందుల్లాంటి స్తితిగతులు ఎలాంటివి? ఒక పరిశీలన చేద్దాం..
ఇంత వరకూ ఎలాంటి దాడి చేయని మోడీ అండ్‌కో
మోడీ చూస్తే ఇంత వరకూ అటు వైపు ఎలాంటి దాడి చేయలేదు. ఒకరిద్దరు ఉగ్రవాదులను చంపినా వారు టార్గెటెడ్ టెర్రరిస్టులు కారు. కాశ్మీర్ లో ఒకట్రెండు టెర్రరిస్టుల ఇళ్లను కూల్చినా అవి మన ప్రతీకారేచ్చను చల్లార్చేవి కావు. దేశమంతా లోలోపల అట్టుడికిపోతోంది. మన వాళ్లలో పాతిక మందికి పైగా చనిపోతే ఇంత వరకూ ఎలాంటి ప్రతీకార చర్య లేదు.
కనీస ప్రతీకార చర్యల్లేవన్న అసంతృప్తి
గతంలో ఇలాంటి దాడులు జరిగిన భారత్ వెంటనే అప్రమత్తమయ్యేది. దేశమంతా సంతోషించేలా సర్జికల్ స్ట్రైక్స్ వంటివి జరిగేవి. దీంతో దేశ ప్రజల అసంతృప్త జ్వాలలు చల్లారేవి. ఇవే వద్దంటున్నారు నిపుణులు. ఒకటీ అరా కాల్పుల ఘటనల ద్వారా మనకొచ్చే లాభం లేదు. వాళ్లకొచ్చే నష్టం లేదు. అంతకు మించి కావాలి. అది శాశ్వత పరిష్కారంలా కనిపించాలి. అలా జరగాలంటే అంత తేలిగ్గా జరిగేది కాదని అంటున్నారు.
వారికొచ్చే నష్టం లేదంటోన్న వార్ ఎక్స్ పర్ట్స్
వారి లక్ష్యం ఎలా విస్తరిస్తోందో.. మన లక్ష్యం కూడా అంతే పెద్దది కావాలి. వారు కూడా ఆర్టికల్ 370 రద్దు అయిన వెంటనే దాడి చేయలేదు. విడతల వారీగా ఒక్కో అడుగు ముందుకేస్తూ వస్తున్నారు. దానికి తోడు పాకిస్థాన్ కూడా మనం ఏం చేయబోతామో ముందే ఒక అంచనాకి వచ్చేసింది. గతంలో చేసిన దాడుల తరహాలో చేస్తే వారు వెంటనే రియాక్టయిపోతారు. ఈ దిశగా ఎప్పుడో వారు పావులు కదిపేశారు. పైపెచ్చు చైనా నుంచి కూడా వారు తగిన సహాయ సహకారాలను పొందడానికి సిద్ధంగా ఉన్నారు. చైనా కూడా ఇందుకు సిద్ధమేనంటోంది.
ఒక పథకం ప్రకారం చేసి చూపించాలి..
వారికి తెలీకుండా వారికి నష్టం కలిగించాలి. దీపావళినాడు నాలుగు టపాకాయలు పేల్చి, చిచ్చుబుడ్లు కాల్చి.. ఒక ఈవెంట్ గా ఎలా చేస్తామో ఇది కూడా అలా మార్చొద్దు. ఈవెంక్చువల్ గా ఒక పథకం ప్రకారం చేసి చూపించాలి. అలా చేయాలంటే ఎంతో సమయం, సంయమనం రెండూ అవసరమే. ఇదే ప్రస్తుతం మోడీ ప్లాన్ గా తెలుస్తోంది.
మా సమయం పరిమితం.. లక్ష్యాలు పెద్దవి-మోడీ
అలాగని పెద్ద సమయమేం తీసుకోదలుచుకోలేదు. మోడీ అందుకే అంటోంది మా సమయం పరిమితం. లక్ష్యాలు పెద్దవని చెబుతోంది. ఈసారి పాక్ మాత్రమే కాదు ప్రపంచ మంతా షాకయ్యేలాంటి పథకరచన చేస్తున్నారు మోడీ. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ అదే జరిగితే అవి ఎలా ఉంటాయ్? వాటి స్వరూప స్వభావాలు ఏ పాటివి? అన్న చర్చ సాగుతోంది.
26/11 తర్వాత జరిగిన.. దారుణమైన దాడి 22/4 అటాక్
26/11 తర్వాత భారత గడ్డపై జరిగిన అత్యంత దారుణమైన దాడి.. 22/4 అటాక్. 26 మంది భారత పౌరులు మరణించారు. అది కూడా మతం ద్వారా వేరు చేయబడి ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారు. దాడికి మూడు రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ హిందూ భారత్ పై పౌర యుద్ధం చేయాల్సి ఉందని అనడం.. పహెల్గాం దాడికి వచ్చిన వారు కూడా సరిగ్గా అలాగే హిందూ -ముస్లిం అంటూ వేరు చేసి మరీ చంపడం చూస్తుంటే ఇందులో ఏదో రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. దీంతో.. ఒక్కొక్కరి రక్తం మరిగిపోతోంది. పహెల్గాం దాడిలో చిందింది కేవలం రక్తం మాత్రమే కాదు.. ఒక సిద్ధాంతీకరణ కూడా ఇందులో దాగి ఉంది. దాన్ని డీకోడ్ చేయాలి. ఇదే మోడీ బృందం చేస్తోన్న సునిశిత ఆలోచనగా తెలుస్తోంది.
ఇది కేవలం ఉగ్రదాడి కాదు
ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు.. భారత్ నుంచి ప్రపంచమంతా కలసి ఆశిస్తున్నది వేరు. కానీ, భారత్ మాత్రం మరోరకంగా చూస్తోందని అంటున్నారు నిపుణులు. ప్రపంచమంతటికీ మొన్న జరిగిన పహెల్గాం దాడులు కేవలం ఉగ్రవాదం కిందకు వస్తాయి. కానీ, భారత్ కి మాత్రం ఇది పూర్తి వ్యక్తిగతం. సరిగ్గా అదే సమయంలో వ్యూహాత్మకం. ఇటు పాక్ నుంచే కాదు అటు పాశ్చాత్య దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును కూడా పరిగణలోకి తీసుకుంటోంది భారత్.
పర్మినెంట్ సొల్యూషన్ దిశగా అడుగులు?
మూడు బాంబులు వేసి- ఆరుగురు ఉగ్రవాదులను చంపగానే సరిపోదని గట్టిగా భావిస్తోంది భారత్. వైమానిక దాడులు, సరిహద్దు ఉద్రిక్తతలకు పరిమితం చేయాలనుకోవడం లేదీ సారి. ప్రతిపక్షాలు ఊహించినట్టు అదేదో మొక్కుబడి తంతుగా చేయదలుచుకోలేదు. ఆ మాటకొస్తే సామాన్యుల భావోద్వేగాలను రాజేసి అక్కడితో ముగించాలని భావించడం లేదు. నెక్స్ట్ లెవల్ రివేంజ్ ని అది కూడా పర్మినెంట్ సొల్యూషన్ ని కనుగొనాలని చూస్తోంది భారత్.
బుల్లెట్ వాడకుండా, రక్తం చెందకుండా..
మీకు మరణమంటే భయం, మాకు ప్రేమ. ఇది వారి ఉగ్ర నినాదం. మీది మరణ పిపాస. మాది శాంతి కాముకత్వం.. అంటూ నిరూపించాలని భావిస్తోంది భారత్. బుల్లెట్ వాడకుండా, రక్తం చిందకుండా కార్యం చక్కబెట్టాలని చూస్తోంది.
భారత్ కి తలనొప్పిగా ట్రంప్ టారిఫ్‌ల వ్యవహారం
దానికి తోడు ట్రంప్ టారిఫ్ ల వ్యవహారం ఒకటి కాచుకుని ఉంది. మనం పీక లోతు సరిహద్దు గొడవల్లో కూరుకుపోతే.. అమెరికా ఇదే అదనుగా భావించే అవకాశం కనిపిస్తోంది. దీంతో మనం చేయాల్సిన బేరసారాలను చేయలేం. పైపెచ్చు వారే మనల్ని మరింత ఒత్తిడికి లోను చేసి.. తద్వారా మన చేత మరిన్ని ఎక్కువ ధరలకు లెక్కకు మించిన ఆయుధాలను కొనిపించవచ్చు. దీంతో భారత్ కి ఇదొక భారం. ఈ విషయంలో మోడీ చాలా చాలా అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక తిరోగమనంలో.. పాశ్చాత్య దేశాలు
ఒక వేళ భారత్- పాక్ యుద్ధమంటూ మొదలై పోతే.. పశ్చిమ దేశాలకు అంతకన్నా మించి కావల్సిందేమీ లేదు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల ఆర్ధిక వ్యవస్త పూర్తి తిరుగోమనంలో ఉంది. ఉక్రేయిన్ యుద్ధంలో మునిగి తేలుతున్నాయీ దేశాలు. ఉక్రేయిన్ కి రుణాలు ఇస్తూ.. తలమునకలుగా ఉన్నారు. ట్రంప్ ఈ యుద్ధం ఎలాగైనా సరే ముగించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఒక వేళ భారత్ పాక్ వార్ మొదలైతే.. ఎలాంటి బేరసారాలు లేకుండా తమ ఆయుధాలను అధిక ధరలకు విక్రయించవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఉచ్చులో పడకూడదని గట్టిగా భావిస్తోంది మోడీ యంత్రాంగం.
చైనా నుంచి వలస వెళ్లాలని చూస్తోన్న ఆపిల్
ఇవన్నీ ఇలా ఉంటే ఆపిల్ వంటి కంపెనీలు చైనా నుంచి భారీగా వలస వెళ్లాలని ట్రై చేస్తున్నాయి. అయితే భారత్ మాత్రం ఇలాంటి దేశాలను స్వాగతిస్తోంది. మనంగానీ పీకలోతు యుద్ధంలో మునిగి తేలితే.. అవి భారత్ కి రాకుండా ఏ వియత్నాంకో వెళ్లే అవకాశాలు లేక పోలేదు. ఇలాంటి నష్టదాయక యుద్ధాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా? అన్నది మోడీ ఆలోచనగా తెలుస్తోంది.
కొని తెచ్చుకోవడం అవసరమా?
ఇక్కడ మన చుట్టూ ఉన్న స్థితిగతులను కూడా ఒక సారి అర్ధం చేసుకోవాలి. ఈ యుద్ధ వాతావరణంలో పొంచి ఉన్న మరో ముప్పును బట్టీ చూస్తే.. పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశం మాత్రమే కాదు అద్దె దేశం కూడా. యూఎస్, యూకే వంటి యురోపియన్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ని పావుగా వాడుకున్న విషయం తెలిసిందే. సాక్షాత్ ఆ దేశ రక్షణ మంత్రే ఈ మాట ఒప్పుకున్నారు కూడా. ఈ సమయంలో వారు పాకిస్తాన్ కి వంద మిలియన్ డాలర్లు ఇచ్చినట్టే ఇచ్చి.. భారత దేశం నుంచి బిలియన్ డాలర్ల ఆయుధాలు కొనేలా చేస్తారు. వారికి భారత్- పాక్ యుద్ధం పైకి కనిపిస్తోన్న అంశం ఉగ్రవాద అంతం. కానీ ఇందులో దాగి ఉన్న లాభదాయక వ్యవహారం అంత తేలికగా పైకి కనిపించేది కాదు. ఇది లోతైన పరిశీలన చేస్తే గానీ అవగతం కాదంటారు నిపుణులు.
మోడీ.. త్రీడీ కాదు.. 6 డీ ప్లాన్
గన్ను కన్నా- పెన్ను గొప్పది. రక్తం కన్నా- ఇంకు గొప్పది. అందుకే థింక్ విత్ ఇంక్.. నాట్ విత్ బ్లడ్ అంటారు. మరి మోడీ ఈ దిశగా ఎలాంటి పథక రచన చేస్తున్నారు? ఆ ఆలోచనా విధానమేంటి? త్రీడీ కాదు.. తమ థియరీ.. సిక్స్ డీ అంటున్నారు. ఢీ అంటే ఢీ అనకుండా వారికి వారు చితికిపోయేలా చేసేలాంటి ఆ మోడ్రన్ వార్ ఫేర్ ఎలాంటిది? ముప్పేట దాడి మాత్రమే కాదు.. దాయాది దేశాన్ని షష్ట దిగ్బంధనం చేసేలాంటి ఆ ఎత్తుగడలు ఏవి? వాటి తాలూకూ పరిణామ క్రమాలు ఎలా ఉండబోతున్నాయ్? ఇవన్నీ అమలయ్యే అవకాశాలెంత? అనుకున్నది అనుకున్నట్టు జరిగే ఛాన్సులు ఎంత మేరకు?
ఫస్ట్ డైమన్షన్.. సైబర్ అటాక్
ఊహలకందని సరికొత్త యుద్ధ రచనలో మోడీమోడీ త్రీడీ కాదు సిక్స్ డీ ప్లాన్ వేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. మోడీ స్కెచ్చేస్తోన్న సిక్స్ డైమన్షన్స్ లో.. ఫస్ట్ డైమన్షన్ సైబర్ అటాక్ గా తెలుస్తోంది. కత్తి, డాలు పోయి.. బాంబులు, తుపాకులు వచ్చిన మాట మనకు తెలిసిందే. ఇది డిజిటల్ జమానా. ఫిజికల్ అటాక్స్ బదులు- మెంటల్ అటాక్స్ చేయడానికి స్కోప్ ఎక్కువ. ఇక్కడ కూర్చుని ఎక్కడో ఉన్న అంశాలను ప్రభావితం చేయవచ్చు.. అదెలాగో చూస్తే.. పాకిస్తాన్ లోని విద్యుత్ గ్రిడ్ లను చీకటిగా మార్చేయవచ్చు. అంతే కాదు బ్యాంకింగ్ వ్యవస్థలనే తారు మారు చేయవచ్చు. ఇక పాక్ కమ్యూనికేషన్ వ్యవస్థనే స్థంభింప చేయవచ్చు.
పాక్ మౌలిక, ఆర్థిక, సైనిక వ్యవస్థలపై సైబర్ అటాక్
అది సాధ్యమేనా? అని చూస్తే.. మన నిఘా వర్గాలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాయి. మనం ఇప్పటికే ఈ దిశగా ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నామని చెబుతున్నాయి. పాకిస్తాన్ కీలకమైన మౌలిక సదుపాయాలను, ఆర్ధిక వ్యవస్థలను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి చేయొచ్చని సూచిస్తున్నాయి. ఇలా చేయడానికి భౌతిక సరిహద్దులు దాటాల్సిన అవసరం లేదు. వారి నుంచి ప్రతిదాడులు ఎదుర్కోవల్సిన పని లేదు. క్లిక్ అంత దూరంలో మొత్తం మటాష్ చేయవచ్చు. దీంతో మోడీ సర్కార్ ఈ దిశగా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం.
చంద్రుడిపై ఏం జరుగుతుందో చేప్పే పొజిషన్
ఇక సెకండ్ డీ విషయానికి వస్తే.. అంతరిక్షం. భారత్ ఇప్పటికే అంతరిక్ష పరంగా టాప్ పొజిషన్లో ఉంది. చంద్రమండలంలో ఏం జరుగుతుందో ముందే పసిగట్టే పొజిషన్ కి చేరింది. అలాంటిది పాకిస్తాన్ లో ఏం జరగుతుందో మన నిఘా శాటిలైట్లు పసిగట్టలేవా? అన్నది మరొక ఆప్షన్ గా తెలుస్తోంది.
అంతరిక్ష సామర్థ్యం వాడ్డం మరో ఎత్తుగడ
ప్రస్తుతం మనకున్న అంతరిక్ష సామర్ధ్యం చాలు.. పాకిస్థాన్ ఉగ్ర స్థావరాల్లో ఏం జరుగుతుందో పసిగట్టడానికి. డాకింగ్ ప్రక్రియలో ముందడుగు వేశాం. వచ్చే రోజుల్లో మనదైన అంతరిక్ష కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసుకునేంత స్థితిలో ఉన్నాం. అలాంటిది పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల్లో ఏం జరుగుతుందో చెప్పడం పెద్ద పనేం కాదు. ఈ దిశగా మన అంతరిక్ష సామర్ధ్యాన్ని వినియోగించడం మరొక ఎత్తుగడగా తెలుస్తోంది.
పాక్ GDPలో 24 శాతం వ్యవసాయమే
మూడో డైమన్షన్.. జల ఖడ్గం. పాకిస్థాన్ జీడీపీలో 24 శాతం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. వారి వ్యవసాయానికి ఎంతో కీలకమైన సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేసింది భారత్. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ముందుంది అసలు సినిమా. పాకిస్థాన్ ఆర్ధిక సామర్ధ్యాన్ని ప్రభావితం చేసే, నదీ జలాలను భారత్ నియంత్రిస్తే.. వచ్చే రోజుల్లో ఆ దేశ పతనం ప్రారంభమయినట్టే. ఏ యుద్ధం లేకుండానే అక్కడ ఆహార కొరత విలయ తాండవం చేస్తోంది. ప్రస్తుతం.. గోధుమ పిండి యుద్ధమే జరుగుతోందక్కడ. అలాంటిది.. వచ్చే రోజుల్లో వారి జలవనరులను గానీ మనం కంట్రోల్ చేస్తే.. ఇక వారి ఆకలి కష్టాలు.. ఆకాశాన్ని అంటడం ఖాయం. ఇటు కరవు మాత్రమే కాదు- అటు వరదలతోనూ మనం పాకిస్థాన్ వ్యవసాయంతో చెడుగుడు ఆడుకోగలం. మొన్నటికి మొన్న మన డ్యాముల్లోని బురద తొలగించుకోడానికి జీలం జలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే పీవోజేకేలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అంటే నీళ్లు లేకుండా చేయగలమూ.. సరిగ్గా అదే సమయంలో వరదలతోనూ ముంచెత్తి ముచ్చెమటలు పట్టించనూ గలమూ. ఒక్క మాటలో చెప్పాలంటే.. పాకిస్థాన్ ని మనం.. ముప్పు తిప్పలు పెట్టి మూడు నదుల నీళ్లు తాగించగలం..
బలూచిస్తాన్, POJKలను వేరు చేయడం
ఇక పాకిస్థాన్ దాని స్వరూప స్వభావాలను ముక్కలు చెక్కలు చేయడం. ఒకట్రెండు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఇరుకున పడేయటం కాదు.. ఏకంగా బలూచిస్తాన్, POJKలను పాక్ నుంచి వేరు చేయడం. ఈసారిగానీ పాకిస్తాన్ తోక జాడిస్తే.. బలూచిస్తాన్ కోల్పోవడం ఖాయంగా చెప్పారు అజిత్ దోవల్. వచ్చే రోజుల్లో అలా జరిగేందుకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. బలూచిస్తాన్, POJKపీవోజేకే ప్రాంతాలు ప్రస్తుతం ఏమంత ప్రశాంత వాతావరణంలో లేవు. ఈ ప్రాంత వాసులు పాకిస్తాన్ ఉగ్ర పోకడలను తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. తమ భుజం మీద నుంచి భారత్ కి గురిపెడుతున్న టెర్రరిస్టు తుపాకులను చూసి చిరాకు పడుతున్నారు. ఎప్పుడీ పాకిస్తాన్ పీడ వదుల్చుకుందామా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్ తో కలసి నడిచినంత మాత్రాన వచ్చేదేముందీ.. టెర్రర్ టెన్షన్ తప్ప అన్న కోణంలో ఆ ప్రాంతాలు విసిగి వేసారి ఉన్నాయి.
సరిహద్దులో ఒత్తిడి తెస్తూన్న ఆప్గనిస్తాన్
ఆఫ్గనిస్తాన్ సైతం పాక్ సరిహద్దులో తీవ్ర అసహనం చెలరేగేలా చేస్తోంది. పాకిస్తాన్ కి అనుక్షణం హై టెన్షన్ తెప్పిస్తోంది. గత మూడేళ్లుగా మనం తాలిబన్లతో గొప్ప సంబంధ బాంధవ్యాలను నెరుపుతున్నాం. వచ్చే రోజుల్లో భారత్ ఆఫ్గన్ సంబంధ బాంధవ్యాలపై మరింత భారీ ప్రకటనలు వెలువడ్డం ఖాయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్ అటు నుంచి కూడా నరుక్కొచ్చేలా కనిపిస్తోంది.
పాక్‌ని ఆర్థికంగా ఒంటరి చేయడం మరో డైమన్షన్
భారత్ సిక్స్ డైమన్షన్ వార్ లో మరో ఆయుధం.. పాక్ ని ఆర్ధికంగా ఒంటరి చేయడం. IMF, ప్రపంచ బ్యాంకుల సహాయ సహకారాలతో ఎలాగోలా నెట్టుకొస్తోంది పాకిస్తాన్. ఈ దేశానికి మీరు ఆర్ధిక సాయం చేసే.. అది ప్రతి పైసా ఉగ్రవాద కార్యకలాపాలకే వెచ్చిస్తోందని రిపోర్ట్ చేస్తోంది భారత్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దారుణంగా పడిపోయింది.. పాక్ ఆర్ధిక సామర్ధ్యం. ఒక వేళ పాక్ బలూచిస్తాన్ని కోల్పోతే.. చైనా హ్యాండిచ్చేలా తెలుస్తోంది. నేరుగా బలూచిస్తాన్ కే నిధులు సమకూర్చి పెడుతుంది. దీంతో పాకిస్థాన్ మరింత ఆర్ధిక సమస్యల్లో చిక్కుకుపోయేలా తెలుస్తోంది.
సాక్ష్యాలతో సహా FATF కి చూపించి ఒత్తిడి తెస్తే..
పాకిస్థాన్ ఎంత అభ్యర్ధిస్తున్నా.. భారత సింధూ జలాల ఒప్పంద రద్దు వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదు ప్రపంచ బ్యాంకు. సాధారణ పరిస్థితుల్లో అయితే వత్తాసు వచ్చేదేమోగానీ.. పహెల్గాం వంటి దాడుల తర్వాత వరల్డ్ బ్యాంకు సైతం పాకిస్తాన్ కి మద్ధతుగా నిలిచే సాహసం చేయలేక పోతోంది. దీన్నిబట్టీ చెప్పొచ్చు.. పాకిస్తాన్ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో. ప్రపంచ ఆర్ధిక సాయం లేకుంటే క్షణం ఊపిరి తీస్కోలేని స్థితిలో ఉంది పాకిస్థాన్. భారత్ గానీ పాక్ ఉగ్రకార్యకలాపాలను సాక్ష్యాలతో సహా FATF కి చూపించి ఒత్తిడి తెస్తే.. పాపిష్టి దేశం ఖేల్ ఖతం. వెంటిలేటర్ మీదున్న ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ సమాధి స్థితికి చేరుకోవడం ఖాయమంటున్నారు నిపుణులు.
పాక్ ఆర్మీ ఐఎస్‌ఐ, టెర్రరిస్టులపై పర్సనల్ అటాక్స్
పాకిస్తాన్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయక పోవచ్చుగానీ.. వచ్చే రోజుల్లో పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, టెర్రర్ గ్రూపుల్లోని వారిపై పర్సనల్ అటాక్స్ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ జనరల్స్ తమ తమ కుటుంబాలను యూరప్ లో గుర్తు తెలియని ప్రాంతాలకు తరలిస్తున్న వార్తలు వెలుగు చూస్తున్నాయ్. అందుకు కారణం.. భారత్ తమను వెంటాడి మరీ హతమార్చనుందన్న నిఘా వర్గాల సమాచారమే వారినిలా చేస్తోందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, టెర్రరిస్టు గ్రూపులు ఒక జట్టు. ఒకరికొకరు కూడబలుక్కుని ఈ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. పాక్ ఆర్మీ చీఫ్ వీరందరికీ హెడ్. ఆర్మీ చీఫ్ మాటే శాసనంగా వీరు భారత్ పై చెలరేగిపోతుంటారు. ఈ విషయం గుర్తించిన భారత్- పాక్ సైనికాధికారులను సైతం ఉగ్రవాదులతో సమానంగా భావిస్తోంది. దీంతో వీరి ప్రాణాలకు కూడా భద్రత లేదన్న మాట వినిపిస్తోంది. అసలే ప్రాణభీతి అధికంగా గల పాక్ జనరల్స్.. పెట్టేబేడ సర్దుకుని యూరప్ కి శాస్వతంగా తరలి పోతున్నట్టు తెలుస్తోంది.
పాక్ ని పిచ్చెక్కిస్తోన్న మోడీ వార్ రూమ్ మీటింగ్స్
బయోలాజికల్ వార్ కన్నా సైకలాజికల్ వార్ ఫేర్ అత్యంత భయానకమైనది. నేరుగా దాడి చేయడంకన్నా- దాడి చేస్తారేమో అన్న భయం అత్యంత భీతావాహకమైనది. మోడీ హుటాహుటిన సౌదీ నుంచి వచ్చి నిర్వహిస్తున్న సమావేశాలు పాకిస్థాన్ని పిచ్చెక్కిస్తున్నాయి. ఇక్కడ వార్ రూమ్ హెడ్ లైన్స్ అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దల గుండెలు అదరగొడుతున్నాయి. దెబ్బకు జడుసుకున్న పాక్ రక్షణ మంత్రి తాము ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు ఒప్పుకున్నారు కూడా. అంతే కాదు బలూచిస్తాన్ నుంచి తమ సైనికులను భారత సరిహద్దులకు తరలించారు. ఇక అరేబియా సముద్రంలో అతి పెద్ద మొహరింపును సైతం ప్లాన్ చేశారు. ఎప్పుడు.. ఏ క్షణం.. భారత్ తమపై విరుచుకుపడుతుందో అర్ధం కాక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు పాకిస్థానీయులు.
ఊహలకందని సరికొత్త యుద్ధ రచనలో మోడీ
ఏ మాటకామాట.. 21 వ శతాబ్దపు బ్రాండెడ్ అటాక్ చేయడానికి సిద్ధ పడుతున్నారు భారత ప్రధాని మోడీ. ఇది సరికొత్త వ్యూహం. ఇప్పటి వరకూ పాకిస్థాన్, ప్రతిపక్షాలు, పశ్చిమ దేశాలు, చైనా వీరెవరి ఊహకలకీ అందని మోడ్రన్ వార్ ఫేర్. ఆఫ్ లైన్ కన్నా- ఆన్ లైన్ లోనే అధికంగా వ్యూహ రచన చేస్తున్నారు. ఫిజికల్ గా కన్నా- మెంటల్ గా దెబ్బ తీసేలా చర్యలు తీసుకుంటున్నారు. శతృవును నేరుగా కొట్టడం ఎవరైనా చేస్తారు.. వారిపై అటాక్ జరగాలి. కానీ తెలీకూడదు. గిలగిలతన్నుకోవాలి. కానీ రక్తం చింద కూడదు. బుల్లెట్ దిగాలి కానీ, దాని శబ్ధం వినిపించకూడదు. కేవలం ఎత్తుగడలతో పరేషాన్.. చేయాలి. ఎక్కడ- ఎప్పుడు- ఎలా- కొట్టారో తెలీకుండా కొట్టాలి. ప్రత్యర్ధి సర్వస్వం భస్మీపటలం అయిపోవాలి. వచ్చే రోజుల్లో పాకిస్థాన్ దాని స్వరూప స్వభావాలు పూర్తిగా కనుమరుగై పోవాలి. ఉగ్రవాదం పేరెత్తడానికే హడలెత్తి పోవాలి. ఇదీ మోడీ మార్క్ ఆరంచల యుద్ధ ప్రణాళికగా తెలుస్తోంది.