West Godavari Politics:పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా తర్వాత ఆ పార్టీకి దిక్కెవరు? అన్న ప్రశ్న తలెత్తింది. భీమవరంలో YCP ముఖ్య నేతలు సైతం గ్రంధి శ్రీనివాస్ వెంట పార్టీని వదిలి వేయడంతో.. ఇక వైసిపి పని అయిపోయినట్టే అని భావించారంతా. ఆరు నెలలు గడుస్తున్న భీమవరానికి YCP ఇంచార్జ్ పోస్టుకు సరైన వ్యక్తి దొరకడం లేదా? అన్న కామెంట్లు వినిపించాయి. ఎట్టకేలకు అధిష్టానం భీమవరం వైసీపీ బాధ్యతలను కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట రాయుడికి అప్పగించింది. ఇప్పటివరకు పటిష్టమైన నాయకత్వంలో పనిచేసిన స్థానిక వైసీపీ కేడర్.. రాయుడుతో పనిచేయటానికి సుముఖంగా ఉందా? నాలుగేళ్లపాటు పార్టీని నడిపించే ఆర్థిక వనరులు ఆయన దగ్గరున్నాయా? భీమవరం బిగ్ షాట్ గ్రంధి లాంటి వారిని మాకొద్దంటూ వదిలేసిన పార్టీని.. రాయుడు ముందుకు తీసుకు వెళ్ళగలరా?
భీమవరం YCP ఇంచార్జ్ గా వెంకటరాయుడు
రాయుడొచ్చాడని పాడుకుంటోన్న కార్యకర్తలుపశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా కాపునాడు జిల్లా అధ్యక్షుడు చిన్నమిల్లి వెంకట రాయుడును నియమించింది వైసీపీ అధిష్టానం. గత ఏడాది డిసెంబర్ లో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ YCP పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. సుమారు 7 నెలల తర్వాత వైసీపీ అధిష్టానం కాపు నాయకుడైన వెంకటరాయుడికి అవకాశమిచ్చింది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పశ్చిమగోదావరి జిల్లా అంటేనే సామాజిక సమీకరణాలు పూర్తిస్థాయిలో చూడాల్సి ఉంటుంది.. ఇప్పటివరకు కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్ వైసిపి సమన్వయకర్త గా పార్టీని బలోపేతం చేసేందుకు తనకున్న ఆర్థిక వనరుల్లో సగానికి పైగా ఖర్చు చేశారని ఇప్పటికీ చెప్పుకుంటారు ఇక్కడి వారు.. అధిష్టానం నుంచి నిధులు వచ్చినా- రాకపోయినా భీమవరంలో వైసిపికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.
పేరిచర్ల, కామన, చినమిల్లి పేర్ల పరిశీలన
గ్రంధి శ్రీనివాస్ రాజీనామా తర్వాత క్లిష్ట పరిస్థితుల్లోకి జారిన వైసీపీ దిద్దుబాటు చర్యలకు సిద్ధమైందనే చెప్పాలి. భీమవరంలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నేతల పేర్లను పరిశీలించింది వైసీపీ అధిష్టానం. క్షత్రియ వర్గం నుంచి భీమవరం MPP పేరిచర్ల విజయ నరసింహరాజు, బీసీ వర్గం నుంచి కామన నాగేశ్వరరావు, కాపు సామాజిక వర్గం నుంచి చినమిల్లి వెంకట రాయుడు పేర్లను పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నరసాపురం, ఉండి నియోజకవర్గాలు క్షత్రియులకు కేటాయించగా.. పాలకొల్లు, ఆచంట బీసీ, తాడేపల్లిగూడెం మాత్రమే కాపులకు కేటాయించారు. భీమవరంలో తప్పనిసరి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన చినమిల్లి వెంకటరాయుడిని సమన్వయకర్తగా నియమించాల్సి వచ్చిందని అంటున్నారు వైసిపి నేతలు
కాంగ్రెస్ హయంలో ZPTCగా పని చేసిన రాయుడు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చినమిల్లి వెంకటరాయుడు భీమవరం మండల ZPTCగా పని చేశారు. ముద్రగడ కాపు రిజర్వేషన్ల పోరాట సమితిలో ముఖ్య నేతగా ఉన్నారు వెంకటరాయుడు. టిడిపి ప్రభుత్వ హయాంలో ముద్రగడ పిలుపునిచ్చిన కాపు రిజర్వేషన్ల సభ విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర పోషించారు. వైసీపీలో సైతం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు చేదోడు వాదోడుగా ఉంటూ సామాన్య కార్యకర్తల్లో సైతం కలుపుకోలుగా ఉంటారన్న మంచి పేరు తెచ్చుకున్నారు రాయుడు. అయితే భీమవరం వంటి నియోజకవర్గంలో రాజకీయం చేయాలంటే ఆర్థిక వనరులు తప్పనిసరి. అందులోనూ పార్టీ ఘోర పరాజయం చవి చూసిన తర్వాత, ముఖ్య నేతలు అందరూ పార్టీని వీడిన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. రాయుడు ఆర్థికంగా అంత బలమైన వ్యక్తి కానప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు..
రాయుడి సత్తాపై పెదవి విరుస్తున్న కొందరు సీనియర్లు
ముద్రగడ ఉద్యమం పూర్తయిన తర్వాత రాయుడు పెద్దగా కాపు సమావేశాలు సైతం నిర్వహించలేదు.. తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో కాపు సామాజ వర్గానికి ముఖ్య నేతగా మాత్రం ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా వైసిపి మరో నాలుగేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటుంది. ఈ సిట్యువేషన్లో భీమవరం నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి రాయుడు ఆర్థికంగా నిలబడగలరా? అనే దానిపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాయుడు నియామకం పట్ల నియోజకవర్గంలో కొంతమంది YCP సీనియర్లు పెదవి విరుస్తున్నట్లు సమాచారం. పార్టీలో భీమవరం నుంచి గ్రంధి లాంటి డేరింగ్ డాషింగ్ లీడర్ని చూసామని, అలాంటి నాయకత్వం, ఆర్థికబలం రాయుడిలో ఉన్నాయా? అనే సందేహం సైతం వ్యక్తం చేస్తున్నారు సీనియర్లు.
Also Read: వారికి హైడ్రా గుడ్ న్యూస్.. ఇక సొంతింటి కలను ఇలా సాకారం చేసుకోండి
ప్రస్తుతానికైతే భీమవరం వైసీపీ కార్యకర్తలు- రాయుడొచ్చాడని పాడుతూ.. ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయానికి మంచినీళ్లలా ఖర్చయ్యే నిధులు ఎలా మేనేజ్ చేస్తారని గుసగుసలాడుతున్నారు ఫ్యాను పార్టీ లీడర్లు.
Story By Adhi narayana, Bigtv