Sonia Gandhi Autobiography: 544 పేజీల ఒక పుస్తకం… కానీ దాని చుట్టూ రేగిన రాజకీయ దుమారం మాత్రం దేశవ్యాప్తంగాప్రకంపనలు సృష్టిస్తోంది! కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత జ్ఞాపకాలతో తీసుకొచ్చిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఇప్పుడు భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశంగా మారింది. ఒకవైపు ఇది ‘త్యాగాల చరిత్ర’ అని కాంగ్రెస్ శ్రేణులు ఉప్పొంగిపోతుంటే.. మరోవైపు తప్పులను కప్పిపుచ్చే ‘వైట్ వాష్’ అంటూ బీజేపీ నిప్పులు చెరుగుతోంది. అసలు ఈ పుస్తకంలో ఏముంది? వేల సంఖ్యలో సిక్కులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడానికి కారణమేంటి? ఇదొక భావోద్వేగ ప్రయాణమా? లేక రాజకీయ వ్యూహమా? ఈ పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం!
ప్రేమ పెళ్లి పీట లెక్కే క్రమంలో భిన్నమైన స్పందనలు
రాజకీయ విమర్శలకు అతీతంగా, ఈ పుస్తకంలో సోనియా గాంధీ తన వ్యక్తిగత జీవితంలోని అనేక అంశాలను పంచుకున్నారు దేశాల సరిహద్దులను దాటి ప్రేమ ప్రయాణం సోనియా, రాజీవ్ గాంధీలది. ఇటలీ నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిన సాధారణ యువతి సోనియా మైనో.. అక్కడే ఇంజనీరింగ్ చదువుతున్నరు రాజీవ్ గాంధీ. మొదటి చూపులోనే పుట్టిన ఆ పరిచయం, నెమ్మదిగా స్నేహంగా మారి, ఆపై విడదీయరాని గాఢమైన ప్రేమకు దారితీసింది. అయితే వీరి ప్రేమ పెళ్లి పీట లెక్కే క్రమంలో భిన్నమైన స్పందనలు ఎదురయ్యాయి. భారతీయ సంస్కృతిలో తన కుమార్తె ఇమడలేదని భయపడిన సోనియా తండ్రి స్టెఫానో మైనో, మొదట్లో ఈ వివాహానికి అంగీకరించలేదు. కానీ మరోవైపు, లండన్‌లో సోనియాను మొదటిసారి కలిసిన ఇందిరా గాంధీ… ఆ విదేశీ యువతిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, ఫ్రెంచ్ భాషలో ఆత్మీయంగా పలకరించి ఒక తల్లిలా అక్కున చేర్చుకున్నారు. ఇందిరా గాంధీ ఇచ్చిన ఆ భరోసా, రాజీవ్ పై ఉన్న అచంచలమైన నమ్మకం సోనియాను భారత్‌కు నడిపించాయి. 1968లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, ఒక సాధారణ పైలట్‌గా, భారతీయ గృహిణిగా ఎంతో ప్రశాంతమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. తండ్రి భయపడినట్లు కాకుండా, సోనియా భారతీయ సంస్కృతిలో పూర్తిగా మమేకమైపోయారు.
ఫోటోగ్రఫీ చేయడానికి ఎక్కువ ఇష్టపడేవారు..
బయటకు అత్యంత కఠినంగా కనిపించే అత్త ఇందిరా గాంధీ.. ఇంట్లో తనపై చూపిన మాతృవాత్సల్యాన్ని, చీర కట్టుకోవడం, హిందీ నేర్చుకోవడంలో ఆమె అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. 1969లో తాను మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఇందిర ఎంతో సంతోషించినా, ఆ బిడ్డ దక్కలేదన్న వ్యక్తిగత జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ఆ విషాదం తర్వాత, 1970 జూన్ 19న రాహుల్ గాంధీ, 1972 జనవరి 12న ప్రియాంక గాంధీ జన్మించారు. ఈ ఇద్దరు పిల్లల రాకతో సోనియా, రాజీవ్‌ల ప్రపంచం ఆనందంతో నిండిపోయింది. అత్తగారు ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పటికీ, రాజీవ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తూ సాధారణ జీవితాన్ని ఇష్టపడ్డారు. సోనియా పూర్తి సమయం గృహిణిగా ఉంటూ ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకాన్ని చూసుకునేవారు. తన పిల్లలు భారతీయ మూలాలకు దగ్గరగా ఉండాలని సోనియా భావించారు. అందుకే వారు స్కూల్‌కు వెళ్లే వరకు వారితో హిందీలోనే మాట్లాడేవారు. సెలవుల్లో రాజీవ్, సోనియా తమ పిల్లలతో కలిసి ప్రకృతి ఒడిలో గడపడానికి, ఫోటోగ్రఫీ చేయడానికి ఎక్కువ ఇష్టపడేవారు.
ఆ కుటుంబంలో ఆనందం ఎంతో కాలం నిలవలేదు..
అయితే, ఆ కుటుంబంలో ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. వరుస విషాదాలు ఆమె గుండెను పిండేశాయి. 1980లో విమాన ప్రమాదంలో మరిది సంజయ్ గాంధీ మరణం.. ఆ తర్వాత 1984లో కళ్లముందే తుపాకీ తూటాలకు బలైన అత్త ఇందిరా గాంధీ హత్య… ఆ గాయం మానకముందే 1991లో శ్రీపెరంబుదూర్‌లో మానవ బాంబు దాడిలో ముక్కలైన భర్త రాజీవ్ గాంధీ మరణం… ఇలా తన కళ్లముందే రక్తపు మడుగులో కుప్పకూలిన ఆత్మీయులను చూసి సోనియా తల్లడిల్లిపోయారు. రాజీవ్ హత్య తర్వాత తల్లి పావోలా, ఇటలీలోని కుటుంబ సభ్యులు తనను పిల్లలతో సహా ఇటలీకి తిరిగి వచ్చేయాలని ఎంతగానో కోరారు. కానీ, కన్నీళ్లను దిగమింగుకుని, భర్త ఆశయాల కోసం తాను భారతదేశంలోనే ఉండిపోవాలని తీసుకున్న కఠిన నిర్ణయాన్ని సోనియా ఈ పుస్తకంలో కళ్లకు కట్టారు. ఆ తర్వాత మనమలు రెహాన్, మిరాయా తన జీవితంలోకి కొత్త వెలుగును నింపారని పేర్కొన్నారు.
ఈ పుస్తకం వెనుక కవర్ పేజీపై ఉన్న సోనియా గాంధీ ఫోటోను ఆమె మనుమడు రెహాన్ వాద్రా మరియు ఆయన భాగస్వామి అవివా బేగ్ తీశారని ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు.
పుస్తకం పై ప్రతిపక్షాలు విమర్శలు..
పుస్తకం పై కాంగ్రెస్ గొప్పగా వాదిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు ఎక్కుపెట్టాయి.. ముఖ్యంగా ఇందిరా గాంధీ విధించిన 1975 ఎమర్జెన్సీని సోనియా గాంధీ తన పుస్తకంలో కేవలం ఒక చిన్న పొరపాటుగా, రాజకీయ ఒత్తిళ్ల వల్ల జరిగిన నిర్ణయంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని బీజేపీ నిప్పులు చెరుగుతోంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత పదవికి రాజీనామా చేయాలని రాజీవ్ సూచించినా, సంజయ్ గాంధీ ఒత్తిడి వల్లే ఎమర్జెన్సీ విధించారని, చివరికి ఇందిర కూడా అది తప్పు అని భావించారని సోనియా రాశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ… 21 నెలల పాటు దేశంలో పత్రికా స్వేచ్ఛను గొంతు నొక్కి, లక్షలాది మంది ప్రతిపక్ష నేతలను, జర్నలిస్టులను జైళ్లలో పెట్టి, రాజ్యాంగం మరియు న్యాయవ్యవస్థ అధికారాలను నిర్వీర్యం చేసిన ఆ చీకటి రోజులను ‘చివరికి పశ్చాత్తాపపడ్డారు’ అనే ఒక్క మాటతో సాధారణీకరించే (Normalise) ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతోంది. చారిత్రక నేరాన్ని ఒక కుటుంబ భావోద్వేగ కోణంలో కప్పిపుచ్చుతూ, ఇందిరా గాంధీని నిర్దోషిగా నిలబెట్టే ప్రయత్నమే ఇదని కమలనాథులు విమర్శిస్తున్నారు.
ఇందిరా గాంధీపై సంజయ్ తీవ్ర ఒత్తిడి..?
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల ప్రతిష్టను కాపాడే క్రమంలో సోనియా గాంధీ తన మరిది సంజయ్ గాంధీ, తోడికోడలు మేనకా గాంధీలను ప్రధాన దోషులుగా నిలబెట్టారని. 1975లో ఎమర్జెన్సీ విధించడానికి ఇందిరా గాంధీపై సంజయ్ తీవ్ర ఒత్తిడి తెచ్చారని, అరాచకాలను ఇందిరకు తెలియకుండా దాచారని సోనియా ఆరోపించారు.ఇక తోడికోడలు మేనకా గాంధీకి అధికార కాంక్ష ఎక్కువని, సంజయ్ దూకుడును ఆమె మరింత రెచ్చగొట్టారని, కుటుంబంలో చీలికలు తెచ్చి ఇందిరా గాంధీని మానసికంగా తీవ్ర వేదనకు గురిచేశారని సోనియా ఘాటుగా విమర్శించారు. అయితే, కుటుంబ తప్పులన్నింటినీ సంజయ్, మేనకలపైకి నెట్టేసి, ఇందిర-రాజీవ్‌లను నిష్కళంకులుగా చూపించే ప్రయత్నం చేశారనే విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్నాయి.
రాజకీయ అంశాలపై తీవ్ర చర్చ
సోనియా గాంధీ ఇది తన ‘భావోద్వేగ ఆత్మకథ’ అని చెబుతున్నా, ఇందులో దాచిపెట్టిన అనేక రాజకీయ అంశాలపై కూడా ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. 1980లలో రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆయన ప్రతిష్టను దెబ్బతీసిన బోఫోర్స్ కుంభకోణంపై సోనియా పూర్తిస్థాయి వివరణ ఇవ్వలేదు. రాజీవ్‌కు ఇందులో సంబంధం లేదని ఒక్క మాటలో తేల్చేశారే తప్ప, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఇటాలియన్ వ్యాపారి ఒట్టావియో ఖత్రోచి పాత్రపై మౌనం వహించారని ఆరోపనలు వస్తున్నాయి.
దేశాన్ని నడిపించిన తొలి నాయకుడు పీవి నరసింహరావ్ ..
నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబందం లేకుండా ఐదేళ్ల పాటు పూర్తిస్థాయి ప్రధానిగా దేశాన్ని నడిపించిన తొలి నాయకుడు పీవి నరసింహరావ్ … 1991లో దివాలా అంచున ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ సంస్కరణలతో కొత్త పుంతలు తొక్కించిన దార్శనికుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. కానీ, 544 పేజీల సోనియా గాంధీ ఆత్మకథలో పీవీకి దక్కిన స్థానం నామమాత్రమే. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత పీవీ ప్రధానిగా ఎన్నికవడం, “1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత 10 జన్‌పథ్‌కు, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు మధ్య రాజకీయ దూరం తీవ్రస్థాయికి చేరింది. 1996 ఎన్నికల అనంతరం పార్టీలో ఆయనను వ్యూహాత్మకంగా పక్కన పెట్టిన తీరు అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే, ఈ పరిణామాలన్నింటి పై సోనియా గాంధీ ఎప్పుడూ బహిరంగంగా స్పందించకుండా మౌనం వహించారు.
ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు
అంతేకాదు, 2004లో పీవీ మరణించినప్పుడు, దేశానికి సేవ చేసిన ఒక మాజీ ప్రధాని పార్థివ దేహాన్ని కనీసం ఏఐసీసీ (AICC) పార్టీ ప్రధాన కార్యాలయం లోపలికి కూడా అనుమతించకుండా, గేటు బయట ఫుట్‌పాత్‌పైనే ఉంచడం తీవ్ర అవమానకరంగా నిలిచింది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లేదా ప్రధానులుగా పనిచేసిన సీనియర్ నేతలు మరణించినప్పుడు, కార్యకర్తల నివాళుల కోసం వారి పార్థివ దేహాన్ని ఏఐసీసీ (AICC) కార్యాలయం లోపలికి తీసుకెళ్లడం ఆనవాయితీ. కానీ 2004 డిసెంబర్ 24న పీవీ అంతిమయాత్ర 24 అక్బర్ రోడ్ వద్దకు చేరుకున్నప్పుడు ప్రధాన గేటు తెరవలేదు. సైనిక శకటంపై ఉన్న ఆయన పార్థివ దేహాన్ని దాదాపు 20 నుండి 30 నిమిషాల పాటు గేటు బయట రోడ్డు పక్కన (ఫుట్‌పాత్ వద్ద) ఆపారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ బయటకు వచ్చి అక్కడే నివాలి అర్పించారు. మాజీ ప్రధానిగా పనిచేసిన పీవీకి ఢిల్లీలో ఘాట్ (స్మారక స్థలం) నిర్మించి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, అప్పటి కాంగ్రెస్ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్, అప్పటి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా కుటుంబ సభ్యులను ఒప్పించి ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.
రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా విమర్శలు..
ఈ ఘటనపై పీవీ కుమార్తె వాణీ దేవి, కుమారుడు ప్రభాకర్ రావు, అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ వంటి వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాజీ ప్రధాని, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడి పట్ల పార్టీ వ్యవహరించిన తీరు చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని చాలామంది అంటారుఆయనతో ఉన్న విభేదాలపై స్పష్టత ఇవ్వకపోవడం గాంధీ కుటుంబ కేంద్రీకృత ఆలోచనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సోనియా గాంధీ పుస్తక ప్రతులను తగులబెడుతూ ..
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత వార్త విన్నప్పుడు తాను తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నానని సోనియా గాంధీ తన పుస్తకంలో భావోద్వేగంగా రాశారు. ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకున్న బీజేపీ… సోనియా గాంధీ ఆవేదన కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగానే ఉంటుందని ‘ఎంపిక చేసుకున్న కన్నీళ్లు’ అంటూ ఎద్దేవా చేస్తోంది.1984లో వేలాది మంది అమాయక సిక్కులు నడిరోడ్లపై అత్యంత పాశవికంగా ఊచకోతకు గురైనప్పుడు ఆ కన్నీళ్లు, ఆ వేదన ఎందుకు కనిపించలేదని బాధిత కుటుంబాలు నిలదీస్తున్నాయి. నాలుగు దశాబ్దాలు గడిచినా, ఆ నాటి మారణకాండకు బాధ్యత వహించకుండా, సైన్యం మోహరింపు జాప్యంపై నెపం నెడుతూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారని సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధితుల గాయాలకు న్యాయం చేయకుండా, కేవలం గాంధీ కుటుంబానికి ‘క్లీన్ చిట్’ ఇచ్చుకునేలా పుస్తకంలో రాసుకోవడం వారి ఆవేదనను మరింత రగిలించింది. అందుకే, ఆక్రోశంతో రగిలిపోతున్న సిక్కు సంఘాలు, బాధిత కుటుంబాలు నేడు ఢిల్లీ నడిబొడ్డున సోనియా గాంధీ పుస్తక ప్రతులను తగులబెడుతూ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి.”
మల్లికార్జున ఖర్గే బాల్యంలో జరిగిన విషాదం..
పుస్తకంలోని 484వ పేజీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బాల్యంలో జరిగిన విషాదాన్ని సోనియా ప్రస్తావించారు. 1948లో ఖర్గే ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో ఆయన తల్లి, సోదరి, ఇతర బంధువులు సజీవదహనమైన ఘటనను సోనియా “కుల ఘర్షణలు” గా పేర్కొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆ దాడి చేసింది నిజాం రజాకార్లు అని ఖర్గే స్వయంగా గతంలో చెప్పారని, కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సోనియా రజాకార్ల పేరును దాచిపెట్టి ‘కుల ఘర్షణలు’గా చరిత్రను వక్రీకరించారని విమర్శకులు మండిపడుతున్నారు. గోద్రా ఘటనలో గానీ, కశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ లోయలో మతం అడిగి మరీ అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడి విషయంలో గానీ సోనియా ఎందుకు కన్నీరు కార్చలేదని, పుస్తకంలో కనీసం ఆ ప్రస్తావనే ఎందుకు తీసుకురాలేదని కమలనాథులు సూటిగా నిలదీస్తున్నారు
తెలుగు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
2004 , 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి, యూపీఏ కూటమి వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆనాడు తన సుదీర్ఘ పాదయాత్రతో, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చి, ఢిల్లీకి అత్యధిక ఎంపీ సీట్లను కానుకగా అందించిన మాజి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి. కానీ, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి ప్రాంతీయ నేతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన సోనియా గాంధీ… పార్టీకి అంతటి విజయాన్ని అందించిన వైఎస్సార్ గురించి కనీసం ఒక్క వాక్యం కూడా రాయకపోవడం తెలుగు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
సంజయ్ బారు ఆరోపణలను పూర్తిగా ఖండించారు
2004లో తన అంతరాత్మ ప్రబోధం మేరకు, కుటుంబ భద్రత దృష్ట్యా ప్రధాని పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్‌కు ఆ బాధ్యత అప్పగించానని సోనియా గాంధీ తన పుస్తకంలో గొప్పగా చెప్పుకున్నారు. అలాగే, తాను ‘షాడో పీఎం’గా (సూపర్ ప్రధానిగా) వ్యవహరించానన్న సంజయ్ బారు ఆరోపణలను పూర్తిగా ఖండించారు. కానీ, విమర్శకుల ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా… క్యాబినెట్ హోదా కలిగిన జాతీయ సలహా మండలి (NAC) చైర్‌పర్సన్‌గా ఉంటూ సమాంతర ప్రభుత్వాన్ని నడిపించలేదా? ప్రభుత్వ విధాన నిర్ణయాల నుండి కీలక నియామకాల వరకు అన్నీ 10 జన్‌పథ్ కనుసన్నల్లోనే జరిగాయన్నది బహిరంగ రహస్యం కాదా? అంతేకాదు, 2013లో ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ బహిరంగంగా ‘చెత్తబుట్టలో వేయాలి’ అంటూ చించివేయడమే ఆనాటి ప్రధాని నిస్సహాయతకు నిదర్శనం కాదా అని బీజేపీ నిలదీస్తోంది.
అవినీతి కుంభకోణాలపై ఎందుకు మౌనం..?
ఇక అధికారాన్ని అనుభవించిన యూపీఏ-1, 2 విజయాలను తన ఖాతాలో వేసుకున్న సోనియా… యూపీఏ-2 పతనానికి కారణమైన 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపు, కామన్వెల్త్ గేమ్స్ వంటి భారీ అవినీతి కుంభకోణాలపై మాత్రం ఎందుకు మౌనం వహించారు? దేశవ్యాప్తంగా అన్నా హజారే నేతృత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిన తీరుపై కనీస ఆత్మపరిశీలన లేకుండా… కేవలం తన ‘త్యాగాన్ని’ మాత్రమే హైలైట్ చేసుకుంటూ, అసలు నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
సోనియా గాంధీపై సినిమా..?
మరోవైపు, ‘తెలంగాణ ఇచ్చిన దేవత… తెలంగాణ తల్లి’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీని ఆకాశానికెత్తుతున్నారు. ఆమె పుస్తకంపై సినిమా తీస్తామని ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, 544 పేజీల ఆత్మకథలో ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం గురించి గానీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం గురించి గానీ కనీసం ఒక్క పేజీ కూడా లేకపోవడం గమనార్హం. యూపీఏ హయాంలో జరిగిన అతిపెద్ద చారిత్రక ఘట్టాన్ని సోనియా పూర్తిగా విస్మరించడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా నిలదీస్తోంది. “ఇది నా వ్యక్తిగత భావోద్వేగ పుస్తకం” అని సమర్థించుకుంటే సరిపోతుందా… దేశానికి దిశానిర్దేశం చేసిన పీవీని, పార్టీకి ప్రాణం పోసిన వైఎస్సార్‌ను, కోట్లాది మంది ఆకాంక్ష అయిన తెలంగాణను పక్కనపెట్టి రాసిన కథనం పూర్తిస్థాయి ఆత్మకథ ఎలా అవుతుందనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
సోనియా గాంధీ ఘాటుగా విమర్శించారు
ఈ పుస్తకంలోని ద్వితీయార్థం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజకీయాలపై ఒక బలమైన సైద్ధాంతిక దాడిగానే సాగింది ప్రధాని మోదీ ఆలోచనా విధానాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు తీర్చిదిద్దారని, అది ఒకే మతం, సంస్కృతి ఆధిపత్యాన్ని కోరుకునే ‘ఆధిపత్య వాదం’ (Hegemony) అని సోనియా గాంధీ ఘాటుగా విమర్శించారు. గాంధీజీ కలలుగన్న లౌకిక, సమ్మిళిత భారతదేశానికి విరుద్ధంగా… వినాయక్ దామోదర్ సావర్కర్ ప్రతిపాదించిన హిందుత్వ భావజాలంతో రాజ్యాంగ విలువలను ఆర్ఎస్ఎస్, బీజేపీ పక్కనపెడుతున్నాయని ఆమె ఆరోపించారు.
చైనా సరిహద్దు ఆక్రమణలపై ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోంది
గత పన్నెండేళ్ల పాలనలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు, సామాజిక సామరస్యం తీవ్రంగా దెబ్బతిన్నాయని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, 2019లో 40 మంది జవాన్లను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడి విషయంలో నిఘా వర్గాల హెచ్చరికలను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, జవాన్లకు విమాన సౌకర్యం కల్పించడంలో విఫలమైందని నేరుగా నిందించారు. చైనా సరిహద్దు ఆక్రమణలపై కూడా ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని విమర్శించారు. ఈ విమర్శలపై బీజేపీ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గురించి నీతులు చెప్పడం హాస్యాస్పదమని కమలనాథులు మండిపడుతున్నారు. రాజకీయంగా ప్రధాని మోదీని, ఆర్ఎస్ఎస్ను ఎదుర్కోలేకే, ఆత్మకథ ముసుగులో అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.
కాంగ్రెస్ నేతలు ప్రశంసలు..
ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ పుస్తకాన్ని తమ నాయకురాలి అపూర్వ త్యాగాలకు, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనంగా నెత్తిన పెట్టుకుంటోంది. ఇటలీలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, ప్రేమ కోసం భారతదేశపు అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన సోనియా ప్రయాణం పూలబాట కాదని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు.ముఖ్యంగా 2004లో ప్రధాని పదవి తనను వెతుక్కుంటూ వచ్చినా, అధికారం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని తృణప్రాయంగా త్యాగం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆమెదని కాంగ్రెస్ నేతలు ప్రశంసిస్తున్నారు.
మరో అడుగు ముందుకేసిన తెలంగాణ కాంగ్రెస్
ప్రచురణకర్తల ఒత్తిడికి తలొగ్గకుండా తన అభిప్రాయాలను నిజాయితీగా రాశారనే అంశాన్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. ఈ త్యాగాల చరిత్రను కేవలం మేధావులకే కాకుండా, సామాన్య ప్రజల హృదయాలకు చేరువ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పుస్తక ప్రతులను తెలుగులోకి అనువదించి ఇంటింటికీ పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మరో అడుగు ముందుకేసిన తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా ఏకంగా సినిమానే నిర్మిస్తానని ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చరిత్రను ఎవరు రాస్తే వారి దృక్కోణమే కనిపిస్తుంది. సోనియా గాంధీ దృష్టిలో ఈ 544 పేజీల పుస్తకం తన ఆంతరంగిక ప్రయాణం కావచ్చు.. కానీ భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకురాలి కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక రాజకీయ ప్రకటనే.
భారత రాజకీయ రణరంగంలో మరో కొత్త చర్చ
అభిమానులకు ఇది ఒక ‘త్యాగమయ చరిత్ర’లా అనిపిస్తే… విమర్శకులకు మాత్రం గతాన్ని సమర్థించుకునే ఒక ‘రాజకీయ అస్త్రం’లా కనిపిస్తోంది. అందుకే, ‘బిలాంగింగ్’ కేవలం ఒక ఆత్మకథగా పుస్తకాల అరల్లో మిగిలిపోలేదు… నేటి భారత రాజకీయ రణరంగంలో మరో కొత్త చర్చకు తెరలేపిన అస్త్రంగా మారింది.
Also Read: దేశ పోలీసు వ్యవస్థకే గ్రేహౌండ్స్ రోల్ మోడల్: డీజీపీ సీవీ ఆనంద్