BigTV English

Mini Sun On Earth: భూమిపై తొలిసారిగా మినీ సన్.. ఈ కృత్రిమ సూర్యుడితో ఏం చేయనున్నారు..?

Mini Sun On Earth: భూమిపై తొలిసారిగా మినీ సన్.. ఈ కృత్రిమ సూర్యుడితో ఏం చేయనున్నారు..?

దక్షిణ ఫ్రాన్స్‌లో నిర్మిస్తున్న ITER ప్రాజెక్టు

టెక్నాలజీ పరంగా భారత్ అగ్రదేశాలకు పోటీగా నిలబడింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే, అంతర్జాతీయ సహకార కార్యక్రమాల్లో భారత్ భాగస్వామ్యం కోసం అగ్రదేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి. అందుకే, అమెరికాలో కొత్త ప్రెసిడెంట్ వచ్చీ రాగానే భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పలికారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్విటేషన్‌తో.. అమెరికా వయా ఫ్రాన్స్ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకున్న భారత్ ప్రధాని… ఫ్రాన్స్‌లో ఒక చారిత్రక కార్యక్రమాన్ని కూడా సందర్శించారు. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కీలకమైన అంశాన్ని చర్చకు పెట్టింది.


భూమిపై మొట్టమొదటి “మినీ సన్” అభివృద్ధి

ఈ జర్నీలో మోడీ ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి.. దక్షిణ ఫ్రాన్స్‌లోని అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్-ITER ప్రాజెక్టును సందర్శించారు. “ది వే” అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా.. భూమిపైన ‘మినీ సూర్యుణ్ని’ సృష్టిస్తున్నారు. అవును, నిజం. అంతరిక్షంలో భగ భగ మండే సూర్యుడి శక్తి లాంటి అత్యున్నత శక్తిని ఇక్కడ సృష్టిస్తున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా పారిశ్రామిక స్థాయిలో న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. అందుకే, ఈ ప్రాజెక్ట్‌తో.. భూమిపై మొట్టమొదటి “మినీ సన్” అభివృద్ధి జరుగుతోందనేది ఆసక్తిని రేపుతోంది. ఈ ప్రదేశాన్ని ప్రధాని మోడీ సందర్శించిన తర్వాత ఈ ‘కృత్రిమ మినీ సూర్యుడి’పై మరింత చర్చ జరుగుతోంది.

సూర్యుడు, నక్షత్రాలకు శక్తినిచ్చే న్యూక్లియర్ ఫ్యూజన్

నిజానికి, సూర్యుడు, నక్షత్రాలకు శక్తినిచ్చే న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని ఉపయోగించడమే ITER ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రక్రియ ద్వారా స్థిరమైన, కార్బన్-ఉద్గారరహిత క్లీన్ ఎనర్జీని సృష్టించాలని ఎంతో కాలంగా ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. కాగా, ఫ్రాన్స్ నేలపై తలపెట్టిన ఈ ప్రపంచ ప్రాజెక్ట్‌లో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చులో 10% వాటా.. అంటే, రూ.17 వేల 500 కోట్లు భారతదేశం ఖర్చు చేస్తోంది. ఇది మాత్రమే కాదు.. ఈ ప్రత్యేకమైన రియాక్టర్‌లోని అతిపెద్ద భాగమైన రిఫ్రిజిరేటర్‌ను కూడా భారతదేశమే అందిస్తోంది. అంటే, ఈ ప్రాజెక్ట్‌లోని కీలక, ప్రధాన మిషిన్‌పై ‘మేడ్ ఇన్ ఇండియా’ స్టాంప్ కనిపిస్తుంది.

500 MW న్యూక్లియర్ ఫ్యూజన్ శక్తి ఉత్పత్తి చేసే టోకామాక్

ఈ ITER ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని కాడరాచే ప్రాంతంలో నిర్మాణ స్థాయిలో ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా మొదటి ప్లాస్మాను సృష్టించాలని భావిస్తున్నారు. ఇక, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి, పనిచేయడం ప్రారంభించగానే.. ITER దాని ఫ్యూజన్ ప్రతిచర్యను మొదలుపెట్టడానికి, ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేసే మొదటి భారీ-స్థాయి ఫ్యూజన్ రియాక్టర్ కావాల్సి ఉంది. ఇక, ప్రపంచంలోనే అతిపెద్ద టోకామాక్ అనే అయస్కాంత ఫ్యూజన్ పరికరాన్ని అసెంబుల్ చేయడంతో సహా, మండుతున్న ప్లాస్మాను సృష్టించి, దాన్ని నియంత్రించి, చివరికి 500 మెగా వాట్ల న్యూక్లియర్ ఫ్యూజన్ శక్తిని ఉత్పత్తి చేసే అయస్కాంత ఫ్యూజన్ పరికరం పని ఇప్పటికే పూర్తయ్యింది.

మొదటిసారిగా 2006లో పారిస్‌లోని ఎలిసీ ప్యాలెస్‌లో..

ఇక, ఈ ప్రాజెక్ట్‌ని ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసి సందర్శించి, ప్రశంసించారు. ఈ ITER ప్రాజెక్ట్‌ను ఒక దేశాధినేత సందర్శించడం అనేది ఇదే మొదటిసారి కావడంతో ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి నెలకొంది. నిజానికి, ITER ప్రాజెక్ట్‌ను మొదటిసారిగా 2006లో పారిస్‌లోని ఎలిసీ ప్యాలెస్‌లో అమెరికా, యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాలు కలిసి అంగీకరించాయి. కాగా.. ఇప్పుడు, ఈ ప్రయత్నంలో 33 దేశాలు సహకరిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్న ఏడు ITER సభ్యుల్లో భారత్ కీలక సభ్యదేశంగా ఉంది.

200 మంది భారతీయ శాస్త్రవేత్తలు, సహచరుల సహకారం

దాదాపు 200 మంది భారతీయ శాస్త్రవేత్తలు, సహచరులు.. అలాగే L&T, Inox India, TCS, TCE, HCL టెక్నాలజీస్ వంటి ప్రముఖ పరిశ్రమల ITER ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాయి. 1985లోనే ఈ అంతర్జాతీయ ఉమ్మడి ప్రయోగం అనే ఆలోచన మొదలయ్యింది. అలా అనుకున్నప్పటి నుండి వేలాది మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ITER రూపకల్పనలో తమ వంతు పని మొదలుపెట్టారు. తర్వాత, ITER సభ్యులంతా కలిసి, ITER ఎక్స్‌పెరిమెంటల్ పరికరాన్ని నిర్మించడానికి, నిర్వహించడానికి దశాబ్దాలుగా సహకారం అందిస్తున్నారు.

2034లో శాస్త్రీయ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ITER ప్రాజెక్ట్ 2034లో శాస్త్రీయ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే, 2036లో డ్యూటెరియం ప్లాస్మాలపై, పూర్తి అయస్కాంత శక్తితో పని మొదలౌతుందని అనుకుంటున్నారు. నిజానికి, ఈ ప్రాజెక్ట్ అసలు ప్లాన్‌తో పోలిస్తే ఇది మూడు సంవత్సరాల ఆలస్యం అయ్యింది. అయినప్పటికీ, దీని సంబంధిత ఫ్యూజన్ ఇంధనం డ్యూటెరియం-ట్రిటియంతో ఆపరేషన్ 2039లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

2039లో ప్రారంభం అసలు ఆపరేషన్ ప్రారంభం

ఇప్పటికే, భారత్, ఫ్రాన్స్‌లు అధునాతన అణు రియాక్టర్లపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. అత్యాధునిక అణు సాంకేతికతపై ఇండో-ఫ్రెంచ్ సహకారానికి పెద్ద ప్రోత్సాహకంగా, ప్రధాని మోడీ తాజా పర్యటనలో సంతకం చేసిన మూడు అణు ఒప్పందాలలో ఇది ఒకటి. ఇందులో భాగంగా.. రెండు దేశాలు సంయుక్తంగా కొత్త తరం అధునాతన అణు రియాక్టర్లను అభివృద్ధి చేయడానికి అంగీకరించాయి.

గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్టనర్‌షిప్ (GCNEP)

ఇక, పౌర వినియోగం కోసం అధునాతన మాడ్యులర్ రియాక్టర్లు, మినీ మాడ్యులర్ రియాక్టర్లను నిర్మించడంలో భాగస్వామ్యం కావాలని కూడా రెండు దేశాలు నిర్ణయించాయి. “ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లడానికి, న్యూక్లియర్ ఎనర్జీ ఇంధన కలయికలో ఇది ముఖ్యమైన భాగమని ప్రధాని మోడీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. ఇక, తాజాగా సంతకం చేసిన మూడు అవగాహన ఒప్పందాల్లో అధునాతన మాడ్యులర్ రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్లను త్వరలోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

భారత్ అణుశక్తి విభాగం, ఫ్రాన్స్‌ CAE మధ్య అవగాహన ఒప్పందం

గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్టనర్‌షిప్-GCNEPతో సహకారానికి సంబంధించి, ఇప్పటికే… భారత్ అణుశక్తి విభాగం, ఫ్రాన్స్‌లోని CAE మధ్య ఒక అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించారు. అలాగే, భారతదేశానికి చెందిన GCNEP, ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య సహకారంపై DAE, CEA మధ్య కూడా ఒప్పందం ఉంది. వీటి ప్రకారం, త్వరలోనే కీలక దశకు సంబంధించిన పని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

మొత్తం ఖర్చు దాదాపు 22 బిలియన్ యూరోలు

ప్రపంచానికి అపరిమితమైన క్లీన్ ఎనర్జీ సరఫరాను అందించడానికి ఈ ప్రాజెక్ట్ ప్రయత్నిస్తుంది. దీని మొత్తం ఖర్చు దాదాపు 22 బిలియన్ యూరోలకు పైగా ఉంటుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత భారత్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని 100% పొందునుంది. నిజానికి, ఈ ప్రాజెక్ట్.. భారత్ పాల్గొంటున్న అత్యంత ఖరీదైన మెగా-సైన్స్ ప్రాజెక్ట్‌. అలాగే, ప్రపంచవ్యాప్తంగా, ITER అనేది భూమిపైన 21వ శతాబ్దంలో చేపట్టబోయే అత్యంత ఖరీదైన సైన్స్ ప్రాజెక్ట్‌గా కూడా గుర్తింపు పొందింది. ఇంత భారీ ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన రియాక్టర్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజిరేటర్‌ను భారత్ తయారుచేయడం గర్వించాల్సిన అంశం.

మిగిలిన సభ్య దేశాలు 9.1% ఖర్చు

ఈ రిఫ్రిజిరేటర్‌ను గుజరాత్‌లోని లార్సెన్ & టూబ్రో రూపొందించింది. దీని బరువు ఏకంగా 3 వేల 800 టన్నులకు పైగా ఉంటుంది. అంటే, కుతుబ్ మినార్ ఎత్తులో దాదాపు సగం అనమాట. కాగా, ఈ భారీ ప్రాజెక్ట్ కోసం, భారతదేశం “ఇన్-కన్డ్” మెటీరియల్‌ను కూడా అందించింది. ఇక, ఈ మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 45% యూరోపియన్ యూనియన్ భరిస్తుండగా.. మిగిలిన సభ్య దేశాలు 9.1% ఖర్చును పంచుకుంటున్నాయి. అలాగే, 45 కి పైగా దేశాల నుండి పది లక్షలకు పైగా విభిన్న భాగాలను సేకరిస్తున్నారు.

ప్రాజెక్ట్‌ను ముందుగా 2021 నాటికి పూర్తయ్యేలా ప్లాన్

ఫ్రాన్స్‌లో నిర్మిస్తున్న ఈ మినీ సూర్యుడి ప్రాజెక్ట్‌ను ముందుగా 2021 నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. భారత్ సహా అమెరికా, చైనా, రష్యా, దక్షిణకొరియా, ఈయూ, జపాన్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఒసామూ మోటోజిమా నేతృత్వంలో సంయుక్తంగా దీనిపై కృషిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా, 2014లో 800 మంది శాస్త్రవేత్తలు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమై ప్రణాళికలు రూపొందించారు. సూర్యుడిలో నిరంతరం మండుతూ ఏవిధంగా వేడి ఉత్పన్నమవుతుందో అటువంటి ప్రక్రియను ఈ అణురియాక్టర్‌లో జరిపి, దాని నుండి విడుదలైన వేడితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుంబిగించారు.

ఈ స్వచ్ఛమైన విద్యుత్‌ నుంచి ఎలాంటి వ్యర్థాలు వెలువడవు

దశాబ్దాలుగా ఎదురుచూసి, నిర్మించాలనుకున్న మొట్టమొదటి “న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్” ఇది. ఈ రియాక్టర్ ప్రక్రియ ద్వారా వెలువడే శక్తితో తయారు చేసే విద్యుత్ స్వచ్ఛమైన విద్యుత్‌. అంటే, దీని నుంచి ఎలాంటి వ్యర్థాలు రావు. అందుకే, ఇది పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీ అనమాట. అంతేకాదు, దీన్ని నియంత్రించడం కూడా చాలా సులభం. దీని నుండి ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉండదు. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఎంత త్వరగా పూర్తైతే అంత మంచిదని దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి.

న్యూక్లియర్ విద్యుత్ అనేది ఒక పదార్థంలోని..

అయితే, న్యూక్లియర్ ఎనర్జీ.. అంటే అసలేంటో చూద్దాం. న్యూక్లియర్ ఎనర్జీ.. న్యూక్లియర్ విద్యుత్ అనేది ఒక పదార్థంలోని అణువుల కేంద్రకాలను పట్టుకొని ఉండే ఒక శక్తి. ఇక, అణువులు అంటే పదార్థాన్ని విడగొడుతూ పోతే, చివరికి మిగిలే అతి సూక్ష్మమైన కణాలు. అయితే, ప్రతి అణువుకు ఒక కేంద్రం ఉంటుంది. వీటిలోనే న్యూక్లియర్ ఎనర్జీ.. అంటే అణు శక్తి దాగి ఉంటుంది. కొన్ని రేడియో ధార్మిక పదార్థాలకు సంబంధించిన కొన్ని అణువులు ఈ శక్తినంతటినీ దాచుకోకుండా కొంత భాగాన్ని రేడియేషన్ రూపంలో బయటకు వెదజల్లుతూ ఉంటాయి. అయితే, ఈ అణుశక్తిని వెలికితీయడానికి ప్రధానంగా రెండు పద్దతులున్నాయి.

సూర్యుడి నుంచి వేడి పుట్టేది న్యూక్లియర్ ఫ్యూజనేతోనే

ఒకటి కేంద్రక విచ్ఛిత్తి.. మరొకటి, కేంద్రక సంలీనం. కేంద్రక విచ్ఛిత్తి అంటే ఒక అణువును రెండుగా విడగొట్టడం. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే రెండు అణువులను కలిపి ఒక అణువును తయారు చేయడం. ఈ రెండు పద్దతుల్లోనూ అమితమైన శక్తి విడుదలౌతుంది. ఈ ప్రక్రియ ప్రకృతి సిద్ధంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు, సూర్యుడి నుంచి వేడి పుట్టడానికి న్యూక్లియర్ ఫ్యూజనే కారణం. అణు విద్యుత్ కేంద్రాల్లో అణు విచ్చిత్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కాగా, ఈ రెండూ ప్రక్రియలను అణ్వాయుధాల తయారీలో కూడా వాడతారు. అందుకే, చైనా తయారు చేస్తున్న సరిగ్గా ఇలాంటి కృత్రిమ సూర్యుడి గురించి ఆందోళనలు కూడా వస్తున్నాయి.

చైనాలోని మియాన్యాంగ్‌ సిటీలో భారీ ఎత్తున..

చైనాలోని నైరుతి ప్రాంతంలో ఉన్న మియాన్యాంగ్‌ సిటీలో భారీ ఎత్తున లేజర్-ఇగ్నిటెడ్ న్యూక్లియర్ ఫ్యూజన్ పరిశోధన కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. దీనిని, అధునాతన పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా.. అణ్వాయుధాల పరిశోధనా, తయారీని మెరుగు పరచడానికి కూడా వాడే అవకాశం ఉందనీ నిపుణులు భావిస్తున్నారు. అయితే, చైనా రహస్యంగా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడం.. ఆధునిక అణు పరిశోధనల్లో చైనా ఎంత విస్తృతంగా పనిచేస్తుందో తెలియజేస్తుంది. సాంప్రదాయ అణు పరీక్షలు అవసరం లేకుండా.. అణ్వాయుధ కేంద్రాన్ని బలోపేతం చేసే ప్రయోగాలకు చైనా సిద్ధమవుతోందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

అణు విద్యుత్తు కోసమే వినియోగిస్తుందా అనే డౌట్లు

అయితే, ఈ ఫెసిలిటీని.. అణ్వాయుధాల అభివృద్ధి కోసం వాడుతుందా.. లేదంటే, అణు విద్యుత్తు కోసమే వినియోగిస్తుందా అనేది అంతుబట్టడం లేదు. ఈ అనుమానం ఎందుకొచ్చిదంటే.. మియాన్యాంగ్‌లో ఉన్న ఈ ఫెసిలిటీ.. అణ్వాయుధాల రూపకల్పనకు కూడా వాడుకోడానికి అనువుగా ఉంది. ఇక్కడున్న లేజర్-ఇగ్నిటెడ్ ఫ్యూజన్‌లో ఉపయోగించే టెక్నాలజీ.. న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించకుండానే అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి, శుద్ధి చేయడానికి పనికొస్తుంది. అందుకే, తాజాగా దీనికి సంబంధించిన ఫెసిలిటీ గురించి శాటిలైట్ చిత్రాలు బయటపడిన తర్వాత ప్రపంచం విస్తుపోయింది.

ITER నుండి విద్యుత్ పుట్టించడంలో అణు రియాక్టర్ కీలకం

అయితే, ఫ్రాన్స్‌లో నిర్మిస్తున్న ITER-ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ నుండి కేవలం అణు విద్యుత్‌ను మాత్రమే సృష్టించనున్నారు. ఈ ప్రక్రియలో విద్యుత్ పుట్టించడంలో అణు రియాక్టరు కీలకంగా ఉంది. ఇందులో నుండే అణు విచ్ఛిత్తి పద్ధతి ద్వారా అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ రియాక్టర్‌లోనే అణు విచ్ఛిత్తి జరుగుతుంది. ఒక అణువు కేంద్రకాన్ని చిన్న భాగాలుగా విడగొట్టే ప్రక్రియ ద్వారా అణు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. అలాగే, న్యూక్లియర్ ఫ్యూజన్‌ ప్రక్రియలో భాగంగా.. రెండు పరమాణువుల్లోని కేంద్రకాలను ఒకే ఒక కేంద్రంగా కలుపుతారు.

అణు విచ్ఛిత్తి పద్ధతి ద్వారా అణు విద్యుత్‌ను ఉత్పత్తి

ఈ ప్రక్రియ ద్వారా అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే.. రెండు చిన్న పరమాణువుల కేంద్రకాలు సంలీనం చెంది, ఒకే ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో విచ్ఛిన్నమైన ద్రవ్యరాశి ఎనర్జీగా పుడుతుంది. సరిగ్గా, ఇలాంటి కేంద్రక సంలీన చర్య సూర్యుడిలో కూడా నిరంతరం జరుగుతుండటం వలన ఎనర్జీ అనంతంగా పుడుతూనే ఉంటుంది. ఈ చర్యలో రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం అణువుగా ఏర్పడుతూ అనంత శక్తి వస్తూనే ఉంటుంది. కాబట్టి, చైనా తయారుచేసే సూర్యుడిలా… ఈ మినీ సూర్యుడు కూడా ఇన్ఫినిటీ ఎనర్జీని సృష్టిస్తుంది.

ITERలో భారత్ తక్కువ మానవ వనరుల కేటాయింపు

అయితే, ITERలో భారతదేశం పాల్గొనడం గొప్ప సంగతే అయినప్పటికీ.. ఇక్క ఒక ఆందోళన కూడా లేకపోలేదు. ఫ్రాన్స్‌లో నిర్మిస్తున్న ITERలో భారత్ తక్కువగా మానవ వనరులను కేటాయిస్తోంది. ఒక ఒప్పందం ప్రకారం, అక్కడ సభ్యులుగా ఉన్న ప్రతి దేశం 10% వరకు సిబ్బందిని అందించాలి. అందులో భాగంగా, భారత్ తన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలలో దాదాపు 100 మందిని ITERలో పనిచేయడానికి పంపించాలి. కానీ, ఇక్కడ ప్రస్తుతం 25 నుండి 30 మంది భారతీయులు మాత్రమే పనిచేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

ITERలో ప్రస్తుతం 25 నుండి 30 మంది భారతీయులు పని

యువ భారతీయ ఇంజనీర్లు కలిసి తయారు చేస్తున్న ఈ మిలియన్ ముక్కల భారీ పజిల్ లాంటి మినీ సూర్యుడి తయారీలో సంక్లిష్టతలను భారతదేశం కంప్లీట్‌గా నేర్చుకోవాలంటే.. పూర్తి స్థాయి సిబ్బందిని పంపించడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించి అన్ని విభాగాల్లో భారతీయులు ఉన్నప్పుడే.. భారతదేశం నిస్సందేహంగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన డ్రాయింగ్‌లు, బ్లూప్రింట్‌లు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ, అది చేయాలంటే.. సిబ్బంది సంఖ్యను పూర్తిగా భర్తీ చేయాల్సిందే. అలా చేయకపోవడం ద్వారా.. చైనా వంటి దేశాలు అదనపు సిబ్బందిని పంపించడానికి భారతదేశమే అవకాశం కల్పించినట్లు అవుతుంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×