PM Modi: కొత్త ఏడాది వచ్చేదంటే అధికార పార్టీలకు బాధ్యత పెరిగినట్లే! ముఖ్యంగా, ప్రభుత్వాన్ని నడిపై నాయకుడికైతే.. ఎదుర్కోవాల్సిన సవాళ్లన్నీ కళ్లముందు కదులుతాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితి కూడా అంతే. పదేళ్ల పాలన తర్వాత ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన మోదీ.. అంతర్జాతీయంగా పేరు సంపాదించారు సరే. మరి, దేశం మాటేంటీ..? మిలటరీ పరంగా బలంగా మారి, అంతరిక్ష పరిశోధనల్లో ముందుడుగు వేస్తే సరిపోతుందా..? ప్రపంచంలో అధిక జనాభా.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.. అంటూ ప్రచారం చేసుకుంటే సమస్యలు తీరతాయా..? సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లక్ష్యం తీరాలంటే ఏం చేయాలి..? ఇప్పుడు, మోదీ ముందున్న25 సవాళ్లు ఏంటీ..? లెట్స్ ఫోకస్.
చాలా ఇంపార్టెంట్ అంశాలు మోదీకి ప్రధాన సవాళ్లు
మోదీ గ్యారెంటీ మోత మోగి… సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్లోగన్ పారి.. మొత్తానికి, ప్రధాని మోదీ మూడోసారి గద్దెనెక్కారు. కట్ చేస్తే అర్థ సంవత్సరం ముగిసింది. 2024 దాటి 2025.. కొత్త ఏడాది వచ్చేసింది. ఫ్రెష్ ఇయర్‌లో కొత్త సవాళ్లు కూడా చాలా వస్తాయి. ఇప్పటికే షెడ్యుల్ అయిన అధికారిక పనులు పక్కన పెడితే.. అంతగా కనిపించని సామాజిక సంక్షేమం.. నానాటికీ క్లిష్టంగా మారుతున్న మహిళా భద్రత.. కష్టంగా మారుతున్న మానవ హక్కులు.. మైనారిటీ ప్రజలు, ఈశాన్య రాష్ట్రాలు.. సామాన్యుడికి అర్థం కాని దేశ ఆర్థిక పరిస్థితి, పోషకాహారం.. పేదరికం, నిరుద్యోగం.. ఇలా చాలా ఇంపార్టెంట్ అంశాలు మోదీకి ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి.
2025 సంవత్సరంలో మోదీకి 25 ప్రధాన సవాళ్లు
రెండు సార్లు మోదీ ఫ్యాక్టర్‌తో గద్దెనెక్కామని అనుకున్నప్పటికీ.. మూడో సారి కూటమి సాయం అత్యవసరమయ్యింది. ఎన్డీయే పక్షాలతో అధికారం చేపట్టినప్పటి నుండీ మోదీ వాయిస్‌లోనూ ఛేంజ్ వచ్చింది. పార్టీ, దాని నేతల పరపతి పెరుగుతోంది. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని మోదీ పాలన మరింత ప్రజామోదాన్ని పొందాలి. దాని కోసం 2025 సంవత్సరంలో 25 ప్రధాన సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. ఇంతకీ ఏంటా సవాళ్లు…?
దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సి అవసరం
కరోనా తర్వాత ప్రపంమంతా ఎదుర్కుంటున్న అత్యంత ప్రధాన సమస్య ద్రవ్యోల్బణం. భారతదేశం ఆర్థికంగా ముందడుగు వేస్తుందని చెబుతున్నప్పటికీ.. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సి అవసరం చాలా ఉంది. ఎందుకంటో, 2024 అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 14-నెలల గరిష్ఠ స్థాయి 6.21%కి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం 15-నెలల గరిష్ఠ స్థాయి 10.87%కి చేరుకుంది. 2023లో, గృహస్తుల ద్వారా వచ్చే పొదుపులు 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. నగరాల్లో నివశిస్తున్న సగానికి పైగా జనం అప్పులతోనే జీవితాన్ని గడుపుతున్నారు.
2024 డిసెంబర్‌లో 7.2% నుండి 6.6%కి తగ్గిన GDP వృద్ధి అంచనాలు
పేదరికం తగ్గిందని చెబుతున్నప్పటికీ.. అప్పుల భారం సామాన్యుణ్ని ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇలాంటి నేపధ్యంలో.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సి ఉంది. అది ఎంత త్వరగా జరిగితే.. దేశంతో పాటు రాష్ట్రాలు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే.. GDP వృద్ధి చెందేలా చేయాలి. 2024 డిసెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా GDP వృద్ధి అంచనాలను 7.2% నుండి 6.6%కి తగ్గించింది. రెపో రేటును వరుసగా పదకొండు పర్యాయాలు తగ్గించలేదు. ప్రపంచంలోనే మూడో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఈ టార్గెట్ సరిపోదన్నది ప్రధానికి తెలియని విషయం కాదు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించండం ప్రధాన సవాలు
దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించండం ప్రధాన సవాలుగా ఉంది. అయితే 2022-23, 2023-24 మధ్య 13 వేల కోట్ల రూపాయల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు, ఎలన్ మస్క్ లాంటి కుబేరుడు భారత్‌లో పెట్టుబడి పెడతామని చెప్పి, తర్వాత తత్సారం చేయడం ప్రారంభించారు. భారత్ పర్యటనను రద్దు చేసుకోని, చైనా వైపు చూపు తిప్పారు. ఇంకోవైపు, అదానీ, అంబానీల ఆస్తి గ్రాఫ్ కూడా ఇటీవల తగ్గు మొహం పట్టింది.
యూఎస్ డాలర్‌తో పోలిస్తే 85.27 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయి
భారత ప్రధాని మోదీ తీరిక లేకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నప్పటికీ.. అనుకున్నంతగా విదేశీ పెట్టుబడులను భారత్ ఆకర్షించలేకపోతోంది. అమెరికాలో అధికార పీఠం ఎక్కబోతున్న డొనాల్డ్ ట్రంప్ చూస్తే.. టారిఫ్‌లతో అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ బాధ్యత మరింత పెరిగింది. అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరగాలంటే.. రూపాయిని కూడా బలోపేతం చేయాల్సి ఉంది. 2024 డిసెంబర్‌లో.. రూపాయి మూడవ వరుస సెషన్‌లో బలహీనంగా మారింది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే 85.27 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. ఈ నేపధ్యంలో.. మోదీ ముందున్న పెద్ద సవాలు రూపాయిని బలోపేతం చేయడమే!
ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాల్సి అవసరం
ఇక, దేశంలో పేదరికం తగ్గుతుందని నివేదికలు వస్తున్నప్పటికీ.. నిరుద్యోగం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే, మోదీ ప్రభుత్వం అర్జెంట్‌గా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉంది. గత రెండేళ్లుగా 10% వద్దే చతికిలపడిన యువత నిరుద్యోగం రేటును ఈ ఏడాది అయినా మెరుగుపర్చాల్సి ఉంది. ఎకనామిక్ సర్వే ప్రకారం, దేశంలోని మొత్తం యువతలో సగం మంది కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాలకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ హోల్డర్లు దరకాస్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక విధంగా, దేశంలో చాలా మంది చదువుకు సంబంధించిన ఉద్యోగాలు చేయలేకపోతున్నారు.
సామాన్యులకు మేలు చేసే విధంగా ఉండాల్సిన విధివిధానాలు
స్వయం ఉపాథిని ఆశ్రయిద్దామనుకున్నా.. కార్పొరేట్ సంస్థలు వచ్చి చిన్నపాటి వ్యాపారాలను కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమస్యను అధిగమించాలంటే.. ప్రభుత్వం సామాన్యులకు మేలు చేసే విధంగా విధివిధానాలను రూపొందించాల్సి ఉంది. గత నాలుగేళ్లలో పారిశ్రామిక రంగానికి రూ.5.65 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. దేశంలోని అతిపెద్ద ఉపాధి సంస్థ వ్యవసాయం, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌ల నుండి అన్ని రంగాల్లో రుణాల రద్దు విషయంలో అతి తక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. కాబట్టి, ఈ సంవత్సరమైనా కేంద్రం ఉద్యోగ కల్పన నుండి స్వయం ఉపాధిలో సామాన్యుడికి సహకరించాల్సి ఉంది.
ఏటా 17 లక్షల మంది భారతీయులకు ఆహార కొరత
ఈ ఏడాది, ఏటా 17 లక్షల మంది భారతీయులకు ఆహార కొరత మోదీ ప్రభుత్వం ముందున్న అత్యంత ముఖ్యమైన సవాలు అందరికీ ఆహారాన్ని అందించండం. ఏటా 17 లక్షల మంది భారతీయులు తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధులతో మరణిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. 2013 నుండి భారతదేశం GDPలో 50% పెరిగినప్పటికీ.. ప్రపంచంలోని పోషకాహార లోపం ఉన్న పిల్లలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది భారతదేశంలో నివసిస్తున్నారు. వీరిలో మూడేళ్లలోపు పిల్లల్లో సగం మంది తక్కువ బరువుతో ఉన్నారు.
తక్కువ ఆర్థిక స్థితి కారణంగా ఆహార నాణ్యత లోపం
భారతదేశంలో పోషకాహార లోపానికి ప్రధాన కారణాలలో ఆర్థిక అసమానత ఒకటి. జనాభాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఆర్థిక స్థితి కారణంగా, వారి ఆహారంలో తరచుగా నాణ్యత లోపం, పరిమాణంలోనూ తక్కువ ఉంటోంది. ఇలా పోషకాహార లోపం ఉన్న స్త్రీలకు ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశం తక్కువ. అధిక పోషకాహారం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. భారతదేశంలో జాతీయ స్థూలకాయం రేట్లు 2010లో స్త్రీలకు 14%, పురుషులకు 18%గా ఉంది. కొన్ని పట్టణ ప్రాంతాలలో 40% కంటే ఎక్కువగా ఉంది. ఊబకాయం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వంటి అనేక నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులకు కారణమవుతుంది.
అందరికీ సమాన వేతనాలు ఉండేలా చూసుకోవాలి
మరోవైపు, పోషకాహార లోపం ఉన్న వ్యక్తులతో.. సమాజానికి దీర్ఘకాలిక నష్టం ఉంది. మంచి ఆహారం తీసుకునే వారితో పోలిస్తే, పోషకాహార లోపం ఉన్న వ్యక్తులు న్యుమోనియా, క్షయ వంటి అంటు వ్యాధులకు లోనవుతారు. ఇది అధిక మరణాల రేటుకు దారితీస్తుంది. అంతేకాకుండా, పోషకాహార లోపం ఉన్న వ్యక్తులు పనిలో తక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటారు. తక్కువ ఉత్పాదకత వారికి తక్కువ వేతనాన్ని అందించడమే కాకుండా వారిని పోషకాహార లోపం అనే విష వలయంలోకి నెడుతుంది.
గత ఐదేళ్లుగా 0.4% తగ్గిన గ్రామీణ వాస్తవ వేతనాలు
కాబట్టి, అందరికీ సమాన వేతనాలు ఉండేలా చూసుకోవడం వల్ల అందరూ మంచి ఆహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. గత దశాబ్దంలో వాస్తవ వేతనాల వార్షిక వృద్ధి రేటు అఖిల భారత స్థాయిలో సున్నాకి దగ్గరగా ఉంది. గత ఐదు సంవత్సరాలుగా గ్రామీణ వాస్తవ వేతనాలు 0.4% తగ్గాయి. అలాగే, వ్యవసాయ వేతనాలు 0.2% వద్ద నిలిచిపోయాయి. ఐదుగురిలో నలుగురు వ్యక్తులు 2021 నాటికి రూ.515 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. అయితే, సామాజిక-ఆర్థిక సంక్షేమంలో మెరుగుదల ఉంటే.. పిల్లల పోషకాహారం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు కూడా భావిస్తున్నారు. కాబట్టి, దేశంలో ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా మోడీ ప్రభుత్వం ఈ సవాళ్లను పరిష్కారించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
రైతులకు సంబంధించి గత పదేళ్లలో జరిగిన నిరసనలు
మోడీ రెండు పర్యాయాల పాలన ఎలా ఉన్నప్పటికీ.. గత దశాబ్ధ కాలంగా దేశంలో మానవ హక్కులకు తీవ్రమైన భగం వాటిల్లిందనే విమర్శలు గట్టిగా వినిపించాయి. మోడీకి గానీ, బిజెపి పార్టీకి గానీ వ్యతిరేకంగా ఎవ్వరైనా పనిచేస్తుంటే.. వారిని నయోనో భయానో బెదిరించే స్థాయికి రాజకీయాలు చేరుకున్నాయనే ఆరోపణలను మోడీ ఎదుర్కున్నారు. దీనికి తోడు, రైతులకు సంబంధించి గత పదేళ్లలో జరిగిన నిరసన సెగలూ ఇప్పటికీ చల్లారలేదు. మోడీ ప్రభుత్వం మొండిగా తీసుకొచ్చిన రైతు చట్టాలను తర్వాత రద్దు చేసినప్పటికీ.. రాజధానికి సమీపంలో వందల కొద్దీ రైతులు ఇప్పటికీ రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.
కనీస మద్దతు ధరకి చట్టపరమైన హామీ కోసం రైతులు నిరసన
ఈ నేపధ్యంలో.. రాబోయే రోజుల్లో అయినా రైతులు గౌరవప్రదంగా జీవించడానికి మోడీ సహకరించాల్సి ఉంది. NCRB ప్రకారం, దేశంలో ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 2024 నుండి, కనీస మద్దతు ధరకి చట్టపరమైన హామీ కోసం నిరసన చేస్తూ… 22 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. 160 మందికి పైగా గాయపడ్డారు. అయితే, బాధితులను ఇప్పటికీ ఆదుకోలేదనే ఆరోపణలు మోడీ ప్రభుత్వంపై ఉన్నాయి. ఈ అంశంతో పాటు.. రైతుల డిమాండ్ల విషయంలో చర్చలను వేగవతం చేసి, ఈ సమస్యలను మోడీ పరిష్కరించాల్సి ఉంది.
మహిళలపై అత్యాచారాలు ఆపడానికి చట్టాలున్నా అమలు లేదు
ఇక, దేశంలో మహిళలకు భద్రత కరువవుతుందనడానికి గత దశాబ్ధ కాలంలో ఎన్నో ఉదాహరణలు దేశం చూస్తూనే ఉంది. ఇటీవల, కోల్‌కతాలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య కేసులో కేంద్ర సంస్థలు కూడా సరైన న్యాయం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. మహిళలపై అత్యాచారాలను ఆపడానికి చట్టాలు రూపొందిస్తున్నా.. వాటి అమలు విషయంలో కినుకు వహిస్తున్నారనే అపవాదు ఉంది. ఇక, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 63 అత్యాచారం నేరంతో వ్యవహరిస్తున్నప్పటికీ.. వైవాహిక అత్యాచారానికి మినహాయింపును అందించడం తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది.
వైవాహిక అత్యాచారానికి మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు
ఒక వ్యక్తి.. పద్దేనిమిది ఏళ్లు దాటిన తన సొంత భార్యతో బలవంతంగా లైంగిక సంపర్కం లేదా లైంగిక చర్యలు చేయడం అత్యాచారం కాదని ఈ చట్టం చెబుతుంది. ఒకవైపు, మహిళా హక్కుల సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు.. ఒక మహిళ ‘వద్దూ అంటే వద్దూ అని అర్థంచేసుకోవాలి’ అంటుంటే.. పెళ్లి చేసుకుంటే బలవంతం చేయొచ్చనే చట్టాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి, దీన్ని మోడీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధం అమలులో లోపం
ఇక, దేశంలో అట్టడుగున ఉన్నవారికి గౌరవం కల్పించాలనే డిమాండ్ కూడా ఉంది. ఇందులో భాగంగా.. ముఖ్యంగా, మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధాన్ని సరిగ్గా అమలు చేయాల్సి ఉంది. మాన్యువల్ స్కావెంజింగ్ 2013లో నిషేధించబడినప్పటికీ.. 2018-2020 మధ్య, మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేయడం వల్ల 443 మంది మరణించారు. ఇక, మోడీ పాలనలో నిజానిజాలను బయటకు తీసుకొచ్చే జర్నలిస్టుల మీద దాడులు మరింత పెరిగాయన్నది స్పష్టంగా లెక్కలు చెబుతున్న వాస్తవాలు.
2022లోనే కనీసం 194 మంది జర్నలిస్టులపై దాడులు
2020లో 67 మంది జర్నలిస్టులను అరెస్టు చేయగా, దాదాపు 200 మందిపై భౌతిక దాడులు జరిగాయి. 2022లోనే కనీసం 194 మంది జర్నలిస్టులు దాడులకు గురయ్యారు. ఈ దాడులు చేసింది కూడా… ప్రభుత్వ సంస్థలు, నాన్-స్టేట్ రాజకీయ నేతలు, నేరస్థులు, సాయుధ గ్రూపులు. 180 దేశాల వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారత్ రెండు స్థానాలు దిగజారి 142వ స్థానంలో నిలిచింది. చాలా సందర్భాల్లో జర్నలిస్టులపై దేశద్రోహం, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే ప్రకటనలతో సహా క్రిమినల్ అభియోగాలు నమోదు చేశారు. అందుకే, ఇకనైనా, భావప్రకటనా స్వేఛ్చను సంరక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది.
18వ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 13.6%
ఇక, దేశంలో సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. 18వ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 13.6%. ఇది 17వ లోక్‌సభలో ఉన్న 14.4% మహిళల కంటే కూడా తక్కువ. 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో కేవలం ఇద్దరికి మాత్రమే మహిళలు అధ్యక్షత వహిస్తారు. మరోవైపు, పార్లమెంట్‌లో బిల్లులు ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారు అనే ఆరోపణ ఉంది. బిల్లులను శాసనసభ పరిశీలనకు అనుమతించాల్సిన అవసరాన్ని గత దశాబ్ధ కాలంలో మోడీ ప్రభుత్వం గుర్తించలేదు.
17వ లోక్‌సభలో ప్రవేశపెట్టిన 10 బిల్లుల్లో 9 బిల్లులపై చర్చ లేదు
2019 నుండి.. 100 బిల్లులు, రెండు గంటలలోపే ఆమోదించబడ్డాయి. 17వ లోక్‌సభలో, పార్లమెంటులో ప్రవేశపెట్టిన 10 బిల్లుల్లో 9 బిల్లులపై ఎవర్నీ సంప్రదించలేదు.. ఒక వేళ ఏదైనా చర్చ సాగినా అది అసంపూర్తిగానే మిగిలింది. ఇలా, ఏకపక్షంగా బిల్లులు ఆమోదించిన ఘనత మోడీకి దక్కిందని విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు కూడా దుమ్మెత్తి పోశాయి. అయినా, పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఈ ఏడాది జరిగే లోక్ సభ సమావేశాల్లో అయినా సక్రమంగా జరుగుతుందోమో చూడాలి.
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ను ఎంపిక చేసుకోని వైనం
ఇక, మోదీ ముందున్న అతి పెద్ద సవాలు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ను ఎంపిక చేసుకోవడం. 17వ లోక్‌సభలో మొత్తం ఐదు సంవత్సరాల కాలానికి డిప్యూటీ స్పీకర్ లేరు. 18వ లోక్‌సభలో కూడా డిప్యూటీ స్పీకర్ సీటు ఖాళీగానే కొనసాగుతోంది. సాంప్రదాయానికి విరుద్ధంగా మోదీ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో కూడా సమాధానం లేదు. పోనీ, లోక్ సభలో విమర్శలు చేసినా వాటిని అనుమతించడానికి మోదీ ఎప్పుడూ సిద్ధంగా లేదు. గత ఐదేళ్లలో సస్పెండ్ చేయబడిన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 13 రెట్లు పెరిగినట్లు తెలుస్తుంది. గత పదేళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా 95% కేసులు ప్రతిపక్షానికి చెందిన వారిపైనే నమోదయ్యాయి. ఇవన్నీ మోదీని విమర్శించినందుకే అనే ఆరోపణలు ఉన్నాయి.
వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్..
అలాగే, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు వైస్-ఛైర్‌పర్సన్ లేక పోవడం కూడా ప్రభుత్వ వర్గాల్లో విమర్శలకు కారణం అయ్యింది. కేంద్ర సంస్థలను గౌరవించకపోవడం వల్లే మోదీ ప్రభుత్వం ఇలా అశ్రద్ధగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు, బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తేస్తుందనే ప్రచారం జరుగుతుంటే.. సంబంధిత సంస్థలకు అవసరమైన పాలనా వ్యవస్థను కల్పించకపోవడం కుట్రగానే భావిస్తున్న పరిస్థితి ఉంది.
షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు…
దీనికి తోడు.. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి మద్దతు లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మార్చి 2024 నాటికి, 10 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఒకటి పనిచేయడం ఆగిపోయింది. ఐదు ఏకలవ్య పాఠశాలల్లో రెండు జూలై 2024 నాటికి పని చేయడం లేదు. ఇవన్నీ, అణగారిన కులాలపై మోదీ ప్రభుత్వం అశ్రద్ధ వహించడం వల్లనే అంటున్నారు.
2021 జనాభా గణన ఇంకా నిర్వహించని ఎన్డీయే
ఇక, మోదీ ప్రభుత్వంలో జన, కుల గణన భారం ఇంకా మిగిలే ఉంది. 2021 జనాభా గణన ఇంకా నిర్వహించలేదు. 1887-2011 మధ్య ఇంత ఆలస్యమైన మొదటి జనాభా గణన ఇదే కావడం విశేషం. ఒక పక్క విపక్షాలన్నీ జన గణనపై మోత మోగిస్తున్నా మోదీ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక కోసం తీవ్రంగా వాదిస్తున్న మోదీ ప్రభుత్వం.. దాని నిర్వహణకు అత్యంత ఆవస్యకమైన జన గణన విషయాన్ని మాత్రం పక్కన పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇక, నిధులను కూడా మెరుగ్గా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు.
80% మీడియా అడ్వకసీ కోసం వినియోగించిన వైనం
బేటీ బచావో బేటీ పఢావో మొత్తం ఫండ్‌లో 80% మీడియా అడ్వకసీ కోసం వినియోగించేశారు. ఆరోగ్యంపైన కానీ, విద్యపై కానీ పైసా ఖర్చు చేయలేదు. మరోవైపు, రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు MGNREGS, ఆవాస్ యోజన కింద రూ.1,500 కోట్లు బకాయిపడింది కేంద్ర ప్రభుత్వం. నిధులు చెల్లించకపోవడంతో 59 లక్షల మంది MGNREGS కార్మికుల జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఇదొక ఉదాహరణ. బిజెపి వ్యతిరేక అధికారాలు ఉన్నా రాష్ట్రాల్లో చాలా వాటి పరిస్థితి ఇలాగే ఉందనేది ఆ రాష్ట్రాల ఆరోపణ. దీన్ని ప్రధాని మోడీ సీరియస్‌గా తీసుకుంటున్న దాఖలాలు ఇప్పటికైతే లేవు.
మణిపూర్ హింసలపై మోడీ మౌనం
ఇక, సంవత్సరానికి పైగా నడుస్తున్న మణిపూర్ హింసలపై మోదీ మౌనం దేనికి అర్థమో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్నా ప్రధాని ఎందుకు ఆ రాష్ట్రానికి వెళ్లట్లేదని విపక్షాలు విమర్శిస్తున్నా.. మోడీ పట్టించుకోలేదు. మణిపూర్ అల్లర్ల వల్ల 67 వేల మంది వేరే ప్రాంతాలకు మారాల్సి వచ్చింది. అందులో 14 వేల మంది పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఉన్నారు. వీరంతా శరణార్థులుగా ఎక్కడో ఓ చోట తలదాచుకుంటున్నారు. అయినా, ప్రధాని ఇంకా రాష్ట్రాన్ని సందర్శించలేదు. ఇక, దేశంలో మైనారిటీలు, వారి సంక్షేమంపై ఆందోళన పెరుగుతూనే ఉంది.
2023లో ఒక కమ్యూనిటీపైనే 668 ద్వేషపూరిత ప్రసంగాలు
NCRB ప్రకారం.. 2021లో దేశంలో 378 మత హింసాకాండ సంఘటనలు నమోదు అయ్యాయి. 2022లో 272 ఉదంతాలను నమోదు చేశారు. 2023లో, భారతదేశంలోని ఒక కమ్యూనిటీపై మాత్రమే 668 డాక్యుమెంట్ అయిన ద్వేషపూరిత ప్రసంగాలు వచ్చాయి. మతపరమైన హింస, నిరసనల తర్వాత.. 2022 ఏప్రిల్-జూన్ మధ్య నూట ఇరవై ఎనిమిది ఆస్తులను కూల్చివేశారు. ఇంత జరుగుతున్నా… దేశంలో శాంతి భద్రతలకు లోపం లేదని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం.
సురక్షితమైన ప్రజా మౌలిక సదుపాయాల లోపం
ఇక, సురక్షితమైన ప్రజా మౌలిక సదుపాయాలపై కూడా విమర్శలు లేకపోలేదు. 2017-2022 మధ్య 244 రైలు ప్రమాదాలు జరిగాయి. మోర్బిలో వేలాడే వంతెన కూలిపోవడంతో 135 మంది మరణించారు. ఉత్తరకాశీ టన్నెల్‌లోకి ప్రవేశించిన తర్వాత 41 మంది కార్మికులు 17 రోజుల పాటు చిక్కుకుపోయారు. దీనికి తోడు.. దేశంలో సురక్షితమైన ఇంటర్నెట్ లోపం కారణంగా.. 2024 మొదటి తొమ్మిది నెలల్లో “డిజిటల్ అరెస్టులకు” సంబంధించిన మోసాలు రూ.1616 కోట్ల విలువైన నష్టాలను చూశాయి.
దేశంలో సురక్షితమైన ఇంటర్నెట్ లోపం
ఏడాది క్రితం చట్టం ఆమోదించబడినప్పటికీ డిజిటల్ డేటా రక్షణ నియమాలు నోటిఫై చేయలేదు. ఇవన్నీ మోదీ ప్రభుత్వంపై కేవలం విమర్శలు మాత్రమే కాదు. ఇది మోదీ ప్రభుత్వం ఎదుర్కుంటున్న సవాళ్లు కూడా. మూడో టర్మ్‌లో ఆరు మాసాలు దాటిపోయిన కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం, వీటన్నింటిపై ఇప్పుడు ధ్యాస పెట్టాల్సి ఉంది. మరి, ఈ కొత్త సంవత్సరంలో మోదీ ఈ సమస్యలను పరిష్కరిస్తారో లేదో చూడాలి.