Liquor Scam: న్యాయమే గెలిచిందని ఒకరి భావోద్వేగం.. ముందు చెప్పామని మరొకరుకడిగిన ముత్యంలా వచ్చామని ఇంకొకరు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో రకమైన భావోద్వేగం. కానీ అందరి ఆనందానికి కారణం ఒకటే. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇలా మరో 20 మందికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. సీబీఐ వారిపై నమోదు చేసిన అభియోగాలన్నింటిని కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 23 మంది నిందితులు తప్పు చేశారని ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది కోర్టు.
కేజ్రీవాల్, మనిష్ సిసోడియా, కవిత, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయిన్‌పల్లి, అమిత్ అరోరా, దినేష్, శరత్ చంద్రా, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు గోరంట్ల, బెనోయ్ బాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, పంజజ్, సీ అరవింద్, యోగేష్ గుప్తా, సందీప్ గుప్తా, చరణ్‌ప్రీత్సింగ్, అశిష్ మాథూర్.. వీరే మొత్తం క్లీన్ చీట్ పొందిన 23 మంది. వీరిలో చాలా మంది నెలల పాటు జైలులో గడిపారు. ఇన్ని రోజుల పాటు వీరిలోనే చాలా మంది అక్రమాలు చేశారు.. కిక్‌బ్యాగ్స్ తీసుకున్నారు.. కింగ్ పిన్‌లు.. కథ మొత్తం నడిపింది వీరే.. అక్రమాలకు పాల్పడ్డారు.. ప్రజా ధనాన్ని దోచేశారు.. అంటూ ఆరోపించాయి దర్యాప్తు సంస్థలు. కానీ కోర్టు మాత్రం వీటన్నింటిని ఏమాత్రం పట్టించుకోలేదు.
వీరందరికి క్లీన్‌చిట్ ఇచ్చే ముందు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు సీబీఐ దర్యాప్తు విధానంలోనే తీవ్రమైన లోపాలు ఉన్నాయంది కోర్టు. మనీష్ సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సీబీఐ సమర్పించలేక పోయిందనేది కోర్టు కామెంట్. ఇక కేజ్రీవాల్ విషయానికి వస్తే.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు మోపడం చట్టపరమైన ప్రమాణాలకు విరుద్ధమని తెలిపింది.
Also Read: BRS : ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పు.. కేసీఆర్, కేటీఆర్ మౌనమేలా?
కోర్టు చేసిన మరో సీరియస్ కామెంట్ ఏంటంటే.. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహాగానాల ఆధారంగా ఈ కేసులో కుట్ర జరిగిందని సీబీఐ అధికారులు ఆరోపించారని చెప్పడం. అంటే కేవలం ఊహాగానాల ఆధారంగానే కేసును నమోదు చేశారని కోర్టు తేల్చేసింది. కానీ దానిని నిరూపించడంలో విఫలమయ్యారంటూ ఫైర్ అయ్యింది. ఎక్సైజ్ పాలసీపై ముగ్గురు న్యాయ నిపుణుల అభిప్రాయాలు తమ కేసుకు మద్దతు ఇస్తున్నాయని గతంలో సీబీఐ చేసిన ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
అంతేకాదు కేవలం అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసును నమోదు చేసిన సీబీఐ తీరును తప్పు పట్టింది కోర్టు. ఇలాంటి వాటికి అనుమతిస్తే.. రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. నిందితుడికి క్షమాభిక్ష పెట్టి, అతడిని అప్రూవర్‌గా మార్చి, ఆ వ్యక్తి నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని దర్యాప్తును కొనసాగించడాన్ని తప్పుపట్టింది. అలాంటి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. మిగిలిన వారిని తప్పుపట్టడం.. అరెస్ట్ చేయడం కరెక్ట్ ఎలా అవుతుంది అనేది కోర్టు వేస్తున్న ప్రశ్న.
ఈ తీర్పుతో బిగ్ రిలీఫ్ పొందిన వ్యక్తులో మొదటిస్థానం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌దే. సత్యం చివరికి గెలుస్తుందని ఎప్పుడూ చెబుతూనే ఉన్నా.. సత్యం మావైపై ఉంది… అందుకే గెలిచామంటూ ఆయన తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఇంటి నుంచి బయటకు లాగి జైల్లో పడేశారని, మాపై బురద జల్లారు అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ముందే చెప్పామని.. ఇప్పుడు అదే జరిగిందని చెబుతున్నారు కల్వకుంట్ల కవిత. ఇలా ఒక్కో నేతది ఒక్కో రకమైన భావోద్వేగం. ఇప్పుడు వీరంతా సంబరాలు చేసుకుంటున్నారు. తాము అనవసరంగా శిక్షను అనుభవించామని.. తమను కావాలనే వేధించారనేది ఇప్పుడు బాధిత నేతలంతా చేస్తున్న ఆరోపణ.
కాస్త పాస్ట్‌లోకి వెళితే.. 2022, జూలై 20వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ తన కేసును నమోదు చేసింది. అప్పటి నుంచి మొదలైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథ. నోటీసులు.. విచారణలు.. ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. దేశ వ్యాప్తంగా రెయిడ్‌లు.. వందల మంది ఆఫీసర్లతో దర్యాప్తులు.. నేతలను అరెస్ట్ చేయడం.. జైల్లో ఉంచడం.. ఇలా అన్ని జరిగిపోయాయి. కానీ ఇదంతా ఉత్తదే.. తూచ్ అనేసింది కోర్టు. ఈ కేసులో అందరికి క్లీన్‌చిట్ ఇచ్చింది కోర్టు. మరి ఈ స్కామ్ చేసింది ఎవరు? సీబీఐ, ఈడీ చార్జ్‌షీట్‌లో చెప్పిన డబ్బుల లెక్కలు అంతా ఉత్తిదేనా?
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. దేశంలోనే అత్యున్న కేసులను విచారించే దర్యాప్తు సంస్థ. ఒక్కసారి సీబీఐ విచారణ చేపట్టిందంటే.. కేసు లోతుల్లోకి వెళ్లి అసలు దోషులను గుర్తిస్తుందనే నమ్మకం ప్రజలది. కానీ అలాంటి సీబీఐ ఇప్పుడు పంజరంలో చిలకలా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నమోదు నుంచి తీర్పు వచ్చే వరకు ఒక్కసారి పరిస్థితులు చూస్తే.. అనేక డౌట్స్ వస్తాయి. ఎందుకంటే 2022, జూలై 20న ఈ కేసులో గవర్నర్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తును ప్రారంభించింది సీబీఐ. అప్పటి నుంచి నోటీసులు, విచారణల పేరుతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారంతా విపక్ష పార్టీల నేతలే. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయాలపైనే ఫోకస్ చేసింది సీబీఐ.
నిజానికి దర్యాప్తును చాలా వేగంగా కొనసాగించింది. చార్జ్‌షీట్‌లను రూపొందించింది. కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేసింది. నేతలకు కనీసం బెయిల్ రాకుండా న్యాయ పోరాటం చేసింది. కానీ .. చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అనేక విషయాలను కోర్టు ముందు ప్రూవ్ చేయలేకపోయింది సీబీఐ.
ఈ నాలుగేళ్ల కాలంలో చాలా మారాయి. ఢిల్లీలో ఆప్ అధికారం కోల్పోయింది. కవిత లాంటి నేతలు తమ ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అనేక మంది నేతలపై అక్రమార్కులు అనే ముద్ర పడింది. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ పేరుతో చేసిన హడావుడి కారణంగా ఓ రకంగా మానసిక క్షోభను అనుభవించారు బాధితులు, వారి కుటుంబ సభ్యులు. మరి వీటికి సమాధానం చెప్పేది ఎవరు? అంటే ఇప్పుడు సమాధానం లేదు. ఇప్పుడు ఈ కేసును విచారించిన అధికారులపైనే విచారణకు ఆదేశించింది కోర్టు. ఇది కదా ఈ కేసులో అసలైన ట్విస్ట్.
నిజానికి సీబీఐ అనేది స్వయంప్రతిపత్తిగల సంస్థ. కానీ అది ఎంత స్వతంత్రంగా పని చేస్తుందనే దానిపై మాత్రం అనేక అనుమానాలున్నాయి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ. సాధారణ పోలీసులు తేల్చలేని కేసులు సీబీఐ తేల్చేస్తుందన్న నమ్మకం ఉండేది. ఒకప్పుడు ఈ పేరు వింటేనే క్రిమినల్స్‌లో ఓ రకమైన భయం ఉండేది. కానీ అది తగ్గిపోతూ వస్తోంది. ఎప్పుడైతే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు.. సీబీఐని పంజరంలో చిలుక అని చెప్పిందో.. అది నిజమే అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ ప్రారంభంలో సీబీఐ చూపించిన స్పీడ్‌కు అంతా షాక్ అయ్యారు. కానీ ఆ వేగం నేరాన్ని ప్రూవ్ చేయడంలో మాత్రం చూపించలేకపోయింది.
సీబీఐపై ఉన్న పెద్ద ఆరోపణ ఏంటంటే.. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న కొందరు రాజకీయంగా అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలు తీసుకున్నప్పుడైనా.. లేదా పార్టీలు మారినప్పుడు వారిపై ఆటోమెటిక్‌గా ఒత్తిడి తగ్గుతోందనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇప్పటి వరకు వేల పేజీలతో చార్జ్‌షీట్‌లు వేస్తూ పోయింది సీబీఐ. కానీ ఈ కేసుల్లో తుది తీర్పు వచ్చిన ఘటనలు మాత్రం ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి.
అంతేకాదు.. రాజకీయ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టేందుకు.. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టడానికి కేంద్రం సీబీఐను ఉపయోగించుకుంటుంది.. అనేది విపక్షాల ప్రధాన ఆరోపణ. విపక్ష నేతలపై ఉన్న పాత కేసులను తిరగదోడటం, అదే నేతలు అధికార పార్టీలో చేరగానే ఆ కేసులు అటకెక్కడం అనేది సీబీఐకి చెడ్డపేరు తీసుకోస్తుంది. ఇక్కడ న్యాయవ్యవస్థపై కూడా అనేక అనుమానాలు రాక మానదు. ఎందుకంటే సీబీఐ ఇచ్చిన నివేదికలు, చూపించిన ఆధారాలకు అనుగుణంగానే నేతలకు రిమాండ్‌లు విధించింది కోర్టు. మరిప్పుడేమో తప్పు మొత్తం సీబీఐపైనే వేసింది. ఈ స్కాంలో 1100 కోట్ల నేరం జరిగిందని ఛార్జీషీట్‌లో తెలిపారు. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ కంపెనీ పొందిందని చెప్పారు. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారన్నారు. 292 కోట్ల లావాదేవీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. డిజిటల్ ఆధారాలను ఆమె ధ్వంసం చేశారని ఆరోపించారు. కానీ వీటిలో ఏ ఒక్కదానిని కూడా నిరూపించలేదు సీబీఐ.
2జీ కుంభకోణం, దాణా స్కామ్, జగన్ అక్రమాస్తుల కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, ఎలక్టోరల్ బాండ్ల కేసు.. ఇలా ఎన్నో రాజకీయాలను ప్రభావితం చేసేలా కేసులను డీల్ చేసింది.. చేస్తోంది సీబీఐ. విటన్నింటిలో కూడా ఏళ్లకు ఏళ్లుగా విచారణ జరుగుతున్నా.. ఎక్కడ వేసిన గొంగళి.. అక్కడే అన్నట్టుగా ఉంది వ్యవహారం. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆయేషా హత్య కేసును తేల్చలేకపోయింది సీబీఐ. వివేకా హత్య కేసు విచారణ నెవర్ ఎండింగ్ సీరియల్‌గా కొనసాగుతోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇంత వరకు ఏం తేల్చలేదు. కానీ ఈ సాగదీత, ఆధారాలు సంపాదించలేకపోవడం కారణంగా కొన్ని పార్టీలకు రాజకీయ లబ్ధి జరిగింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసు పుణ్యమా అని ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. లోక్‌సభ ఎన్నికల ముందు కీలక నేతల అరెస్ట్‌లు జరగడంతో.. ఆ ఇంపాక్ట్ ఆయా పార్టీలపై పడింది. తెలంగాణలో అయితే బీఆర్ఎస్ టార్గెట్‌గా అనేక విమర్శలు వచ్చాయి. ఆ పార్టీ ఓటమికి ఈ అంశం కూడా ఒక కారణంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి ఆరోపణల నుంచి సీబీఐ బయటపడాలి. సీబీఐలో ప్రక్షాళన జరగాలి. సీబీఐ ఒక కేసు టేకప్ చేస్తే దానిని పూర్తి చేస్తుందనే నమ్మకం కలగాలి. ప్రాథమిక ఆధారాలు లేకుండా.. ఊహాగానాలతో సీబీఐ ముందుకు వెళ్లదనే భరోసా కల్పించాలి. కానీ అదంత సులువైన వ్యవహారంగా మాత్రం కనిపించడం లేదు. సీబీఐ డైరెక్టర్‌ను కేంద్రమే నియమిస్తోంది. ఇదే ఇప్పుడు సమస్యకు అసలు కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌లాగా సీబీఐని కూడా ఓ కమిషన్‌లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. మరి ఇది సమస్యను నిజంగా పరిష్కరిస్తుందా? లేదా? అనేది కూడా అనుమానమే.
Story Credit: Vamsi Krishna, Big TV
Also Read: వరంగల్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి దామోదర రాజనర్సింహ..?