YCP: అక్రమ మైనింగ్, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ నేతృత్వంలో ఏకంగా ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగి కాకాణి కోసం గాలిస్తున్నాయి. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయంట. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలోనే ఉన్నారు. కాకాణి దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులు, సీ పోర్టులకు సమాచారం ఇచ్చారు. తాజాగా కాకాణి ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించడం ఆయన అరెస్టు ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది.
అక్రమ మైనింగ్ కేసులో ఏ-4గా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలోని పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం మైన్స్ మైనింగ్.. వ్యవహారంలో ఏ4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్‌ను కాకాణి అండ్ బ్యాచ్ ఎగుమతి చేశారని అభియోగాలు నమోదయ్యాయి. ఆ క్రమంలోవిదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమ మైనింగ్‌పై ఫిబ్రవరి 16న పోలీసులు కేసు నమోదు
నెల్లూరులో అక్రమ మైనింగ్‌పై ఫిబ్రవరి 16న పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా కాకాణికి మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే మాజీ మంత్రి విచారణకు హాజరు కాకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. తాను తప్పించుకోవడం లేదని, పోలీసులకు సహకరిస్తానని ఓవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే పోలీసుల కన్నుగప్పి పరారీలోనే ఉంటున్నారు. మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కాకాణి విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగతంగా కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ప్రతీసారి అక్కడ ఆయన లేకపోవడంతో పోలీసులు ఆయన బంధువులకు ఇస్తున్నారు.
కాకాణిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
అక్రమ మైనింగ్ కు పాల్పాడ్డారన్న ఆరోపణలతో పాటు కాకాణిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. క్వార్జ్ అక్రమంగా తరలించి సుమారుగా 250 కోట్ల రూపాయల అవనీతికి పాల్పడ్డారు అన్నది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై పోలీసులు నమోదు చేసిన అభియోగం. ముచ్చటగా మూడోసార్లు నోటీసులు అందజేసినా ఆయన నుంచి విచారణకు సహకరిస్తున్న పరిస్థితులు కనిపించలేదు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డిని కక్ష సాధింపు చర్యలో భాగంగా వేధిస్తున్నారంటూ నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టి విమర్శిస్తున్నారు. మరి ఆయన ఎక్కడున్నారో మాత్రం చెప్పడం లేదు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ కార్యక్రమానికి హైదరాబాదులో ఉన్న సమయంలో నెల్లూరులో ఉన్న నివాసానికి వెళ్లి నోటీసులు గోడలకు అంటించి హడావిడి చేశారని. ఆయన ఉన్నన్ని రోజులు పోలీసులు మౌనంగా ఉండి ఆయన లేనప్పుడు హడావిడి చేయడం ఏంటని కూడా వైసీపీ నేతలు పోలీసుల తీరుపై మండి పడుతున్నారు. విచారణకు హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని చెపుతుండటంతో కాకాణిని అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కాకాణి దేశం విడిచిపెట్టి వెళ్లకుండా లుక్‌అవుట్ నోటీసులు
కాకాణికి, ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు ఉండటం కాకాణిపై కేసులకు మరో కారణంగా వైసిపి జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కేసు నుంచి బయట పడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలోనే ఉన్నారు. కాకాణి దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులు, సీ పోర్టులకు సమాచారం ఇచ్చారు. అదలా ఉంటే బుధవారం కాకాణి ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అలాగే క్వాష్ పిటీషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరి ఇప్పటికైనా ఆయన అజ్ఞాతం వీడి బయటకు వస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read: విశాఖ వైసీపీ నేతలకు జాక్
హైదరాబాద్, బెంగళూరు, చెనై, విజయవాడల్లో లభించని ఆచూకీ
మరోవైపు కాకాణి కోసం కొన్ని పోలీసు బృందాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ ప్రాంతాల్లోనూ తిరిగినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదట. దీంతో ఆయన వ్యవహార శైలి పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి, ఎలాంటి అరెస్టులకు, కేసులకు భయపడేది లేదని ప్రకటనలు గుప్పించిన ఆయన నేడు పోలీసుల విచారణకు తప్పించుకొని తిరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
కాకాణి సుప్రీం కోర్టుని ఆశ్రయించే అవకాశం
నిత్యం అధికార పార్టీ నేతలపై సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ ఉండే కాకాణి గడిచిన వారం రోజులుగా ఒక్క మెసేజ్ కూడా పెట్టకపోవడం గమనార్హం. ఈ కేసులో పోలీసుల చర్యలను నిలుపుదల చేయలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారన్న చర్చ జోరుగా సాగుతుంది. మొత్తమ్మీద కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యవహారం సింహపురిలో హాట్‌టాపిక్‌గా మారిందిప్పుడు.