Jangalapalli Incident: ఆ గ్రామం హడలెత్తిపోతోంది. రాత్రి అయితే చాలు ఒక్కరు కూడా బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.. భయపడుతున్నారు. అంతేకాదు చీకటి వేళ ఒకరిని ఒకరు చూసి భయపడిపోయే పరిస్థితులు గ్రామంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ గ్రామంలో ఇంతటి భయానక పరిస్థితులు తలెత్తడం వెనుక.. పెద్ద కారణమే ఉంది. ఆ గ్రామం ఎక్కడుంది? అసలేం జరిగింది? గ్రామస్థులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ములుగు మండలం జంగాలపల్లిలో ఈ పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణాలు ఏవైనా చిన్నా, పెద్దా తేడా లేకుండా గజగజ వణికిపోతున్నారట. సాయంత్రం అయితే చాలు.. ఇంటి ముందు భారీ లైట్స్, ఇంటికి తాళాలు వేసి భద్రంగా ఉంటున్నారట వారు. అసలు విషయంలోకి వెళితే.. ఈ గ్రామంలో ఉన్నట్లుండి మరణాల సంఖ్య పెరుగుతుందని గ్రామస్థులు తెలుపుతున్నారు.
అక్టోబర్ నుండి ఇప్పటి వరకు సుమారు 20 మంది మృతి చెందినట్లు తెలుపుతూ.. అది కూడా 30 నుండి 50 ఏళ్ల లోపు వయస్సు వారేనంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతులు కూడా యుక్త వయస్సు వారే కావడంతో గ్రామానికి చేతబడి జరిగిందని కూడా గ్రామస్థులు ప్రచారం సాగిస్తున్నారు.
అలాగే తమ గ్రామానికి కీడు పట్టిందని, గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలని గ్రామస్తులు చర్చోప చర్చలు సాగిస్తున్నారు. అసలే కుగ్రామం కావడంతో గ్రామస్తులలో మూఢ విశ్వాసాల కారణంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే గ్రామానికి చెందిన కొందరు మాత్రం.. తమ గ్రామంలో వైద్యులు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించి, ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా గ్రామ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
అలాగే అక్టోబర్ నుండి నేటి వరకు 20 మంది యువకులు మృతి చెందినట్లు తెలుపుతున్న గ్రామస్థులలో, మనోధైర్యం కలిగేలా అవగాహన సదస్సులు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని గ్రామానికి చెందిన యువకులు తెలుపుతున్నారు. చివరగా ఈ మరణాల వెనుక ఉన్నది అదృశ్య శక్తేనంటూ గ్రామస్తులు వక్కాణించి తెలపడం విశేషం.
వరుస మరణాలతో గ్రామంలో భయాందోళనలు
ములుగు మండలం జంగాలపల్లిలో అక్టోబర్ నుంచి నేటి వరకూ 20 మంది మృతి
మృతుల్లో ఎక్కువ మంది 30 నుంచి 50 ఏళ్ళలోపు వారు
గ్రామానికి కీడు పట్టిందని, గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలని చర్చ
వైద్యాధికారులు గ్రామంలో మెడికల్ క్యాంపులు… pic.twitter.com/tLQPayv4wz
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2024