Cockfight Bet Rs 1.25 Cr: కోళ్లన్నీ ఊపేశాయ్.. ఊళ్లన్నీ ఊగిపోయాయ్. చెప్పాలంటే ఈ సంక్రాంతి జిగేల్ మన్నది. పండగంటే పండగే మరి. వెనక్కి తగ్గేదేలే అన్నారంతా. పిండివంటల దగ్గర్నుంచి కోడి పందాల దాకా, మందు నుంచి ఆటా పాటా దాకా ఒక్కటేంటి బరిలో దిగాక మామూలుగా ఉండదుగా.. పండగ పవరేంటో సంక్రాంతి నిరూపించింది. లెక్కలన్నీ తిరగరాసింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడూ కలిసి ఒక్కొక్కరికీ టన్నుల కొద్దీ సంబరాలను ఇచ్చి పడేశాయ్. ఈసారి కూడా సంక్రాంతి లెక్క తగ్గలేదు. లెక్క తప్పలేదు. మూడ్రోజులూ జాతరే జాతర అన్నట్లుగా సాగాయి. పండగంటే పండగే అంతే మరి. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులూ కట్టిపడేశాయ్. అందరిలో జిగేల్ నింపింది సంక్రాంతి. భోగితో బోణీ కొట్టి సంక్రాంతితో సంబరాలు చేసి, కనుమతో కిరాక్ అనిపించేలా పండగ సందడి నడిచింది. ముఖ్యంగా ఆంధ్రా అందులోనూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్టోరీ మరో లెవెల్ లో సాగిందంతే.
గుండాట.. పేకాట.., గ్యాంబ్లింగ్, అందర్ బాహర్, చివరికి రికార్డింగ్ డ్యాన్స్ లు ఇలా అన్నీ నడిచాయి. పేకాట ఆడేవాళ్లకు, బరుల దగ్గర దగ్గరుండి మద్యం సరఫరా జరిగింది. ఈ సంక్రాంతి గతం కంటే ఇంకాస్త అడ్వాన్స్ గా మారింది. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కోడి పందాల కల్చర్ ఇప్పుడు చాలా జిల్లాలకు పాకింది. ఒకప్పుడు సరదాగా సాగిన కోడి పందాలు, బిజినెస్ రేంజ్ నే పెంచేశాయి. పందెంకోళ్లను పెంచి అమ్మడం ఒక బిజినెస్ అయితే.. వాటిని కొని, కోట్లల్లో పందాలు కాయడం మరో ఎపిసోడ్. బరులు వేసిన నిర్వాహకులైతే పార్కింగ్ దగ్గర్నుంచి సప్లై దాకా అన్నిటికీ ఛార్జ్ వేసి సప్లై డిమాండ్ అంటే ఇదే అని నిరూపించారు.
ఇక పండగ మూడు రోజులూ కోడి పందాలను చూడటానికి, పందాలు కాయడానికి ఏపీలోని ఇతర జిల్లాలతో పాటు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి బడా వ్యాపారులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లంతా గోదావరి జిల్లాలకు వచ్చి ఇక్కడే మకాం వేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. కొందరు పందాలు కాశారు. ఇంకొందరు పందెంకోళ్ల టేస్ట్ చూసి వెళ్లారు. ఈ దఫా ఏపీలో కొత్త మద్యం పాలసీ రావడంతో అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. సో మందు, ముక్కకు లోటు లేకుండా పోయింది.
ఈసారి పందెంకోళ్లలో కొత్త రికార్డ్ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి రూపాయలు పందెం కాశారు. నెమలి పుంజు, రసంగి పుంజును కోటి 25 లక్షలు కాసి బరిలోకి దింపారు. కోటి రూపాయల పందాన్ని చూడ్డానికి వచ్చిన జనం అంతా ఇంతా కాదు. హోరా హోరిగా సాగిన పోరులో… నెమలి పుంజు కోటి తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఫ్రై అయిపోయింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
1.25 cr kodi pandem full video
5 min lo 1.25cr thengaadu 🔥 pic.twitter.com/SWe9aj6SbQ— Ajay Varma (@AjayVarmaaa) January 15, 2025
సంక్రాంతి అంటే పందెంకోళ్లు, మందు, విందులే కాదు.. ఆంధ్రాలో అంతకు మించి. ఏ ఇంట చూసినా చూడముచ్చటగా రంగవల్లులు, గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు, పూలు చల్లి ఉత్సాహంగా గడిపారు మహిళలు. బంధువులంతా ఒక్క చోట చేరి చేసుకున్న పిండివంటలు, విందు భోజనాలతో పండగ మూడు రోజులు అదిరిపోయింది. కొత్త బట్టలు, ఆలయాల్లో పూజలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఒక్కటేమిటి అన్నీ అదుర్స్ అనిపించాయి. సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు వెలిగిపోయాయి.
గోదావరి జిల్లాల్లో కోడి పందాలే కాదు.. ఉత్తరాంధ్రలో గుండురాయి పోటీలు, ఆవుల పండగ, తాడేపల్లి గూడెం వంటి చోట్ల పందుల పోటీ ఇవన్నీ హైలెట్టే. సంక్రాంతి పండగలో నాలుగో రోజైన ముక్కనుమతో సంబరాలు పూర్తవుతాయి. చివరి రోజు మాంసం కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి.
సంక్రాంతి సంబరాల్లో కోడి పందాల జోష్ కనిపించింది. సంక్రాంతి అంటేనే కోడి పందాలు..కోడి పందాలంటేనే సంక్రాంతి అనేలా ఈసారి కూడా పందాలు జోరు మాములుగా లేదు. సంక్రాంతి మూడు రోజులు సాగిన ఈ పందాల్లో..వందల కోట్లు రుపాయాలు చేతులు మారాయి. రాష్ట్ర నలమూలల నుంచి వచ్చిన పందెం రాయుళ్లు..భారీగా పందాలు కట్టారు. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 1500 వందల కోట్ల రూపాయల పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది.ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అధికంగా ఈ పందాలు సాగాయి. వాటికి తోడు కోత ముక్క, గుండాట వంటి జూదాలతో బెట్టింగులు రాయుళ్లు రెచ్చిపోయారు. పగలు రాత్రి తేడా లేకుండా కోడిపందాలు సాగించారు. ప్రత్యేకమైన నైట్ సెట్టింగులతో..రాత్రి అంతా పందాలు జోరుగు జరిపించారు. బౌన్సర్ల ,బందోబస్తులు, విఐపి ట్యాగ్ నడుమ భారీ ఏర్పాట్లు చేశారు.
రూ.1500 కోట్లకు పైగా చేతులు మారాయా?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దబరి, చిన్నబరి అనే తేడా లేకుండా పండగ మూడు రోజులూ పందేలు, జూదం జోరుగా సాగాయి. పెదఅమిరం, డేగాపురం, సీసలి, మహదేవపట్నం, అయిభీమవరం, కామవరపుకోట, కలిదిండి, దెందులూరు తదితర ప్రాంతాల్లో భారీ బరులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, గుండాట, ఇతర జూద క్రీడల్లో సుమారు రూ.1500 కోట్లపైనే చేతులు మారినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి అంటే పిండివంటలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు. కానీ రాను రాను కథ మొత్తం మారిపోయింది. బరుల్లో కోళ్లు కాదు.. కోట్లు ఎగిరిపోయాయ్… మూడు రోజుల్లో పండగ మొత్తం కోడి పందాలవైపే టర్నింగ్ అయింది. సంక్రాంతి అంటే కోడి పందాలే అన్నట్లుగా సీన్ మారిపోయింది. పగలూ రాత్రి ఏకమయ్యాయి. మద్యం ఏరులై పారింది. ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం తెచ్చింది. అటు ప్రబల తీర్థం సాంస్కృతిక వైభవాన్ని చాటింది.
సత్తా చాటిన కోళ్లు.. ఓడినవన్నీ ఫ్రై
రోజూ ఉడకబెట్టిన గుడ్లు, ఉడికించిన మటన్, జీడిపప్పు, రాగులు, సజ్జలు, బాదం తిన్న పందెంకోళ్లు ఈ మూడు రోజులూ తమ సత్తా చూపించాయి. పొగరు పెరగడానికి అశ్వగంధ పొడి, వాతం చేయకుండా కస్తూరి మాత్రలు వాడి, తాగేందుకు, స్నానానికి వేడి నీళ్లనే ఉపయోగించి, అలసట కంట్రోల్ చేసేందుకు వారానికోసారి ఈత కొట్టించి రెడీ చేసిన పందెం కోళ్లు పవర్ చూపించాయి. సంక్రాంతి సంబరం అంటేనే కోడిపందాలు అన్నట్లుగా ట్రెండ్ మారడంతో ఈ పండగ సంబరాన్నంతా అందరి అటెన్షన్ ను తమ అధీనంలోకి తీసుకున్నాయి ఈ పందెంకోళ్లు. ఓడిపోయిన కోళ్లు మాత్రం ఫ్రై అయిపోయాయి.
జిల్లాల్లో అయితే కోడి పందాల బరులు 60కి తగ్గకుండా ఏర్పాటయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేయడం, స్క్రీన్లు, భారీ లైటింగ్, రాత్రి వేళల్లోనూ పందాలు నడిచేలా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు ఒక్కటేమిటి అన్నీ అదిరిపోయాయి. అయితే పార్కింగ్ దగ్గర్నుంచి పందాలు చూసే వరకు నిర్వాహకులకు చాలా సమర్పించుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో 64 బరులు, కృష్ణా జిల్లాలో 61 ఏర్పాటయ్యాయి. లోకల్ లీడర్ల కనుసన్నల్లో ఏర్పాటైన ఈ బరుల్లో పెద్ద ఎత్తున కొడిపందేలు జరిగాయి. బరుల్లో అధికారికంగా టోకెన్ పందాలు, అనధికారికంగా పై పందేల పేరిట గేమ్ నడిచింది. ఒక్క కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనే దాదాపు 400 కోట్ల రూపాయల మేర చేతులు మారి ఉంటాయని అంచనా ఉంది. ఇక ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనూ లెక్కలు తగ్గలేదు. పందెం రాయుళ్లతో పాటు సాధారణ జనం కూడా ఈ కోడిపందేల బరుల్ని చూసేందుకు ఉత్సాహంగా తరలి వచ్చారు. ఇక వీఐపీ, వీవీఐపీల కోసం ఏసీ టెంట్లు ఏర్పాటు చేసి వాళ్ల దగ్గరకే మద్యం, ఆహారం అందించారు. దానికో స్పెషల్ ఛార్జ్. అదీ సంగతి.
ఏరులై పారిన మద్యం..
ఈ సంక్రాంతి అటు మద్యం ప్రియులకు డబుల్ కిక్ ఇచ్చింది. ఓవైపు బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది. హామీ ఇచ్చినట్లుగానే లిక్కర్ రేట్లు తగ్గించి ఈ పండక్కి సప్లై చేశాయి. దీంతో కిక్కే కిక్కు అన్నట్లుగా సీన్ మారింది. సంక్రాంతి పండుగ నేపధ్యంలో మందుబాబులకు లిక్కర్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఏకంగా ఆరు ప్రముఖ కంపెనీలు లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తగ్గిన ధరలతోనే కంపెనీలు పండుగకు మద్యం సరఫరా చేశాయి. 99 రూపాయల క్వార్టర్ కు ఏపీలో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో తక్కువ ధరలు ఉన్న మద్యం బ్రాండ్ల సేల్స్ అమాంతం పెరిగింది.
ఇక పండగ చివరి రోజు ముక్కనుమ నాడైతే ఇక కథ చెప్పక్కర్లేదు. అటు మందు, ఇటు మాంసం రెండింటితో సంక్రాంతి సంబరాలు పీక్ కు వెళ్తాయి. సంక్రాంతి పండగ సీజన్ లో వెయ్యి కోట్లైనా ఖజానాకు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసుకుంది. 12వ తేదీ నుంచి 16 వరకు పండగే పండగ అన్నట్లుగా మారడంతో మద్యం అమ్మకాలు కూడా పీక్ స్టేజ్ కు వెళ్లాయి. ఈనెల 12న ఆదివారం 13న భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ, 16 ముక్కనుమతో పండగ సందడి ముగుస్తుండడంతో 5 రోజుల్లో రికార్డు స్థాయి మద్యం అమ్మాలుంటాయని అంచనా. డిసెంబర్ 31, జనవరి ఫస్టుకు 3 వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో ఇక సంక్రాంతి సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది ముక్కనుమ తర్వాత వెయ్యి కోట్ల మార్క్ చేరుతుందన్న అంచనాలున్నాయి. పందెం బరులున్న దగ్గర విచ్చలవిడిగా లిక్కర్ సేల్స్ నడిచింది. వేలంపాట పెట్టి మరీ బెల్ట్ షాపులు నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపుగా 300కు పైనే బెల్ట్ షాపులు పెట్టారు.
కోళ్ల పందెమే కాదండోయ్.. ఇవి కూడా హైలెట్టే!
కోనసీమలో సంక్రాంతి వేడుకల్లో ప్రభల తీర్థం వేడుకలు కూడా హైలెట్ గా ఉంటాయి. జగ్గన్న తోట ప్రభల తీర్థానికి ఏకాదశ రుద్రులు ప్రబల రూపంలో జగ్గన్న తోటకు చేరుకోవడం, తొలి ప్రభ జగ్గన్న తోటకు చేరుకున్న వెంటనే పాలగుమ్మి ప్రభ అనుసరిస్తూ చేరుకోవడం, ఇలా 11 గ్రామాలకి చెందిన ఏకా దశ రుద్రులు జగ్గన్న తోటకు చేరుకున్నాక వారి మధ్య చర్చ ఆ తర్వాత గంగాలకుర్రు ప్రభ కాలువను దాటి జగ్గన్న తోటకు చేరుకోవడంతో ప్రభల తీర్థం ర్యాలీ సమాప్తం అవడం ఇవన్నీ చూడముచ్చటగా సాగాయి.
కోడి పందాలు, పందుల పందాలు, జల్లి కట్టు ఇవేనా… ఈసారి సంక్రాంతికి కొత్తగా పడవ పోటీలను ఏర్పాటు చేశారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలకు పలు జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులతో కూడిన 11 జట్లు హాజరయ్యాయి. ఒక్కో పడవలో 12 మంది క్రీడాకారులు చొప్పున పాల్గొన్నారు. బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు 1000 మీటర్ల పరిధిలో యువకులకు డ్రాగన్ బోట్ రేస్, యువతులకు కనోయింగ్ బోటింగ్ పోటీలు ఈనెల 12న ఉత్సాహంగా జరిగాయి. గెలిచిన వారికి ట్రోఫీలు ఇచ్చారు.
సంక్రాంతి అంటే ఉభయగోదావరి జిల్లాలేనా… చిత్తూరు జిల్లాలో రంగంపేట సహా తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో జల్లికట్టు జోరుగా సాగుతుంటుంది. ఏటా కనుమ పండగ రోజున జల్లికట్టును సాంప్రదాయ క్రీడగా నిర్వహించడం ఆనవాయితీ. పోటీల్లో పాల్గొనేందుకు కోడెద్దులు రంకెలు వేస్తూ.. సై అన్నాయి. కోడెద్దుల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకోవడం కోసం యువకులు ప్రయత్నించడం, మధ్యలో గాయాలు ఇవన్నీ కామనే.
అటు ఉత్తరాంధ్రలోనూ సంక్రాంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలు అదుర్స్ అనిపించాయి. శ్రీకాకుళం జిల్లా లోలుగు గ్రామంలో కనుమ వైభవంగా జరిగింది. రైతులు ఎద్దుల పోటీలు నిర్వహించారు. తరాలుగా ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తున్నారక్కడ. ఈ ఎడ్ల బండ్ల పోటీలు చూసేందుకు చుట్టుప్రక్కల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు జనం. సంక్రాంతి పండక్కి పల్లెటూళ్లు వెళ్లని వారికి హైదరాబాద్ లో స్వీట్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్స్ నిర్వహించారు. అవి కూడా చాలా సందడిగా సాగాయి. జనం ఎంజాయ్ చేశారు. సో పండగంటే పండగే. అది సంక్రాంతి పండగే. ముక్కనుమతో కలిపి నాలుగు రోజుల పండగ ఈసారి పవర్ ఫుల్ గా సాగింది. పల్లెల్లో ఎన్నో మెమొరీస్ తో జనం పట్నం బాట పట్టడమే మిగిలింది.