Visakhapatnam Municipal: వైసీపీ కార్పొరేటర్లు.. కొలంబో క్యాంపులో ఎంజాయ్ చేస్తున్నారు. కూటమి కార్పొరేటర్లు.. మలేషియాలో రిలాక్స్ అవుతున్నారు. వీళ్లంతా సరిహద్దులు దాటి సరదాగా గడిపేస్తుంటే.. ఏపీలో ఉన్న టీడీపీ, వైసీపీ నాయకులు మాత్రం అస్సలు తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ముఖ్యంగా.. విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై వైసీపీ ప్లాన్ ఏంటనేదే.. ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్నగా కనిపిస్తోంది. మరోవైపు.. అవిశ్వాస తీర్మానంలో అంతిమ విజయం మాదే అన్నట్లుగా కూటమి నేతలు కనిపిస్తున్నారు. అసలు.. వ్యూహం బెడిసికొడితే.. వైసీపీ దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? తమ కార్పొరేటర్లను కొలంబో నుంచి రప్పించే ఆలోచనలో ఉన్నారా?
విశాఖలో హీట్ రేపుతున్న జీవీఎంసీ మేయర్ వ్యవహారం
ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి.. ఇదే ప్రస్తుతం విశాఖ వైసీపీ నేతల పరిస్థితి. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఎప్పుడైతే.. జీవీఎంసీ మేయర్‌ని పదవిలో నుంచి దించేందుకు.. తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టిందో.. అప్పట్నుంచే అసలైన పొలిటికల్ గేమ్ మొదలైంది. ఈ అవిశ్వాస తీర్మానానికి ముందే.. వీలైనంత మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరేలా చేశారు. ఇంతలోనే అలర్టైన వైసీపీ.. తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లందరితో సమావేశం నిర్వహించింది.
వైసీపీని వీడే ప్రసక్తే లేదన్న 34 మంది కార్పొరేటర్లు
మేయర్‌పై అవిశ్వాస తీర్మానం విషయంలో.. అధికార పార్టీ ప్రలోభాలకు లోనై.. పార్టీ మారే అవకాశం ఉందా? లేదా? అని చర్చించి.. కార్పొరేటర్ల నుంచి క్లారిటీ తీసుకుంది. 34 మంది కార్పొరేటర్లు ముక్తకంఠంతో వైసీపీని వీడే ప్రసక్తి లేదనడంతో.. మరో ఆలోచన లేకుండా విశాఖ నుంచి బెంగళూరు క్యాంపుకు తరలించేశారు. వారి కుటుంబ సభ్యులను కూడా క్యాంపుకు పంపడంతో.. అంతా కలిసి సమ్మర్ టూర్ ఎంజాయ్ చేశారు.
మేయర్ పదవిని దక్కించుకోవాలనే ఆలోచనతో కూటమి
ఎలాగైనా విశాఖ మేయర్ పదవిని దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్న కూటమి.. వైసీపీ నుంచి తమ పార్టీలో చేరే కార్పొరేటర్లతో ముందే చర్చలు జరిపింది. పక్కా స్కెచ్ రెడీ చేసి అవిశ్వాస తీర్మానం పెట్టారు. తెలుగుదేశం కార్పొరేటర్లను కూడా మొదట భీమిలి క్యాంపునకు తరలించారు. అక్కడ వారం ఉంచిన తర్వాత.. కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లందరినీ.. నేరుగా మలేషియా క్యాంపుకు పంపారు. అలా.. వైసీపీ, కూటమికి చెందిన కార్పొరేటర్లు.. హ్యాపీగా సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటే.. రెండు పార్టీల నాయకులు విశాఖలో కంటిమీద కునుకు లేకుండా రోజులు గడిపేస్తున్నారు. తెలుగుదేశం అధిష్టానం.. విశాఖ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవలం చేసుకునే బాధ్యతలు అంతా తీసుకోవాలనే ఆదేశాలిచ్చింది.
విశాఖ జీవీఎంసీలో ఇప్పుడేం జరగబోతోంది?
వైసీపీకి చెందిన కార్పొరేటర్లు.. కూటమి పార్టీల్లో ఎందులో చేరినా ఫరవాలేదంటున్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసే వాళ్లు ఎక్కడున్నా సరే తీసుకురమ్మని చెప్పడంతో.. ఎమ్మెల్యేలు కూడా పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. మేయర్ పీఠం గెలిచేందుకు నలుగురు కార్పొరేటర్ల బలం కావాల్సి ఉండగా.. వైసీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు జనసేనలో చేరారు. దాంతో.. కచ్చితంగా అవిశ్వాస తీర్మానం నెగ్గుతామనే నమ్మకం కూటమిలో ఏర్పడింది. అయితే.. ఇది జరగాలంటే మరో ఓటు కావాల్సి ఉంది. కానీ.. మిగతా వైసీపీ కార్పొరేటర్లంతా శ్రీలంకలోని కొలంబో క్యాంపులో ఉన్నారు. మొత్తం 34 మంది కార్పొరేటర్లను బ్లాక్ చేసి పెట్టి.. అవిశ్వాస తీర్మానం వీగిపోయి.. మేయర్ పదవిలో తమ పార్టీనే కంటిన్యూ చేసేలా ప్లాన్ చేసింది. దాంతో.. విశాఖ జీవీఎంసీలో ఇప్పుడేం జరగబోతోందనేది మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.
అవిశ్వాస తీర్మానం నెగ్గుతామనే ధీమాలో కూటమి
ఇప్పటికే.. అవిశ్వాస తీర్మానం నెగ్గుతామనే ధీమాలో ఉన్న కూటమి.. తమకవసరమైన కార్పొరేటర్లను సామ,దాన,దండోపాయాలతో ఎలాగైనా వైసీపీ నుంచి రప్పించి.. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు పనిచేస్తోంది. మరోవైపు.. వైసీపీ కూడా రెండు ప్లాన్లని సిద్ధం చేసుకొని ముందుకు సాగుతోంది. గత జీవీఎంసీ ఎన్నికల్లో జీవీఎంసీ మేయర్ పీఠ గెలవడంలో విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన వైసీపీని వీడారు. ఇప్పుడు.. విశాఖ రాజకీయాల్లోకి బొత్స ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు.. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పారు.
ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కన్నబాబు
మరో మాజీ మంత్రి కన్నబాబును ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. దాంతో.. విశాఖ మేయర్ పీఠం జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత.. ఈ ముగ్గురిపైనే పడింది. ఏపీలో కీలకమైన గుంటూరు-విజయవాడ-విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లలో.. ఇప్పుడు వైసీపీ జెండానే ఎగురుతోంది. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లను కదిపితే.. రాజకీయంగా వివాదాలు తలెత్తుతాయని భావించిన కూటమి ప్రభుత్వం.. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ కార్పొరేషన్ మేయర్‌ని మారిస్తే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలం పెరుగుతుందనే లెక్కల్లో ఉన్నారు. అందుకోసమే.. అవిశ్వాస తీర్మానం పెట్టారనే చర్చ ఉంది.
రాబోయే ఎన్నికల్లో తమ బలం పెరుగుతుందనే ఆలోచన
వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరు నుంచి కొలంబో క్యాంప్‌కు పంపడంలో బొత్స కీలకంగా వ్యవహరించారు. 34 మంది కార్పొరేటర్లలో ఒక్కరు కూడా మిస్ అవకుండా.. దాదాపు నెలరోజులుగా గుడివాడ అమర్నాథ్ వారి కుటుంబ సభ్యులతో రోజూ టచ్‌లో ఉంటున్నారు. కార్పొరేటర్లలో అసంతృప్తి రేగకుండా.. వైసీపీ కీలక నాయకులంతా కార్పొరేటర్ల కుటుంబాలతో చర్చిస్తూ.. అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు గనక అవిశ్వాస తీర్మానం వీగిపోతే.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మళ్లీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని కార్పొరేటర్లలో మనోధైర్యం నింపుతున్నారు. వైసీపీ అధినేత జగనే.. మీ రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ అని చెబుతున్నారట.
తేడాకొడితే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటానే ఆలోచనలో వైసీపీ
దాంతో.. కొలంబోలో ఉన్న 34 మంది వైసీపీ కార్పొరేటర్లు.. అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పూర్తయ్యే దాకా విశాఖకు వచ్చే ప్రసక్తే లేదంటున్నారట. ఆ 34 మందిలో ఏ ఒక్కరైనా విశాఖకు చేరుకొని.. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే.. మేయర్ పీఠం కూటమి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అదే గనక జరిగితే.. మిగతా కార్పొరేటర్లతో ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటాలు చేస్తూ.. జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధమయ్యేలా ప్లాన్ చేసింది వైసీపీ. అవిశ్వాస తీర్మానం వీగిపోతే మేయర్ పీఠం నిలుస్తుంది. తేడాకొడితే.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామనే ఆలోచనతో ఉంది వైసీపీ నాయకత్వం. మరోవైపు.. కూటమి నేతలు మాత్రం జీవీఎంసీ మేయర్ పీఠాన్ని గెలిచి.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ధీమాగా వెళతామని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందనే దానిపై.. విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.