Kangana Ranaut: ఒకప్పుడు సిల్వర్ స్క్రిన్‌పై హీరోయిన్… తర్వాత బాలీవుడ్‌పై బాంబుల్లాంటి వ్యాఖ్యలు.. సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై యుద్ధం… రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శల వర్షం.. చివరికి బీజేపీ టికెట్‌తో ఎంపీగా ఎంట్రీ. కానీ ఎంపీ అయిన తర్వాతైనా వివాదాలకు బ్రేక్ పడిందా అంటే… నో ఛాన్స్. రైతుల నుంచి కాంగ్రెస్ వరకు… సోనియా గాంధీ నుంచి గాంధీ కుటుంబం వరకు… ఆమె కామెంట్స్ మాత్రం కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీకు ఇప్పటికే అర్థమైంది అంటుకుంటున్నా. ఆమె బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. సినిమా స్క్రీన్‌పై రాణిగా ఉన్న ఆమె… రాజకీయ స్క్రీన్‌పై రచ్చరాణి ఎందుకయ్యింది? ఇప్పుడు సోనియాగాంధీ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తోంది?
సినిమాలో క్వీన్.. పాలిటిక్స్‌లో రచ్చరాణి
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా భాంబ్లాలో జన్మించిన కంగనా… చిన్న వయసులోనే నటనపై ఆసక్తితో ఇంటి నుంచి ముంబైకి వెళ్లింది. 2006లో అనురాగ్ బసు డైరెక్షన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి సినిమాతోనే గుర్తింపు… ఆ తర్వాత ఫ్యాషన్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, తను వెడ్స్ మను, క్వీన్ ఇలా అనేక సినిమాలు చేసి మంచి స్టార్‌డమ్ తెచ్చుకుంది. ఆమె నటనకు 2021లో పద్మశ్రీ అవార్డ్ కూడా అందుకుంది. అయితే కంగనా ప్రయాణం కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. బాలీవుడ్‌లో నెపోటిజంపై బహిరంగ విమర్శలు… కరణ్ జోహార్‌తో వివాదం… హృతిక్ రోషన్‌తో బహిరంగ విభేదాలు… ఇలా సినిమాల కంటే బయట జరిగే వ్యవహారాలతోనే ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండేది కంగనా. ఆమె యాక్టింగ్ కంటే.. ఆమె చేసిన వ్యాఖ్యల గురించే ఎక్కువగా మాట్లాడుకునేవారు.
వివాదాలకు దారితీసిన పోస్టులు..
నిజానికి ఆమె పొలిటికల్ ఒపినియన్స్‌ను కూడా చాలా ఓపెన్‌గానే చెప్తుంది. నచ్చితే నచ్చింది అనడం.. నచ్చకపోతే.. నచ్చలేదనడం.. ఆమెకు అలవాటు. ఓపెన్‌గానే ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సపోర్ట్ ఇస్తూ వచ్చేది. 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై ఆమె చేసిన పోస్టులు తీవ్ర వివాదానికి దారితీశాయి. ట్విట్టర్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించారన్న కారణంతో అదే ఏడాది మేలో ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత… 2023 జనవరిలో మళ్లీ అకౌంట్‌ను రీస్టోర్ చేశారు. అంటే రాజకీయాల్లోకి రాకముందే సోషల్ మీడియా వేదికగా కంగనా వివాదాల ప్రయాణం మొదలైందన్నమాట.
సినిమా స్టార్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మారిన కంగనా..
ఇక 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కంగనా పొలిటికల్ కెరీర్ కీ టర్న్ తీసుకుంది. మార్చి 2024లో బీజేపీ తన ఐదో అభ్యర్థుల జాబితాలో కంగనా పేరును ప్రకటించింది. ఆమె సొంత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అప్పటికే మోదీకి మద్దతుదారుగా, బీజేపీకి అనుకూలంగా తన అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్న కంగనాకు పార్టీ టికెట్ ఇవ్వడం వెనుక రాజకీయంగా కొన్ని లెక్కలున్నాయి. మండిలో ఆమెకు స్థానిక అనుబంధం ఉంది. మరోవైపు సినిమా స్టార్‌డమ్, జాతీయ స్థాయిలో గుర్తింపు, బహిరంగంగా మాట్లాడే వ్యక్తిత్వం కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. ఇలా సినిమా స్టార్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మారిన కంగనా… మండి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై విజయం సాధించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టింది.
ఎంపీ అయ్యాక కూడా మారలేదా?
ఎంపీగా మారిన కూడా.. ఆమె వివాదాలకు మాత్రం బ్రేక్ పడలేదు. 2024 జూన్ 6న చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన సీన్ ఓ హైలేట్ అనే చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఢిల్లీకి వెళ్తున్న కంగనాకు సెక్యూరిటీ చెకింగ్ టైమ్‌లో ఓ మహిళా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టినట్లు ఆమె ఆరోపించింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆ కానిస్టేబుల్ మాత్రం రైతుల ఉద్యమంపై కంగనా గతంలో చేసిన వ్యాఖ్యలతో తాను ఆగ్రహానికి గురయ్యానని తెలిపింది. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ విచారణ చేపట్టి కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది. అంటే కంగనా గత వ్యాఖ్యల వివాదం… ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్లి మరో పెద్ద వార్తగా మారిందన్నమాట. ఇదే టైమ్‌లో రైతుల ఉద్యమంపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. 2024 ఆగస్టులో రైతుల నిరసనల గురించి మాట్లాడుతూ బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు భారత్‌లోనూ ఏర్పడి ఉండేవని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని స్పష్టం చేయడమే కాకుండా, పార్టీ విధానాలపై మాట్లాడేందుకు ఆమెకు అనుమతి లేదని తెలిపింది. కంగనా కూడా పార్టీ తనను మందలించిందని అంగీకరించింది. అంతేకాదు… అదే ఏడాది సెప్టెంబర్‌లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలన్న వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. బీజేపీ మళ్లీ ఆ వ్యాఖ్యల నుంచి దూరం జరిగింది. చివరకు కంగనా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది.
సోనియాగాంధీ బుక్ పై కంగనా సంచలన పోస్టులు..
ఇవన్నీ పాతవి. ఇక లెటెస్ట్ వివాదం సోనియాగాంధీ బుక్‌పై. సోనియా బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ రిలీజ్ అయిన రోజే కంగనా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు రాజకీయాల్లో రచ్చ లేపాయనే చెప్పాలి. సోనియా గాంధీని మిస్టీరియస్ ఫారిన్ నేషనల్ అంటూ పోస్ట్ పెట్టారు. గాంధీ కుటుంబంలోని వరుస మరణాలను ఆమె రాజకీయ ఎదుగుదలకు లింక్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలను ప్రస్తావిస్తూ How Convenient అన్నారు ఆమె. అంతేకాదు… సంజయ్ గాంధీ మరణం తర్వాత మేనకా గాంధీ ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా పాత వీడియోతో ప్రస్తావించారు. ఈ పోస్ట్‌లు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ పోస్టులపై కాంగ్రెస్ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో కంగనాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పరువు నష్టం, ప్రజల్లో విద్వేషాన్ని ప్రోత్సహించడం, ప్రజా శాంతికి విఘాతం కలిగించే వ్యాఖ్యలకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రాజకీయాల్లో కాంట్రవర్సీ క్వీన్..
ఒకప్పుడు బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు కోసం పోరాడిన కంగనా… ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమాల్లో నటిగా విజయాలు… రాజకీయాల్లో ఎంపీగా బాధ్యతలు… మధ్యలో ఈ వివాదాలు. ఆమె ఏదైనా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతారు అని సపోర్ట్ చేసేవారు అంటారు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు కాస్త కంట్రోల్ అవసరం కదా అని విమర్శించే వారు అంటారు. కానీ ఆమె ఒక విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. ఈ వివాదాలు.. మీడియా లైమ్ లైట్ కొన్ని రోజులు బాగానే ఉంటుంది. కానీ పొలిటికల్ సినిమాను డైరెక్ట్ చేసేది ప్రజలు అనే విషయాన్ని గుర్తుంచుకోకపోతే.. మాత్రం నెక్ట్స్ ఎన్నికల్లో కంగనా కంగు తీనే పరిస్థితులు వస్తాయి.
Also Read: 23 ఏళ్లకే రూ.40 వేల కోట్ల సామ్రాజ్యం.. ఇద్దరు కుర్రాళ్ల ప్రపంచ రికార్డు!