ఏడేళ్ల కిందటి హైదరాబాద్ దిశ ఎన్ కౌంటర్ కేసును … యథాతథంగా బాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ మూవీని తీశారు. దీని పేరు దాయ్రా (Daayra). హద్దు, వలయం అని దీని అర్థం. మలయాళంలో కూడా డబ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ ఉన్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. సజ్జనార్ పాత్రను మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డీసీపీ రామన్‌కుమార్‌గా పోషించారు. ఆయన చేసిన ఎన్‌కౌంటర్‌పై విచారణ అధికారిణిగా కరీనా కపూర్ డీసీపీ అజూనీ కోహ్లీగా నటించారు.
మొత్తం అదే కథ. కొన్ని చిన్న చిన్న మార్పులు అంతే. కానీ ఇక్కడ రాజకీయాల జోలికి పోలేదు దర్శకురాలు మేఘనా గుల్జార్. ఒంటరి మహిళల మిస్సింగ్ కేసులు.. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విషయంలో నిర్లక్ష్యంపై చర్చించారు. హీరో పాత్ర చేసిన ఎన్‌కౌంటర్‌ను పూర్తిగా సమర్థిస్తూనే.. దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విధంగా సమాంతరంగా విచారణ కూడా చేసే పాత్ర ద్వారా రెండో కోణాన్ని కూడా టచ్ చేసే ప్రయత్నం జరిగింది.
మొత్తంగా ఇక్కడ సజ్జనార్ పాత్రను హీరోగా చూపించారు. ఆ ‘దిశ’ అమ్మాయిని లారీ డ్రైవర్ సహా, ముగ్గురు క్లీనర్లు ఎలా ప్లానింగ్ ప్రకారం ట్రాప్‌లో వేసి అత్యాచారం చేసి హతమార్చారో కథనం అంతా అలాగే సాగింది. నిజ జీవితంలో ఆ దిశ స్కూటీని కావాలనే పంక్షర్ చేసి ఆమెకు సాయం చేసేలా నటించి.. దాడికి తెగబడ్డారు. సినిమాలో స్కూటీని తమ ట్రక్కులో దాచేసి దొంగతనం అయ్యిందని, తాము డ్రాప్ చేస్తామని నమ్మించి ఎక్కించుకుని బలాత్కరించి, చంపేసి.. కాల్చేస్తారు.
ఆ నలుగురు నిందితులు స్పాట్ రీ కన్‌స్ట్రక్చన్ చేసే సమయంలో తమ పిస్టోల్ లాక్కుని కాల్చే ప్రయత్నం చేశారని, ఆత్మ రక్షణ కోసమే తాము ఆ నలుగురిని కాల్చాల్సి వచ్చిందని హీరో పృథ్వీ మీడియాకు చెబుతారు. అతని చర్యపై అంతా హర్షిస్తారు. ఒక్క మీడియా ప్రశ్నలు తప్ప అంతా హీరోగా చూస్తారు ఆ డీసీపీని. అచ్చం ఇక్కడ యథార్థంగా జరిగిన ఎన్ కౌంటర్ ఘటన తరువాత సజ్జనార్ హీరో అయ్యాడు.
ఇక్కడ రాజకీయ కోణాన్ని టచ్ చేయలేదు దర్శకురాలు. రాజకీయాలను తీసుకుంటే.. సీఎంగా ఉన్న వ్యక్తే హీరో అవుతారనే భావన కావొచ్చు. ఎందుకంటే.. సీఎం జోక్యం లేకుండా.. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకుండా పోలీసు శాఖ.. ఓ నలుగురిని కాల్చి చంపేంత సీన్ ఉండదు. అప్పుడు అక్కడ సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ఉండటంతో అతని పేరు మారుమోగిపోయింది. అంతకు ముందు వరంగల్ యాసిడ్ దాడి ఘటనలో కూడా నిందితుడిని ఎన్‌కౌంటర్ చేసింది ఈ సజ్జనారే. అందుకే అతని పేరుకు ప్రాముఖ్యత లభించింది.
కానీ అప్పుడు సర్కార్‌లో ఉన్నది కేసీఆర్. సర్కార్ ఆదేశాల మేరకే అది జరిగిందనేది జగమెరిగిన సత్యం. అందుకే ఇక్కడ ఆ పోలీసు ఆఫీసర్‌ను హీరోగా ఎలివేట్ చేయడం కోసం.. యథార్థ కథను ఎంచుకుని, ఆ ఎన్‌కౌంటర్ నిర్ణయం కూడా ఆ డీసీపీదే అనే విధంగా చిత్రీకరించారు ఈ సినిమాను. కరీనా కపూర్ విచారణాధికారి పాత్ర ద్వారా పోలీసు చర్య పూర్తిగా ఉద్దేశ పూర్వకంగా చేసిందేనని చెప్పేందుకే పెట్టారు.
కానీ అతనిపై చర్యలకు మాత్రం సిఫారసు చేసిన విషయాన్ని వెల్లడించకుండా.. నాది నీ దారి కాదని చెప్పి విడిపోవడంతో ముగించేసి ఇద్దరు చేస్తున్నది.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతున్నది’ అనే డైలాగుకు అన్వయించేలా ముగించేశారు. న్యాయవాదిగా ఉన్న కరీనా తండ్రిని కోర్టు ఆవరణలోనే కాల్చేస్తే .. నిందితులకు ఇంత వరకు శిక్ష వేయలేదని, ఢిల్లీ నిర్బయ ఘటనలో మైనర్ అని రేప్ చేసిన నిందితుడికి రక్షణ కల్పిస్తారా? అని డీసీపీ హోదాలో పృథ్వి వాదించే సీన్లు అతనికి ప్రస్తుత చట్టాలపై నమ్మకం లేదు అనే విధంగానే తీర్చిదిద్దారు.
ఇలాంటి నేరాల్లో తక్షణ శిక్షగా.. ఎన్‌కౌంటరే సరైదని చెప్పే ప్రయత్నం చేశారు అతని ద్వారా. కాగా సజ్జనార్‌కు ఈ కేసు విషయంలో ప్రస్తుతానికి ఊరట లభించింది. పది మంది పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోర్టు ఆదేశాల నుంచి సజ్జనార్ మినహాయించబడ్డాడు. నారాయణపేట్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ ఆరీఫ్‌తో పాటు ఉన్న ముగ్గురు క్లీనర్లలో ఒకరు మైనర్. సినిమాలో కూడా యథతథాంగానే వీరి వయస్సును పెట్టారు.