Sowmya Rao:ప్రముఖ యాంకర్ సౌమ్య రావు (Sowmya Rao) కన్నడ ఇండస్ట్రీకి చెందినవారు అయినప్పటికీ, వచ్చిరాని తెలుగుతో.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా సీరియల్స్ ద్వారా పాపులారిటీ అందుకున్న సౌమ్య, అనూహ్యంగా జబర్దస్త్ (Jabardast) లోకి యాంకర్ గా అడుగుపెట్టడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా యాంకర్ గా కొనసాగిన అనసూయ (Anasuya) షో నుండి అనూహ్యంగా తప్పుకోవడంతో, ఈమెను తీసుకొచ్చి పెట్టారు నిర్వాహకులు. అయితే కొంతకాలం బాగానే ప్రేక్షకులను అలరించింది. కానీ అనుకున్నంత స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రాకపోవడంతో ఈమెను తప్పించి, సిరి హనుమంత్ (Siri Hanumanth) ను రంగంలోకి దింపారు. అయితే ఆ తర్వాత కాలంలో రెండు షోలకి టీఆర్పీ రేటింగ్ రాకపోవడం వల్లే ఒక షోగా కుదించి, దానికి ఇప్పుడు రష్మీ ను యాంకర్ గా పెట్టారు.
కన్నడ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించిన సౌమ్యరావు..
ఇకపోతే సౌమ్యా రావు జబర్దస్త్ లో యాంకర్ గా చేయకపోయినా.. అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ‘దావత్’ పేరిట ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒక షో నిర్వహించగా అందులో పాల్గొన్న సౌమ్యరావు.. నూకరాజుతో కన్నడ ఇండస్ట్రీ గురించి గొడవ పడింది. ఇంతలోనే సొంత ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించింది. దీంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకెళితే.. కన్నడ వర్సెస్ తెలుగు వివాదం ఇప్పుడు కీలకంగా మారింది. దావత్ ప్రోగ్రాం లో కన్నడ , తెలుగు మధ్య భేదాలు చూపించారని నూకరాజు మీద కౌంటర్లు వేసింది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానలా మారేసరికి.. నూకరాజు చేతే యాంకర్ సౌమ్య జై కర్ణాటక అనిపించింది. అంతేకాదు నూకరాజు కన్నడను, కర్ణాటకను తక్కువ చేసి మాట్లాడలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. అలాంటి సౌమ్య ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్లు..
సౌమ్య రావు మాట్లాడుతూ.. తనకు కన్నడ అంటే అభిమానం కానీ కన్నడ ఇండస్ట్రీ అంటే నచ్చదని, అక్కడ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని, అందుకే కన్నడ పరిశ్రమ ఇంకా చిన్నదిగానే ఉండిపోయిందంటూ చెప్పుకొచ్చింది. అలాగే తెలుగు పరిశ్రమను ఆకాశానికి ఎత్తేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ అందరినీ ఎంకరేజ్ చేస్తారని, అందరినీ స్వాగతిస్తారని, అందుకే తెలుగు పరిశ్రమది విశాల హృదయం అని, ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా కారణం అదే అంటూ తెలిపింది.
కన్నడ ఇండస్ట్రీకి దూరం అయినట్టేనా..
ఇకపోతే కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్, కాంతారా వంటి చిత్రాలు వచ్చాయి కదా అని యాంకర్ అడిగితే, అది మూడేళ్ల క్రితం.. మళ్లీ ఇంతవరకు ఒక్కటైనా వచ్చిందా అంటూ కాస్త పరుషంగానే మాట్లాడింది సౌమ్య. మరి ఈ దెబ్బతో యాంకర్ సౌమ్యకి కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఉంటుందో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీ పై విమర్శలు గుప్పించింది కానీ.. పరోక్షంగా ఎంకరేజ్ చేసిందనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా మరొకవైపు కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు రాక, ఇక్కడ తెలుగు వాళ్లతో మాటలు పడలేక ఇలాంటి కామెంట్లు చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.