Prashant Kishor: పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ప్రస్థానం ముగిసినట్లేనా?. ఇటీవలి కాలం వరకూ దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పిన ఆ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం జరుగుతున్న కీలక రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఆయన వాయిస్ కూడా వినిపించకపోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ప్రత్యక్షమై.. ఏదో పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి.. ఆ పార్టీని గెలుపు బాటలో నడిపించి.. తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిషోర్ ఉనికి.. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కనిపించకపోవడంతో ఇక ఆయన శకం ముగిసట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
2014 ఎన్నికల్లో అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి ప్రచారంలో సలహాదారుడిగా పనిచేసి దేశవ్యాప్త గుర్తింపు పొంది, సెలబ్రిటీగా మారారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్. ఐ-పాక్ వ్యవస్థాపకుడిగా, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, వైఎస్ జగన్, స్టాలిన్ వంటి పలువురు నాయకుల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి రావడంలో పీకేగా ఫేమస్ అయిన ప్రశాంత్ కిషోర్ కీరోల్ పోషించారు. అప్పట్లో జగన్ సైతం అదే విషయం చెప్పి.. పీకేని ఘనంగా సత్కరించారు.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పనిచేయడానికి పీకే హైదరాబాద్ కూడా వచ్చి వెళ్లారు. అయితే సూచించిన సలహాలు, చెప్పిన వ్యూహాలు బీఆర్ఎస్ పెద్దలకు నచ్చలేదో? లేకపోతే డీల్ సరిగ్గా కుదరలేదో కాని పీకే ఆ పార్టీకి పనిచేయలేదు. ఇక 2024 ఎన్నికలకు ముందే ఏపీలో జగన్ చిత్తుగా ఓడిపోబోతున్నారని ప్రెస్‌మీట్లో వెల్లడించి కలకలం రేపారు. తీరా చూస్తూ అటు తెలంగాణలో బీఆర్ఎస్ హ్మాట్రిక్ విజయానికి దూరమైంది. ఇటు ఆంధ్రప్రవేశ్లో జగన్ ఆయన చెప్పినట్లుగానే చిత్తుగా ఓడిపోయి.. వైసీపీ 11 సీట్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది.
ఇక ఇతర పార్టీలకు చేసిన సేవలు చాల్లే అనుకున్నారో ఏమో పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇఛ్చారు, సొంత రాష్ట్రం బీహార్ ఎన్నికల ద్వారా నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కిశోర్.. అక్కడ జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగారు అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. కోటి మందికి పైగా సభ్యులున్న జన్ సురాజ్ పార్టీ, పది లక్షల ఓట్లను కూడా సంపాదించలేకపోయింది. పార్టీ పోటీ చేసిన 238 సీట్లలో 233 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
ఎన్నికలకు ముందు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ 25 సీట్లకు మించి గెలవదని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ పార్టీ 25 సీట్లకు మించి గెలిస్తే, తాను రాజకీయాలను విడిచిపెడతానని పీకే సవాల్ విసిరారు. తత్ఫలితంగా, ప్రశాంత్ కిషోర్ తన మాటకు కట్టుబడి రాజకీయాల నుండి రిటైర్ అవుతారా అన్న సందేహాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. దానికి తగ్గట్లే ఆయన పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు.
2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్నారు ప్రశాంత్ కిషోర్. కాని తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు. దాంతో అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చింది.. అనే సామెతలా తయారైంది జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పరిస్థితి అంటున్నారు.
ఐదేళ్ల క్రితం తమిళనాడులో డీఎంకేకు, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు పీకే వ్యూహకర్తగా పనిచేశారు. ఆయా పార్టీల విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు మాత్రం డీఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆయనను తమ పార్టీల దరికి కూడా రానీయడంలేదు. మీ సేవలు అవసరం లేదని మర్యాదగా చెప్పేశాయి. తమిళనాట కొత్తగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ టీవీకే పార్టీకి పీకీ ఎన్నికల వ్యూహాలు అందించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే విజయ్ కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహ సేవలకు నో చెప్పినట్లు టీవీకే వర్గాల చెబుతున్నాయి.
అదలా ఉంటే ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఐ-ప్యాక్ పై వెల్లువెత్తుతున్న అవినీతి, కుంభకోణాల ఆరోపణలకు కూడా ప్రశాంత్ కిశోర్ మౌనానికి కారణమని అంటున్నారు. ఈ అవినీతి, కుంభకోణం ఆరోపణల కారణంగానే ఆయన కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ తరఫునా ఎన్నికల వ్యూహాలు అందించేందుకు సాహసించలేకపోతున్నారన్నది పరిశీలకులు విశ్లేషణ. అయితే తెలంగాణలో కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కూడా ఎన్నికల వ్యూహాలు అందిస్తానని ప్రశాంత్ కిషోర్ అప్రోచ్ అయ్యారంట. ఆమెకు పాత పార్టీ టీఆర్ఎస్ పేరు ఆయనే సూచించారన్న టాక్ వినిపించిది. కాని కొత్త పార్టీతో పీకే అగ్రిమెంట్ కుదిరిందో లేదో క్లారిటీ లేదు.
అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ పీకేని ఆశ్రయించాలని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై వైసీపీ వర్గాలు నోరు విప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ స్ట్రాటజీలకు కాలం చెల్లిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సమాజంలో వర్గాల మధ్య, కులాల మధ్యా విభేదాల ద్వారా రాజకీయ లబ్ధి అన్నదే ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహాలనీ, అవి ఒకసారి ఫలించినా, జనం మరోసారి ఆ వ్యూహాలలో చిక్కుకోరని ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా నియమించుకోవడానికి సాహసం చేయడం లేదని చెబుతున్నారు. మొత్తానికి ఆ సెలబ్రటీ స్ట్రాటజస్ట్ పరిస్థితి అలా తయారైందిప్పుడు.
Also Read: తెలంగాణకు సూర్యుడి హెచ్చరిక.. ఆ నాలుగు రోజులు జాగ్రత్త
Story by: Apparao, Big Tv