E-Paper
Advertisement

Save Aravali: సేవ్ ఆరావళి.. అసలు ఈ పర్వతాలు ఎందుకంత ఇంపార్టెంట్..?

Save Aravali: సేవ్ ఆరావళి.. అసలు ఈ పర్వతాలు ఎందుకంత ఇంపార్టెంట్..?
Advertisement

Save Aravali: సేవ్ ఆరావళి..! కొన్ని రోజులుగా ఈ నినాదం ఉత్తర భారతంలో హోరెత్తుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌గా నిలుస్తోంది. నార్త్ ఇండియాకు సహజ సిద్ధమైన రక్షణ కవచంలా ఉన్న.. ఆరావళి పర్వత శ్రేణుల మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అంటూ పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? అందుకు దారి తీసిన కారణాలేంటి..?

కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ సుప్రీంకోర్ట్ తీర్పు

ఈ ఆందోళనలకు ప్రధాన కారణం కేంద్రం ఇచ్చిన అఫిడవిట్. అనంతరం సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పునన్నది ఇక్కడి వాళ్లు చెప్పేమాట. అవును.. సేవ్ ఆరావళి అంటూ నినదిస్తున్న వారంతా ముక్త కంఠంతో ఇప్పుడు ఇదే మాట చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే నెలరోజులుగా ఇదే పరిస్థితి. తెల్లవారిందంటే చాలు సేవ్ ఆరావళి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించడం, స్లోగన్‌లు చేయడం ఇక్కడి ప్రజలు, పర్యావరణ వేత్తల రోజువారీ దినచర్యలా మారిపోయిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

నవంబర్ 20న సుప్రీం కీలక తీర్పు

Advertisement

అసలు ఇందుకు కారణమైన పరిస్థితులను ఓసారి గమనిస్తే.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆరావళి పర్వతాలు, కొండల శ్రేణి రక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు నవంబర్ 20న కీలక తీర్పునిచ్చింది. నాటి చీఫ్‌ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఆరావళి కొండలు, పర్వత శ్రేణికి సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ మార్పుల నిరోధ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నిర్వచనాన్ని ఆమోదించింది. అంతేకాదు.. కీలక తీర్పు వెల్లడించింది.

100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తైన కొండలే

కేంద్రం ప్రతిపాదనలు, వాటి ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా చూస్తే.. ఆరావళి పర్వతాలు విస్తరించిన జిల్లాల్లోని ప్రాంతాల్లో వంద మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తైన కొండలను మాత్రమే ఆరావళి కొండలుగా పరిగణిస్తారు. అలాంటి కొండలు రెండు లేదంటే మూడు అంతకంటే ఎక్కువ ఒకదానికొకటి 500 మీటర్ల దూరంలోపులో ఉంటే మాత్రమే వాటిని ఆరావళి పర్వత శ్రేణిగా గుర్తిస్తారు.

100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న వాటికి..

Advertisement

సుప్రీం తీర్పు ప్రకారం చూస్తే.. వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న వాటికి పర్యావరణ చట్టాల నుంచి ఏమాత్రం రక్షణ లభించదు. అయితే.. ఆరావళి పర్వత శ్రేణుల్లో దాదాపు 90 శాతం కొండలు వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నాయని పర్యావరణ వేత్తలు, స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రకారం చూస్తే ఇప్పుడున్న 90 శాతం ఆరావళి పర్వత ప్రాంతం మైనింగ్ జోన్‌గా మారిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనే ఇప్పటి నిరసనలకు కారణంగా మారింది.

పొలిటికల్‌గానూ తీవ్ర దుమారం

కేవలం పర్యావరణ వేత్తలు, ప్రజలే కాదు.. రాజకీయంగానూ ఆరావళి అంశం పెద్ద వివాదంగా మారింది. పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా మరికొందరు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముగాసేందుకు, వారి ప్రయోజనాలను కాపాడేందుకే పర్యావరణాన్ని బలిపెడుతోందని ఆరోపిస్తున్నారు.

ఆరావళి పర్వత శ్రేణుల్లో 70కి పైగా ఖనిజాలు

వాస్తవానికి గతంలో వచ్చిన పలు రిపోర్ట్‌ల ప్రకారం చూస్తే.. ఆరావళి పర్వత శ్రేణుల్లో 70కి పైగా ఖనిజాలు లభిస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. ప్రధానంగా జింక్, వెండి, రాగి, పాలరాయి సహా అనేకం ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో..గత కొంత కాలంగా ఆరావళి పర్వతాలపై వివిధ రకాల ఖనిజాల కోసం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో.. కొండల సైజు క్రమేపీ తగ్గిపోతోంది. పర్యావరణ సమతుల్యం మెల్లమెల్లగా దెబ్బతింటోంది.

మైనింగ్ జోన్‌గా మారిపోయే ప్రమాదం

సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన సుప్రీం తీర్పు ఆరావళి పర్వతాల మనుగడకు పెను ప్రమాదం అంటున్నారు స్థానిక ప్రజలు, పర్యావరణ వేత్తలు. అయితే.. రోజురోజుకూ పెరుగుతున్న నిరసనలపై కేంద్రం వాదన మరోలా ఉంది. ఆరావళి పర్వతాలపై ప్రజలు, పర్యావరణ వేత్తలు, రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ కొట్టిపారేశారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకే కొండకు సంబంధించిన నిర్వచనంపై స్పష్టత తెచ్చామన్నారు. సుప్రీం తీర్పు కారణంగా పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదంటున్నారు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్. అయితే.. కేంద్రం ఎలాంటి వివరణ ఇచ్చినా ప్రజలు, పర్యావరణ వేత్తలు మాత్రం నిరసనలపై ససేమీరా అంటున్నారు. వెనక్కు తగ్గేది లేదని తేల్చిచెబుతున్నారు.

ఆరావళిని తవ్వేస్తున్నారు.. సేవ్ ఆరావళి అంటూ మూడు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి సరే. అసలు ఈ పర్వతాలు ఎందుకంత ఇంపార్టెంట్..? ఆరావళి పర్వత శ్రేణి లేకపోతే ఉత్తర భారతంలో ఏం జరుగుతుంది..? సేవ్ ఆరావళి నినాదాలు హోరెత్తుతున్న వేళ అందరిలోనూ ఇవే ప్రశ్నలు.

250 కోట్ల ఏళ్లకు పూర్వం నాటి పర్వతాలు

ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణి ఆరావళి. ఇవి దాదాపుగా 2.5 బిలియన్ సంవత్సరాలు అంటే 250 కోట్ల ఏళ్లకు పూర్వం నాటివిగా చెబుతారు పురాతత్వ శాశ్త్రవేత్తలు. ప్రొటెరోజోయిక్ యుగం కాలంలో ఇవి ఏర్పడినట్లుగా పరిశోధకులు తేల్చారు. ఢిల్లీ నుంచి మొదలై నైరుతి దిశగా దక్షిణ హరియాణా, రాజస్థాన్ మీదుగా గుజరాత్ వరకు దాదాపు 7 వందల కిలోమీటర్ల మేర ఇవి వ్యాపించి ఉన్నాయి.

అనేక నదులు, వృక్ష జాతులు, వన్య ప్రాణులు

అత్యంత పురాతనమైన ఈ పర్వత పంక్తుల్లో అనేక నదులు, వృక్ష జాతులు, వన్య ప్రాణాలు కన్పిస్తాయి. ఈ పర్వత శ్రేణుల వెంబడి జీవ వైవిధ్యం ఉన్న పార్కులు, రణతంబోర్ లాంటి అభయారణ్యాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా మరెన్నో వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు సైతం మనకు అడుగడుగునా కన్పిస్తుంటాయి.

నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి

ఆరావళిలో ఉండే తక్కువ ఎత్తైన పర్వతాలు పక్కనే ఉన్న థార్ ఎడారి నుంచి వచ్చే ఇసుక ధూళిని సమర్థంగా అడ్డుకోవడంలో సహజ కవచంలా పనిచేస్తాయి. ఇవే లేకుండా ఉంటే ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వంటి ప్రాంతాలపై ఇసుక తుఫానులు తమ ప్రతాపం చూపి ఉండేవేనన్న వాదన స్థానికులు, పర్యావరణ వేత్తల నుంచి బలంగా విన్పిస్తోంది. అదే జరిగితే ఉత్తర భారతంలోని కీలక రాష్ట్రాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

వర్షాలు, భూగర్భ జలాలు పెరిగేందుకు కారణం

ఇంకా చెప్పాలంటే అసలు ఆరావళి పర్వతాలు అంటే కేవలం రాళ్లు, చెట్లు, చేమలు మాత్రమే కాదు.. అంతకు మించి అన్నది ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఇవి ఉత్తర భారతానికి పెట్టని కోటలా ఉంటాయి. వీటి వల్లే ఢిల్లీ, హరియాణా, పంజాబ్ వంటి ప్రాంతాల్లో వర్షాలు కురవడంతోపాటు భూగర్భ జలాలు పెరిగేందుకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. కేవలం ఇదే కాదు..అసలు కాంక్రీట్ జంగిల్‌లా మారిన ఢిల్లీ సహా సమీప ప్రాంతాల ప్రజలు కొంతలో కొంతైనా గాలి పీల్చుకుంటున్నారంటే అందుకు ఆరావళి పర్వాతాలే కారణమన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

స్థానికులు, పర్యావరణ వేత్తలు ఆందోళన

ఇంత కీలకమైనవి కాబట్టే వీటి విషయంలో స్థానికులు, పర్యావరణ వేత్తలు ఇంతగా ఆందోళన చేస్తున్నారు. అయితే.. కేంద్రం మాత్రం ఆరావళిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆక్షేపిస్తోంది. ఈ పర్వత శ్రేణిని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని చెబుతోంది. ఇప్పటికే ప్రపంచ పర్యావణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తోంది. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు అడవులను పెంచడమే లక్ష్యంగా ఈ పునరుజ్జీవన ప్రాజెక్టు లక్ష్యంగా చెబుతోంది.

Story By Y. Rajashekar,  Big Tv 

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×