‘బిలాంగింగ్.. ఏ జర్నీ ఆఫ్ లవ్’ సోనియా స్వయంగా రాసుకున్న తన ఆత్మకథ నేపథ్యంలో అప్పుడే జాతీయ స్థాయిలో కొత్త చర్చకు తెర తీసినట్టైంది. ఈ బుక్కు ఇంకా రిలీజ్ కాకముందే హైప్ క్రియేట్ అయ్యింది. కారణం.. స్వయంగా సోనియేఈ బుక్కుపై మాట్లాడి అంచనాలు మరింత పెంచారు.
ఆమె మాటల్లో ముఖ్యంగా.. ‘రాజీవ్‌గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టే సందర్భంలో తాను పూర్తిగా వ్యతిరేకించాన’ని చెప్పడం. ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలోనే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నదనే అంశాన్ని ఆమె పరోక్షంగా వెల్లడించారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు తాజా చర్చకు తెర తీశాయి.
2004 లో యూపీఎ అధికారంలోకి వచ్చిన సందర్భంగా సోనియానే ప్రధాని కావాల్సింది. కాని దీన్ని రాహుల్ అడ్డుకున్నారనే విషయం మళ్లీ చర్చకు తావిస్తోంది. ఇందిరా, రాజీవ్ తరహాలో తన తల్లికి కూడా ప్రాణహాని ఉంటుందనే భయం రాహుల్‌ను వెంటాడింది. అందుకే ఈ విషయంలో సోనియాను బలంగానే ఈ పదవి తీసుకోవద్దని వ్యతిరేకించారట రాహుల్.
తన మాట వినకపోతే.. తను కఠినమైన నిర్ణయం తీసుకుంటాననే విధంగా రాహుల్ హెచ్చరించడానికి కూడా వెనుకడుగు వేయలేదట. ఈ విషయాలను మాజీ విదేశాంగ మంత్రి కే నట్వర్ సింగ్ తన ఆత్మకథలో వెల్లడించారు. ఇవి ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అప్పటికే రాహుల్ తొలిసారిగా ఆమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అందుకే అతని పేరు కనీసం ప్రధాని పదవి రేసులో చర్చించడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఉన్నాయి.
అందుకే సోనియా.. ప్రధాని పదవికి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఆ తరువాత 2009లో మళ్లీ యూపీఏ-2 అధికారంలోకి వచ్చిన సందర్బంగా .. రాహుల్‌ను ప్రధాని చేసే అవకాశం వచ్చింది. కానీ రాహుల్ ఈ అవకాశాన్ని సుతిమెత్తగా తిరస్కరించారు. పదవుల కన్నా తనకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు పార్టీ యువశక్తిని రాజకీయంగా బలోపేతం చేయడం తన లక్ష్యంగా పెట్టుకున్నానని బాహాటంగానే వెల్లడించారు.
మధ్యలో కూడా మరోసారి రాహుల్‌కు ప్రధాని ఛాన్స్ వచ్చింది. మన్మోహన్‌సింగ్ తీవ్ర అనారోగ్యం కారణంగా తను పదవి నుంచి తప్పుకుందామని డిసైడ్ అయ్యారు. అప్పుడు రాహుల్ పేరును సూచించారు. సోనియా కూడా ప్రధాని పదవి విషయంలో రాహుల్ వైపే ఆమె చూపులున్నాయి. కానీ రాహుల్ మళ్లీ తిరస్కరించారు.
మన్మోహన్ తన ప్రధాని పదవిలో పూర్తికాలం ఉండాలని కోరుకున్నారు. ఆయన సీనియారిటీకి భంగం వాటిల్లొద్దని భావించిన రాహుల్.. ఆయననే ప్రధానిగా కొనసాగించారు. ఈ నేపథ్యాన్ని ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం.. గాంధీ వారసులకు ప్రధాని పదవులపై మక్కువ లేదని, దేశ ప్రజల కోసం త్యాగాలకు సైతం సిద్దంగా ఉంటారని ప్రకటించారు.
ఈ బుక్కు రిలీజ్ అయిన తరువాత మరిన్ని కొత్త అంశాలు వెలుగులోకి రావడం, కొత్త వివాదాలకు అది కేంద్ర బిందువుగా మారుతుందనడంలో సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.