Kiran Abbavaram : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vija Devarakonday) తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda). అతి తక్కువ కాలంలోనే ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఆయన నెక్స్ట్ మూవీ గురించి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు విజయ్ దేవరకొండ వరుస డిజాస్టర్లు అందుకుంటుంటే, మరోవైపు తమ్ముడు ఆనంద్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ కూడా చేజార్చుకున్నాడనే బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ (Baby) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దాదాపు 100 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా, వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ‘బేబీ’ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ ఇదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ కొత్త సినిమాను ప్రకటించారు. ఆ సినిమా ద్వారా ప్రవీణ్ నంబూరి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్కేఎన్యం, సాయి రాజేష్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది.
ఈ మూవీని 2023లోనే లాంచనంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసి దాదాపు ఏడాది గడిచిపోయింది. అయినప్పటికీ ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కొట్టేసాడని టాక్ నడుస్తోంది. టాలీవుడ్ లో సర్క్యులేట్ అవుతున్న రూమర్ల ప్రకారం, ఈ ప్రాజెక్టులో ఆనంద్ దేవరకొండ స్థానంలో కిరణ్ అబ్బవరంను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు ఆలస్యం కావడంతో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
ఇక ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్న మరో ప్రాజెక్ట్ లో ఈ జంట భాగం కాబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆనంద్ తప్పుకున్న ప్రాజెక్ట్ లో మేకర్స్ హీరోగా కిరణ్ అబ్బవరంను అనుకోగా, హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారని టాక్ నడుస్తోంది. దీనిపై నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా రీసెంట్ గా ‘క’ మూవీతో కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా, విశ్వ కరుణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దిల్రూబా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాను జోజో జోష్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా, ఇంటెన్స్ లవ్ స్టోరీ గా మూవీ రూపొందుతోంది.