కరువు సెగలు దేశ ప్రజలను తాకుతున్నాయి. రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇవాళ తమ వడ్లకు మద్దతు ధర పెంచి ఇవ్వాల్సిందేనని సూర్యపేటలో రైతులు రోడ్డెక్కారు. మహారాష్ట్రలో రైతులు లాంగ్ మార్చ్ చేపట్టారు. కరువు నేపథ్యంలో రైతులు తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో ఆందోళన బాట పడుతున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏపీ, మహారాష్ట్ర మాత్రమే కరువు మండలాలను ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో పోల్చితే మహారాష్ట్రలో ప్రస్తుతం తీవ్ర కరువు ప్రభావం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రైతులు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో అకోలే నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్‌ను చేపట్టారు. కరువు నేపథ్యానికి సంబంధించిన ప్రధాన డిమాండ్లతో ఈ లాంగ్ మార్చ్‌ను నిర్వహించారు మరాఠా రైతులు.
తక్షణమే కరువు పరిహారం ప్రకటించాలనేది ప్రధాన డిమాండ్‌గా ఉంది. సమగ్ర రుణమాఫీ చేయాలని, దీని ద్వారా కొత్త రుణాలు తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అటవీ భూములపై హక్కులు కల్పించాలని, కరువు నేపథ్యంలో కార్మికులకు కనీస వేతనాలు అందించాలనేది వీరి డిమాండ్లుగా ఉన్నాయి.
మహారాష్ట్రలో మొత్తం 358 తాలూకాలకు గాను 305 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. సోయాబీన్, పత్తి, పప్పుధాన్యాల పంటలు ఇప్పటికే అక్కడ దెబ్బ తిన్నాయి. దాదాపు పదివేల మందికి పైగా రైతులు సీఎం అధికారిక నివాసానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరాఠా రైతుల పోరాటం కరువు తీవ్రతకు అద్దం పడుతున్నది. అక్కడ ఇప్పుడే ఇట్లా ఉంటే .. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన మిగిలిన రాష్ట్రాలను కూడా పట్టి పీడిస్తున్నది.
మహా సర్కార్ కరువును దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన తాలూకాల్లోని రైతులకు ఒక్కొక్కరికి రూ. 5వేలను నేరుగా అందించనున్నట్లు ప్రకటించింది. ఇది దీపావళి పండగకు ముందే అందించడం ద్వారా వారిని ఆదుకున్నట్టవుతుందనే భావన ఆ సర్కార్‌లో ఉంది. పంట నష్టం కింద పరిహారంగా హెక్టారుకు రూ. 7,500 నుంచి రూ.22,000 వరకు అందించనున్నట్టు ప్రకటించింది. దీని కోసం కేంద్ర నిధుల కోసం రూ. 17, 500 కోట్లు అవసరం అని ప్రతిపాదనలు పంపింది.
కరువు ప్రాంతాల్లోని వర్సిటీ విద్యార్థుల పరీక్ష ఫీజులను రద్దు చేసింది. మహారాష్ట్ర తరువాత ఏపీ మాత్రమే కరువు మండలాలను ప్రకటించింది. 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా చేర్చింది. రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్రతో పాటు ఏపీ సర్కార్ కూడా ఎన్డీయే కూటమిలో ఉన్నందున.. కరువు సాయం కింద నిధులను రాబట్టుకునే క్రమంలో ఇబ్బందులేమీ ఉండవు.
కానీ తెలంగాణ సర్కార్ మాత్రం ఇంకా మేలుకోలేదు. కరువు సహాయక చర్యలు, ప్యాకేజీపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం ప్రకటించినా.. అది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఉపాధి హామీ పనులను పెంచి.. అందరికీ కూలీ పనులు ఇప్పించేందుకు మాత్రం చొరవ తీసుకున్నది ఇప్పటి వరకైతే. ఇక ఢిల్లీకి వెళ్లాలనే ఆలోచన , కేంద్ర నిధుల సాయం పట్ల కూడా ఉదాసీనంగానే ఉంది. కరువు మండలాలను ఇంత వరకు ప్రకటించలేదు.