Trump Hush Money | అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలిన హష్ మనీ కేసు ఇంకా ఆయనను వెంటాడుతూనే ఉంది. అందరూ అనుకున్నట్లు కోర్టు ఆయనకు జరిమానా విధించి వదిలేయడం లేదు. తప్పకుండా జైలు శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయమూర్తి పట్టుబట్టారు. దీంతో అధ్యక్ష పీఠం ఎక్కబోయే ట్రంప్ తలపై జైలు శిక్ష అనే కత్తి వేలాడుతోంది. ఈ కేసులో ఆయనకు శిక్ష విధిస్తూ కోర్టు జనవరి 10, 2025న తీర్పు వెలువరించనుంది.
రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన జనవరి 20, 2025న అమెరికా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ట్రంప్ పై ఉన్న హష్ మనీ కేసు మళ్లీ ముందుకొచ్చింది. ఎన్నికలకు ముందే ఆయనపై ఉన్న అన్ని కేసులు వీగిపోయాయి. కానీ ఈ కేసులో మాత్రం ఆయనను న్యూ యార్క్ స్టేట్ సుప్రీం కోర్టు దోషిగా తేల్చేంది.
హష్ మనీ కేసు ఏంటి?
స్టార్మీ డేనియల్స్ అనే ఒక పా*ర్న్ స్టార్ తో 2006లో డొనాల్డ్ ట్రంప్ వివాహేతర సంబంధం కలిగిఉన్నారు. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే ముందు ఆమె తమ సంబంధం గురించి మీడియా ముందు బయటపెడతానని బెదరించింది. దీంతో ఆమె తన విషయాలు బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ తన రియల్ ఎస్టేట్ కంపెనీ బిజినెస్ నిధులు చట్ట వ్యతిరేకంగా మళ్లించారు. ఈ విషయం 2016 తరువాత బయటపడింది.
Also Read: ప్రతిపక్ష నాయకుడిని పట్టిస్తే రూ.85 లక్షల కానుక.. వెనెజూలాలో పాలిటిక్స్ పీక్స్
నిబంధనలకు వ్యతిరేకంగా కంపెనీ నిధులు ఉపయోగించినందుకు ట్రంప్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2024 సంవత్సరంలో కోర్టు తీర్పు వెలువరిస్తూ ఆయనను దోషిగా తేల్చింది. అయితే న్యాయ నిపుణుల ప్రకారం ట్రంప్ నకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయి. కానీ గతంలో ఇలాంటి కేసుల్లో ఎక్కువగా జరిమానా మాత్రమే విధించడం జరిగింది. దీంతో ట్రంప్ కూడా జరిమానా విధిస్తే సరిపోతుందని అందరూ భావించారు. కానీ ఈ కేసుని విచారణ చేసిన న్యూ యార్క్ స్టేట్ సుప్రీం కోర్టు జడ్జి జుయాన్ మర్చెన్ మాత్రం ఆయనకు జరిమానా కాదు జైలు శిక్ష మాత్రమే విధించాలని చెబుతున్నారు. ఈ క్రమంలో జనవరి 10 ఈ కేసులో శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించనున్నారు.
ఒకవేళ జైలు శిక్ష విధిస్తే ట్రంప్ పై కోర్టులో వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఇదంతా జనవరి 20న ఆయన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారానికి ముందే జరుగనుంది. న్యాయ నిపుణల ప్రకారం.. పై కోర్టులో విచారణ త్వరగా చేపట్టకపోయినా.. జైలు శిక్షపై స్టే విధించే అవకాశం ఉంది. దీంతో ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి అధ్యక్షుడు కావడం అమెరికా చరిత్రలోనే తొలిసారి అవుతుంది.