BigTV English

Kashmir Accession Day : కశ్మీర్ విలీనం.. అసలు హీరో ఈయనే..!

Kashmir Accession Day  : కశ్మీర్ విలీనం.. అసలు హీరో ఈయనే..!
Mehr Chand Mahajan

Kashmir Accession Day : కొందరు వ్యక్తులు తమ సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ.. వారు తమ నీడనూ నేలపై పడకుండా ఈ లోకం నుంచి మౌనంగా నిష్క్రమిస్తారు. ఆ వ్యక్తులను చరిత్ర మరువొచ్చేమో గానీ, వారి విజయాలు మాత్రం ఎన్నటికీ సజీవంగా నిలిచే ఉంటాయి. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు.. మెహర్ చంద్ మహాజన్.


హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్డా దగ్గర టిక్కాన గ్రోటా అనే గ్రామంలో 1889 డిసెంబరు 23న మెహర్ చంద్ జన్మించారు. ఈ శిశువు నష్టజాతకుడనీ, 12 ఏళ్లు వచ్చే వరకు తండ్రి ఈ శిశువు ముఖం చూస్తే.. తండ్రికి ప్రాణగండమని జ్యోతిష్యులుచెప్పటంతో, తల్లిదండ్రులు ఆ శిశువును వేరేవారికి పెంపకానికి ఇచ్చి, 12 ఏళ్ల తర్వాత ఇంటికి తెచ్చుకున్నారు.

పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి, గురుదాస్‌పూర్‌లో లా ప్రాక్టీస్ ఆరంభించి, లాహోర్ హైకోర్టులో పేరున్న లాయర్‌గా పేరుతెచ్చుకున్నారు. ఆ సమయంలోనే ఆయన కశ్మీర్‌ మహారాజా ప్రతాపసింగ్‌ పక్షాన, పూంచ్ మహారాజుకు వ్యతిరేకంగా ఓ దావాలో వాదించి, కోర్టుబయట ఆ సమస్యకు పరిష్కారం సాధించారు. అనంతర కాలంలో పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు.


ఆయన చాతుర్యానికి చకితుడైన మహారాజా హరిసింగ్..తన భార్య, మహారాణి లలితాదేవి, కుమారుడైన యువరాజు కరణ్ సింగ్‌ను మెహర్ చంద్ ఇంటికి పంపి కశ్మీర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని సందేశం పంపారు.

అప్పటికి ప్రధానిగా ఉన్న రామచంద్ర కాక్‌ కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరుగా ఉంచాలని చెప్పటంతో బాటు బ్రిటిష్ జాతీయత గలిగిన ఆయన భార్య పాలనలో జోక్యంచేసుకునేది. దీంతో ఆయన స్థానంలో మెహర్ చంద్ మెరుగైన ఎంపిక అని పటేల్ సూచించటంతో 1947 అక్టోబరు 15న మెహర్‌ చంద్‌ మహాజన్‌ జమ్మూ కశ్మీర్‌కి ప్రధానమంత్రి అయ్యారు.

దేశ విభజన అనంతరం, కశ్మీర్ సైన్యంలోని ముస్లింలు తిరుగుబాటు చేయటం, గిల్గిట్ బాల్టిస్థాన్ పాక్ పరమైంది. మరోవైపు పూంఛ్‌లో తిరుగుబాటు మొదలైంది.

సరిహద్దులో పాకిస్తాన్‌ తన సైన్యాన్ని చొరబాట్ల రూపంలో చొప్పించటమూ మొదలైంది. భారత్‌లో విలీనం కావాలా? వద్దా? అనే విషయంలో మహారాజా హరిసింగ్ తేల్చుకోలేని స్థితిలో పడిపోయారు.

ఆ సమయంలో విలీనానికి మహారాజును ఒప్పించి, ఒప్పందంపై సంతకాలు చేయించి, తక్షణం మహారాజును, ఆయన కుటుంబాన్ని కశ్మీర్ నుంచి జమ్మూకు సురక్షితంగా తరలించే ఏర్పాట్లూ చేశారు. అలాగే.. పటియాలా మహారాజుతో మాట్లాడి.. అక్కడి సైన్యాన్ని కశ్మీర్ రక్షణకు పంపేలా ఒప్పించారు.

అనంతరం.. కశ్మీర్ ప్రధానిగా షేక్ అబ్దుల్లాను ప్రకటించాలని ప్రధాని నెహ్రూ మహారాజుపై ఒత్తిడి చేయగా.. వెంటనే తన పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు.

ఆపై.. విభజన రేఖను నిర్ణయించేందుకు ఏర్పాటైన రాడ్‌ క్లిఫ్‌ కమిషన్‌లో ఆయన హిందువుల పక్షాన సభ్యుడిగానూ పనిచేశారు. ముస్లిం మెజారిటీ జిల్లా అయిన.. గురుదాస్‌పూర్‌ను హద్దుగా నిర్ణయించాలని, దానిని తమకు అప్పగించాలని పాక్ కోరగా, మెహర్ చంద్ మాత్రం రావీ నదిని సరిహద్దుగా నిర్ణయించాలని తన వాదనను వినిపించారు. మహారాజా రంజిత్‌ సింగ్‌కి చెందిన నలభై వేల మంది సిక్కు సైనికులు రావీ నదీ కాలువను తవ్విన సంగతిని గుర్తుచేస్తూ.. ఆ కాలువతో సిక్కుల, హిందువుల మనోభావాలు ముడిపడి ఉన్నాయని కమిషన్ ముందు వివరించారు.

నిజానికి.. భారత్ నుంచి జమ్మూ వెళ్లాలంటే గురుదాస్‌పూర్ జిల్లాలోని పఠాన్‌ కోట్‌ మీదుగా వెళ్లటం తప్ప మరో మార్గం లేదు. ఆ జిల్లాను చేజిక్కించుకుంటే.. మిగిలిన కశ్మీర్ అంతా గంటలో తమ చేతిలోకి వస్తుందని పాక్ ఆశపడింది. కానీ.. కమిషన్ ముందు మెహర్ చంద్ వాదనతో అది కలగా మిగిలిపోయింది.

ప్రధానిగా పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. మెహర్ చంద్ర భారత సర్వోన్నత న్యాయస్థానపు 3వ ప్రధాన న్యాయమూర్తిగా( 1954 జనవరి 3 – 1954 డిసెంబరు 22) వరకు పనిచేశారు. చివరి వరకు ఆర్యసమాజం తరపున పలు సేవాకార్యక్రమాలు నిర్వహించిన మెహర్ చంద్ మహాజన్.. 1967 డిసెంబర్‌ 11న కన్నుమూశారు.

జమ్మూ కశ్మీర్ అనే భవంతిపై ఎగిరే జెండాలా గాక.. ఆ భవనపు పునాది రాయిగా చరిత్రలో మిగిలిపోయారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×