TDP Sana Satish Biodata: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు ఆ పార్టీ అభ్యర్థి సానా సతీష్. పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్న తనను పెద్దలసభకు పంపిస్తుండడంపై సంతోషం వ్యక్తంచేశారు. పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ టికెట్ ఆశించిన సానా సతీష్‌కు కూటమి సర్దుబాట్లలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు రాజ్యసభకు సానా సతీష్‌ను పంపిస్తున్నారు. దీంతో భావోద్వేగానికి గురయ్యారు సానా సతీష్. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిని అవుతానని, పార్టీ లైన్ ప్రకారం సభలో తన వాయిస్ బలంగా వినిపిస్తానని చెప్పారు. సానా సతీష్‌తో పాటు.. మరో ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులు బీద మస్తాన్‌రావ్, ఆర్.కృష్ణయ్య కూడా చంద్రబాబును కలిశారు.
కాకినాడ లోక్‌సభ టికెట్ ఆశించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సానా సతీష్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావించిన సతీష్‌కు పొత్తుల లెక్కలు కలిసిరాలేదు. కాకినాడ ఎంపీ సీటు జనసేనకు దక్కడంతో ఆయన కూటమి విజయానికి కృషి చేసి పార్టీ పట్ల కమిట్‌మెంట్ చాటుకున్నారు. సానా సతీష్ ఇప్పుడు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వనుండటంతో ఆయన శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
కాకినాడకు చెందిన సానా సతీష్‌ను రాజ్యసభ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు ఆశించినా అనూహ్య పరిణామాలతో ఆ స్థానాన్ని పిఠాపురం జనసేన నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు కేటాయించారు. అయినా ఏ మాత్రం నిరాశపడని సతీష్ పార్టీ పట్ల కమిట్‌మెంట్‌తో ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని భర్తీచేసేందుకు టీడీపీ సానా సతీష్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. రాజ్యసభకు నామినేషన్ వేసిన సానా సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వనుండటంతో ఆయన శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
ఒక సామాన్యుడిగా మొదలైన సానా సతీష్ ప్రస్థానం కృషి, పట్టుదల, అకుంఠత దీక్షతో రాజ్యసభలో అడుగుపెట్టేలా చేసింది.. సానా సతీష్‌బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా కాకినాడ వాసులకు సుపరిచితుడైన ఆయన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని తమ్మవరంలో 1972 ఆగస్టు 19న జన్మించారు. తల్లిదండ్రులు సానా సుబ్బారావు, సత్యప్రభ.. ఆయనకు భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్,పాలిటెక్నిక్ డిప్లొమా చదివారు.
Also Read: వాళ్ల గొడవల్లో.. వీళ్లు వేలు పెడుతున్నారు, అరె ఏంట్రా ఇది!
తండ్రి విద్యుత్తు ఉద్యోగిగా పనిచేస్తూ మరణించడంతో సతీష్ కారుణ్య నియామకం కింద 1994లో అదే శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం బీటెక్ పూర్తిచేశారు. విద్యుత్తు శాఖ సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సతీష్ 2005లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత హైదరాబాద్ వెళ్లి వ్యాపారాలపై దృష్టిపెట్టారు. వాన్‌పిక్, మ్యాట్రిక్స్, మహాకల్ప ఇన్‌ఫ్రా తదితర 14 కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా పనిచేశారు. స్థిరాస్తి వ్యాపారం, ఫుడ్ అండ్ బెవరేెజ్, సీపోర్టు, పవర్ అండ్ ఎనర్జీ రంగాల్లో రాణించారు.
సతీష్‌బాబు చదువుకుంటున్న రోజుల్లో అండర్-15 కాకినాడ క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వహించారు. పదేళ్లపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. బిజినెస్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత వంశీ పసలపూడి కథల పుస్తకాన్ని అచ్చువేయించి సాహిత్య రంగం పట్ల తన అనుభవాన్ని చాటుకున్నారు. సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ ఆసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పుడు స్వయం కృషితో ఎదిగి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు.