BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యేలను, తమ నాయకులను వేరే పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్లుతుండటంతో కేసీఆర్, కేటీఆర్ పలుమార్లు ఎమ్మెల్యేలతో సమావేశాలు జరిపారు. పార్టీలోనే ఉండాలని, మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. ఫిరాయింపులు ఆగలేవు. మరోవైపు అనర్హత భయాన్ని కలిగించేలా హైకోర్టులో బలంగా కొట్లాడుతున్నారు. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈ రోజే వాదనలు ముగిశాయి.
కాగా.. వచ్చే ఎన్నికల వరకు పార్టీ బలంగా నిలబడటానికి, ఎక్కడా రిలవెన్స్ కోల్పోకుండా ఉండటానికి ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం అండ కోరుకుంటున్నదని, బీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో విలీనం చేయాలనే ఆలోచనలు చేస్తున్నదని కొన్ని రోజులు వార్తలు వస్తున్నాయి. కేటీఆర్, హరీశ్ రావుల ఢిల్లీ పర్యటనల వెనుక ఇదే ప్రధానంగా ఉన్నదని, కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి, రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేయాలనే ప్రతిపాదనను కమలం పెద్దలపై ఉంచినట్టు ప్రచారం జరిగింది. ఎంపీలను బీజేపీలోకి పంపితే.. బీఆర్ఎస్‌కు అండగా ఉండాలనే ప్రతిపాదననూ ఉంచినట్టు వార్తలు వచ్చాయి.
బీఆర్ఎస్ నాయకులు ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ.. ప్రచారం ఆగడం లేదు. ఇటీవలే ఇందుకు సంబంధించిన వార్తా వీడియో చర్చనీయాంశమైంది. బీజేపీలో బీఆర్ఎస్ చేరుతుందని, కొందరు బీజేపీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారని, కానీ.. ఇది జరుగుతుందంటూ సదరు సీనియర్ జర్నలిస్టు చెప్పుకుంటూ పోయారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక ఉపేక్ష సరికాదన్న అభిప్రాయానికి వచ్చారో ఏమో కానీ.. ట్విట్టర్‌లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ఊరుకోబోమని దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను హెచ్చరించారు. బీఆర్ఎస్ పై అవాస్తవాలను అంగీకరిస్తూ వార్త ప్రచురించాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు సంసిద్ధంగా ఉండాలన్నారు.
Also Read: రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్
24 ఏళ్లు అకుంఠిత దీక్ష.. అనేక సవాళ్లు, కుట్రలు, దుష్ప్రచారాలు, ఎదురుదెబ్బలకు ఎదురొడ్డి నిలబడ్డామని కేటీఆర్ ట్వీట్ చేశారు. తాము అలసట లేకుండా పోరాడామని, రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధికి కేంద్రంగా పునర్నిర్మాణం చేశామని వివరించారు. మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కోట్లాది హృదయాలు ఒక్కటై ఆరాటపడింది ఈ తెలంగాణ కోసమే, అందుకే అది సాధ్యమైందని తెలిపారు.
గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్న బీఆర్ఎస్ ఇక పైనా అలాగే కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అవాస్తవ, నిరాధార ప్రచారాన్ని ఆపేయాలని హితవు పలికారు.
24 Years of Resilience and Devotion!
Against Hundreds of Saboteurs,
Standing up Against Thousands of Malicious Propagandists & Schemes!
For 24 Years!And yet, we prevailed. We fought tirelessly, and we achieved and built a state that has become a beacon of progress and pride. A…
— KTR (@KTRBRS) August 7, 2024
‘మేం పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం. కానీ, తలవంచం. ఎప్పటికైనా, ఎన్నటికైనా! జై తెలంగాణ!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దీంతో బీఆర్ఎస్ ఇకపైనా బీఆర్ఎస్‌గానే కొనసాగుతుందని, బీజేపీలో విలీనం చేస్తారనే వార్తలు పచ్చి అబద్ధాలని ఆయన తేల్చేశారు.