రైలు ప్రయాణం చేయాలనుకున్న ఇద్దరు అన్నాదమ్ములకు జనరల్ బోగీలో సీటు దొరక్కపోవడంతో కోపంతో తలతిక్క ఆలోచన చేశారు. అనుకున్నదే ఆలస్యంగా అమలు చేశారు. ప్రయాణీకులందరినీ భయాందోళనకు గురి చేశారు. రైలు 40 నిమిషాలకు పైగా ఆలస్యం అయ్యేందుకు కారణం అయ్యారు. చివరకు పోలీసులు వారిద్దరినీ కటకటాల్లోకి పంపించారు. ఈ ఘటన యూపీలో జరిగింది. ఇంతకీ అసలు ఏమైందంటే..
లూథియానాలో మెకానిక్ గా పనిచేస్తున్న దీపక్ చౌహాన్, నోయిడాలోని ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న అతడి సోదరుడు అంకిత్ తాజాగా ఢిల్లీలో అమృత్‌సర్- కతిహార్ మధ్య నడిచే అమ్రపాలి ఎక్స్ ప్రెస్ లో ఎక్కారు. జనరల్ టికెట్ తీసుకోని రైల్లోకి అడుగు పెట్టారు. అయితే, వారు కూర్చునేందుకు సీటు లభించలేదు. రైలు ఉత్తరప్రదేశ్ లోని ఎటావాకు చేరుకున్న సమయంలో సీటు కోసం తోటి ప్రయాణీకులతో అన్నాదమ్ములు గొడవకు దిగారు. ఎలాగైనా రైల్లోని ప్రయాణీకులను భయపెట్టడంతో పాటు సీటు పొందేందుకు దీపక్, అంకిత్ ప్లాన్ వేశారు. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి రైలులో బాంబు ఉందని హెచ్చరించారు. వెంటనే అలర్ట్ అయిన రైల్వే పోలీసులు, బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బందితో కలిస కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకున్నారు. రైలును ఆపివేసి ప్రయాణీకులందరినీ కిందికి దించారు. రైల్లోని అన్ని కోచ్ లను 40 నిమిషాల పాటు చెక్ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో, రైలు బయలుదేరడానికి అనుమతించారు.
పెద్ద సంఖ్యలో పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో భయపడిన అన్నాదమ్ములు దీపక్, అంకిత్ తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. వారు రైలు ఎక్కకూడదని, కాన్పూర్ లోని ఫెయిత్ ఫుల్ గంజ్ లో దాక్కోవాలని నిర్ణయించుకున్నారు. బెదిరింపు కాల్ గురించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, కాల్ చేసిన సెల్ ఫోన్ ను కనుగొనడానికి ప్రయత్నించారు. కానీ, స్విచ్ ఆఫ్ కావడంతో గుర్తించలేకపోయారు. తాజాగా ఆ ఫోన్లను ఆన్ చేయడంతో పోలీసులు వారిని గుర్తించారు. ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అన్నాదమ్ములు ఇద్దరూ ఉత్తరప్రదేశ్ లోని ఘటంపూర్ కు చెందిన వారిగా వెల్లడించారు.
నిజానికి అన్నాదమ్ములు అయిన దీపక్, అంకిత్ కు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ, కేసు తీవ్రత దృష్ట్యా వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. “వారి మీద గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదు. కానీ, ప్రస్తుత కేసు తీవ్రత దృష్ట్యా, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా వారిని విచారిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది” అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆకాంక్ష పాండే వెల్లడించారు. రైల్వే ప్రయాణీకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదన్నారు. లేదంటే తీవ్ర ఇబ్బందులుపడే అవకాశం ఉందన్నారు.