Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మహిళ 50 కిలోల కేటగిరీలో వినేష్ ఫోగట్ పోటీ పడింది. ఫైనల్ మ్యాచ్ వరకు అద్భుతంగా రాణించింది. స్వర్ణం లేదా రజతం పక్కా అనే భారతీయులందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ రోజు ఆమెపై అనర్హత వేటు పడింది. 50 కిలోల కన్నా సుమారు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నదని డిస్‌క్వాలిఫై చేశారు. ఈ వార్త 140 కోట్ల భారతీయుల మనసును కలచివేయడమే కాదు.. వినేష్ గతంలో చేసిన ఆందోళనల నేపథ్యంలో రాజకీయ కుట్ర అనుమానాలను రేపింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్‌గా బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఉన్నప్పుడు ఆయనపై మహిళా క్రీడాకారుణులు లైంగిక ఆరోపణలు చేశారు. మెంటల్‌గానూ టార్చర్ పెడుతున్నారని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేశారు. యాక్షన్ లేకపోవడంతో ఢిల్లీలో ధర్నాకు దిగారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ సహా పలువురు మల్లయోధులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేశారు. ఈ ఆందోళనల్లో పోలీసులు వారిని రోడ్డుపై నుంచి లాక్కెళ్లిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనాన్ని రేపాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు రావట్లేదని బాధపడుతూ నిరసనగా తమ పతకాలను నదిలో నిమజ్జనం చేయడానికీ ప్రయత్నించారు.
ఇక ప్రస్తుతానికి వస్తే.. పారిస్ ఒలింపిక్స్‌లో రాణించిన వారిని ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌లో పలకరిస్తున్నారు. అభినందిస్తున్నారు. ఫైనల్‌కు చేరనందుకు, లేదా ఓడినందుకు ఓదార్చారు. ఫైనల్‌కు చేరిన వినేష్ ఫోగట్‌కు మోదీ ఫోన్ చేస్తారా? చేసి అభినందిస్తారా? కొన్ని నెలలపాటు దేశంలో రోడ్డెక్కినా పట్టించుకోలేదని ఆరోపణలున్న ప్రధాని మోదీ ఆమె విజయాన్ని స్వీకరిస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఫైనల్ మ్యాచ్‌కు ముందే చక్కర్లు కొట్టాయి.
Also Read: BRS Party: బీజేపీలో విలీనం లేదు? కేటీఆర్ మాస్ వార్నింగ్ వెనుక అర్థమేంటీ?
కానీ, ఎవరూ ఊహించని రీతిలో వినేష్ ఫోగట్ అనర్హతకు గురయ్యారు. ప్రధాని మోదీ స్వయంగా ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉషాకు ఫోన్ చేసి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ అనర్హత నుంచి తప్పించుకోవడానికి ఏమైనా అవకాశాలున్నాయా? అని అడిగారు. లేదంటే వినేష్ పై అనర్హత నిర్ణయాన్ని బలంగా నిరసించాలని సూచించారు. పార్లమెంటులోనూ కేంద్రమంత్రులు ఆమె ప్రతిభను ప్రశంసించారు. ఆమె ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదని, ధైర్యంగా, గర్వంగా రావాలని పేర్కొన్నారు.
ఇక ఆరోపణల విషయానికి వస్తే.. మ్యాచ్ ఆడిన తర్వాత ఒకే రోజులో ఆమె రెండు కిలోల బరువు ఎలా పెరుగుతారు? అని కొందరు ప్రశ్నిస్తుండగా.. ఆమె బరువును నియంత్రణలో ఉంచడానికే కదా సపోర్ట్ టీమ్ ఉంది.. మరెందుకు ఆమె వెయిట్‌ను కంట్రోల్ చేయలేకపోయిందని నిలదీస్తున్నారు. వెయిట్ కంట్రోల్ చేయలేని స్థితిలో మన ఒలింపిక్ టీమ్ ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆమె బరువు పెరగడం వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? లేక అనర్హత వేటు పడటంలో ఏమైనా రాజకీయ ప్రమేయం ఉన్నదా? అనే అనుమానాలను పలువురు వ్యక్తపరుస్తున్నారు. ఆమె నిరసన ప్రదర్శనల నేపథ్యంలో ఈ అనుమానాలు రావడం సహజమే.
కాగా, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అదిల్లి సుమారివాలా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ‘అదొక క్రీడ, క్రీడ అన్నప్పుడు కొన్ని కచ్చితమైన రూల్స్ ఉంటాయి. ఆమె నిన్న విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత ఆమె తినడానికి అనుమతి ఉంటుంది. ఆమె బౌట్స్ మధ్యలో కూడా తిన్నది. ఎందుకంటే బౌట్‌లో ఆడటానికి ఆమెకు శక్తి కూడా అవసరమే. రాత్రికల్ల ఆమె వెయిట్ రెండు కిలోలు అధికంగా ఉన్నది. ఆమె వెయిట్ తగ్గించడానికి డాక్టర్లు, టీమ్ ఆమె వెంటే రాత్రంతా మెలకువతోనే ఉన్నది. ఆమె తల వెంట్రుకలు కూడా కొంత కట్ చేశారు. కానీ, కొన్ని గ్రాములను మాత్రం తగ్గించలేకపోయారు. ఇందులో కుట్ర ఏమీ లేదు’ అని పేర్కొన్నారు. ఇది పొరపాటేమీ కాదని, ఇది మానవ శరీరమని, సహజంగా ఇలాంటివి జరుగుతాయని తెలిపారు.
Also Read: హాట్ టాపిక్ గా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బొత్సకు గండి కొట్టేనా?
కాగా, బీజింగ్ ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ విజేందర్ ఈ ఘటనపై రియాక్ట్ అవుతూ.. ఆమె అనర్హత వెనుక కుట్ర ఉండొచ్చని, ఆమె బాధితురాలయిందని పేర్కొన్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా కుట్ర కోణాన్ని ప్రస్తావించాయి. ఆమె అనర్హత వెనుక కుట్ర ఉన్నా లేకున్నా ఆమె అనర్హత వేటుకు గురికావడం, ఫైనల్‌కు చేరుకుని ఒట్టి చేతులతో తిరిగి రావడం అందరినీ బాధిస్తున్నది. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలాంటి సందర్భంలో సహజమే కానీ, అవి తేలేవి కావు.
గోల్డ్ మెడల్ బౌట్‌లో అడుగుపెట్టిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మాత్రం వినేష్ రికార్డు సృష్టించింది. పతకం రాలేదన్న నిరాశ ఉన్నప్పటికీ ఆమె కోట్లాది మంది భారతీయుల ప్రేమను సంపాదించుకున్నది.