దొంగ బాబుల లెక్కలు తీసి భారత్ చేతిలో పెట్టిన జర్మనీ
బిక్క చచ్చిపోతున్న మిలయనీర్లు, బిలయనీర్లు
భారతదేశంలో బడాబాబులకు చెమటలు పడుతున్నాయి. ఇల్లీగల్‌గా చేస్తున్న దందా అంతా బయటపడటంతో.. ఎక్కడ తీగలాగితే ఎవరి డొంక కదులుద్దోనని టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు వీళ్లందరికీ దబిడిదిబెడే! అసలే, భారత్ బ్లాక్ మనీ విషయంలో సీరియస్ వార్నింగ్‌లు ఇస్తూనే ఉంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్‌లో సీక్రేట్‌గా దాచుకున్న ఆస్తులన్నీ బయటపడటంతో ఏం చేయాలో తెలియక కంగారుపడుతున్నారు కోటీశ్వరులు. బ్లాక్ మనీకి పాపులర్ డెస్టినేషన్ అయిన స్విస్ బ్యాంక్‌లోనే కాకుండా.. ఇతర దేశాల్లో దాచుకుందామని చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ‘హత విధీ’ అనుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా జర్మనీ ఈ లెక్కలన్నీ తీసి భారత ప్రభుత్వం చేతిలో పెట్టింది. “ఇదిగో.. ఇదీ మీవోళ్ల బాగోతం” అంటూ పెద్ద లిస్టే ఇచ్చింది. ఇందులో ఎవరు పేరు ఉందో.. వాళ్ల పేరు మీద ఉన్న దొంగ డబ్బులో ఎంత బయటపడిందో తెలియక మిలయనీర్లు, బిలయనీర్లు బిక్క చచ్చిపోతున్నారు. లెక్కలు చూపించకుండా లావాదేవీలు చేసినవారంతా వణికిపోతున్నారు.
43 కేసుల్లో దొంగ స్థిరాస్తుల గురించి ఆధారాలు లభ్యం
తాజాగా, ఆదాయపు పన్ను శాఖ ఈ దొంగలపై దృష్టి పెట్టింది. కొందరు భారతీయ ధనికులు దుబాయ్‌లో లెక్కకు అందకుండా భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్లు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి 500 కంటే ఎక్కువ కేసులు కనిపించినట్లు సమాచారం. ఇవన్నీ చట్టపరంగా సీరియస్ చర్యలు తీసుకోవాల్సిన కేసులేనని అధికారులు అంటున్నారు. ఈ మేరకు, ఢిల్లీలో మాత్రమే నిర్వహించిన దాడుల్లో 700 కోట్ల కంటే ఎక్కువ విలువైన దొంగ లావాదేవీలకు సంబంధించి ఆధారాలు బయటపడినట్లు తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్‌లోని ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ వింగ్ తాజాగా డజనుకు పైగా సోదాలు నిర్వహించగా… ఇందులో, 43 కేసుల్లో దొంగ స్థిరాస్తుల గురించి ఆధారాలు లభించినట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు. కేవలం ఢిల్లీలో మాత్రమే అనుమానిత ఎగవేత సంఖ్య రూ.700 కోట్లకు పైగా ఉంది. ఇక, రాబోయే దర్యాప్తులో ఈ సంఖ్య కొన్ని వేల కోట్లకు చేరుతుందని అధికారులు అనుమానిస్తున్నారు.
రూ.125 కోట్లకు పైగా లెక్కకు అందని నగదు పెట్టుబడులు
భారత్-జర్మనీ మధ్య ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందానికి సంబంధించిన ‘స్పాంటేనియస్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ మెకానిజం కింద.. మిడిల్ ఈస్ట్‌లో భారతీయుల అండర్‌లో ఉన్న ఆస్తుల గురించిన సమాచారాన్ని జర్మనీ భారతదేశంతో పంచుకుంది. ఇందులో, వెయ్యి మందికి పైగా భారతీయులకు చెందిన ఆస్తుల వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. అయితే, ఈ రహస్య సమాచారం జర్మన్ అధికారుల చేతికి ఎలా వచ్చిందో అనేది మాత్రం స్పష్టంగా తెలియట్లేదు. కాకపోతే, ఢిల్లీలో జరిగిన సోదాల్లో ట్యాక్స్ పేయర్లు రూ.125 కోట్లకు పైగా లెక్కకు అందని నగదు పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించినట్లు అధికారులు ఇటీవల వెల్లడించారు. సదరు సోదాల్లో బోగస్ నగదు చెల్లింపులు, రశీదులు, కొనుగోళ్లకు సంబంధించిన దొంగ రశీదులను డిపార్ట్‌మెంట్ గుర్తించిందనట్లు తెలుస్తోంది.
గత వారంలోనే దాదాపు 100 నోటీసులు జారీ
అయితే విదేశాల్లో దాచుకున్న ఈ ఆస్తులను బడాబాబులు బయట పెట్టకపోవడం వల్ల.. ఇప్పటి వరకూ ఎంత నల్లధనం లెక్కలకు అందకుండా ఉందీ అనే విషయాన్ని అంచనా వేయడానికి ఈ సమాచారాన్ని స్టడీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక, అక్టోబరు చివరి నుండి, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్‌తో దగ్గర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, గత వారంలోనే దాదాపు 100 నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఇప్పటికే కొంత మంది ధనికుల అప్రకటిత దుబాయ్ ఆస్తుల మొత్తాన్ని… క్రాస్‌మ్యాపింగ్‌తో పాటు 360 డిగ్రీల ప్రొఫైలింగ్‌ను నిర్వహించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తన ఇన్వెస్టిగేషన్ వింగ్‌ను కోరినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్, బ్లాక్ మనీ యాక్ట్ కింద వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి ఉన్న మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దొంగ బాబులకు సంబంధించిన క్లియర్ కట్ లిస్ట్ రాబట్టడం కోసం… 90 రోజుల కంటే తక్కువ కాలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు, వారి ఆస్తుల గురించి UAE అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోడానికి అధికారులు రెడీ అయ్యారు.
90 రోజులకు పైగా UAEలో నివసిస్తే రెసిడెన్సీ హోదా
అయితే, ఇటీవలి సంవత్సరాల్లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్, చాలా మంది భారతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడం కోసం ఈ దేశం 10% తక్కువ డౌన్ పేమెంట్ అవసరమయ్యే స్కీమ్‌లను కూడా అందిస్తోంది. మిగిలిన బ్యాలెన్స్ కూడా చాలా సంవత్సరాలుగా చెల్లిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిజానికి, 90 రోజులకు పైగా UAEలో నివసిస్తున్న భారతీయ పౌరులు, అక్కడ రెసిడెన్సీ హోదాను పొందొచ్చు. అలాగే, 181 రోజుల కంటే ఎక్కువ కాలం ఉన్నవాళ్లు, ఇండియా-UAE పన్ను ఒప్పందంలోని నిబంధనల నుండి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే, అలాంటి సెఫ్టీ ఆఫర్లు నాన్-రెసిడెంట్‌లకు విస్తరించవు. కాబట్టీ, అలాంటి వారిపై ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దృష్టి పెట్టింది. ఎంతమంది, పెట్టుబడీదారులు దుబాయ్‌లో ప్రాపర్టీని కొనడానికి చట్టబద్ధంగా నిధులు తీసుకున్నారో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లకు సంబంధించి, విదేశీ ఆస్తుల షెడ్యూల్‌లలో సరిగ్గా పేర్కొన్నారా లేదా అనేది కూడా నిర్ధారించుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఫ్రాన్స్ ఇచ్చిన HSBC స్విస్ ఖాతాల డేటా
నిజానికి, గల్ఫ్‌లో భారతీయులకు చెందిన వేలాది ఆస్తులపై 2011లోనే ఫ్రాన్స్ సమాచారం ఇచ్చింది. భారత ప్రభుత్వం బ్లాక్ మనీపై ఉక్కు పాదం మోపుతామని చెప్పిన తర్వాత ఈ డిటైల్స్ వచ్చాయి. అయితే, అప్పడు ఫ్రాన్స్ ఇచ్చిన HSBC స్విస్ ఖాతాల డేటా కంటే ఇప్పుడు జర్మనీ చాలా ఎక్కువ సమాచారాన్ని ఇండియాతో పంచుకుంది. దుబాయ్, UAEలతో పాటు ఇతర నగరాల్లో నివాసముంటున్న భారతీయుల దొంగ ఆస్తులకు సంబంధించిన ఈ సున్నితమైన డేటాను జర్మనీ ఎక్కడ నుండి తీసుకుందో సరైన సమాచారం లేనిప్పటికీ.. ఆ సమాచారం నేరుగా స్విస్ బ్యాంక్ నుండే తీసుకున్నారనే సందేహాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఇండియా, జర్మనీల మధ్య ద్వంద్వ పన్నుల అవాయిడెన్స్ ఒప్పందం ప్రకారం ఈ ‘సమాచార మార్పిడి’ జరిగినట్లు తెలుస్తోంది.
దుబాయ్‌లో దొంగల డేటా అయితే దొరికింది. మరి వీళ్ల పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అసలు, ఈ డేటాతో చర్యలు తీసుకోడానికి ఛాన్స్ ఉంటుందా..? లేకపోతే, గతంలో దేశం విడిచి పారిపోయిన తిమింగలాలు చేసినట్లే వీళ్లు కూడా లైట్ తీసుకుంటారా? ఇప్పుడు, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తీసుకునే స్టెప్ ఏంటీ..?
ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్
అసలు, జర్మనీ ఇచ్చిన డేటా కరెక్టేనా..? దీనిపైనే ఇప్పుడు ఇండియన్ ఇన్‌కమ్ ట్యాక్స్ దృష్టి పెట్టింది. డేటా మూలాలపై విచారణ చేస్తోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్ సహా దేశవ్యాప్తంగా 14 నగరాల్లో నోటీసులు జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం, ఈ నోటీసులు దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్‌తో పాటు UAE ప్రభుత్వ అధికారుల కూసాలు కూడా కదిలిస్తాయనే భయం పట్టుకుంది. అయితే, దుబాయ్‌లో ఆస్తులు దాచుకున్న ధనవంతులైన భారతీయ ఖాతాదారులకు సలహా ఇస్తున్న న్యాయవాదులను, కొంత మంది ప్రాక్టీషనర్లను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ల దగ్గర నుండి డేటా మూలం గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. భారతీయుల ఆఫ్‌షోర్ ఆస్తులపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కి ఇప్పటివరకు అందిన అతిపెద్ద డేటా ఇదే కావడంతో అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
జనవరి ప్రారంభంలో యాక్షన్ టేకన్ రిపోర్టు సమర్పించాలి
ఇక, దీనికి సంబంధించి తమ యాక్షన్ టేకన్ రిపోర్టులను సంబంధిత డిజిఈటీ అధికారులు అపెక్స్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌కు జనవరి ప్రారంభంలో సమర్పించాల్సి ఉంది. దీనితో రెండు శాఖలు సమన్వయంగా స్పష్టమైన చర్యలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఇండియాతో పంచుకున్న సదరు డేటా మొదట ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత కాలంలో డేటా డిజిటల్ ట్రాన్స్మిషన్‌ని ఉపయోగించి, చాలా డేటా మార్పిడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఈ దిశగా అధికార వర్గాలు దృష్టి పెట్టాయి. గతంలో, బ్రిటీష్ బ్యాంక్‌కు చెందిన స్విస్ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి HSBC డేటా లీక్ చేశారు. అయితే, దొంగతనంగా వచ్చిన ఈ డేటా ఆధారంగా చర్య తీసుకోడానికి ప్రయత్నించినప్పుడు.. డిపార్ట్‌మెంట్ చట్టపరమైన పరిమితులను ఈ బడాబాబులు ప్రశ్నించారు. ఇది గతంలో భారీ వివాదానికి దారితీసింది. అందుకే, ఇప్పుడు అందిన సమాచారం ఎలా వచ్చిందో కనుక్కోవడం పెద్ద టాస్క్‌గా మారింది.
G20 దేశాల మధ్య సమాచార మార్పిడి ఒప్పందాలు
ఏది ఏమైనప్పటికీ, సమాచారం ఖచ్చితమని తెలుసుకునేంత వరకు కేసులను అంగీకరించడానికి భారతీయ ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండకపోవచ్చు. కాబట్టి, ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు, కోర్టుల మధ్య వాదోపవాదాల దగ్గర కొంత కాలం నానక మానదు. అంతేకాకుండా, ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ విధి విధానాలతో ఇది ఇంకాస్త జఠిలం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. దీనికి తోడు, పన్ను ఎగవేత, బ్లాక్ మనీ వ్యవహారంలో సీరియస్‌గా ఉన్నామని చెబుతున్న భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ దేశం వదిలి పారిపోయిన పెద్ద తలకాయలను టచ్ చేసింది లేదు. మాటలతో కాలం గడుపుతున్నారు తప్ప బ్లాక్ మనీని వెనక్కి తీసుకొచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. ఎన్నికలొచ్చినప్పుడు ప్రగల్భాలు పలకడం, తర్వాత.. పబ్బం గడపడం మామూలయ్యింది. ఇక, పన్ను మోసాలను తగ్గించడానికి G20 దేశాల మధ్య సమాచార మార్పిడి కోసం ఒప్పందాలు చేసుకోవడం, సమాచారం అందిందని చెప్పడం తప్ప చర్యలు మాత్రం తూతూ మంత్రంగానే కనిపిస్తున్నాయి.
మార్కెట్ విలువలో 120%-30% పన్ను.. 90% జరిమానా
ఇలాంటి పరిస్థితుల్లో… వెల్లడించిన ఆదాయంతో ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులు… లేదంటే, అద్దె ఆదాయాలపై పన్ను చెల్లించినవారు… IT రిటర్న్‌లలో దుబాయ్‌లోని దొంగ ఆస్తులను బయటకు చెప్పని వాళ్లు నామమాత్రపు జరిమానా చెల్లించి తప్పించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, దుబాయ్‌లో గానీ, మరే ఇతర దేశాల్లో గానీ ఆస్తులను కొనుగోలు చేయడానికి వారికి ఆదాయం ఎక్కడి నుండి వచ్చిందో బయటకు చెప్పకపోతే… అలాంటి వారిపై ఎప్పటికైనా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బ్లాక్ మనీ కింద వారి ఆస్తిపై ప్రస్తుత మార్కెట్ విలువలో 120% నుండి 30% పన్ను… అలాగే, 90% జరిమానా విధించవచ్చు. 2015లో ఆమోదించిన ఈ చట్టం అమలులో కొంత నత్తనడక ఉన్నప్పటికీ, దుబాయ్ దొంగలు దీని నుండి తప్పించుకోవడం కూడా కష్టమే. దీని కోసం, కేవలం జర్మనీ పంపిన డేటా మాత్రమే సరిపోదు. విచారణలో మరింత సమగ్రమైన సాక్ష్యాధారాల అవసరం కూడా ఉంటుంది.
భారత ఆదాయ-పన్ను చట్టం, 1961లోని 131(1A) కింద సమన్లు
ప్రస్తుతానికైతే… భారత ఆదాయ-పన్ను చట్టం, 1961లోని 131(1A) కింద సమన్లు జారీ చేయడం వరకూ వచ్చింది. జర్మనీ పంచిన డేటా మూలాలు అస్పష్టంగా ఉన్నా… ఇప్పటికైతే.. కొంతలో కొంత వేగంగా చర్యలు తీసుకోడానికి అది ఉపయోగపడింది. మరోవైపు, పన్ను ఎగ్గొట్టే బడాబాబులకు షాకిచ్చే విధంగా ప్రపంచ దేశాల మధ్య సమాచార సహకారం పెరిగిందనడానికి ఈ చర్య అద్దం పడుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం చేయాల్సింది… సమాచారానికి సంబంధించిన మూలాలు గురించి స్పష్టమైన సాక్ష్యాలను సేకరించి చూపించడమే. లేకపోతే, చట్టపరమైన కారణాలు చూపించి దొంగలంతా దొరల్లా తిరుగుతూనే ఉంటారు. దుబాయ్, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆస్తులను బయటకు చెప్పకుండా ఉన్న ట్యాక్స్ పేయర్లు… జరిమానాలు కట్టకుండా తప్పించుకుంటారు. వీళ్ల మీద యాక్షన్ తీసుకోడానికి భారత్ UAE అధికారులకు డేటా మూలంపై స్పష్టత ఇస్తే తప్ప, ఈ వ్యవహారం ముందుకు కదలదు. లేకపోతే, విజయ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల లాంటి తిమింగలాలు భారతదేశ వ్యాప్తంగా తయారౌతూనే ఉంటారు.