BigTV English

Jubilee Hills MLA Seat: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. జూబ్లీహిల్స్ పల్స్ పట్టేదెవరు

Jubilee Hills MLA Seat: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. జూబ్లీహిల్స్ పల్స్ పట్టేదెవరు

Jubilee Hills MLA Seat: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీ నాథ్ మృతి చెందడంతో.. ఈ స్థానానికి బైపోల్ జరగనుంది. అయితే ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుండగా.. కాంగ్రెస్ బీజేపీలు ఈ సెగ్మెంట్ లో పాగే వేసే దిశగా పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే ఈ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి తీస్కెళ్లడంతో నోటిఫికేషన్ విడుదల కానుంది.


రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక 

రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నిక రాబోతోంది. దీంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఉప ఎన్నికతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ అంటుంటే, అలాంటిదేం లేదని అంటోంది కాంగ్రెస్. ఇదే టైంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ బీజేపీ లీడర్లు సైతం వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఈ సిట్యువేషన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పై చేయి సాధిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.


2023 ఎన్నికల్లో మాగంటి విజయం

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ నుంచి మాగంటి విజయం సాధించారు. అయితే ఆయన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేలా తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ స్థానం ఎలాగైనా సరే కైవసం చేసుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి.

పీజేఆర్ కుమారుడు విష్ణు, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లూ.. తెరపైకి

మరీ ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోడానికి బీఆర్ఎస్ కి అతి పెద్ద సవాల్ గా మారనుంది. ఇందుకోసం పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ఒక కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇవ్వడమా? లేక మరొక నాయకుడ్ని తెరపైకి తేవడమా? అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చకు తెరలేచింది. అంతే కాదు పీజేఆర్ కుమారుడైన విష్ణువర్ధన్ రెడ్డితో పాటు, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి.. అభ్యర్ధి విషయంలో ఒక నిర్ణయానికి రావల్సి ఉంది.. బీఆర్ఎస్. బీజేపీ అభ్యర్ధిని బరిలోకి దింపుతుందా? లేదా అనే సస్పెన్స్ సైతం కొనసాగుతోంది. ఒక వేళ అవకాశం ఇస్తే తాను సిద్ధంగా ఉన్నానంటూ చికోటి ప్రవీణ్ రెడీ అవుతున్నట్టు సమాచారం.

మరోమారు బరిలోకి దిగేందుకు అజర్ ఆసక్తి

ఇక అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు అప్పుడే ఉప ఎన్నికపై రియాక్ట్ అవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజరుద్దీన్ మరోమారు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై తాజాగా మాట్లాడిన ఆయన రానున్న ఉప ఎన్నికలో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ తనకే టికెట్ ఇస్తుందన్న భరోసాతో ఉన్నారాయన. ఈ ఎన్నికలో విజయం సైతం తననే వరిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు అజర్.

ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై..

ఈ సంవత్సరం చివర్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ గెలిచేలా ప్రణాళిక రచించాలని కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరిగాయి? వాటిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? ఒక వేళ గెలిస్తే ఆ గెలుపునకు దోహద పడ్డ అంశాలేంటి? గతేడాది జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎలా గెలిచింది. వంటి అంశాలతో కూడిన ఒక నివేదిక సిద్ధం చేసి తనకివ్వాల్సిందిగా మీనాక్షి గాంధీభవన్ సిబ్బందిని కోరినట్టు తెలుస్తోంది.

ఈ ఉప ఎన్నిక జరిగిన 3 నెలల్లో గ్రేటర్ ఎన్నికలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కేవలం రెండు మూడు నెలల్లోనే గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పాలనకు ఈ ఉప ఎన్నికను ఒక రెఫరెండంగా చూస్తారని.. దీంతో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరాలని మీనాక్షి నటరాజన్ ఒక టార్గెట్ ఫిక్స్ చేశారని అంటారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండి ఉప ఎన్నికల్లో గెలిచిన చరిత్ర బీఆర్ఎస్ కి ఉండటం.. గ్రేటర్ పరిధిలో పెద్దగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేక పోవడం.. హైడ్రా వంటి నిర్ణయాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఒక నెగిటివ్ ఇమేజీ పెంచింది. దీంతో ఈ బైపోల్ గెలుపు ఒక ఛాలెంజింగా కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి నుంచి ఒక టార్గెట్ పెట్టుకుని పని చేస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును మనం కైవసం చేసుకోవడం పెద్ద పనేం కాదని మీనాక్షి కాంగ్రెస్ లీడర్లతో చెప్పినట్టు తెలుస్తోంది.

Also Read: భీమవరంలో వైసీపీకి దిక్కెవరు?

మైనార్టీ నేత ఫహీం ఖురేషీకి సీటిచ్చే యోచన?

మైనార్టీ వ్యక్తికి టికెట్ ఇస్తే మజ్లీస్ మద్ధతు సైతం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముస్లిం నేత ఫహీం ఖురేషీకి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇక ఇటీవల చేరిన మాజీ మజ్లిస్ నేత నవీన్ యాదవ్ పేరు కూడా కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. ఇక గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడాపరిశీలనలో ఉన్నట్టు సమాచారం. గ్రేటర్ మేయర్ గా పని చేసిన అనుభవంతో పాటు ఏపీ ఓటర్ల మద్ధతు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. దానికి తోడు ఆయన సతీమణి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో బొంతు ఒక మంచి ఆప్షన్ గా కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే ఖమ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, తెలుగు బాగా మాట్లాడే మహ్మద్ జావేద్ కి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ సైతం మొదలైనట్టు చెబుతున్నారు. మరి ఇన్నేసి వ్యూహ ప్రతివ్యూహాల నడుమ.. కంటోన్మెంట్ ఫలితాలే జూబ్లీహిల్స్ లోనూ రిపీట్ అవుతాయో లేదో తేలాల్సి ఉందంటున్నారు.

Story BY Adhi Narayana, Bigtv

Related News

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

×