BigTV English

Betting Apps: బెట్టింగ్ యాప్స్ ఇలా మోసం చేస్తాయ్.. సెలబ్రిటీలు చెప్పేవి నమ్మితే జీవితం నాశనం!

Betting Apps: బెట్టింగ్ యాప్స్ ఇలా మోసం చేస్తాయ్.. సెలబ్రిటీలు చెప్పేవి నమ్మితే జీవితం నాశనం!

బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంటాయి, వాటి పేర్లేంటి, ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి, ఎలా ఆడాలి.. ఇలాంటి విషయాల జోలికి ఎవరూ వెళ్లకపోవడమే మంచిది.


ఇక అసలు విషయానికి వస్తే.. బెట్టింగ్ యాప్స్ రకరకాలుగా ఉంటాయి. అవి లీగలా, ఇల్లీగలా అనే విషయం పక్కనపెడితే.. అమాయకుల నుంచి వీలైనంత వరకు డబ్బులు గుంజేయడమే వాటి పని. అంటే బెట్టింగ్ యాప్ ని తయారు చేసే కంపెనీలకు సమాజ సేవ చేయాలనే ఉద్దేశమేమీ ఉండదు. సమాజం నుంచి దోచుకోవడమే వారి పని. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వ్యాపారం కాదు, దోపిడీ. ప్రజలకు ఉచితంగా ఇచ్చే గిఫ్ట్ లు, ప్రైజ్ మనీ, కొత్తగా బెట్టింగ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకునేవారికి ఇచ్చే బోనస్ పాయింట్స్.. ఇవన్నీ వారు మనకు వేసే ఎర మాత్రమే. ఆ ఎరకు మనం తగులుకుంటే చేపలా మారి గేలానికి చిక్కుతాం. చివరకు చేపల కూరలో ముక్కలుగా మిగులుతాం.

మన రోజువారీ సెల్ ఫోన్ వినియోగంలో బెట్టింగ్ యాప్స్ ని చాలావరకు మనం చూస్తూనే ఉంటాం. సరదాకోసం ఆడుకునే మొబైల్ గేమ్స్ లో కూడా కొన్ని లెవల్స్ దాటాలంటే డబ్బులు చెల్లించాలనే రూల్ ఉంటుంది. మనలో చాలామంది అక్కడి వరకు ఆడేసి వెనక్కి తగ్గుతారు. ఇంకొందరు వాటికోసం డబ్బులు చెల్లిస్తారు. అలా డబ్బులు కట్టి ఆడటం మొదలు పెట్టడమే ఫస్ట్ స్టేజ్. వీటిని బెట్టింగ్ యాప్స్ అనలేం కానీ.. ఆన్ లైన్ గేమ్స్ పేరుతో దోచుకునే యాప్స్ అని అనుకోవచ్చు. ఇక పూర్తిగా దోపిడీయే పరమాధిగా ఉండే యాప్స్ ఇంకొన్ని ఉన్నాయి. వాటి పేర్లు ఇక్కడ ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు అనేది మా బిగ్ టీవీ టీమ్ అభిప్రాయం. అందుకే వాటి పేర్లు కూడా మేం ప్రస్తావించడం లేదు.


అలా మొదలవుతుంది..
బెట్టింగ్ యాప్స్ లో ముందుగా రిజిస్టర్ చేసుకుంటే వెంటనే కొన్ని బోనస్ పాయింట్స్ వస్తాయి. అంటే కొన్నిరోజులపాటు, లేదా కొన్ని గంటలపాటు ఆ యాప్ లో మనం ఉచితంగా బెట్టింగ్ గేమ్స్ ఆడొచ్చు. ఆ బోనస్ పాయింట్స్ ఆవిరైపోయిన తర్వాత మెల్లగా మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు జమ చేయాలని అడుగుతారు. అలా మనం ఊబిలోకి వెళ్లిపోతామన్నమాట.

ఈ బెట్టింగ్ యాప్స్ లో ఉండే సౌలభ్యం ఏంటంటే.. యాప్ లోకి డబ్బుల్ని క్రెడిట్ చేయాలన్నా, గెలిచిన తర్వాత డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలన్నా చాలా ఈజీ. స్మార్ట్ ఫోన్ వాడటం పూర్తిగా తెలియనివారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ బారినపడి మోసపోడానికి ఇదే ప్రధాన కారణం.

బెట్టింగ్ ఆడేవాళ్లు రెండు రకాలు. ఒకటి నేరుగా తానే ఆటలోకి దిగడం. అంటే ఆన్ లైన్ రమ్మీ, పేకాట లాంటివి అనమాట. ఇంకొకటి… అక్కడెక్కడో జరుగుతున్న మ్యాచ్ లో మనం ఒక టీమ్ తరపున పందెం కాయడం. పేకాటలో చేయితిరిగిన వారు రమ్మీవైపు వెళ్తారు. మిగతావాళ్లలో చాలామంది క్రికెట్ తో ఈ రొంపిలోకి దిగుతారు. మొదట్లో ఇంటర్నేషనల్ మ్యాచ్ లు, ఆ తర్వాత ఇండియా ఆడే ఇతర మ్యాచ్ లు, ఐపీఎల్.. ఇలా సాగుతుంది బెట్టింగ్. అంతవరకు ఓకే అనుకుంటే పొరపాటే.. ఆ అలవాటే వారిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తుంది. ఎక్కడో ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అది ఎప్పుడు జరిగిందో, లైవ్ గేమ్ అవునో కాదో కూడా మనకు తెలియదు. తెలియకుండానే మనం బెట్టింగ్ లోకి దిగుతాం. బాల్ కి ఎన్ని పరుగులు, డాట్ బాల్ కి ఎంత, సిక్స్ కి ఎంత, వికెట్ కి ఎంత, మేడిన్ ఓవర్ కి ఎంత..? ఇలా సాగుతుంది బెట్టింగ్. ఆ మాయలో పడిపోతే చుట్టూతా ఎవరున్నారో కూడా మనం గ్రహించలేం. అంతలా దానికి బానిస అవుతాం.

క్రికెట్ మ్యాచ్ లు లేని టైమ్ లో యానిమేటెడ్ మ్యాచ్ లకు కూడా బెట్టింగ్ ఆడాలనిపిస్తుంది. అలా మొదలైన ఆట కాస్తా చివరకు రమ్మీ సహా ఇతర గేమ్స్ వైపు దారితీస్తుంది. అర్థంపర్థం లేని గేమ్స్ తో ఉన్నది కాస్తా ఊడిపోతుంది.

ఇక్కడ మనకో డౌట్ రావొచ్చు. బెట్టింగ్ యాప్ లో ఒక కాలేజీ కుర్రాడు వెయ్యి రూపాయలు నష్టపోయాడనుకుందాం. దాంతో అతడి పాకెట్ మనీ అయిపోతుంది. ఇక అతను ఆడడు కదా, సో అతను నష్టపోయేదేమీ ఉండదు కదా అనుకుంటాం. కానీ అక్కడే అసలు కథ మొదలవుతుంది. అప్పులు చేస్తాడు, ఆన్ లైన్ లో హామీ లేకుండా అప్పులిచ్చే యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుంటాడు. ఆ తర్వాత మరింతగా ఊబిలో కూరుకుపోతాడు. పలువురు ప్రైవేట్ ఉద్యోగులు, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయ్యాక, అప్పులిచ్చే యాప్స్ లో వీలైనంత తీసుకుని బెట్టింగ్ ఆడుతున్నారు. జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు.

బెట్టింగ్ వ్యసనం అంత ఈజీగా వదిలేది కాదు. ఇప్పటికే చాలా నష్టపోయాం, ఇకపై ఈ ఖర్మ ఎందుకు అని ఏ ఒక్కరికీ అనిపించదంటే నమ్మండి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకుంటాం అనే మాయలో బతుకుతుంటారు వారంతా. ఇప్పటికే చాలా అనుభవం వచ్చింది, ఈసారి ఆడితే గెలుపు మనదే అనుకుంటాం. ఆ స్టేజ్ లో ఎవరు ఎంత మంచి చెప్పినా చెవికెక్కదు. అప్పు తీసుకుని వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం, ఆ వచ్చిన డబ్బుతో మిగతా అప్పులన్నీ తీర్చేద్దాం అనే భ్రమలో ఉంటారు, పూర్తిగా మునిగిపోతారు. ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా ఉంది. అప్పులు పెరిగిపోయిన తర్వాత వాటిని తిరిగి సంపాదించిన సొమ్ముతో తీర్చడం అసాధ్యం అని వారికి అర్థమవుతుంది. అంటే ఆ అప్పులు తీర్చాలంటే తిరిగి బెట్టింగ్ ఆడాల్సిందే అనే మూర్ఖత్వంలోకి వెళ్లిపోతారు. అందుకే బయటకు రాలేదు.

పైగా వీటికి తోడు సెలబ్రిటీల ప్రమోషన్ కూడా మనపై బలంగా పనిచేస్తుంది. ఫలానా స్టార్ హీరో చెప్పాడంటే ఆ ప్రోడక్ట్ కి ఓ వేల్యూ ఉంటుంది, ఆ యాప్ లో మోసాలు జరగవు అని గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఇక నోట్ల కట్టలు ముందు పెట్టుకుని కొంతమంది ఇన్ ఫ్లూయెన్సర్లు మరీ ఓవర్ గా చెప్పే మాటల్ని కూడా కొంతమంది నిజం అనుకుంటారు. కేవలం వారు ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కానీ, బెట్టింగ్ ఆడి కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి.

ఫైనల్ గా ఒక విషయం గుర్తుంచుకోండి..
డబ్బులు ఊరికే రావు..
బెట్టింగ్ యాప్స్ వాళ్లు మనకి డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడరు, ఇవ్వరు కూడా..
మన దగ్గర ఉన్న డబ్బులు కాజేయడమే వారి తక్షణ కర్తవ్యం.
ఎవరో ఎక్కడో గెలిచాడని, కోట్లు పోగేశాడని జరిగే ప్రచారం అంతా అబద్ధం.
బెట్టింగ్ ఆడి డబ్బులు గెలిచినవాళ్లెవరూ లేరు, జీవితం నాశనం చేసుకున్నవాళ్లు తప్ప.
అందుకే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకండి, కనీసం ఆ యాప్స్ పేర్లు ఏంటి..? అని కూడా తెలుసుకునే ప్రయత్నం వద్దు. ఆ ఆసక్తి ఉంటే పతనం అక్కడినుంచే మొదలవుతుంది జాగ్రత్త.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×