Ap Politics: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల సెగ్మెంట్ రాజకీయాలు ఏ పార్టీకి ఒక పట్టాన అంతుపట్టవు.. ఆ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఓటర్లు అన్ని పార్టీలను ఆదిరస్తూ ఎప్పటికప్పుడు విభిన్నతను చాటుకుంటుంటారు… అక్కడ ఓటర్లు గెలిపించుకున్న పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండటం విశేషం. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. అలాంటి చోట గత ఎన్నికల్లో వైసీపీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది. ఆ ప్రయోగం వికటించడంతో ఇప్పుడు తేరుకుని దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉన్న ఇన్చార్జ్‌ని, మాజీ ఎమ్మెల్యేని పక్కనపెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన శైలజానాథ్‌కు జగన్ శింగనమల ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు.
కాంగ్రెస్ నుంచి శింగనమలకు ప్రాతినిధ్యం వహించిన శైలజానాథ్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది… ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతూ వస్తోంది… కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు…. ఆ తర్వాత శమంతకమణి కుమార్తె యామిని బాల టీడీపీ నుంచి ఒకసారి గెలిచారు . ఆ తర్వాత 2019 లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా దక్కించుకోలేకపోయారు.
వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్ లో వీరంజనేయులు
టిడిపి నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్ లో వీరంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్‌ని పోటీలోకి దింపామని గొప్పగా చెప్పుకొంది వైసీపీ. కానీ అసెంబ్లీ సమన్వయకర్తగా ఆలూరు సాంబశివరెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం. పైకి మాత్రమే వీరాంజనేయులు అభ్యర్ధి అయినా ఎన్నికల సమయంలో పెత్తనం అంతా జొన్నలగడ్డ పద్మావతి భర్త వైసీపీ నాయకుడు ఆలూరు సాంబశివరెడ్డిది కొనసాగేదని వైసీపీ నేతలే చెప్పుకుంటారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో తన ఉద్యోగి అయిన వీరాంజనేయులు ఓటమి తర్వాత సాంబశివ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న శైలజనాథ్
అప్పటికే కాంగ్రెస్ పార్టీ లో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ శింగనమల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా పీసీసీ మాజీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో జగన్ చూపు శైలజానాథ్ వైపు పడింది. శైలజానాథ్ కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితులు కావడం, అందులోనూ శింగనమలలో మంచి పేరు ఉండడం ఆయనకు వైసీపీలో చేరడానికి కలిసివచ్చింది. జగన్ నుంచి పిలుపు రావడం, శైలజానాథ్ వైసీపీలోచేరడం చకచక జరిగిపోయాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సాకే శైలజానాథ్ 2025 ఫిబ్రవరిలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి వైసీపీ తరుఫున కూటమి ప్రభుత్వ విధానాలపై గళ మెత్తుతున్నారు.
శైలజానాథ్‌కు పీఏసీలో స్థానం కల్పించిన జగన్
శైలజానాథ్ వైసీపీలో చేరగానే ఆయనకు జగన్ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీలో స్థానం కల్పించారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటన జారీ చేశారు. శైలజానాథ్ శింగనమల వైసీపీ ఇన్చార్జ్‌గా నియమితులవ్వడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అదే సాంబశివరెడ్డి కి వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం బాధ్యతలు జగన్ అప్పజెప్పారు.
అనంతపురం వైసీపీ సీనియర్ నేతలతో విభేదాలే కారణమన్న టాక్
గత ఎన్నికల్లో జగన్ తనదైన లెక్కలతో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ నిరాకరించారు. దాంతో తన ఇంట్లో ఉండే ఓ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు అనే వ్యక్తికి ఆలూరు సాంబశివారెడ్డి శింగనమల వైసీపీ టికెట్ దక్కించుకుని జగన్ దగ్గర తన పలుకుబడిని చాటుకున్నారు. కానీ బండారు శ్రావణి చేతిలో వీరాంజనేయులు ఓడిపోయారు. అయితే ఆలూరు సాంబశివ రెడ్డి భార్య పద్మావతి టికెట్ రాకపోవడం వెనుక అనంతపురం వైసీపీ సీనియర్ నేతలతో విభేదాలే కారణమన్న టాక్ ఉంది. ఇప్పుడు కూడా సాకే శైలజనాథ్‌ను ఇన్చార్జిగా ప్రకటించడం వెనుక కూడా ఆ సీనియర్ నేతల హస్తం ఉందని జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read: భారత్ కొత్త వ్యూహం.. అసలు మన ప్లాన్ ఏంటంటే.?
శైలజానాథ్‌కు శింగనమల వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతలు
ముఖ్యంగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెనుక ఉండి సాంబశివారెడ్డికి శింగనమలలో ప్రాధాన్యత లేకుండా చేయడానికి కథ నడిపించారంట. ఇక మాజీ ఎమ్మెల్యే పద్మావతి చాలాకాలంగా బయటెక్కడా కనిపించడం లేదు. సాంబశివారెడ్డి ఒక్కరే అడపదడపా కనిపిస్తున్నా… ఇప్పుడు ఇన్చార్జిగా శైలజానాథ్ ను ప్రకటించడంతో సాంబశివరెడ్డి దంపతుల రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చే జరుగుతోంది.
జొన్నలగడ్డ పద్మావతి దంపతులకు షాక్ ఇచ్చిన జగన్ వాయిస్
గత కొంతకాలంగా శింగనమల వైసీపీ ఇన్చార్జి పదవి కోసం వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇంచార్జ్ రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి , ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డికి జగన్ పెద్ద షాకే ఇచ్చారు . శింగనమల వైసిపి ఇన్చార్జిగా ఉన్న సాంబశివారెడ్డికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని కూడా తప్పించి సాకే శైలజానాథ్‌కు బాధ్యతలు కట్టబెట్టడంతో ప్రస్తుతం సెగ్మెంట్లో ఆ దంపతులు దాదాపు డమ్మీలుగా మిగిలిపోయారు. మరి చూడాలి మున్ముందు శింగనమల వైసీపీలో ఇంకెన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయో?